12వ శతాబ్ది నాయకురాలు నాగమ్మ ఆలయాన్ని కాపాడుకోవాలి!

-శిథిలావస్థలో నాయకురాలు నాగమ్మ దేవాలయం  -నిర్లక్ష్యపు నీడలో పలనాటి వారసత్వం! -పల్నాటి పౌరుషానికి ప్రతీకలు ఈ చరిత్ర శాకలాలు -శివనాగిరెడ్డి  పల్నాటి వీర భారత వారసత్వం, అలనాటి పౌరుషానికి ప్రతీకలైన చారిత్రక శకలాల్ని పదిలపరుచుకోవాలని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి పల్నాడు ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. వారసత్వ సంపదను కాపాడి భవిష్యత్ తరాలకు అందించే 'ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిటి' అనే అవగాహన కార్యక్రమంలో భాగంగా, ఆయన ఆదివారం నాడు పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, జిట్టగామాలపాడు గ్రామ శివారులోని నాయకురాలు నాగమ్మ దేవాలయమని స్థానికులు గట్టిగా నమ్ముతున్న శిథిలాలను పరిశీలించారు. పల్నాటి యుద్ధంలో, నలగామ రాజు మంత్రిణిగా, మలిదేవరాజు మంత్రి బ్రహ్మనాయునితో పోరాడిన వీర వనితగా గుర్తింపు పొందిన నాయకురాలు నాగమ్మ, ఆమె తండ్రి చౌదరి రామిరెడ్డి నివసించారని విశ్వసిస్తున్న ప్రదేశంతో పాటు, జిట్టగామాలపాడు లో ఆమె నిర్మించిన చెన్నమల్లికార్జునాలయాన్ని, ఇంకా, ఆమె పౌరుషానికి గుర్తుగా అప్పటి వీరులు నిర్మించిన నాగమ్మ దేవాలయ శిధిలాలను అధ్యయనం చేసి, ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మధ్యయుగాల్లో  శ్రీనాధుడు, ఈ తరంలో గుర్రం చెన్నారెడ్డి, కే.హెచ్.వై. మోహన్ రావు  రచనల నేపథ్యంలో ఈ శిధిలాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయన్నారు. నాగమ్మ నిర్మించిన చెన్న మల్లికార్జునాలయాన్ని అప్పటి ప్రజాపతినిధుల చొరవతో పదేళ్ల క్రితం ప్రభుత్వం పునరుద్ధరించిందని, ఆ ఆలయానికి దక్షిణాభిముఖంగా గర్భాలయ, అర్ధ, మహా మండపాలతో ఉన్న నాగమ్మ ఆలయం, అధిష్టానం వరకు కూలిపోయి, చల్లాచెదురుగా పడి ఉన్న ఆలయ శకలాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాగమ్మ ఆలయ పునరుద్ధరణకు స్థానికులు ముందుకొస్తే,  స్థపతిగా అనుభవమున్న తాను, ఉచితంగా సాంకేతిక సహాయాన్ని  అందిస్తానన్నారు. ఇంతటి చారిత్రక ప్రాధాన్యత గల నాయకురాలు నాగమ్మ దేవాలయాన్ని పదిలపరిచి, పల్నాటి యుద్ధ క్షేత్రాలైన మాచర్ల, గురజాల, కారంపూడి, కంభంపాడులను జిట్టగామలపాడుతో కలుపుతూ పల్నాడు టూరిస్ట్ సర్యూట్ ను అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ ఏపీ భ‌వ‌న్‌లో ఎవ‌రి వాటా ఎంత‌? షెడ్యూల్ 9,10 పంచాయితీ తేలేదెప్పుడు?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా.. ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల విభజన  పూర్తి కాలేదు.  ఏపీ 17 వేల కోట్ల బాకీ వుందని తెలంగాణా ప్ర‌భుత్వం చెబుతుంటే,  6 వేల కోట్ల బ‌కాయి తెలంగాణా నుంచి రావాల్సి వుందని  ఏపీ ప్ర‌భుత్వం చెబుతోంది.  ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ, తెలంగాణ ఆస్తుల వ్యవహారం కొలిక్కి రాలేదు. ఇప్పుడు ఏపీ ఎన్నికల వేళ రెండు రాష్ట్రాల ఆస్తుల పంపిణీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆస్తుల పంపకాల ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అంగీకారం తెలపడంతో మార్గం సుగమమమైంది. దీంతో ఢిల్లీ లో ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యా ఆస్తుల పంపిణీ కున్న అడ్జంకులు దాదాపుగా తొలగిపోయాయనే చెప్పవచ్చు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ భవన్ సహా భూములు, భవనాలు దాదాపు రూ 10 వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇందులో గోదావరి బ్లాక్, శబరి బ్లాక్, నర్శింగ్ హాస్టల్, పటౌడీ హౌస్ వంటివి ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రానికి వెలుపల ఉండే ఆస్తులను రెండు తెలుగు రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచారు. ఫలితంగా పదేళ్లుగా సాగుతున్న ఆస్తుల పంపకం వ్యవహారం ఇప్పుడు కొలిక్కివచ్చింది.  