English | Telugu
భారీ ధర పలికిన 'ఆర్ఆర్ఆర్' తమిళనాడు హక్కులు
Updated : Feb 17, 2021
యస్.యస్. రాజమౌళి పీరియాడికల్ ఫిక్షన్ మూవీ 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ చేజిక్కించుకుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తోన్న ఈ మూవీ హక్కులను తాము సొంతం చేసుకున్న విషయాన్ని ఆ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.
"బిగ్గెస్ ప్యాన్ ఇండియా ఫిల్మ్ 'ఆర్ఆర్ఆర్' తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను మేం సొంతం చేసుకున్నామని అనౌన్స్ చేయడానికి ఆనందిస్తున్నాం, గర్విస్తున్నాం" అని ఆ సంస్థ ట్వీట్ చేసింది. ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ దానయ్య ఆ హక్కుల్ని రూ. 42 కోట్లకు అమ్మారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక తెలుగు మూవీ తమిళ వెర్షన్ రూ. 40 కోట్లకు పైగా అమ్ముడవడం ఇది రెండోసారి మాత్రమే. ఇదివరకు రాజమౌళి మునుపటి సినిమా 'బాహుబలి 2' తమిళ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ రూ. 47 కోట్లకు అమ్ముడుపోయాయి.
'ఆర్ఆర్ఆర్' మూవీని దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ చిత్రంలో నాయికలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, సముద్రకని కీలక పాత్రధారులు. రే స్టీవెన్‌సన్, అలీసన్ డూడీ విలన్లుగా కనిపించనున్నారు.