రాజకీయాలలో గొంగళిపురుగులు-సీతాకోక చిలుకలు

 

కేవలం మనుషులే రాజకీయాలు చేస్తారని అందరూ భ్రమించేవారు. కానీ, ఇటీవల కాలంలో రకరకాల జంతువులూ, క్రిమి కీటకాలు కూడా రాజకీయాలలోకి తరలి వస్తున్నాయి. గతంలో కేవలం కప్పలు మాత్రం పార్టీలు దూకేవి. ఇప్పుడు పార్టీలో నుండి గొంగళీ పురుగులు బయటకి పాక్కొంటూ వెళిపోతుంటే, సీతాకోక చిలుకలు ఎగురుకొని వస్తున్నట్లు తాజా సమాచారం. ఇక గాడిదలు, దున్నపోతులు, కుక్కలు, నక్కలు వంటి జంతువులు కూడా మన రాజకీయాలలోకి ప్రవేశించి చాల కాలమే అయినా, పాపం వాటికి తగినంత ప్రచారం కానీ, గుర్తింపు కానీ ఇంత వరకు కూడా రానందుకు, అవి ఈ రాజకీయ పక్షపాత వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. తమకు తగినంత ప్రాధాన్యం ఈయాలంటూ, తమ జాతులను రాజకీయ నేతలు దుర్వినియోగ పరచరాదంటూ అవి తమ రాజకీయహక్కుల కోసం పోరాడుతున్నాయి.

 

తమను పదవుల కోసం పడిగాపులు కాసే నేతలతో పోల్చడాన్ని గుంటనక్కలు తప్పు పడుతున్నాయి. ఎందుకంటే తాము కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే ‘గోతి కాడ కాపలా కాస్తాము’ తప్ప నేటి రాజకీయ నాయకులులాగా ఏడేడు తరాలకి సరిపడే ఆస్తులు పోగేసుకోవడానికి కాదని వాదిస్తున్నాయి.

 

ఇక పార్టీని వీడిపోయేవారిని తెదేపా నేతలు ‘కుక్క మూతి పిందెల’నడాన్ని కుక్కలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. విశ్వాసానికి మారు పేరయిన తమ జాతిని ఈ విధంగా అవమానించడం చాలా అన్యాయమని అవి తీవ్రఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

 

ఇక ఈ రాజకీయ నాయకులు ఒకరినొకరు తిట్టుకోవడానికి, తమ జాతిని వాడుకోవడాన్ని దున్నపోతులూ తప్పు పడుతున్నాయి. తాము మానవజాతికి ఎంత సేవ చేసినా కూడా వారికి విశ్వాసం లేకుండా ఈవిధంగా తమ జాతిని అవమాన పరచడాన్ని అవి తీవ్రంగా నిరసిస్తున్నాయి. తాము జడివానకి జడవనట్లే, నేటి రాజకీయ నాయకులు తిట్లకి, శాపనార్ధలకి జడవట్లేదని, ఎందుకంటే వారి తోలు తమకంటే ఎక్కువ మందమని దున్నపోతులు దృడంగా విశ్వసిస్తున్నాయి.

 

అదేవిధంగా క్రమంగా అంతరించిపోతున్న తమ జాతిని ఈ మానవులు కాపాడే ప్రయత్నం చేయక పోగా ఈ రాజకీయ నాయకులూ ఒకరినొకరు దూషించుకొనేందుకు తమ పేరును దుర్వినియోగం చేయడాని గాడిదలు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి.

 

ఇక అవకాశ వాదులయిన కొందరు రాజకీయ నాయకులను గోడ మీద పిల్లులు అని వర్ణిస్తూ తమని అవమానిస్తున్నారని ‘మ్యావ్ మ్యావ్’ మంటూ తమకు తెలిసిన ఒకే ఒక పదంతో పిల్లులు తీవ్రఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, రాజకీయ నాయకులు మాత్రం వాటన్నిటి భాషలలో గాండ్రిస్తూ, గర్జిస్తూ, మొరుగుతుండేసరికి ఆ రాజకీయ వింత జంతువును చూసి అన్నిజంతువులు బయపడిపోతున్నాయి.