మెగాభక్తుడిపై కిరణ్ వేటేస్తే కుదురుద్దా?

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి డీయల్ ను బర్త్ రఫ్ ఆడించేసి తన పంతం నెగ్గించుకొన్నారు. గనుక, తరువాత మెగాభక్తుడు రామచంద్రయ్యపై వేటు వేస్తారా లేదా అనేది లేటెస్ట్ టాపిక్. ఆయన దేవాదాయ శాఖలో ఉన్నపటికీ, నిత్యం మెగా అసమ్మతి భజన మాత్రమే చేస్తూ, ముఖ్యమంత్రి కుర్చీలో మెగాజీవి కూర్చొంటే చూడాలని పరితపించిపోతున్నారు. మరి కిరణ్ కుమార్ రెడ్డి ఆయనపై కూడా వేటువేసి ఇంటికి వెళ్లి భజన చేసుకోమని పంపించేస్తారా? లేక అమ్మదయ పుష్కలంగా ఉన్నచిరంజీవి శరణు పొందిన ఆ మెగా భక్తుడిని తన పక్కలో బల్లెంలా ఉంచుకొని అసమ్మతి భజన చేసుకోనిస్తారా? ఒకవేళ ఆయనపై వేటువేస్తే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న 17మంది మెగాభక్తులు (ప్రజారాజ్యం శాసనసభ్యులు) కూడా రామచంద్రయ్య పాటకు తాళం వేస్తే, మరి అప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి దైర్యంగా వారందరినీ కూడా బయటకి పంపుతారా? లేక వారి భజన పాటలకు చలించకుండా గుండె నిబ్బరం చేసుకొని అమ్మహస్తం పట్టుకొని ముందుకు సాగిపోతారా? అనే కొన్ని ధర్మ సందేహాలు సర్వత్రా నెలకొని ఉన్నాయి.

 

అయితే, తన భక్తుడు కోరుకొంటున్నఆ చిన్నకోరికను ఎన్నడూ కాదనని బోళాశంకరుడు వంటి చిరంజీవి, తన మనసులో మాటనే ఆయన బయటపెడుతున్నందుకు కిరణ్ కుమార్ రెడ్డి వేటువేస్తే ఆయనపై తన మూడో కన్ను తెరిచి శివతాండవం చేయకుండా ఊరుకొంటారా? తన మరో భక్తుడు శ్రీనివాసరావుతో కలిసి ఆయన కూడా అసమ్మతి గంట కొట్టకుండా ఊరుకొంటారా? అని పండిత పామరుల అనుమానం.

 

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించి పారేసిన చిరంజీవికి ఆగ్రహం కలిగితే, రేపు ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించమని కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ప్రాదేయపడినప్పటికీ ఆయన ఒప్పుకొంటారా? అని కొందరు కాంగ్రెస్ వాదులు కూడా బెంగపెట్టుకొన్నారు.

 

ఇటువంటి పరిస్థితులలో పార్టీలో తన భక్తులు, కిరణ్ కుమార్ రెడ్డి కి బలయిపోయిన అసమ్మతి నేతలతో కలిసి, సాటి కులపోడు బొత్స సత్తిబాబుతో హస్తాలు కలిపి నేడు కాకపోయినా రేపయినా ముఖ్యమంత్రికి చెక్ పెట్టి ఆయన కుర్చీలో కర్చీఫ్ వేయకుండా ఊరుకొంటారా అని అజ్ఞానులయిన ప్రజలకి కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఏమయినప్పటికీ, రామచంద్రయ్యపై వేటువేసే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం బెటరేమోనని పబ్లిక్ టాక్!