చేతి రాతను టెక్ట్స్ గా మార్చే యాప్

  'గూగుల్ హ్యాండ్ రైటింగ్ ఇన్ పుట్' అంటే చేత్తే రాస్తే టెక్ట్స్ గా మార్చే సరికొత్త యాప్ విడుదలైంది. దాదాపు 82 భాషలను ఈ యాప్ సాధారణ టెక్ట్స్ గా మారుస్తుంది. మొబైల్ లో ఏదైనా టెక్ట్స్ పంపించాల్సినపుడు కీ ప్యాడ్ అవసరం లేకుండా చేతితో రాస్తే అది టెక్ట్స్ గా మారిపోతుంది. టెక్ట్స్ మాత్రమే కాదు దీని ద్వారా స్మైలీస్ కూడా పంపించుకోవచ్చు. దీనికి గూగుల్ ప్లే నుంచి యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ యాప్ ఆండ్రాయిడ్ 4.0.3 నుండి తరువాత వచ్చిన వెర్షన్ లో మాత్రమే పనిచేస్తుంది. మొబైల్ కీ బోర్డు ద్వారా టైప్ చేయడం కష్టంగా ఉండేవాళ్లకి ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది.

ఫోన్ పోయిందా.. గూగుల్ వెతికిపెడుతుంది

  ఏదో ఒక సందర్భంలో మనం ఫోన్ మర్చిపోతుంటాం. తెలిసిన తరువాత గాబరా పడిపోతాం. ఇప్పుడు దాని గురించి కంగారు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే కనిపించకుండా పోయిన ఫోన్ వెతికేందుకు గూగుల్ కొత్తగా ఓ ఫీచర్ ను రూపొందించింది. మొబైల్ డెస్క్ టాప్ పై ఉండే గూగుల్ సెర్చ్ లో ఫైండ్ మై ఫోన్ అని టైప్ చేస్తే అది మన ఫోన్ ఉన్న లొకేషన్ ను తెలుపుతుంది. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే మొబైల్ కొనుగోలుదారులు తమ ఫోన్ లో లేటెస్ట్ వెర్షన్ తో ఉన్న గూగుల్ యాప్, స్మార్ట్‌ఫోన్ లొకేషన్ సర్వీస్ ఆప్షన్ పనిచేసే విధంగా చూసుకోవాలి. రింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ ద్వారా ఫోన్ ఐదు నిమిషాలపాటు రింగ్ అయ్యేలా చేస్తుందని గూగుల్ అధికారులు తెలిపారు.

