English | Telugu
మీరు నాపై విసిరిన రాళ్లతోటే నేనొక కోటను నిర్మించాను.. సునీత పోస్ట్ వైరల్!
Updated : Mar 8, 2021
గాయని సునీత మరోసారి తనేమిటో చాటి చెప్పారు. తనమీద రాళ్లు విసిరినవాళ్లను, తనలో అభద్రతా భావాన్ని రేకెత్తించాలనుకున్న వాళ్లను, తనను నిందించిన వాళ్లను క్షమించేశారు. అదే సమయంలో వారికి సున్నితంగా వాతలు కూడా పెట్టారు. సోమవారం విమెన్స్ డే సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో సునీత పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.
రెడ్ కలర్ టీ షర్ట్ ధరించి, తలకు హ్యాట్ పెట్టుకున్న ఫొటోను షేర్ చేసిన సునీత, "మీరు జడ్జ్ చేస్తారు, ట్రోల్ చేస్తారు, నన్ను కిందకు లాగడానికి ఎప్పుడూ ట్రై చేస్తుంటారు. ఒక విషయాన్ని ప్రూవ్ చేయాలనుకుంటారు, నాలో అభద్రతా భావాన్ని కలిగిస్తుంటారు. మీరు నన్ను నమ్మరు, సపోర్ట్‌గా నిలవరు, నేను చెప్పేది ఎప్పుడూ వినరు. నేను ఫెయిలైనప్పుడు మీరు నవ్వుతారు, నాకు ఊపిరాడనీయకుండా చేస్తారు. అకారణంగా నన్ను నిందిస్తారు. హ్యాపీ విమెన్స్ డే అంటూ నాకు శుభాకాంక్షలు తెలుపుతారా?" అని ప్రశ్నించారు.
ఆ వెంటనే, "యస్, దాన్ని నేను స్వీకరిస్తాను. ఎందుకంటే నేను సొంతంగా నా బలాన్ని పుంజుకొని, మీరు నాపై విసిరిన రాళ్లతోటే ఒక కోటను నిర్మించాను. అన్ని విధాలా ముందుకు సాగాను!!" అని చెప్పారు.
చివరగా, "నేను నవ్వుతాను, క్షమిస్తాను, శ్రద్ధ చూపుతాను, ప్రేమిస్తాను, ఎప్పుడూ వదలను. నేను స్త్రీని.. దయామయిని!! మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!!" అంటూ రాసుకొచ్చారు.