English | Telugu
తొలి రోజు ఐదో స్థానంలో 'వకీల్ సాబ్'
Updated : Apr 10, 2021
పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేసిన 'వకీల్ సాబ్' మూవీ తొలిరోజు ఊహించనట్లే భారీ వసూళ్లు సాధించింది. అన్యాయానికి, అఘాయిత్యానికీ గురైన ముగ్గురు అతివలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వారి తరపున వకాల్తా పుచ్చుకొనే లాయర్‌గా పవర్‌స్టార్ నటించిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 32.25 కోట్ల షేర్ సాధించిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ మూవీ ఓవరాల్‌గా ఫస్ట్ డేకి సంబంధించి టాలీవుడ్ టాప్ 5 గ్రాసర్‌గా నిలిచినట్లయింది.
ఆంధ్రప్రదేశ్‌లో టిక్కెట్ రేట్లు పెంచడానికి అనుమతి లభించినా, ఎక్స్‌ట్రా షోస్‌కు అనుమతించినా ఈజీగా టాప్ 4గా నిలిచి ఉండేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం టాప్ 4 ప్లేస్‌లో మహేశ్ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' ఉంది. దానికి ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 32.77 కోట్ల షేర్ వచ్చింది. అంటే చాలా తక్కువ మార్జిన్‌లో 'వకీల్ సాబ్' ఐదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇక 'బాహుబలి 2' మూవీ రూ. 43 కోట్ల షేర్‌తో టాప్ ప్లేస్‌లో ఉండగా, 'సైరా.. నరసింహారెడ్డి' రూ. 38.75 కోట్లతో రెండో స్థానంలో, 'సాహో' మూవీ రూ. 36.52 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. ఏదేమైనా ఫస్ట్ డేకి సంబంధించి 'వకీల్ సాబ్' పవన్ కల్యాణ్ కెరీర్ బెస్ట్ ఫిగర్స్‌ను నమోదు చేసింది. తెలంగాణలో రూ. 8.75 కోట్లు, ఆంధ్రలో రూ. 19 కోట్లు, రాయలసీమలో రూ. 4.5 కోట్లను 'వకీల్ సాబ్' వసూలు చేసింది. మూడు ఏరియాల కలెక్షన్ చూస్తే, ఒక్క ఆంధ్రలోనే 58.9 శాతం వసూలవడం విశేషంగా భావించాలి.
ఈ సినిమా ప్రి బిజినెస్ వాల్యూ రెండు రాష్ట్రాల్లో రూ. 80.5 కోట్లని అంచనా. అంటే తొలి రోజే 40 శాతం రికవరీ అయ్యిందన్న మాట. వీకెండ్‌లోగా 80 శాతం పైనే రికవర్ అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే ఫస్ట్ వీక్‌లోనే 'వకీల్ సాబ్' బ్రేకీవెన్ అయ్యే అవకాశం ఉంది.