స్మార్ట్‌ఫోన్‌తో సమస్యలా

ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఎంత మాత్రం స్మార్ట్ ఫోన్లు అయినా అవి కూడా అప్పుడప్పుడు సతాయిస్తుంటాయి. అయితే స్మార్ట్‌ఫోన్‌తో చిక్కులు  అందరికీ కామనే. అయితే వాటిలో కొన్ని మనం సులభంగా పరిష్కరించుకోవచ్చు. అవేంటో చూద్దాం. గూగుల్ ప్లే స్టోర్ క్రాష్ అవుతూంటే... స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌బిల్ట్‌గా వచ్చే గూగుల్ ప్లే స్టోర్ తరచూ క్రాష్ అవడం అందరికీ అనుభవమైన సమస్య. క్యాష్ మెమరీలో తేడాలు రావడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా క్యాష్ మెమరీని తీసేస్తే సమస్య తీరినట్లే. దీనికి ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి తరువాత ఆప్స్‌ను సెలెక్ట్ చేసుకోండి. కుడివైపునకు స్వాప్ చేస్తూ వెళితే ‘ఆల్’ అన్న ట్యాబ్ కనిపిస్తుంది.  ఆల్ ను క్లిక్ చేసి దాంట్లో గూగుల్ ప్లే స్టోర్‌ను గుర్తించి దానిలో ఉన్న క్యాష్ మెమరీని తుడిచేయండి. సిస్టమ్ యూజర్ ఇంటర్ఫేస్ ఆగిపోతే... స్మార్ట్‌ఫోన్ స్క్రీన్  ఉన్నట్టుండి ఫ్రీజ్ అవడం.. మళ్లీ రీస్టార్ట్ చేస్తే పనిచేయడం చూస్తాం. కొన్నిసార్లు రీస్టార్ట్ చేసినా కూడా స్క్రీన్‌లోని యూజర్ ఇంటర్ఫేస్ పనిచేయదు. అప్పుడు దీనికి సంబంధించి క్యాష్ మెమరీని తొలగించాలి. దీనివల్ల సమస్య తీరుతుంది. క్యాష్ మెమరీని తొలగించాలి అంటే మొదట్లో చెప్పినట్లుగా సెట్టింగ్స్‌లోని ఆప్ ట్యాబ్‌కు, అందులోని ఆల్ సెక్షన్‌కు వెళ్లి ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. దానిలో ఉన్న క్యాష్ మెమరీని క్లియర్ చేసుకోవాలి. వైఫై నెట్‌వర్క్‌ సరిగా కనెక్ట్ కాకపోతే... కొన్నిసార్లు వైఫై కనెక్షన్ సరిగా కనెక్ట్ కాదు. ఈ సమస్యకు ఎక్కువగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని రూటర్ లోపం కారణమవుతుంటుంది. అలాంటప్పుడు ఫోన్‌ను, రూటర్ ను ఒకసారి రీస్టార్ట్ చేయడం ద్వారా వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ కావచ్చు. ప్లే స్టోర్‌ ద్వారా అప్లికేషన్లు డౌన్‌లోడ్ కాకపోతే... సాధారణంగా మనకు కావలసిన ఆప్స్ ను ప్లే స్టోర్‌ నుండి డౌన్‌లోడ్ చేసుకుంటాము. కొన్ని సార్లు అప్లికేషన్లు డౌన్‌లోడ్ కాకుండా ఇబ్బంది పెడుతూంటాయి. అప్పుడు గూగుల్ ప్లే స్టోర్ క్యాష్ మెమరీని వైప్ చేసుకోవాలి. ఇంకో పద్ధతి కూడా ఉంది. గూగుల్ ప్లే హిస్టరీని ఇరేజ్ చేయడం. ముందు చూసిన విధంగానే హిస్టరీని తొలగించాలంటే ప్లే స్టోర్‌లోకి వెళ్లి సెట్టింగ్స్‌ను ఓపెన్ చేసి, అందులో క్లియర్ హిస్టరీని సెలెక్ట్ చేసుకుంటే సరి.   వీడియో ప్లే కాకపోతే... వీఎల్‌సీ, ఎంఎక్స్ ప్లేయర్లు చాలావరకూ ఫార్మాట్లను సపోర్ట్ చేస్తాయి.వీటిని ఉపయోగించి చూడండి. అప్పటికీ ప్లే కాకపోతే దాంట్లోని ఫార్మాట్ సపోర్ట్ చేయడం లేదని అర్ధం. స్కానింగ్ కోసం... మనకేదైనా స్కానింగ్ కావాలంటే ఏం చేస్తాం? దగ్గర్లో ఉన్న డీటీపీ సెంటర్‌కు వెళ్తాం. అలా కాకుండా చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే ఒక చిన్న అప్లికేషన్ ద్వారా ఈ పని మీరు ఎక్కడుంటే అక్కడే చేసుకోవచ్చు. కొత్తగా స్మార్ట్ ఫోన్లకు ఆఫీస్ లెన్స్ పేరుతో ఓ అప్లికేషన్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. మీరు స్కాన్ చేయాలనుకుంటున్న రసీదు లేదా కాగితాన్ని ఫొటో తీసి అప్లికేషన్‌ను రన్ చేస్తే చాలు. మీకు నచ్చిన ఫార్మాట్ (పీడీఎఫ్, డాక్స్, పీపీటీఎక్స్, జేపీజీ)లోకి మార్చేసి ఇస్తుంది.

ఒక్క నిమిషంలో ఛార్జింగ్...

