English | Telugu
'నాంది' మూవీ రివ్యూ
Updated : Feb 19, 2021
సిన్మా పేరు: నాంది
తారాగణం: అల్లరి నరేశ్, వరలక్ష్మీ శరత్ కుమార్, హరీశ్ ఉత్తమన్, వినయ్ వర్మ, నవమి, ప్రవీణ్, ప్రియదర్శి, దేవీప్రసాద్, కృష్ణేశ్వరరావు, శ్రీకాంత్ అయ్యంగార్, సీవీఎల్ నరసింహారావు
కథ: తూమ్ వెంకట్
మాటలు: అబ్బూరి రవి
సాహిత్యం: చైతన్య ప్రసాద్, శ్రీమణి, కిట్టు విస్సాప్రగడ
మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: సిద్
ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్
ఆర్ట్: బ‌్రహ్మ కడలి
ఫైట్స్: వెంకట్
నిర్మాత: సతీశ్ వేగేశ్న
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్ కనకమేడల
బ్యానర్: ఎస్‌వీ2 ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేది: 19 ఫిబ్రవరి, 2021
కామెడీ హీరోగా రాణించిన అల్లరి నరేశ్ కొంతకాలంగా సరైన హిట్టు లేక సతమతమవుతున్న సంగతి మనకి ఎరికేగా! టీవీ చానళ్లలో కామెడీ షోలు జనాన్ని మస్తుగా నవ్విస్తుండేసరికి కామెడీ సినిమాలకు రోజులు కాకుండా పోయినై. అందుకనే "సుడిగాడు" లాంటి బ్లాక్‌బస్టర్ సిన్మా తర్వాత నరేశ్‌కు చెప్పుకోడానికి మంచి కామెడీ సినిమానే లేదు. అందుకని రూటు మార్చి ఒక మాంచి సీరియస్ సబ్జెక్టుతోని జనం ముందుకు వచ్చిండు. ఆ సిన్మా పేరు "నాంది". విజయ్ కనకమేడల అనే కొత్త డైరెక్టర్ ఈ సిన్మాని తీసిండు. అల్లరి నరేశ్‌తోని ఈ డైరెక్టర్ ఏం చేసిండో జర చూద్దాం.. పదుండ్రి...
కథ
పౌరహక్కుల సంఘం నాయకుడు, లాయర్ అయిన రాజగోపాల్ అనే చానా మంచి మనిషిని ఎవరో చంపేస్తరు. ఆ మర్డర్ కేసుల మన హీరో బండి సూర్యప్రకాశ్‌ను ఇరికిస్తడు ఏసీపీ కిశోర్. అట్లా అండర్ ట్రయల్ ఖైదీగా ఐదేళ్లు జైల్లో మగ్గిపోతడు సూర్యప్రకాశ్. ఇట్లాంటి టైమ్‌ల ఆద్య అనే ఒక జూనియర్ లాయరమ్మ ఊడిపడి, సూర్యని మర్డర్ కేసు నుండి నిర్దోషిగా నిరూపిచ్చి, జైలు నుంచి బయటకు తెస్తది. మర్డర్ కేసుల ఇరికించిన ఏసీపీ కిశోర్ మింద ఐపీసీ 211 సెక్షన్ కింద కోర్టులో ఆద్య సాయంతో కేసు వేస్తడు సూర్య. ఆ కేసులో ఆళ్లు గెలుస్తరా, మార్పుకు "నాంది" పలుకుతరా, లేరా.. అనేది మిగతా కత.
విశ్లేషణ
ఏక్‌దమ్మున కామెడీ సినిమాల నుంచి ఇంత సీరియస్ సినిమాల, ఇంత సీరియస్ క్యారెక్టర్‌ల అల్లరి నరేశ్‌ని చూడనీకి కొంచెం ఇబ్బందైతది కానీ, నిజానికి గిది మంచి సబ్జెక్టే. కొంతమంది పోలీసాఫీసర్లు ఎట్లా అమాయకుల్ని తప్పుడు కేసుల ఇరికిస్తరో, ఆ అమాయకలు అండర్ ట్రయల్ ఖైదీలుగా జైళ్లలో ఎట్లా మగ్గిపోతుండటరో చూపించనీకి ఈ సినిమాని తీసిండు. అది మంచిగనే ఉంది కానీ, మొత్తం సిన్మాని సీరియస్ టోన్‌లోనే నడపడంతోని ఆడియెన్స్ రిలీఫ్‌గా ఊపిరి తీయనీకి చాన్స్ లేకుండా పోయింది.
