English | Telugu
'ఆదిపురుష్' దగ్గరకు సీత వచ్చేసింది!
Updated : Mar 11, 2021
ప్రభాస్ టైటిల్ పాత్రధారిగా బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ 'ఆదిపురుష్' మూవీని రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. రామాయణ గాథ ఆధారంగా తీస్తున్న ఈ చిత్రంలో శ్రీరామునిగా ప్రభాస్ నటిస్తున్నాడు. ఇంతదాకా ఈ సినిమాలో సీత పాత్రధారిపై సస్పెన్స్ కొనసాగుతూ రాగా, ఎట్టకేలకు అది వీడింది. సీత పాత్రను చేయడానికి బాలీవుడ్ తార కృతి సనన్ వచ్చేసింది. అలాగే, లక్ష్మణునిగా నటించేందుకు సన్నీ సింగ్ ఎంపికయ్యాడు. ఈరోజు ఉదయమే ఈ ఇద్దరి ఎంపిక గురించిన ప్రకటన వచ్చింది.
కృతి సనన్ స్వయంగా తను 'ఆదిపురుష్'లో నటిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ప్రభాస్, ఓమ్ రౌత్, సన్నీ సింగ్‌తో కలిసి దిగిన ఫొటోను కూడా ఆమె షేర్ చేసింది. "ఒక కొత్త జర్నీ మొదలవుతోంది. ఆదిపురుష్.. ఇది చాలా చాలా స్పెషల్. ఈ ఇంద్రజాల ప్రపంచంలో ఓ భాగం కావడాన్ని గర్వంగా, గౌరవంగా, అమితోద్వేగంగా ఉంది." అని ఆమె రాసుకొచ్చింది.
కృతి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. మహేశ్ జోడీగా '1.. నేనొక్కడినే' మూవీలో నటించడం ద్వారా ఆమె సినీ రంగంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత 'దోచెయ్' సినిమాలో నాగచైతన్య సరసన నటించింది.
ఇప్పటికే 'ఆదిపురుష్'లో రావణునిగా సైఫ్ అలీఖాన్ నటిస్తోన్న విషయం మనకు తెలుసు. 2022 ఆగస్ట్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో మొదలైంది. 'తానాజీ' లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఆదిపురుష్‌పై అంచనాలు అసాధారణ స్థాయిలో ఉన్నాయి.
తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఏక కాలంలో విడుదలయ్యే ఈ మూవీని భూషణ్ కుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ కలిసి నిర్మిస్తున్నారు.