ఆపిల్ తాళాలు రాబోతున్నాయ్
posted on Apr 6, 2015 @ 2:52PM
కంప్యూటర్ దిగ్గజం ఆపిల్ సెల్‌ఫోన్ల రంగంలోకి కూడా ప్రవేశించి తన సత్తా ఏమిటో నిరూపించుకుంది. ఇటీవలి కాలంలో ఆపిల్ సంస్థ తన పరిధిని మరింత విస్తృతం చేసుకుంటూ ఇతర రంగాలలో కూడా ప్రవేశించే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆపిల్ సంస్థ కారును రూపొందించే పనిలో నిమగ్నమై వుంది. ఇప్పుడు ఈ సంస్థ ఇళ్ళకు, కార్యాలయాలకు వేసే తాళాల తయారీ రంగంలో కూడా కృషిని ప్రారంభించింది. తాళం చేతుల అవసరం లేకుండా కేవలం ఫోన్ల ద్వారా వేయగలిగిన తాళాలను రూపొందించే పనిలో ఆపిల్ సంస్థ వుంది. ఈ తాళాల తయారీకి సంబంధించిన ప్రయోగాలు చివరి దశలో వున్నట్టు తెలుస్తోంది. సాధ్యమైంత త్వరలో ఆపిల్ తాళాలు మార్కెట్లోకి రానున్నాయి. ఆపిల్ వర్గాలు చెబుతున్నదాని ప్రకారం ఈ సంస్థ రూపొందిస్తున్న తాళాలకు మన చేతిలో వుండే సెల్‌ఫోనే తాళం చెవి. ఈ తాళాలు పూర్తిగా ఎలక్ట్రానిక్‌గా వుంటాయి. ఆపిల్ సంస్థ రూపొందించే తాళాలు ఇప్పుడున్న విధంగా తాళం కప్పల రూపంలో వుంటాయా లేక తలుపులోనే ఇమిడిపోయి వుంటాయా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అయితే తాము విడుదల చేయబోయే తాళలు తాళాల రంగంలోనే కొత్త శకానికి నాంది అవుతాయని ఆపిల్ సంస్థ వర్గాలు చెబుతున్నాయి.