English | Telugu
ఎవరి మాట వినని 'సీతయ్య'కి 20 ఏళ్ళు.. హరికృష్ణ నట విశ్వరూపం!
Updated : Aug 21, 2023
నందమూరి హరికృష్ణ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో 'సీతయ్య' ఒకటి. 'సీతారామరాజు', 'లాహిరి లాహిరి లాహిరిలో' వంటి విజయవంతమైన సినిమాల తరువాత వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో హరికృష్ణ నటించిన మూడో సినిమా ఇది. గత రెండు చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో కనిపించిన హరికృష్ణ.. 'సీతయ్య'లో కథానాయకుడిగా నట విశ్వరూపం చూపించారు. ఇందులో హరికృష్ణకి జోడీగా సౌందర్య, సిమ్రన్ నటించగా ముకేశ్ రిషి, రాహుల్ దేవ్, రవి ప్రకాశ్, జయ ప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, మోహన్ రాజ్, కాంతారావు, బాలయ్య, ఆహుతి ప్రసాద్, రాజన్ పి. దేవ్, దేవన్, నళిని, సత్య ప్రకాశ్, సుభాషిణి, వింధ్య, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం, మల్లికార్జున రావు, రమాప్రభ, సునీత వర్మ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. రాయలసీమలోని ఓ ప్రాంతంలో ఫ్యాక్షన్ గొడవలను నివారించి.. శాంతిని నెలకొల్పిన సీతయ్య అనే ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ కథే.. ఈ సినిమా.
స్వరవాణి కీరవాణి బాణీలు 'సీతయ్య'కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సిమ్రన్ తో కలిసి హరికృష్ణ చిందేసిన "బస్కెక్కి వస్తావో", "అమ్మతోడు" సినిమాకి ఎస్సెట్ గా నిలవగా.. "ఒక్క మగాడు", "సమయానికి", "సిగ్గేస్తోంది", "ఇదిగో రాయలసీమ గడ్డ", "రావయ్య రావయ్య", "ఆది శంకరుల", "ఎవరి మాట వినడు" కూడా ఆకట్టుకున్నాయి. వీటిలో "ఇదిగో రాయలసీమ గడ్డ" పాటకిగానూ 'ఉత్తమ గాయకుడు' విభాగంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 'నంది' పురస్కారం అందుకున్నారు. బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ చౌదరి స్వయంగా నిర్మించిన 'సీతయ్య'.. 2003 ఆగస్టు 22న జనం ముందు నిలిచింది. మంగళవారంతో ఈ జనరంజక చిత్రం 20 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.