స్మార్ట్‌ఫోన్‌తో సమస్యలా
posted on Apr 11, 2015 @ 3:11PM
ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఎంత మాత్రం స్మార్ట్ ఫోన్లు అయినా అవి కూడా అప్పుడప్పుడు సతాయిస్తుంటాయి. అయితే స్మార్ట్‌ఫోన్‌తో చిక్కులు అందరికీ కామనే. అయితే వాటిలో కొన్ని మనం సులభంగా పరిష్కరించుకోవచ్చు. అవేంటో చూద్దాం.
గూగుల్ ప్లే స్టోర్ క్రాష్ అవుతూంటే...
స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌బిల్ట్‌గా వచ్చే గూగుల్ ప్లే స్టోర్ తరచూ క్రాష్ అవడం అందరికీ అనుభవమైన సమస్య. క్యాష్ మెమరీలో తేడాలు రావడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా క్యాష్ మెమరీని తీసేస్తే సమస్య తీరినట్లే. దీనికి ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి తరువాత ఆప్స్‌ను సెలెక్ట్ చేసుకోండి. కుడివైపునకు స్వాప్ చేస్తూ వెళితే ‘ఆల్’ అన్న ట్యాబ్ కనిపిస్తుంది. ఆల్ ను క్లిక్ చేసి దాంట్లో గూగుల్ ప్లే స్టోర్‌ను గుర్తించి దానిలో ఉన్న క్యాష్ మెమరీని తుడిచేయండి.
సిస్టమ్ యూజర్ ఇంటర్ఫేస్ ఆగిపోతే...
స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ఉన్నట్టుండి ఫ్రీజ్ అవడం.. మళ్లీ రీస్టార్ట్ చేస్తే పనిచేయడం చూస్తాం. కొన్నిసార్లు రీస్టార్ట్ చేసినా కూడా స్క్రీన్‌లోని యూజర్ ఇంటర్ఫేస్ పనిచేయదు. అప్పుడు దీనికి సంబంధించి క్యాష్ మెమరీని తొలగించాలి. దీనివల్ల సమస్య తీరుతుంది. క్యాష్ మెమరీని తొలగించాలి అంటే మొదట్లో చెప్పినట్లుగా సెట్టింగ్స్‌లోని ఆప్ ట్యాబ్‌కు, అందులోని ఆల్ సెక్షన్‌కు వెళ్లి ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. దానిలో ఉన్న క్యాష్ మెమరీని క్లియర్ చేసుకోవాలి.
వైఫై నెట్‌వర్క్ సరిగా కనెక్ట్ కాకపోతే...
కొన్నిసార్లు వైఫై కనెక్షన్ సరిగా కనెక్ట్ కాదు. ఈ సమస్యకు ఎక్కువగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని రూటర్ లోపం కారణమవుతుంటుంది. అలాంటప్పుడు ఫోన్‌ను, రూటర్ ను ఒకసారి రీస్టార్ట్ చేయడం ద్వారా వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ కావచ్చు.
ప్లే స్టోర్ ద్వారా అప్లికేషన్లు డౌన్‌లోడ్ కాకపోతే...
సాధారణంగా మనకు కావలసిన ఆప్స్ ను ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకుంటాము. కొన్ని సార్లు అప్లికేషన్లు డౌన్‌లోడ్ కాకుండా ఇబ్బంది పెడుతూంటాయి. అప్పుడు గూగుల్ ప్లే స్టోర్ క్యాష్ మెమరీని వైప్ చేసుకోవాలి. ఇంకో పద్ధతి కూడా ఉంది. గూగుల్ ప్లే హిస్టరీని ఇరేజ్ చేయడం. ముందు చూసిన విధంగానే హిస్టరీని తొలగించాలంటే ప్లే స్టోర్‌లోకి వెళ్లి సెట్టింగ్స్‌ను ఓపెన్ చేసి, అందులో క్లియర్ హిస్టరీని సెలెక్ట్ చేసుకుంటే సరి.
వీడియో ప్లే కాకపోతే...
వీఎల్‌సీ, ఎంఎక్స్ ప్లేయర్లు చాలావరకూ ఫార్మాట్లను సపోర్ట్ చేస్తాయి.వీటిని ఉపయోగించి చూడండి. అప్పటికీ ప్లే కాకపోతే దాంట్లోని ఫార్మాట్ సపోర్ట్ చేయడం లేదని అర్ధం.
స్కానింగ్ కోసం...
మనకేదైనా స్కానింగ్ కావాలంటే ఏం చేస్తాం? దగ్గర్లో ఉన్న డీటీపీ సెంటర్‌కు వెళ్తాం. అలా కాకుండా చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే ఒక చిన్న అప్లికేషన్ ద్వారా ఈ పని మీరు ఎక్కడుంటే అక్కడే చేసుకోవచ్చు. కొత్తగా స్మార్ట్ ఫోన్లకు ఆఫీస్ లెన్స్ పేరుతో ఓ అప్లికేషన్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. మీరు స్కాన్ చేయాలనుకుంటున్న రసీదు లేదా కాగితాన్ని ఫొటో తీసి అప్లికేషన్‌ను రన్ చేస్తే చాలు. మీకు నచ్చిన ఫార్మాట్ (పీడీఎఫ్, డాక్స్, పీపీటీఎక్స్, జేపీజీ)లోకి మార్చేసి ఇస్తుంది.