  మనం ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలని అనుకున్నప్పుడే మొబైల్ లో ఛార్జింగ్ అయిపోతుంది. మళ్లీ అది ఛార్జ్ అవ్వాలంటే ఎలా లేదనుకున్నా ఓ 15 నిమిషాలు పడుతుంది. అలా కాకుండా ఒక్క నిమిషంలోనే రీఛార్జయ్యే అల్యూమినియం బ్యాటరీని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ప్రస్తుతం వాడుకలో ఉన్న లిథియం-ఐయాన్ బ్యాటరీలా పేలదని, అల్కాలైన్ బ్యాటరీలా పర్యావరణానికి హాని కలిగించదని యూనివర్సిటీ ప్రొఫెసర్ హోంగ్జీ దాయ్తె తెలిపారు. ఆ బ్యాటరీల కంటే ఈ అల్యూమినియం బ్యాటరీ చాలా తక్కువ ధర అని తెలిపారు. ఈ బ్యాటరీని స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లకు అనుగుణంగా మలుచుకోవచ్చని ఆయన చెప్పారు. మామూలు బ్యాటరీలకు రీఛార్జ్ సైకిల్ 1000 సార్లు మాత్రమే ఉంటుందని, దీనిని మాత్రం 7,500 సార్లు రీఛార్జ్ చేసుకోవచ్చని అన్నారు.

మైక్రోసాఫ్ట్ సరికొత్త మొబైల్ మోడల్స్

మైక్రోసాఫ్ట్ సంస్థ మరో రెండు కొత్త మొబైల్ మోడల్స్ లూమియా 640, లూమియా 640 xL లను భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. లూమియా 640 ధర రూ. 11,999 లూమియా 640 xL ధర 15,799 గా ఉన్నాయి. రెండు మోడల్స్ ఎల్టీఈ వెర్షన్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం భారత్ లో మాత్రం ఈ ఎల్టీఈ వెర్షన్ అందుబాటులో లేదని మైక్రోసాఫ్ట్ మొబైల్స్ డైరెక్టర్ టీఎస్ (సౌత్) శ్రీధర్ తెలిపారు. కాగా లూమియా 640 మాత్రం ఆన్ లైన్ సైట్ ఫ్లిఫ్ కార్ట్ ద్వారా మాత్రమే విక్రయించబడుతుంది. లూమియా 640 xL బయట మొబైల్ మార్కెట్లో దొరుకుతోంది. లూమియా 640 ప్రత్యేకతులు: * డ్యుయల్ సిమ్ * 5 అంగుళాల డిస్ ప్లే * 1.2 GHz క్వాడ్ కోర్ క్వాలికమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ * 8.1 లూమియా డెనిమ్ ఓఎస్ * 8 ఎంపీ బ్యాక్ కెమెరా, 1 ఎంపీ ఫ్రంట్ కెమెరా * 8 జీబీ ఇంటర్నల్ మెమరీ లూమియా 640 XL ప్రత్యేకతులు: * 5.7 అంగుళాల డిస్ ప్లే * 13 ఎంపీ బ్యాక్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా * 3000 ఎంఏహెచ్ బ్యాటరీ * 1.2 GHz క్వాడ్ కోర్ క్వాలికమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్

ఆపిల్ తాళాలు రాబోతున్నాయ్

  కంప్యూటర్ దిగ్గజం ఆపిల్ సెల్‌ఫోన్ల రంగంలోకి కూడా ప్రవేశించి తన సత్తా ఏమిటో నిరూపించుకుంది. ఇటీవలి కాలంలో ఆపిల్ సంస్థ తన పరిధిని మరింత విస్తృతం చేసుకుంటూ ఇతర రంగాలలో కూడా ప్రవేశించే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆపిల్ సంస్థ కారును రూపొందించే పనిలో నిమగ్నమై వుంది. ఇప్పుడు ఈ సంస్థ ఇళ్ళకు, కార్యాలయాలకు వేసే తాళాల తయారీ రంగంలో కూడా కృషిని ప్రారంభించింది. తాళం చేతుల అవసరం లేకుండా కేవలం ఫోన్ల ద్వారా వేయగలిగిన తాళాలను రూపొందించే పనిలో ఆపిల్ సంస్థ వుంది. ఈ తాళాల తయారీకి సంబంధించిన ప్రయోగాలు చివరి దశలో వున్నట్టు తెలుస్తోంది. సాధ్యమైంత త్వరలో ఆపిల్ తాళాలు మార్కెట్లోకి రానున్నాయి. ఆపిల్ వర్గాలు చెబుతున్నదాని ప్రకారం ఈ సంస్థ రూపొందిస్తున్న తాళాలకు మన చేతిలో వుండే సెల్‌ఫోనే తాళం చెవి. ఈ తాళాలు పూర్తిగా ఎలక్ట్రానిక్‌గా వుంటాయి. ఆపిల్ సంస్థ రూపొందించే తాళాలు ఇప్పుడున్న విధంగా తాళం కప్పల రూపంలో వుంటాయా లేక తలుపులోనే ఇమిడిపోయి వుంటాయా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అయితే తాము విడుదల చేయబోయే తాళలు తాళాల రంగంలోనే కొత్త శకానికి నాంది అవుతాయని ఆపిల్ సంస్థ వర్గాలు చెబుతున్నాయి.

