English | Telugu
పెళ్లిలో రెడ్ శారీలో మెరిసిన దియా.. పిక్స్ వైరల్!
Updated : Feb 16, 2021
అందాల తార, నాగార్జున సరసన 'వైల్డ్ డాగ్'లో నటించడం ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన దియా మీర్జా తన పెళ్లి ఫొటోలను తొలిసారిగా షేర్ చేశారు. సోమవారం రాత్రి ముంబైలో బిజినెస్‌మ్యాన్ వైభవ్ రేఖితో ఆమె వివాహం జరిగింది. ఈ వేడుకకు సంబంధించి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో 4 పిక్చర్స్‌ను దియా షేర్ చేశారు. ఆ ఫొటోలతో పాటు, "మనం ఇల్లు అని పిలుచుకొనే ప్రేమ అనేది ఓ పూర్తి వృత్తం. దానికి కనుగొనడం ఎంత అద్భుతం! నా కుటుంబం పెరిగిన క్షణాలను, ఆ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నా. అన్ని పజిల్స్ తమ మిస్సయిన ముక్కల్ని కనుగొనవచ్చు, అన్ని హృదయాలు నయం కావచ్చు, ప్రేమ తాలుకు అద్భుతం మన చుట్టూ కొనసాగుతుండవచ్చు." అని రాసుకొచ్చారు.
ఆమె షేర్ చేసిన రెండు ఫొటోల్లో ఆ ఇద్దరూ చేయీ చేయీ కలిపి ఏడడుగులు నడుస్తూ కనిపిస్తున్నారు. ఒక పిక్చర్‌లో పూలదండలు మార్చుకుంటున్నారు. మరో పిక్చర్‌లో మండపంలో కూర్చొని పెళ్లి తంతులో పాల్గొంటున్నారు. దియా రెడ్ కలర్ శారీలో మెరిసిపోతోంది. ఈ వేడుకలో 50 మంది లోపలే అతిథులు హాజరయ్యారు. వారిలో నటి అదితి రావ్ హైదరి కూడా ఉంది.
నిన్నటి దాకా ఇటు దియా కానీ, అటు వైభవ్ కానీ తమ రిలేషన్‌షిప్ గురించి కానీ, తమ పెళ్లి గురించి కానీ మాట్లాడలేదు. నిన్న ఉదయమే తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో వెల్లడించారు దియా. ఆ తర్వాత దియా ఇంటి దగ్గర పెళ్లి అలంకరణలను ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలతో బంధించి ఆన్‌లైన్‌లో వైరల్ చేశారు.
ఇది దియాకు రెండో పెళ్లి. ఇదివరకు ఆమె నిర్మాత సాహిల్ సంఘాను పెళ్లాడారు. 2019లో వారు విడిపోయారు.