English | Telugu
తెలుగు సినిమా గర్వించే రీతిలో 'మేజర్'.. ప్రామిస్ చేస్తున్న టీజర్!
Updated : Apr 12, 2021
"నాన్నా.. బోర్డర్‌లో ఆర్మీ ఎలా ఫైట్ చెయ్యాలి.. ఇండియా క్రికెట్ మ్యాచ్ ఎలా గెలవాలి? అందరూ ఆలోచిస్తారు. అదీ దేశభక్తే. దేశాన్ని ప్రేమించడం అందరి పని. వాళ్లను కాపాడ్డం సోల్జర్ పని." అని తండ్రి పాత్రధారి ప్రకాశ్ రాజ్‌కు చెప్పాడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రధారి అడివి శేష్. సోల్జర్ కావాలనుకున్న తన ఆశయాన్ని సందీప్ నెరవేర్చుకున్నాడు. అంతేకాదు.. ఆ పౌరులను కాపాడటం కోసం తన ప్రాణాలను ఇవ్వడానికి అతను ఏమాత్రం వెనుకాడలేదు.
అందుకే ఫేమస్ అయిన 26/11 ముంబై టెర్రరిస్ట్ ఎటాక్ దాడుల్లో ఉన్నికృష్ణన్ వీరోచితంగా టెర్రరిస్టులపై పోరాడాడు. వాళ్ల చెరలో చిక్కుకున్న అనేకమంది పౌరులను రక్షించాడు. ఆ క్రమంలో తన ప్రాణాల మీదకు వచ్చినా ఏమాత్రం వెనుకడుగు వెయ్యలేదు. టెర్రరిస్టుల గన్స్ నుంచి వచ్చిన తూటాలు తన శరీరాన్ని తూట్లు పొడుస్తున్నా కర్తవ్యాన్ని విస్మరించలేదు. అలాంటి గొప్ప దేశభక్తుడి జీవితం ఆధారంగా రూపొందుతోన్న 'మేజర్' టీజర్ రిలీజైంది. ఒకటిన్నర నిడివి కలిగిన ఆ టీజర్ చూస్తుంటే ఒళ్లు ఉద్వేగంతో, ఉత్తేజంతో గగుర్పొడుస్తుందనేది నిజం.
తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఈ టీజర్‌ను వరుసగా మహేశ్‌బాబు, సల్మాన్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ రిలీజ్ చేశారు. ఫెంటాస్టిక్ విజువల్స్‌తో, ఒళ్లు జలదరిపంజేసే, రోమాలు నిక్కబొడుచుకొనేలా చేసే యాక్షన్ మూమెంట్స్‌తో సూపర్బ్ అనిపిస్తోంది టీజర్. తన కర్తవ్య నిర్వహణలో మేజర్ ఎంతటి రిస్క్ చేశాడో, ఎంతటి ధైర్యసాహసాలు, పరాక్రమం ప్రదర్శించాడో చూస్తుంటే నిజంగానే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌గా అడివి శేష్ ఈ సినిమాతో యాక్టర్‌గా ఇంకో లెవల్‌కు చేరుకుంటాడనే నమ్మకాన్ని టీజర్ కలిగిస్తోంది. టెర్రరిస్ట్ దాడుల్లో హోటల్‌లో తన కుటుంబంతో చిక్కుబడిపోయిన ఓ స్త్రీగా శోభిత కనిపించింది. మేజర్‌ను ప్రేమించిన అమ్మాయిగా సయీ మంజ్రేకర్, మేజర్ తల్లిదండ్రులుగా రేవతి, ప్రకాశ్‌రాజ్, మేజర్ పై ఆఫీసర్‌గా మురళీశర్మ టీజర్‌లో కనిపించారు. మురళీశర్మ, "మేజర్ అక్కడ ఎంతమందున్నారు? మేజర్ సందీప్.. నువ్వక్కడ ఉన్నావా?" అని వైర్‌లెస్‌లో అడిగితే, సందీప్ పాత్రధారిగా అడివి శేష్, "పైకి రాకండి. వాళ్ల సంగతి నేను చూసుకుంటాను." అని చెప్పాడు. అప్పటికే అతని ఒళ్లు తూట్లు పడి ఉంది. అయినప్పటికీ అతను నిబ్బరాన్ని కోల్పోలేదు. ఇలాంటి గగుర్పాటు కలిగించే సన్నివేశాలతో 'మేజర్'ను ఆద్యంతం ఉత్కంఠభరితంగా డైరెక్టర్ శశికిరణ్ తిక్కా రూపొందించాడని ఆశించవచ్చు.
శ్రీరణ్ పాకాల మ్యూజిక్, వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ 'మేజర్'కు మెయిన్ ఎస్సెట్స్ అనిపిస్తున్నాయి టీజర్ చూస్తుంటే. కథ, స్క్రీన్‌ప్లేలను అడివి శేష్ స్వయంగా సమకూర్చిన ఈ సినిమాకు రైటర్ అబ్బూరి రవి స్క్రిప్ట్ సహకారం అందించడంతో పాటు డైలాగ్స్ రాశారు. సునీల్ రోడ్రిగ్స్ డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఉద్వేగభరితంగా ఉన్నాయి. ఏ విధంగా చూసినా తెలుగు సినిమా గర్వించే రీతిలో 'మేజర్' రూపొందుతోందనే నమ్మకం కలుగుతోంది. సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ యస్ మూవీస్ కలిసి నిర్మిస్తున్న 'మేజర్' మూవీ జూలై 2న విడుదలకు సిద్ధమవుతోంది.