హీరో కొత్త ఇ-రిక్షా రాహీ

  ద్విచక్ర వాహనాలు తయారుచేసే హీరో ఎలక్ట్రిక్ సంస్థ విద్యుత్ తో నడిచే ఇ-రిక్షా రాహీని గురువారం ఆవిష్కరించింది. దీని ఖరీదు రూ 1. 10 లక్షలు. ఈ వాహనానికి 1000 వాట్ల సామర్ధ్యం కలిగిన మోటార్ ఉందని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 90 కి.మీలు ప్రయాణించవచ్చని హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ తెలిపారు. దీని లోపల ఎల్ఈడీ దీపాలు, యూఎస్బీ మొబైల్ ఛార్జర్, కర్టెన్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. సంస్థలో ఉన్న 120 మంది డీలర్ల వద్ద ఈ వాహనాలు లభిస్తున్నాయని, తాము ఇప్పటికే లక్షకు పైగా ద్విచక్ర వాహనాలు విక్రయించామని సోహిందర్ తెలిపారు. ఇ- రిక్షాకు పశ్చిమ బంగా, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని అన్నారు.

ఫేస్ బుక్ కొత్త యాప్ రిఫ్

సోషల్ నెట్ వర్కింగ్ లో ఫేస్బుక్ చాలా ప్రాచుర్యం పొందిందని మనకు తెలుసు. ఇప్పుడు ఈ ఫేస్ బుక్ రిఫ్ అనే మరో కొత్త యాప్ ను ప్రపంచ వ్యాప్తంగా 15 భాషల్లో విడుదల చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐవోఎస్ ఫోన్లకు సపోర్ట్ చేసేలా దీనిని ప్రారంభించింది. 20 సెకన్ల నిడివిలో ఒక వీడియోను రికార్డు చేసి అవతలి వ్యక్తికి పంపించవచ్చు. కొద్ది నిడివి ఉన్న వీడియోలను రికార్టు చేసేందుకు ఈ రిఫ్ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుందని ఫేస్ బుక్ రిఫ్ ప్రొడక్ట్ మేనేజర్ జోష్ మిల్లర్ తెలిపారు. ఫేస్బుక్ ద్వారా కానీ, మరే విధంగానైనా కానీ వీటిని పంచుకోవచ్చని చెప్పారు. ఈ రిఫ్ యాప్ రూపొందించడానికి ఈ మధ్య కాలంలో ఎక్కువ వార్తల్లో కనిపించిన ఐస్ బకెట్ తో స్నానం చేసిన వీడియోల ప్రోత్సాహమే అని జోష్ మిల్లర్ అన్నారు.   రిఫ్ యాప్ ప్రత్యేకతలు:   * రిఫ్ ద్వారా వీడియోలు మాత్రమే రికార్డు చేయగలము. కొత్తవి అప్లోడ్ చేయడం సాధ్యం కాదు.  * వీడియో రికార్డింగ్ స్టార్ట్ అవగానే 3-2-1 అంటూ కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. * దీనికి పోస్టింగ్ ముందు ధ్రువీకరించుకునే అవకాశం మాత్రం ఉంది. * ఒకేసారి పలు వీడియోలను రికార్డు చేసే అవకాశంగానీ, ఎడిట్ చేసే అవకాశంగానీ లేదు. * కామెంట్పం పిండం, లైక్ కొట్టడం సాధ్యం కాదు. * వీడియో వచ్చిన తరువాత దానికి బదులుగా మరో వీడియోను షూట్ చేసి మాత్రమే పంపించేందుకు అవకాశం ఉంది.