ఆస్థుల పంపకం ఇలా..  మొత్తం 19.781 ఎకరాల్లో ఉన్న ఏపీ భవన్ ఆస్తుల్లో .. ఆంధ్రప్రదేశ్‌కు 11,356 ఎకరాలు,  తెలంగాణకు 8,245 ఎకరాలు కేటాయింపునకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.  ఏపీ భవన్ పరిధిలో ఉన్న గోదావరి బ్లాక్‌లోని 4.315 ఎకరాలు,  శబరి బ్లాక్‌లోని ఇన్నర్ రోడ్స్, ఆక్రమణకు గురైన ప్రాంతంలోని దుకాణాలున్న 0.512 ఎకరం,  నర్శింగ్ హాస్టల్ ఉన్న 3.359 ఎకరాలు,  పటౌడీ హౌస్‌లోని 2.396 ఎకరాలు ఏపీకు కేటాయించేలా ప్రతిపాదన జరిగింది. ఇక శబరి బ్లాక్‌లోని 3 ఎకరాలు,  పటౌడీ హౌస్‌లోని 5.245 ఎకరాలు తెలంగాణకు కేటాయించేలా ప్రతిపాదించారు.  ఏపీకు కేటాయించిన ఆక్రమణలు ఉన్న ప్రాంతాన్ని స్వాధినం చేసుకోలేని పక్షంలో  అందుకు సమానమైన భూమిని  శబరి బ్లాక్ లేడా పటౌడీ హౌస్ భూమి నుంచి కేటాయించాలనేది ఏపీ విధించిన కండిషన్.  ఈ ప్రతిపాదనలపై రెండు రాష్ట్రాలు అంగీకరించాయ‌ని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రెండు ప్రభుత్వాల ప్రతిపాదన, స్పందనల్ని ఆయా రాష్ట్రాలకు తెలిపింది.   ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.   షెడ్యూల్‌ 9లో  వున్న ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన,  షెడ్యూల్‌ 10లో వున్న రాష్ట్ర స్థాయి సంస్థల విభజన, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన,  సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్  ఏ పీ హెవీ మిషనరీ  యింజనీరింగ్ లిమిటెడ్ విభజన, నగదు, బ్యాంకు బ్యాలెన్సుల విభజన, తెలంగాణా పౌర సరఫరాల కార్పొరేష న్ నుంచి ఏపీ పౌర సరఫరాలకు రావాలసిన క్యాష్ క్రెడిట్ బకాయిలు, విద్యుత్ బకాయిల అంశంమొదలైన సమస్యల పరిష్కరించాల్సి వుంది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం హైద‌రాబాద్‌లోని రాజ్‌భ‌వ‌న్‌, హైకోర్టు భ‌వ‌నం, లోకాయుక్త‌, ఎస్‌హెచ్ఆర్సీ వంటి భ‌వ‌నాల‌ను వినియోగించుకున్నందున ఆ రాష్ట్రం నుంచి వ‌డ్డీతో క‌లిపి మొత్తం రూ.408 కోట్లు కావాల‌ని తెలంగాణా అడుగుతోంది. ఇలా లెక్కేసుకుంటూ పోతే టోట‌ల్‌గా  ఏపీ 17 వేల కోట్ల బాకీ వుందని తెలంగాణా ప్ర‌భుత్వం చెబుతోంది.  మ‌రో వైపు విద్యుత్ బ‌కాయిల‌కు సంబంధించి తెలంగాణా నుంచి ఏపీకి 6 వేల కోట్ల రూపాయ‌లు రావాల‌ని ఏపీ అంటోంది. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం తొమ్మిదో షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థ‌ల విభ‌జ‌న‌ను పూర్తి చేయాల‌ని,  ప‌దో షెడ్యూల్ ప‌రిధిలోని సంస్థ‌ల వివాదాన్ని ప‌రిష్క‌రించాల‌ని,  న్యూఢిల్లీలోని ఉమ్మ‌డి రాష్ట్ర భ‌వ‌న్ విభ‌జ‌న‌ను సాఫీగా పూర్తి చేయాల‌ని, చ‌ట్టంలో ఎక్క‌డా పేర్కొన‌కుండా ఉన్న సంస్థ‌ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్లెయిమ్ చేసుకోవ‌డంపై దృష్టిసారించాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రికి ఏపీ ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

