English | Telugu
కాంట్రవర్సీ కావడంతో తనికెళ్ల భరణి డిలీట్ చేసిన పోస్ట్ ఇదే!
Updated : Apr 17, 2021
'శబ్బాష్‌రా శంకరా' మకుటంతో కొంత కాలంగా తన ఫేస్‌బుక్ హ్యాండిల్‌లో రోజుకో కవితను తనికెళ్ల భరణి పోస్ట్ చేస్తూ వస్తున్నారు. 'ఆటగదరా శివా' పేరుతో ఆయన పబ్లిష్ చేసిన శివ తత్వాలకు ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయో ఈ 'శబ్బాష్‌రా శంకరా' కవితలకు అంత ప్రాచుర్యం లభిస్తోంది. అయితే ఇటీవల ఆయన పోస్ట్ చేసిన ఓ శివ కవిత వివాదాస్పదమైంది. దానిపై హేతువాదులు భగ్గుమన్నారు.
వారి ఆగ్రహానికి కారణమైన భరణి కవిత ఏదంటే.. "గప్పాల్ గొడ్తరు గాడ్తె కొడుకులు.. నువ్వుండగ లేవంటరు!.. ఉన్నవో లేవో చెవుల జెప్పిపోరా.. శబ్బాష్‌రా శంకరా."
ఈ కవితపై ప్రముఖ హేతువాది బాబు గోగినేని మండిపడ్డారు. "గాడిద కొడుకులు" అని ఎవరైనా ఒళ్లు బలిస్తేనే వ్రాస్తారూ.. అని తన ఫేస్‌బుక్ హ్యాండిల్‌లో తీవ్రంగా విమర్శించారు. "మతరహితులను, నాస్తికులను, హేతువాదులను, మానవతావాదులను గాడిద కొడుకులు అంటున్నవా.. అని ఈ తిక్క-కవిత్వ శంకరోన్మాది గురించి అనుకుంటుంటే, డాక్టరమ్మ పావని గారు వచ్చి ఈ సినిమా వేషగాడిని పట్టుకుని పిర్ర మీద ఇంజెక్షన్ ఇచ్చేశారు. అయిపాయే. చూడబ్బాయి! చెవిలో కాదు, పబ్లిక్ గా చెప్తున్నా: లేడు. నీకు మత్తు దిగినాక పబ్లిక్ గా చెప్పించు " ఉన్నాను " అని." అని పోస్ట్ చేశారు. అలా "తిక్క కవిత్వ శంకరోన్మాది" అని భరణిని బాబు అభివర్ణించారు.
అంతే కాదు, "తిక్క శంకర్ విద్వేషపూరిత, ఉన్మాదపు దూషణలపై మానవవాదీ, హేతువాదీ, నాస్తికుడూ బాబు గోగినేని స్పందన. FB Live. తెలుగులో. ఆదివారం 18 ఏప్రిల్ 2021 మ. 12.00 గంటలకు, IST." అంటూ ఇంకో పోస్ట్ పెట్టారు. ఈ ఈవెంట్‌కు "ఆవు దూడలూ - గాడిద కొడుకులూ" అనే పేరు పెట్టడం గమనించాల్సిన విషయం.
దీంతో తన కవిత తీవ్ర దుమారం రేపుతోందని గ్రహించిన తనికెళ్ల భరణి, ఆ కవితను తన ఫేస్‌బుక్ హ్యాండిల్ నుంచి తొలగించారు. హేతువాదులకు, మానవతావాదులకు బేషరతు క్షమాపణలు తెలియజేస్తున్నానంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో "కొన్ని రోజులుగా నేను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తున్న 'శబ్బాష్‌రా శంకరా' కవితల్లో దురదృష్టవశాత్తూ కొన్ని వాక్యాలు కొంతమంది మనసుల్ని నొప్పించడం, బాధ కలిగించడం జరిగింది. దానికి నేను ఏ వివరణ ఇచ్చుకున్నా కవరింగ్ లాగా ఉంటుంది కాబట్టి, నేను చేతులు జోడించి బేషరతుగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను. అలాగే ఆ పోస్ట్ డిలీట్ చేశాను. నాకు హేతువాదులన్నా, మానవతావాదులన్నా గౌరవమే తప్ప వ్యతిరేకత ఏమీ లేదు. ఏ మనిషికీ ఇంకొకర్ని నొప్పించే హక్కూ అధికారం లేదు. జరిగిన పొరపాటుకి మరోసారి మన్నించమని కోరుకుంటున్నా." అని చెప్పారు.
భరణి క్షమాపణలపై బాబు గోగినేని ఇంతదాకా స్పందించలేదు. దాన్నిబట్టి రేపు ఆయన ఫేస్‌బుక్ లైవ్ యాథాతథంగా ఉంటుందని అర్థమవుతోంది.