English | Telugu
'ఏ1 ఎక్స్‌ప్రెస్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్.. యావరేజ్!
Updated : Mar 8, 2021
సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా డెన్నిస్ జీవన్ కానుకొలను డైరెక్ట్ చేసిన 'ఏ1 ఎక్స్‌ప్రెస్' మూవీ బాక్సాఫీస్ దగ్గర మూడు రోజుల ఫస్ట్ వీకెండ్ యావరేజ్‌గా వసూళ్లను సాధించింది. మార్చి 5న విడుదలైన ఈ సినిమా ఎక్స్‌ప్రెస్ రేంజ్‌లో కాకుండా ప్యాసింజర్ స్టైల్‌లో 2.14 కోట్ల రూపాయల షేర్ (అంచనా) సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
హిప్ హాప్ తమిళ హీరోగా నటించగా హిట్టయిన తమిళ ఫిల్మ్ 'నట్‌పే తునై'కి రీమేక్‌గా తయారైన ఈ హాకీ బేస్డ్ ఫిల్మ్‌లో కొన్ని మంచి సన్నివేశాలు ఉన్నప్పటికీ, ఓవరాల్‌గా ప్రేక్షకులకు సహానుభూతి కలిగించడంలో పాక్షికంగానే సక్సెస్ అయ్యిందని విమర్శకులు భావిస్తున్నారు. మార్చి 5న విడుదలైన మిగతా సినిమాల కంటే 'ఏ1 ఎక్స్‌ప్రెస్'కే ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు మద్దతుగా నిలిచాయి. పలువురు సెలబ్రిటీలు దానికి అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.
ఇంత చేసినా, మూడు రోజులకు కలిపి రూ. 2.14 కోట్లనే 'ఏ1 ఎక్స్‌ప్రెస్' సాధించగలిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 76 లక్షలు, రెండో రోజు రూ. 68 లక్షలు, మూడో రోజు ఆదివారం రూ. 70 లక్షలు (అంచనా) ఈ సినిమా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో 50 శాతం రికవరీని అది సాధించింది. మార్చి 11న 'శ్రీకారం', 'జాతిరత్నాలు', 'గాలి సంపత్' సినిమాలు విడుదలవుతున్నందున 10వ తేదీలోగా 'ఏ1 ఎక్స్‌ప్రెస్' బ్రేకీవెన్ సాధిస్తుందా? అనే సందేహాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.