English | Telugu

'జాతిర‌త్నాలు' టీజ‌ర్ ఏం చెబుతోందంటే...

 

న‌వీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి టైటిల్ రోల్స్ పోషిస్తున్న చిత్రం 'జాతిర‌త్నాలు'. కామెడీ క్యాప‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి అనుదీప్ కె.వి. ద‌ర్శ‌కుడు. స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

శుక్ర‌వారం సాయంత్రం ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. థియేట‌ర్ల‌లో ఈ సినిమా న‌వ్వులు పూయిస్తుంద‌ని టీజ‌ర్ తెలియ‌జేస్తోంది. ముగ్గురు ప్ర‌ధాన పాత్ర‌ధారులు న‌వీన్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి జైలులో ఖైదీలుగా న‌డ‌చుకుంటూ రావ‌డంతో టీజ‌ర్ మొద‌ల‌వుతుంది. ఆ న‌డ‌వ‌డంలో స్టైల్ ఉండ‌టం న‌వ్వు తెప్పించే విష‌యం. సెల్‌లో నుంచి ప్రియ‌ద‌ర్శి త‌న‌వైపు ముగ్గురు ఉన్నార‌ని.. వారు త‌మ‌న్నా, స‌మంత అని చెప్పి, మూడో పేరు కోసం త‌డుముకుంటుంటే ర‌ష్మిక అని అందిస్తాడు న‌వీన్‌. 

వినోదం మాత్ర‌మే కాకుండా ఈ మూవీలో సీరియ‌స్ విష‌యం కూడా ఒక‌టి ఉంద‌ని ముర‌ళీ శ‌ర్మ ఎపిసోడ్ తెలుపుతోంది. రూ. 500 కోట్ల చుట్టూ ఈ సినిమా క‌థ న‌డుస్తుంద‌ని అర్థ‌మ‌వుతుంది. న‌వీన్‌కు ఓ ల‌వ్ స్టోరీ కూడా ఉంద‌నే సంగీతి ఈ టీజ‌ర్‌లో చూడొచ్చు.

ర‌ధ‌న్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సిద్దం మ‌నోహ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. మార్చి 11న 'జాతిర‌త్నాలు' థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు రెడీ అవుతోంది.