English | Telugu
'వకీల్ సాబ్' ప్రివ్యూ.. ఎనిమిదేళ్ల తర్వాత పవన్ ప్రభంజనం?
Updated : Mar 29, 2021
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమా క్రేజ్ ఎలాంటిదో మూడేళ్ల తర్వాత మళ్లీ కనిపిస్తోంది. 2018 సంక్రాంతికి 'అజ్ఞాతవాసి' సినిమా వచ్చి వెళ్లాక పవన్ కల్యాణ్ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రావడంతో మూడేళ్ల పాటు ఆయన ఫ్యాన్స్ చాలా వెలితి ఫీలవుతూ వచ్చారు. ఇప్పుడు 'వకీల్ సాబ్' సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో వారికి పెద్ద పండగ వస్తున్నంత సంబరంగా ఉంది. ఏప్రిల్ 9న 'వకీల్ సాబ్' ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు.
ఈరోజు సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ రిలీజ్ అవుతుండటంతో అందరి దృష్టీ ఆ మూమెంట్ మీదే ఉంది. ట్రైలర్ ఎలా ఉండబోతోంది, శాంపుల్ సీన్స్‌లో పవన్ ఎలా చెలరేగుతాడు?.. అనే క్యూరియాసిటీ అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ట్రైలర్ గురించి తెగ హంగామా సృష్టిస్తున్నారు. ట్రైలర్‌ను ఎలా వైరల్ చేయాలని డిస్కస్ చేసుకుంటున్నారు. ట్రైలర్ రాకముందే #VakeelSaabTrailerDay అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చిందంటే ఫ్యాన్స్ ఎంత ఆకలిగా ఉన్నారో ఊహించవచ్చు. ఇక ట్రైలర్ వస్తే ఆ హంగామా ఏం రేంజ్‌లో ఉంటుందో మరి!
ఇదివరకు రిలీజ్ చేసిన పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' లుక్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి దాకా మూడు పాటలు రిలీజ్ చేస్తే, "మగువా మగువా" సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇన్‌ఫ్యాక్ట్.. విమెన్స్ డేకి ఎక్కడకు వెళ్లినా ఆ పాటే వినిపించింది. అంతగా లేడీస్ ఆ సాంగ్‌ను సొంతం చేసుకున్నారు. తమన్ మ్యూజిక్, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, సిద్ శ్రీరామ్ వాయిస్ ఆ సాంగ్‌కు సూపర్బ్ క్రేజ్ తెచ్చాయి. అందుకే ఆ సాంగ్‌కు 45 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
అయితే ఆ తర్వాత రిలీజ్ చేసిన "సత్యమేవ జయతే" సాంగ్ ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్‌లో హిట్ కాలేదు. అది.. పవన్ కల్యాణ్ క్యారెక్టరైజేషన్ ఏమిటనేది వివరించే సాంగ్. దాన్ని కూడా రామజోగయ్య శాస్త్రి రాస్తే.. శంకర్ మహదేవన్ లాంటి గొప్ప సింగర్ ఆలపించాడు. ఆయనతో పాటు పృథ్వీచంద్ర కూడా తన గళాన్ని జోడించాడు. అయినా ఏమంతగా ప్రయోజనం కలగలేదు. దానికి ఇప్పటివరకూ 6.5 మిలియన్ వ్యూస్ లభించాయి.
మార్చి 17న రిలీజ్ చేసిన మరో సాంగ్ "కంటి పాప" ఫర్వాలేదనే స్థాయిలో ఆదరణ పొందింది. అది పవన్ కల్యాణ్, శ్రుతి హాసన్ జోడీపై పిక్చరైజ్ చేసిన సాంగ్. రామజోగయ్య శాస్త్రి రాస్తే, అర్మాన్ మాలిక్, దీపు, గీతామాధురి ఆలపించారు. ఆ పాటకు ఇంతదాకా 6.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
'ఓ మై ఫ్రెండ్' ఫిల్మ్‌తో డైరెక్టర్‌గా పరిచయమై, 'మిడిల్ క్లాస్ అబ్బాయి' మూవీతో హిట్ కొట్టిన శ్రీరామ్ వేణు 'వకీల్ సాబ్'ను తీర్చిదిద్దుతున్నాడు. బాలీవుడ్‌లో హిట్టయిన 'పింక్'కు ఇది రీమేక్ అనే విషయం ఇప్పటికే మనకు తెలుసు. ఆ సినిమాలో వకీల్‌గా అమితాబ్ బచ్చన్ చేసిన క్యారెక్టర్‌ను ఈ సినిమాలో చాలావరకు మార్చేశారు. ఒరిజినల్‌లో తాప్సీ, కృతి కుల్హరి, ఆండ్రియా తరియాంగ్ చేసిన మెయిన్ క్యారెక్టర్స్‌ను తెలుగు వెర్షన్‌లో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల చేశారు. వాళ్ల ముగ్గురి తరపున వాదించే లాయర్ రోల్‌ను పవన్ కల్యాణ్ పోషించాడు. ఆయన భార్య పాత్రలో శ్రుతి హాసన్ కనిపించనున్నది. ఆమె క్యారెక్టర్‌ను కూడా ఒరిజినల్‌కు భిన్నంగా మార్చారు.
మూడు సంవత్సరాల తర్వాత చేసిన 'వకీల్ సాబ్' సినిమాతో పవర్‌స్టార్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడో, ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడోనని ఇండస్ట్రీ వర్గాలే కాకుండా ఆడియెన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈలోగా వచ్చే ట్రైలర్ ఆ క్యూరియాసిటీని మరింతగా పెంచడం ఖాయం. పవన్ చివరిసారిగా రికార్డులు సృష్టించింది 2013లో వచ్చిన 'అత్తారిటికి దారేది' సినిమాతో. ఆ మూవీ ఇండస్ట్రీ హిట్టయింది. ఆ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్‌ను పవర్‌స్టార్ ఇవ్వలేదు. మునుపటి సినిమా 'అజ్ఞాతవాసి' అయితే డిజాస్టర్ అయ్యింది. అందుకే ఎనిమిదేళ్ల తమ ఆకలిని 'వకీల్ సాబ్' తీరుస్తాడని అభిమానులు శిఖరమంత ఆశతో ఎదురుచూస్తున్నారు.