English | Telugu
ప్రతి రోజూ నీకు రుణపడి ఉంటానమ్మా!
Updated : Apr 20, 2021
నేడు (ఏప్రిల్ 20) సూపర్‌స్టార్ మహేశ్‌కు చాలా స్పెషల్. ఎందుకంటే ఈరోజు వాళ్లమ్మ ఇందిరాదేవి పుట్టినరోజు. హైదరాబాద్‌లో ఉంటే కచ్చితంగా అమ్మను కలుసుకుంటాడు మహేశ్. ఇందిరాదేవి తన చిన్నకూతురు ప్రియదర్శిని దగ్గర ఉంటున్నారు. అంటే హీరో సుధీర్‌బాబు ఇంట్లో అన్నమాట. తల్లి జన్మదినం సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశాడు మహేశ్. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అమ్మతో కలిసున్న ఓ పిక్చర్‌ను అతను షేర్ చేశాడు. ఆ పిక్చర్‌లో అమ్మ చేతిని పట్టుకొని నడిపించుకుంటూ వస్తున్నాడు.
అది కొన్నేళ్ల క్రితం జరిగిన ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటో అని తెలుస్తోంది. అందులో మహేశ్ కొడుకు గౌతమ్ బాగా చిన్నవాడిగా కనిపిస్తున్నాడు. ఆ ఫొటోను షేర్ చేసిన మహేశ్, "హ్యాపీ బర్త్‌డే అమ్మా. ప్రతిరోజూ నీకు రుణపడి ఉంటాను." అనే క్యాప్షన్ పెట్టాడు. మూడు హార్ట్ ఎమోటికాన్స్‌ను కూడా జోడించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ పోస్ట్‌కు మహేశ్ వదిన శిల్పా శిరోద్కర్ స్పందించింది. "హ్యాపీ బర్త్‌డే ఆంటీ" అనే కామెంట్ పెట్టింది.
సీనియర్ సూపర్‌స్టార్ కృష్ణకు ఇందిరాదేవి సొంత మరదలు. ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికే కృష్ణ, ఇందిరా దేవిలకు వివాహమైంది. వారికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు రమేశ్ కూడా హీరోగా పరిచయమై, కొన్ని సినిమాలు చేశాక తెరమరుగయ్యాడు. చిన్నకొడుకు మహేశ్ మాత్రం తండ్రికి తగిన వారసుడిగా సూపర్‌స్టార్ పేరును నిలబెట్టాడు.
పెద్దకుమార్తె పద్మావతి పేరు మీదనే పద్మాలయా స్టూడియోస్‌ను కృష్ణ నెలకొల్పారు. రెండో కుమార్తె మంజుల నటిగా, నిర్మాతగా ఉన్నారు. మూడో అమ్మాయి ప్రియదర్శినిని సుధీర్‌బాబు పెళ్లాడాడు. విజయనిర్మలను రెండో వివాహం చేసుకున్నప్పటికీ ఇందిరాదేవిని కృష్ణ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని చెప్పుకుంటారు. మహేశ్ కూడా తల్లి అంటే అమితమైన ప్రేమానురాగాలు ప్రదర్శిస్తుంటాడు.