మార్కెట్లోకి శామ్సంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

  యాపిల్ ఐ ఫోన్ 6కు పోటీగా శామ్‌సంగ్ కంపెనీ గెలాక్సీ ఎస్6 గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సోమవారం భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌లను శామ్‌సంగ్ కంపెనీ ఆవిష్కరించింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌లను ముందు బార్సినాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో కంపెనీ ఆవిష్కరించింది. అంతర్జాతీయంగా విడుదల చేసిన 3 వారాల తర్వాత వీటిని భారత మార్కెట్లోకి తీసుకొచ్చామని శామ్‌సంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ (మొబైల్ అండ్ ఐటీ) అశిమ్ వార్సి చెప్పారు. సోమవారం నుండి బుకింగ్ లు ప్రారంభించామని, వచ్చే నెల 10 నుంచి ఫోన్ విక్రయాలు జరుగతాయని తెలిపారు. ఈ ఫోన్‌ల తయారీలో భారత రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టీమ్ తగిన పాత్ర పోషించిందని ఆశిమ్ వార్సి తెలిపారు.   గెలాక్సీ ఎస్6 ప్రత్యేకతలు: లాలీపాప్ ఓఎస్, 5.1 అంగుళాల డిస్‌ప్లే 16 మెగా పిక్సెల్ రియర్ కెమెరా 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వెర్లైస్ చార్జింగ్, 10 నిమిషాల చార్జింగ్‌తో 4 గంటల పాటు ఉపయోగించుకోవచ్చు. గెలాక్సీ ఎస్6లో 2,550 ఎంఏహెచ్ బ్యాటరీ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ప్రత్యేకతలు: లాలీపాప్ ఓఎస్, 5.1 అంగుళాల డిస్‌ప్లే, ఎస్6 ఎడ్జ్‌లో డ్యూయల్ ఎడ్జ్ స్కీన్ ఉంటుంది 16 మెగా పిక్సెల్ రియర్ కెమెరా 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వెర్లైస్ చార్జింగ్, 10 నిమిషాల చార్జింగ్‌తో 4 గంటల పాటు ఉపయోగించుకోవచ్చు. గెలాక్సీ ఎస్6 ఎడ్జ్‌లో 2,600 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు..  మెమరీ        ఎస్6    ఎస్6 ఎడ్జ్  32 జీబీ        49,000    58,900  64 జీబీ        55,900    64,900  128 జీబీ        61,900    70,900

సెల్ఫ్ డ్రైవింగ్ కార్లొస్తున్నాయ్

  త్వరలో గూగుల్ నుండి డ్రైవర్ అవసరం లేని కార్లు కూడా రాబోతున్నాయి. టెక్నాలజీలో ఎప్పుడూ వినూత్న ప్రయోగాలు చేసే గూగుల్ సంస్థ ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తయారుచేయబోతోంది. డ్రైవర్ అవసరం లేని ఈ కార్లను 2020 నాటికి మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తున్నామని గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల విభాగం అధిపతి క్రిస్ ఉర్మ్ సన్ తెలిపారు. అయితే భద్రత విషయంలో అత్యాధునిక టెక్నాలజీతో ఇప్పుడు ఎన్నో కార్లు అందుబాటులో ఉన్నా.. అవి అన్ని సమయాలలో రక్షణ కల్పించలేవని, రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే డ్రైవర్ లేని కార్లతోనే సాధ్యమని ఆయన అన్నారు. మరోవైపు ఆపిల్ సంస్థ కూడా గూగుల్ కు పోటీగా ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తయారుచేస్తున్నట్లు సమాచారం. ఈ సంస్థ కూడా గూగుల్ మాదిరిగానే 2020 నాటికే కారును విడుదుల చేయాలని నిర్ణయించుకొంది. అయితే ఈ కారు పూర్తిగా సాఫ్ట్ వేర్ నియంత్రణలో రాడార్, సెన్సర్ల ఆధారంగా పనిచేస్తుంది. స్మార్ట్ ఫోన్ తో అనుసంధానమైన ఈ కారు వెళ్లాల్సిన, రావాల్సిన ప్రదేశం ఏమిటో ఆదేశిస్తే చాలు తన పని తాను చేసుకుపోతోంది.

