English | Telugu

కంగ‌నా.. నువ్వొక న్యూక్లియ‌ర్ బాంబ్‌వి!

 

ఫైర్ బ్రాండ్ యాక్ట్రెస్‌గా పేరుపొందిన కంగ‌నా ర‌నౌత్‌కు మ‌రో ఫైర్ బ్రాండ్ ఫిల్మ్ మేక‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ ఇంకో బిరుదు ఇచ్చారు. ఆమెను న్యూక్లియ‌ర్ బాంబ్‌గా అభివ‌ర్ణించారు. మంగ‌ళ‌వారం రాత్రి త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో కంగ‌న షేర్ చేసిన పోస్ట్‌కు ఆయ‌న రియాక్ష‌న్ అది. షూటింగ్ సెట్స్‌పై ఉన్న ఓ సెల్ఫీ పిక్చ‌ర్‌ను కంగ‌న షేర్ చేశారు.

ఆ పిక్చ‌ర్‌లో ఆమె నుదుటిపైన నెత్తుటి గాయం క‌నిపిస్తోంది. అడ్డంగా గీసుకుపోయిన చోట నుంచి నెత్తుటి చుక్క నిలువుగా కింద‌కు జార‌డం క‌నిపిస్తోంది. ముఖ‌మంతా దుమ్ముధూళి నిండి న‌ల్ల‌గా అగుపిస్తోంది. ఆ ఫొటోకు, "సంఘ‌ర్ష‌ణ‌లో ఓదార్పుని పొంద‌డం మీకు వింత‌గా అనిపించ‌వ‌చ్చు, క‌త్తుల కొట్లాట శ‌బ్దంతో ప్రేమ‌లో ప‌డ‌డం సాధ్యంకాద‌ని అనుకోవ‌చ్చు, ర‌ణ‌రంగం మీకు అగ్లీ రియాలిటీ కావ‌చ్చు. కానీ పోరాటం కోసం పుట్టిన అమ్మాయికి త‌న‌కు చెందిన వేరో ప్ర‌దేశం ఈ ప్ర‌పంచంలో మ‌రొక‌టి ఉండ‌దు." అని రాసుకొచ్చారు కంగ‌న‌.

దీన్ని రిట్వీట్ చేసిన ఆర్జీవీ, "ఇది ఒక ప్రొఫెష‌న‌ల్ ఫిల్మ్ మేక‌ర్‌గా నా కెరీర్‌లో నేను చూసిన ఒక న‌టి అత్యంత ఆక‌ర్ష‌ణీయ‌మైన క్లోజ‌ప్ గురించి మాత్ర‌మే.. ఇలాంటి ఇంటెన్సిటీతో, ఒరిజినాలిటీతో ఏ యాక్ట‌ర్ సింగిల్ ఇమేజ్‌ని ఇప్ప‌టిదాకా చూసిన‌ట్లు గుర్తుకు తెచ్చుకోలేక‌పోతున్నాను. హే కంగ‌నా.. నువ్వు ఫ‌** న్యూక్లియ‌ర్ బాంబ్‌వి." అని పోస్ట్ చేశారు. ఇది ఆమెని పొగిడిన‌ట్లా, తిట్టిన‌ట్లా అని నెటిజ‌న్లు అనుకుంటున్నారు. ఆర్జీవీ నుంచి వ‌చ్చిన సెటైరిక‌ల్ పోస్టుల్లో ఇదొక‌టి అనేది కాగ‌న‌గ‌ల‌మా!

కాగా ఆర్జీవీ చేసిన పోస్ట్‌ను ట్విట్ట‌ర్ తొల‌గించింది. కార‌ణం.. త‌న పోస్ట్‌లో ఆర్జీవీ ఉప‌యోగించిన "ఫ‌**" అనే ప‌దం.