English | Telugu
టాప్ ఫామ్‌లో పవన్ కల్యాణ్.. వాట్ ఎ కమ్‌బ్యాక్!
Updated : Apr 10, 2021
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, సూపర్‌స్టార్ మహేశ్ ఫ్యాన్స్ మధ్య ఎంత వైరం ఉండుగాక, తమ హీరోను ఆకాశానికెత్తేస్తూ ఎదుటి హీరోను ఎంత కించపరుస్తూ ఉండుగాక.. ఆ ఇద్దరు స్టార్స్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి అభిమానం. అందుకే పవన్ కల్యాణ్ సినిమా 'జల్సా'కు వాయిస్ ఓవర్ ఇచ్చి అతనిపై తన అభిమానాన్ని ప్రదర్శించాడు మహేశ్. పైగా మెగా ఫ్యామిలీతో మహేశ్ ఎంత సన్నిహితంగా ఉంటాడో మనకు తెలిసిందే. అలాగే సందర్భం వచ్చినప్పుడల్లా మహేశ్‌ను ప్రశంసిస్తూ వస్తున్నాడు పవన్ కల్యాణ్.
లేటెస్ట్‌గా మరోసారి పవర్‌స్టార్‌పై తనకు ఎంతటి అభిమానముందో చాటాడు మహేశ్. పవన్ లేటెస్ట్ ఫిల్మ్ 'వకీల్ సాబ్'ను తన ఏఎంబీ మాల్‌లో వీక్షించాడు మహేశ్. నిజానికి తొలిరోజే సినిమాని చూడాలనుకున్నాడు కానీ వీలుపడలేదు. ఈరోజు చూసి, ఎక్సయిట్ అయ్యాడు. 'వకీల్ సాబ్' క్యారెక్టర్‌లో పవన్ నటనకు ముగ్ధుడయ్యాడు. పవన్ కల్యాణ్ టాప్ ఫామ్‌లో ఉన్నాడనీ, వకీల్ సాబ్‌గా పవర్-ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనీ ప్రశంసించాడు.
తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్పందిస్తూ, "టాప్ ఫామ్‌లో పవన్ కల్యాణ్.. 'వకీల్ సాబ్'లో పవర్-ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. వాట్ ఎ కమ్‌బ్యాక్." అంటూ చప్పట్లు కొడుతున్న చేతుల ఎమోజీలీను జోడించాడు. అందులోనే ప్రకాశ్‌రాజ్ బ్రిలియంట్‌గా యాక్ట్ చేశాడని మెచ్చుకున్నాడు.
ఆ ట్వీట్‌కు కొనసాగింపుగా మరో ట్వీట్ వేశాడు. "అమ్మాయిలు నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల హృదయాన్ని స్పృశించే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తమన్ టాప్ నాచ్ మ్యూజిక్ ఇచ్చాడు. మొత్తం టీమ్‌కు అభినందనలు." అంటూ డైరెక్టర్ శ్రీరామ్ వేణు, నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, శ్రుతి హాసన్, సినిమాటోగ్రాఫర్ పి.ఎస్. వినోద్, బోనీ కపూర్‌ల పేర్లను ప్రస్తావించాడు.
ఇప్పటికే 'వకీల్ సాబ్'లో పవన్ కల్యాణ్ నటనను ప్రశంసిస్తూ అన్నయ్య చిరంజీవి, అబ్బాయ్ రామ్‌చరణ్ ట్వీట్స్ చేసిన విషయం తెలిసిందే. వాళ్లంటే ఇంట్లో మనుషులు. కానీ వారికంటే 'వకీల్ సాబ్'పైనా, పవన్ కల్యాణ్ పర్ఫార్మెన్స్ పైనా మహేశ్ చేసిన ట్వీట్ మొత్తం సినిమా ఇండస్ట్రీని ఆనందంలో ముంచెత్తింది. టాప్ స్టార్స్ మధ్య ఎలాంటి ఇగోలు లేని ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఉండటం గొప్ప విషయమని వారంతా అంటున్నారు. ఇద్దరు స్టార్ల ఫ్యాన్స్ కూడా మహేశ్ ట్వీట్‌కు సానుకూలంగా స్పందిస్తున్నారు. మహేశ్ ఇలా ట్వీట్ చేశాడో లేదో, కొద్ది నిమిషాల వ్యవధిలోనే వేలాది లైక్స్, రిట్వీట్స్ పొందడం విశేషం.