డాటావిండ్ కొత్త స్మార్ట్ ఫోన్లు

  డాటావిండ్ సంస్థ ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సంస్థ 2జి 4స్మార్ట్ ఫోన్, 3జి 4స్మార్ట్ ఫాన్ అను రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ సంస్థ సీఈఓ సునీత్ సింగ్ తులి హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో వీటిని విడుదల చేశారు. 2జి 4స్మార్ట్ ఫోన్ ను 1,999 రూపాయలకు, 3జి 4స్మార్ట్ ఫాన్ ను 2,999 రూపాయలకు అందిస్తున్నట్లు తులి వెల్లడించారు. 2జి 4స్మార్ట్ ఫోన్ 3.5 అంగుళాల డిస్ ప్లే, డ్యూయల్ సిమ్, ఎడ్ట్ నెట్ వర్క్ కంపాటబుల్ కలిగి ఉంటుందని, 3జి 4స్మార్ట్ ఫాన్ 4 అంగుళాల డిస్ ప్లే, డ్యూయల్ సిమ్, డ్యూయల్ కెమెరా కలిగి ఉంటుందని తెలిపారు. ఉచిత ఇంటర్నెట్ సేవలు అందించడానికి రిలయన్స్ కమ్యూనికేషన్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని, మరో 90 రోజుల్లో తమ వ్యాపారాన్ని భారత్ లో నెలకొల్పనున్నట్లు చెప్పారు.

సూపర్ ఫాస్ట్ రోబో వచ్చేసింది

  అమెరికన్ రోబోటిక్ శాస్త్రవేత్తలు వెరైటీ రోబోలను తయారుచేయడంలో ముందంజలో ఉన్నారు. వాళ్లు ఈసారి రెండుకాళ్లతో అత్యంత వేగంగా పరిగెత్తే రోబోను అభివృద్ధిపరిచారు. అయితే ఇందుకు ముందే రోబోలు ఉన్నా... వాటికి ధీటుగా అన్నింటికన్నా వేగంగా పరిగెత్తగలదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి ఏట్రియాన్ అనే పేరు పెట్టారు. రెండు కాళ్లతో వేగంగా దూసుకెళ్లగలిగే పక్షుల శరీర నిర్మాణం ఆధారంగా ఈ రోబోను రూపొందించినట్లు పరిశోధనలో పాల్గొన్న జొనాథన్ హర్ట్స్ తెలిపారు. మార్గమధ్యంలో ఎలాంటి ఎగుడుదిగుళ్లు ఉన్నా కూడా కింద పడిపోకుండా పరిగెత్తే సామర్ధ్యం ఈ రోబోకు ఉందన్నారు. అంతే కాకుండా ఏదైనా ప్రమాదం సంభవించినపుడు అక్కడికి సహాయక సిబ్బంది వెళ్లడం సాధ్యం కానప్పుడు ఈ రోబోను పంపించి తగు చర్యలు చేపట్టవచ్చని వారు తెలిపారు. ఈ రోబోను ఒరెగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజినీరింగ్ కళాశాల నిపుణులు 'రక్షణ ఆధునిక పరిశోధన ప్రాజెక్టుల సంస్థ', 'మానవ శాస్త్రపరిజ్ఞాన పథకం' ఆర్ధికసాయంతో తయారుచేశారు.

మార్కెట్లోకి బ్లాక్ బెర్రి కొత్త 'సెక్యూటాబ్లెట్'

  ఇప్పటి వరకూ మార్కెట్ లో బ్లాక్ బెర్రీ టాబ్లెట్లకు మంచి క్రేజ్ లేదు. ఇది మొదట తెచ్చిన ప్లేబుక్ సరైన సాఫ్ట్ వేర్ అనుసంధానం లేకపోవడం వల్ల మార్కెట్ లో ఫ్లాప్ అయింది. అప్పటి నుండి ఈ కంపెనీ టాబ్లెట్ లను మార్కెట్ లోకి విడుదల చేయలేదు. అయితే ఇప్పుడు ఈ కంపనీ సెక్యూటాబ్లెట్ పేరు మీద ఒక టాబ్లెట్ ను మార్కెట్ లోకి విడుదుల చేయనుంది. శామ్సంగ్ గెలాక్సీ టాబ్ s 10.5 హార్డ్ వేర్ లో కొన్ని మార్పులు చేసి ఈ టాబ్లెట్ కి ఉపయోగించారు. డేటా కమ్యూనికేషన్, వాయిస్ గుప్తీకరించడానికి సెక్యూస్మార్ట్ ను ఉపయోగిస్తున్నారు. దీనిని బ్లాక్ బెర్రీ గత సంవత్సరమే సెక్యూస్మార్ట్ టెక్ నుండి కొనుగోలు చేసింది. ఫేస్ బుక్, యూ ట్యూబ్ లాంటి యాప్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా రావడానికి దీనిలో సాఫ్ట్ వేర్ సిస్టమ్ కొరకు ఐబీఎంతో టైఅప్ అయింది.

