తెలంగాణాపై కాంగ్రెస్ ప్రకటనలు అనాలోచితమా, వ్యుహాత్మకమా?
posted on May 24, 2013 @ 10:52PM
బయ్యారం గనులను వైజాగ్ స్టీల్ ప్లాంటుకి కేటాయించడంపై జరిగిన రగడ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. చల్లబడిన తెలంగాణా ఉద్యమానికి బయ్యారం మళ్ళీ కొత్త ఊపిరి పోసింది. కానీ, దానిని కొత్తగా వచ్చిన ఇతర అంశాలు వెనక్కి నెట్టడంతో మళ్ళీ బయ్యారం చల్లబడింది. తెరాస మరిచిపోయిన ఆ అంశాన్ని కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ స్వయంగా త్వరలో కెలికేందుకు సిద్ధం అవుతోంది.
హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి పి. బలరాంనాయక్ మీడియాతో మాట్లాడుతూ త్వరలో బయ్యారం పైలట్ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేయబోతున్నట్లు వెల్లడించారు. పనిలో పనిగా తెలంగాణా ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం లేదంటూ ఆయన కూడా తెలంగాణా యంపీలను మరోసారి కవ్వించారు.
ఈవిదంగా కాంగ్రెస్ నేతలు ఒకరి తరువాత మరొకరు సున్నితమయిన తెలంగాణా అంశంపై పనిగట్టుకొని నోరు జారుతూ తెరాస మరియు ఇతర తెలంగాణా వాదులను కవ్వించడం గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యపూర్వకంగానే చేస్తున్నట్లు అర్ధం అవుతోంది. బహుశః తెలంగాణా వాదులను ఎప్పటికప్పుడు కవ్విస్తూ, తెలంగాణలోకి తెదేపా, వైకాపాలు అడుగుపెట్టకుండా నిరోదించాలని దాని ఆలోచనేమో.
బయ్యారం అంశంపై వైకాపా తన వైఖరి ఏమిటో స్పష్టంగా ప్రకటించిన తరువాతనే విజయమ్మ తెలంగాణాలో తన రచ్చబండ కార్యక్రమం పెట్టుకోమని తెరాస నేత హరీష్ రావు హెచ్చరించడం ఇందుకు ఒక చిన్న ఉదాహరణ. బయ్యారం విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటన చేయడంతో తెరాస నేతలు మొదట కిరణ్ కుమార్ రెడ్డి పై విరుచుకు పడినప్పటికీ, ఆ తరువాత వారు క్రమంగా వైకాపా మరియు తెదేపాతో తీవ్ర యుద్ధం చేసారు.
తమ మాటలకి ఎటువంటి ప్రతిస్పందన వస్తుందో ఖచ్చితంగా తెలిసిఉన్న కాంగ్రెస్ పార్టీ, ఒక లెక్క ప్రకారమే సరయిన సమయంలో సరయిన డైలాగులు పేలుస్తోంది. చాకో ప్రకటన తరువాత కాంగ్రెస్ యంపీలను తన వైపు లాక్కొందామని ప్రయత్నిస్తున్న కేసీఆర్ పై ఎటువంటి అస్త్రం ప్రయోగించ బోతోందో త్వరలోనే తెలియవచ్చును. తద్వారా చాకో ప్రకటన పరమార్ధం కూడా త్వరలోనే బయటపడుతుంది.