English | Telugu

ఆ 'రామాయ‌ణ్' సీత ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తోంది?

 

దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌సార‌మైన 'రామాయ‌ణ్ సీరియ‌ల్ అన‌గానే 1987 కాల‌పు మ‌న‌దేశ‌పు మ‌నుషులంతా ఆ రోజుల్ని త‌ల‌చుకుని ఉద్వేగానికి గురైపోతారు. దూర‌ద‌ర్శ‌న్ ప్ర‌సారాలు మొద‌ల‌య్యాక దేశం మొత్తాన్ని ఊపేసిన మొట్ట‌మొద‌టి బ్లాక్‌బ‌స్ట‌ర్ సీరియ‌ల్ అదే. అది హిందీలో ప్ర‌సార‌మైనా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌హా ద‌క్షిణాది రాష్ట్రాల్లోని హిందీ రాని జ‌నం కూడా అది ప్ర‌సార‌మ‌య్యే స‌మ‌యానికి టీవీల‌కు అతుక్కుపోవ‌డం అదే మొద‌టిసారి. అలాంటి ఇతిహాసంలో సీత పాత్ర‌తో ప్ర‌తి ఇంటి ఆరాధ్య‌తార‌గా మారారు దీపికా చిఖ్‌లియా. తెలుగువాళ్ల‌కు అప్ప‌టిదాకా తెర సీత అంటే అంజ‌లీదేవే! 'ల‌వ‌కుశ' సినిమాలో మ‌హాసాధ్వి సీత పాత్ర‌లో అంజ‌లి అస‌మాన న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు పాదాక్రాంత‌మ‌య్యారు.

ఆ త‌ర్వాత సీత‌గా అంత‌గా ఆక‌ట్టుకుంది దీపికే. విశాల‌మైన క‌ళ్లు, ముగ్ధ‌త్వం మూర్తీభ‌వించిన మోముతో దీపిక ఆక‌ట్టుకున్నారు. 'రామాయ‌ణ్‌'లో ఆమె పాత్ర మొద‌లైన త‌ర్వాత నుంచీ క్ర‌మ‌క్ర‌మంగా త‌న న‌ట‌న‌తో వీక్ష‌కుల్ని స‌మ్మోహితుల్ని చేశారు. క‌రుణ‌ర‌సాత్మ‌క స‌న్నివేశాల్లో సీత బాధ‌ప‌డుతుంటే జ‌నం చూడ‌లేక‌పోయారు. అంత‌లా ఆమె త‌న అభిన‌యంతో వీక్ష‌కుల మ‌న‌సుల్ని క‌దిలించేశారు.

నిజానికి 'రామాయ‌ణ్' సీరియ‌ల్ కంటే ముందు 'విక్ర‌మ్ ఔర్ బేతాళ్' హిందీ సీరియ‌ల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దీపిక‌. అందులో ఆమె న‌ట‌న‌కు ముచ్చ‌ట‌ప‌డిన డైరెక్ట‌ర్ రామానంద సాగ‌ర్ 'రామాయ‌ణ్‌'లో సీత పాత్ర‌కు ఆమెను కాకుండా మ‌రొక‌ర్ని ఊహించ‌లేక‌పోయారు. శ్రీ‌రామునిగా అరుణ్ గోవిల్‌కు ఎంత పేరు వ‌చ్చిందో, సీత‌గా దీపిక‌కు అంత పేరు వ‌చ్చింది.

టీవీ సీరియ‌ల్స్‌లోనే కాకుండా సినిమాల్లోనూ దీపిక న‌టించారు. 1983లో 'సున్ మేరీ లైలా'తో ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. కెరీర్ ఆరంభంలో బి గ్రేడ్ సినిమాలు, హార‌ర్ సినిమాల్లోనే ఆమె ఎక్కువ‌గా క‌నిపించారు. 'రామాయ‌ణ్' సీరియ‌ల్‌తో ఆమె కెరీర్ యు-ట‌ర్న్ తీసుకుంది. 'ల‌వ్ కుశ్‌', 'ద స్వోర్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్' లాంటి టెలివిజ‌న్ సిరీస్‌లో ఆమె న‌టించారు.

రాజేశ్ ఖ‌న్నా హీరోగా న‌టించిన 'ఘ‌ర్ కా చిరాగ్'‌, 'రూప‌యే ద‌స్ క‌రోడ్' మూవీస్‌లో ఆమె స‌పోర్టింగ్ రోల్స్ చేశారు. తెలుగులో ఆమె రెండు సినిమాల్లో న‌టించారు. న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీఆర్ న‌టించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర‌'లో ఆమె హ‌రిశ్చంద్రుని భార్య‌ చంద్ర‌మ‌తి పాత్ర పోషించిన విష‌యం గుర్తుండే ఉంటుంది. హ‌రిశ్చంద్రునిగా నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించారు. దానికంటే ముందు రాజ‌శేఖ‌ర్ స‌ర‌స‌న 'య‌మ‌పాశం'లో హీరోయిన్‌గా న‌టించారు. అలాగే త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, బెంగాలీ, భోజ్‌పురి సినిమాల్లోనూ ఆమె న‌టించారు.

ఆమె పాపులారిటీని సొమ్ము చేసుకోవ‌డానికి బీజేపీ ఆమెను త‌మ పార్టీలోకి ఆహ్వానించి 1991 జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్ల‌లో బ‌రోడా నియోజ‌క‌వ‌ర్గం టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నిక‌ల్లో గెలిచిన దీపిక ఆరేళ్ల పాటు ఎంపీగా కొన‌సాగారు. హేమంత్ టోపీవాలా అనే బిజినెస్‌మ్యాన్‌ను ఆమె పెళ్లాడారు. ఆయ‌న‌కు శింగార్ బిందీ, టిప్స్ అండ్ టోస్ కాస్మెటిక్స్ బ్రాండ్లు ఉన్నాయి. ఆ దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమార్తెలు.. జుహీ, నిధి.

ఇప్పుడు ఆ సీత పాత్ర‌ధారి దీపికా చిఖ్‌లియా ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? దీపిక మ‌ళ్లీ న‌టించ‌డం మొద‌లుపెట్టారు. ఒక గుజ‌రాతీలో ఓ సీరియ‌ల్‌, 'న‌ట్‌సామ్రాట్' అనే సినిమా చేశాక‌, 2019లో ఆయుష్మాన్ ఖురానా హీరోగా వ‌చ్చిన బాలీవుడ్ మూవీ 'బాలా'లో హీరోయిన్ యామీ గౌత‌మ్ త‌ల్లిగా న‌టించారు. రాజ‌కీయ‌నాయ‌కురాలు, క‌వ‌యిత్రి స‌రోజినీ నాయుడు బ‌యోపిక్‌లో ఆమె పాత్ర‌ను చేయ‌నున్న‌ట్లు గ‌త ఏడాది ఆమె ప్ర‌క‌టించారు. ఆ సినిమాకు ఆకాశ్ నాయ‌క్‌, ధీర‌జ్ మిశ్రా సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్పుడు దీపికా చిఖ్‌లియా వ‌య‌సు 55 సంవ‌త్స‌రాలు.