యూట్యూబ్... కొత్త సంచలనం

  యూట్యూబ్... ద మోస్ట్ వాచ్డ్ వీడియో సైట్... నో డౌట్! గూగుల్ సంస్థకు చెందిన ఈ సైట్ ఇప్పుడు సరికొత్తగా 360 డిగ్రీ వీడియోలు (రీచోస్ తీటా, కోడాక్ పిక్స్ ప్రో ఎస్పీ360 వంటి ప్రత్యేక కెమెరాలతో తీసిన వీడియోలు) అప్ లోడ్ చేసుకునేందుకు వీలుగా మార్పులు తీసుకొస్తొంది. ఆండ్రాయిడ్ మొబైల్ లో యూ ట్యూబ్ యాప్ లో వీడియో ప్లే అవుతున్నప్పుడు ఫోన్ కానీ టాబ్లెట్ కానీ అటూ ఇటూ తిప్పడం వల్ల వివిధ కోణాలు చూడగలుగుతాం. అలాగే యూట్యూబ్.కామ్ లో ఈ ఎఫెక్ట్ ద్వారా మౌస్ ఉపయోగించి వ్యూ పాయింట్ నుండి డ్రాగ్ చేస్తే చుట్టూ ఉన్న ప్రదేశం చూడగలుగుతాం. దీనికి బుబల్ కామ్, గిరోప్టిక్స్ 360 కామ్, ఐసీ రియల్ టెక్స్ ఎలై, కోడాక్స్ ఎస్పీ360, రీచోస్ తీటా కెమెరాలు అనువైనవిగా కంపెనీ చెపుతోంది. అలాగే వీడియోస్ ఎలా అప్ లోడ్ చేయాలో స్క్రిప్ట్ ద్వారా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందట. ఐఫోన్, ఐ పాడ్ లాంటి డివైస్ లలో టెస్ట్ చేయాడానికి ఈ ఫీచర్ రెడీ అయిందని చెప్పారు.

షియోమి నుంచి కొత్త ఫోన్, టాబ్లెట్

  చైనా యాపిల్ గా పేరొందిన షియోమి కంపెనీ రెడ్ ఎంఐ2 స్మార్ట్ ఫోన్ తోపాటు ఎంఐ ప్యాడ్ టాబ్లెట్ పేరుతో మరో రెండు కొత్త డివైజ్ లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిలో రెడ్ ఎంఐ2 ధరను రూ. 6999గా, ఎంఐ ప్యాడ్ ధరను రూ. 12,999గా నిర్ణయించింది. రెడ్ ఎంఐ2 స్మార్ట్ ఫోన్ రిజిస్ట్రేషన్ గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం.మార్చి 24వ తేదీ నుండి ఫ్లిప్ కార్ట్ల్ లో ఫ్లాష్ అమ్మకాలు ఉంటాయి. మొదటి విడతలో 30 వేల నుండి 40 వేల ఫోన్లు అమ్మే అవకాశం ఉందని షియోమి ఇండియా హెడ్ మను జైన్ చెప్పారు. రెడ్ ఎంఐ2 ప్రత్యేకతలు: * 4.7 అంగుళాల డిస్ప్లే * క్వాడ్ కోర్ 64 బిట్ స్నాప్డ్రాగన్ 410 ప్రాసెసర్, * 4జి డ్యూయల్ సిమ్ * 8 ఎంపీ బ్యాక్ కెమెరా * 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఎంఐ ప్యాడ్ ప్రత్యేకతలు: 7.9 అంగుళాల డిస్ప్లే.  అయితే వీటిలో కేవలం వై-ఫై ఆధారంగానే నెట్ అందుబాటులోకి వస్తుంది.