English | Telugu
బర్త్ డే మంత్ లో మెగాస్టార్ బాక్సాఫీస్ హిట్స్.. ఏంటో తెలుసా!
Updated : Aug 22, 2023
ఆగస్టు నెల.. మెగాస్టార్ చిరంజీవికి ఎంతో ప్రత్యేకం. ఈ నెల 22న చిరు పుట్టినరోజు. ఇక ఇదే నెలలో వేర్వేరు సంవత్సరాల్లో పలు ఆసక్తికరమైన చిత్రాలతో పలకరించారు చిరు. వీటిలో కొన్ని బాక్సాఫీస్ ముంగిట సంచలనం సృష్టించాయి. ఆ చిత్రాల వివరాల్లోకి వెళితే..
ఛాలెంజ్: 1984లో విడుదలైన మ్యూజికల్ సెన్సేషన్ ఇది. ఆగస్టు 9న రిలీజైన ఈ చిత్రం అప్పటి యువతరాన్ని విశేషంగా అలరించింది. యండమూరి వీరేంద్రనాథ్ 'డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు' నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమాని ఎ. కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. ఇందులో చిరంజీవికి జంటగా విజయశాంతి, సుహాసిని నటించగా ఇళయరాజా సంగీతమందించారు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్. రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు.
మరణ మృదంగం: చిరంజీవికి 'మెగాస్టార్' అనే టైటిల్ ఇచ్చిన సినిమా ఇదే. 1988 ఆగస్టు 4న జనం ముందు నిలిచిన 'మరణ మృదంగం'లో చిరుకి జోడీగా రాధ, సుహాసిని అలరించగా.. ఎ. కోదండరామిరెడ్డి రూపొందించారు. ఈ సినిమాకి కూడా యండమూరి నవలే ఆధారం. 'మరణ మృదంగం' అనే నవలాధారంగా తయారైన ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్. రామారావు నిర్మించగా.. ఇళయరాజా బాణీలు కట్టారు.
కొదమ సింహం: కౌబాయ్ పాత్రలో మెగాస్టార్ ఎంటర్టైన్ చేసిన సినిమా ఇది. కె. మురళీ మోహన రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రమా ఫిలింస్ పతాకంపై కైకాల నాగేశ్వరరావు నిర్మించారు. రాజ్ - కోటి స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన రాధ, సోనమ్ నటించారు. 1990 ఆగస్టు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందు నిలిచింది.
చూడాలని వుంది: చైల్డ్ సెంటిమెంట్ తో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా సౌందర్య, అంజలా ఝవేరి నటించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాని గుణశేఖర్ తీర్చిదిద్దారు. మణిశర్మ సంగీతం ఎస్సెట్ గా నిలిచిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ.. 1998 ఆగస్టు 27న జనం ముందు నిలిచింది.