English | Telugu
'ఆచార్య'ను ఆమడదూరం నెట్టేసిన 'అఖండ'!
Updated : Apr 20, 2021
యూట్యూబ్‌లో అందరు హీరోలు ఏదో వీడియోతో రికార్డులు బద్దలు కొడుతుంటే, తమ హీరో అలాంటి రికార్డులు క్రియేట్ చేయడం లేదే అనుకుంటూ ఒకింత అసంతృప్తితో ఉన్న బాలకృష్ణ ఫ్యాన్స్ ఇప్పుడు ఆనందాతిరేకంగా కాలర్ ఎగరేస్తున్నారు. కారణం.. ఆయన లేటెస్ట్ ఫిల్మ్ 'అఖండ' టీజర్ రికార్డులు క్రియేట్ చేస్తుండటమే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తోన్న సినిమా అంటే దానికి ఉండే క్రేజ్ ఎలాంటిదో మరోసారి అఖండ నిరూపిస్తోంది.
ఉగాది సందర్భంగా బీబీ3 మూవీకి 'అఖండ' టైటిల్‌ను ఖరారు చేస్తూ, దానితో పాటు రిలీజ్ చేసిన టీజర్ యూట్యూబ్‌లో దుమ్ము రేపుతోంది. బాలయ్య అఖండ గెటప్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఎంతగా అంటే మెగాస్టార్ 'ఆచార్య' టీజర్ వ్యూస్‌ను తక్కువ టైమ్‌లోనే అఖండ టీజర్ దాటేసి, దానికి అందనంత దూరంలోకి దూసుకుపోయింది. సీనియర్ స్టార్స్‌లో ఇప్పుడు బాలయ్య సినిమా టీజర్‌దే సరికొత్త రికార్డ్. ముఖ్యంగా "కాలుదువ్వే నంది ముందు రంగుమార్చిన పంది కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది." అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌కు విపరీతమైన స్పందన వస్తోంది.
జనవరి 29న రిలీజైన 'ఆచార్య' టీజర్ ఇప్పటిదాకా 80 రోజుల్లో 19.77 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అదే 'అఖండ' టీజర్ విషయానికి వస్తే, ఏప్రిల్ 13న రిలీజై, వారం రోజుల్లోనే 28.9 మిలియన్ వ్యూస్ సాధించి దూసుకుపోతోంది. దీన్ని బట్టి 'అఖండ' టీజర్ ఎంతలా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోందో అర్థం చేసుకోవచ్చు. దానికి లభిస్తున్న ఆదరణ చూసి ఇండస్ట్రీ వర్గాలే ఆశ్చర్యానికి గురవుతున్నాయి. దానికి తగ్గట్లే సినిమాకు కూడా అనూహ్యమైన బజ్ వచ్చింది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే మే 28న రిలీవడానికి ఈ సినిమా రెడీ అవుతోంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకు అఖండ విజయం తథ్యమని బాలయ్య అభిమానులు కుండబద్దలు కొడుతున్నారు.