ఒగ మంచి పాయింట్‌ని, జనం ఆలోచించాల్సిన పాయింట్‌ని ఎట్లా చెప్పాల!. మధ్యమధ్యలో ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాల. కాసిన్ని సరదా సీన్లు ఉండాల. సీన్లన్నీ చకచకా ఉరకాల. గప్పుడే సీరియస్ కత కూడా చూడబుద్దయితది. డైరెక్టర్ విజయ్ కనకమేడల ఈ విషయంలో విఫలమయ్యిండు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకే మాదిరిగా, సీరియస్‌గా సీన్లు రాసుకొని పోయిండు. ప్రవీణ్, ప్రియదర్శి లాంటి యాక్టర్లని పెట్టి కూడా ఆళ్లకి రిలీఫ్ సీన్లు రాయలేదు డైరెక్టర్.
పోనీ కతనమన్నా స్పీడ్‌గా ఉందా? లేదుమల్ల. గీమధ్యన మనం కార్తీ యాక్ట్ జేసిన "ఖైదీ" సిన్మా చూసినం. అందులో కామెడీ ఏమీ లేదు. కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నెక్ట్స్ ఏం జరుగుతదనే టెంపోని డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ మెయిన్‌టైన్ జేసిండు. ఆ టెంపో "నాంది" సిన్మాల మిస్సయింది. అందుకనే కొన్ని సందర్భాల బోర్‌కొడతది. కతలో అల్లరి నరేశ్ పడే పెయిన్ మన పెయిన్ అవ్వాలంటే ఈ టెంపోనే మెయిన్ ఎలిమెంట్. టెంపో మెయిన్‌టైన్ అయితే ఎమోషన్ క్యారీ అవుతది. ఆ ఎమోషన్ గీ సిన్మాల మిస్సయింది.
టెక్నికల్‌గా జూస్తే.. సిద్ సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ పాకాల బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. కతనంలో టెంపో మిస్సయిన విషయాన్ని ఎడిటర్ చోటా కె. ప్రసాద్ పట్టుకోలేకపోయిండు. తూమ్ వెంకట్ కత మంచిగనే రాసిండు కానీ, సీన్లు ఇంట్రెస్టింగ్‌గ రాసుకోడంలో డైరెక్టర్ విజయ్ మరింత నేర్పు చూపిచ్చి ఉండాల. అబ్బూరి రవి డైలాగ్స్ సీన్లకు తగ్గట్లు ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ యావరేజ్‌గ ఉన్నయి.
నటీనటుల అభినయం
యాక్టర్ల విషయానికొస్తే, బండి సూర్యప్రకాశ్ క్యారెక్టర్‌ల అల్లరి నరేశ్ బాగా చేసిండనేది నిజం. కామెడీ చేసే నరేశ్‌ని ఇంత సీరియస్ సినిమాల చూడ్డం కొత్త ఎక్స్‌పీరియెన్స్. క్యారెక్టర్‌లోని పెయిన్‌ని బాగా చూపిచ్చాడు నరేశ్. యాక్టర్‌గా అతడికి మంచి మార్కులైతే పడతయ్ కానీ, ఆడియెన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటరనేదే డౌట్. మర్డర్ కేసు నుంచి అతడిని విడిపిచ్చి, అతడి కోసం ఫైట్ జేసే లాయర్ ఆద్య పాత్రలో వరలక్ష్మీ శరత్‌కుమార్ మంచిగ యాక్ట్ జేసి, ఆ పాత్రకి న్యాయం జేసింది.
సూర్యని మర్డర్ కేసుల ఇరికించే బక్వాస్‌గాళ్లు మాజీ హోమ్ మినిస్టర్ నాగేంద్ర, ఏసీపీ కిశోర్ క్యారెక్టర్లకు వినయ్ వర్మ, హరీశ్ ఉత్తమన్ పాత్రలకు తగ్గట్లే దుర్మార్గంగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన్రు. సూర్యను లవ్ చేసే అమ్మాయిగా నవమి అనే కొత్తపోరి అందంగా ఉంది. సూర్య ఫాదర్‌గా దేవీప్రసాద్ పర్ఫార్మెన్స్ చక్కగుంది. జోవియల్ క్యారెక్టర్లో అలరించే ప్రవీణ్ ఎమోషనల్ క్యారెక్టర్ల నటునిగా కొత్త యాంగిల్‌ని మనకు పరిచయం చేసిండు. ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్, కృష్ణేశ్వరరావు లాంటివాళ్లు పాత్రల పరిధికి తగ్గట్లు నటించిన్రు.
తెలుగువన్ పర్‌స్పెక్టివ్
సినిమాలో మంచి పర్ఫార్మెన్స్‌లు ఉన్నయి. మంచి విషయం ఉంది. అయినప్పటికీ ఓవరాల్‌గా చెప్పాల్నంటే కతనంలో టెంపో మిస్సయిన మంచి కత "నాంది" అని చెప్పాల.
రేటింగ్: 2.5/5
- బుద్ధి యజ్హమూర్తి