English | Telugu
చేతిలో 9 క్రేజీ-భారీ ప్రాజెక్టులు.. వార్తల్లో మైత్రీ మూవీ మేకర్స్!
Updated : Feb 11, 2021
మైత్రీ మూవీ మేకర్స్.. ఇప్పుడు టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ద టౌన్ అయిన సంస్థ. ఆరేళ్ల క్రితం సూపర్‌స్టార్ మహేశ్‌కు 'శ్రీమంతుడు' లాంటి కెరీర్ బెస్ట్ మూవీ ఇవ్వడం ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ అచిర కాలంలోనే అగ్రశ్రేణి ప్రొడక్షన్ హౌస్‌గా పేరు తెచ్చుకుంది. 'శ్రీమంతుడు' తర్వాత, జనతా గ్యారేజ్, రంగస్థలం, చిత్రలహరి, డియర్ కామ్రేడ్, నానీస్ గ్యాంగ్ లీడర్, మత్తు వదలరా, ఉప్పెన లాంటి చిత్రాలు నిర్మించింది.
'ఉప్పెన' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, దాని తర్వాత నిర్మాణంలో ఉన్న, త్వరలో షూటింగ్ మొదలుకానున్న, కన్‌ఫామ్ అయిన సినిమాలు తొమ్మిది ఉండటం విశేషం. వీటిలో నేటి క్రేజీ, బిగ్ స్టార్స్ సినిమాలు ఉన్నాయి. మహేశ్‌తో రెండోసారి కాంబినేషన్ కట్టి 'సర్కారు వారి పాట'ను పరశురామ్ డైరెక్షన్‌లో తీస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దుబాయ్‌లో జరుగుతోంది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌తో నిర్మిస్తున్న 'పుష్ప' కూడా సెట్స్ మీదుంది.
త్వరలో పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టనున్నారు మైత్రి అధినేతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్. అలాగే నాని హీరోగా 'అంటే సుందరానికీ!' సినిమా కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. దీనికి వివేక్ ఆత్రేయ దర్శకుడు.
వీటి తర్వాత మరో సినిమాలను కన్ఫామ్ చేసింది ఈ సంస్థ. అవి.. చిరంజీవి-బాబీ కాంబినేషన్ మూవీ, బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబో ఫిల్మ్, జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ఫిల్మ్, విజయ్ దేవరకొండ-శివ నిర్వాణ కాంబినేషన్ సినిమా, ప్రభాస్‌తో తీయనున్న ప్యాన్ ఇండియా మూవీ.