English | Telugu
మోహన్‌బాబు పాట.. ట్యూన్ కష్టమన్న ఇళయరాజా!
Updated : Feb 20, 2021
దేశంలోని గొప్ప విలక్షణ నటుల్లో ఒకరిగా కీర్తి ప్రతిష్ఠలు పొందిన డాక్టర్ మోహన్‌బాబు టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. పవర్‌ఫుల్ రోల్ చేస్తుండటమే కాకుండా ఈ చిత్రానికి ఆయన స్క్రీన్‌ప్లే సైతం సమకూరుస్తున్నారు. టాలీవుడ్‌లో ఇంతవరకూ రాని ఒక విభిన్న కథా కథనాలతో రూపొందుతోన్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
11వ శతాబ్దంలో శ్రీరామచంద్రుని ఘనతను చాటి చెబుతూ వేదాంత దేశిక అనే మహనీయుడు 'రఘువీర గద్యము' రాశారు. 'సన్ ఆఫ్ ఇండియా' బృందం గణనీయమైన కృషి చేసి ఆ గద్యాన్ని అద్భుతం అనిపించే శ్రావ్యమైన పాటగా ప్రేక్షకులకు అందిస్తోంది.
ఆ పాటకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ఇటీవల చెన్నైలో జరిగాయి. 'సన్ ఆఫ్ ఇండియా'కు సంగీత సారథ్యం వహిస్తోన్న మ్యాస్ట్రో ఇళయారాజాతో మోహన్‌బాబు, దర్శకుడు డైమండ్ రత్నబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన విలక్షణ గాత్రంతో "జయజయ మహావీర మహాధీర ధోళీయ.." అంటూ సాగే రఘువీర గద్యాన్ని అలవోకగా తన గంభీర స్వరంతో ఆలపించారు మోహన్‌బాబు. అది విని ఆశ్చర్యపోతూ, "ఏంటీ ఇంత కఠినంగా ఉందే.. ఏం చేసేది? ఎలా చేసేది? ట్యూన్‌కి ఎలా వస్తుంది?" అని నవ్వుతూనే అడిగారు ఇళయరాజా.
"దీనికి మీరే సమర్థులు" అన్నారు మోహన్‌బాబు. "ఈ పాటను మీరు పాడతారా?" అని అడిగారు మేస్ట్రో. తాను పాడలేననీ, డైలాగ్ చెప్పగలననీ మోహన్‌బాబు అన్నారు. మీ పదనిసలకు తగ్గట్లుగా డైలాగ్ చెప్పమంటే చెప్తాను కానీ, పాట తన వల్ల కాదని చెప్పేశారు. "ఇది గద్యం లాగా ఉంది. దీనికి ట్యూన్ చెయ్యడం ఎలా కుదురుతుంది. చాలా కష్టమండీ" అన్నారు మేస్ట్రో. "మీకే కుదురుతుంది సార్. మీరు చేయంది లేదు." అని చెప్పి, 'రఘువీర గద్యం' రాత ప్రతిని ఆయనకు అందజేశారు మోహన్‌బాబు.
సుదీర్ఘమైన కెరీర్‌లో తనకే సాధ్యమనిపించే అపూర్వమైన సంగీత బాణీలతో లెక్కలేనన్ని అద్భుతమైన పాటలకు జీవం పోసిన ఇళయరాజా ఇప్పుడు మోహన్‌బాబు 'సన్ ఆఫ్ ఇండియా' కోసం "రఘువీర గద్యం"ను పాట రూపంగా మలచి అందిస్తున్నారు. ఈ పాట ఈ చిత్రానికే కాకుండా తెలుగు సినిమాకే గర్వకారణంగా నిలిచే పాట అవుతుందనడంలో సందేహం లేదు.
కాగా ఇదివరకు విడుదల చేసిన ఈ ఫిల్మ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ లభించింది. మెడలో రుద్రాక్ష మాల ధరించి ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన మోహన్‌బాబు రూపానికి సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఇన్ని దశాబ్దాల సినీ కెరీర్‌లో మోహన్‌బాబుకు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ లుక్ అని చెప్పొచ్చు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ చిత్రంపై అంచనాలను మరో లెవల్‌కి పెంచింది.
విష్ణు మంచు భార్య, మోహన్ బాబు కోడలు విరానికా మంచు ఈ చిత్రంతో స్టైలిస్ట్‌గా మారారు. ఆమె మోహన్ బాబును పూర్తిగా కొత్త అవతారంలో చూపిస్తున్నారు. డైరెక్టర్ డైమండ్ రత్నబాబుతో పాటు తోటపల్లి సాయినాథ్ డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి సర్వేష్ మురారి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. సుద్దాల అశోక్‌తేజ లిరిక్స్ అందిస్తున్నారు. గౌతంరాజు ఎడిటర్‌గా వర్క్ చేస్తుండగా చిన్నా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.