దటీజ్ రేవంత్..!

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి స్వపక్షం, విపక్షం అన్న తేడా లేకుండా అందరినీ మెస్మరైజ్ చేస్తున్నారని చెప్పడానికి ఎటువంటి సందేహం అవసరం లేదనిపించేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా అసెంబ్లీ వేదికగా ఆయన మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలా ఇలా కాకుండా కేసీఆర్ రాజకీయ అనుభవం, మంత్రిగా, కేంద్ర మంత్రిగా, పార్లమెంటేరియన్ గా, తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు సీఎంగా ఆయన చేసిన సేవలను ప్రస్తుతిస్తూ అత్యంత ఆత్మీయంగా సభ వేదిగా ఆయన కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తీరు విపక్ష బీఆర్ఎస్ నేతల నుంచి కూడా బల్లలు చరిచి హర్షద్వానాలు చేయించింది.   కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా  తనదైన పాత్ర పోషించిన కేసీఆర్ 70వ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున జన్మదిన ముఖ్యమంత్రి బర్త్ డే విషెస్ తెలిపారు.   భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని.. తెలంగాణ పున:నిర్మాణంలో వారిని భాగస్వామ్యం చేయాలని ఆకాంక్షించారు. ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభను సజావుగా నడిపేలా, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి నడిపించేలా ఆయనకు పూర్తి స్థాయిలో దేవుడు శక్తి, సామర్థ్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.   

గుంటూరు లోక్ సభ అభ్యర్థి వేటలో జగన్!.. పోటీకి నో అంటున్న ఉమ్మారెడ్డి?

వైసీపీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు కరవైయ్యారు. అధిష్ఠానం ఏరి కోరి ఎంపిక చేసిన వారు చేతులెత్తేస్తున్నారు. తమ స్థానాన్ని మార్చిన జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్న వారు పార్టీ మారిపోతున్నారు. మొత్తంగా వైసీపీలో ఇప్పుడు తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. సిట్టింగుల మార్పు అంటూ జగన్ ఎప్పుడైతే మార్పులకు శ్రీకారం చుట్టారో ఆ క్షణం నుంచీ వైసీపీలో ముసలం ప్రారంభమైందంటున్నారు. ప్రజా వ్యతిరేకత ఉందని తెలిసినా, నియోజకవర్గంలో ఉంటూ పని చేసుకున్న తమకు విజయం లభిస్తుందన్న నమ్మకంతో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పుడు తమ స్థానానికే జగన్ ఎసరు పెట్టడంతో ఒక్క సారిగా తిరుగుబావుటా ఎగుర వేస్తున్నారు. మీకో దణ్ణం, మీ పార్టీకో దణ్ణం అంటూ జెండా పీకేస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారేందుకు వెనుకాడటం లేదు. తాము చేరబోయే పార్టీలో టికెట్ రాదని తెలిసినా, కనీసం రాజకీయంగా లైఫ్ ఉంటుందన్న భావనతో మరో ఆలోచన లేకుండా వైసీపీకి గుడ్ బై చెప్పేయడానికి రెడీ అయిపోతున్నారు.  టికెట్ల విషయంలో అసంతృప్తికి గురైన వారి పరిస్థితి ఇలా ఉంటే.. టికెట్ దక్కిన వారూ సంతృప్తిగా లేరు. నాన్ లోకల్ అన్న ముద్ర వేసుకుని, వారికి టికెట్ లభించిన నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని గమనించి గౌరవంగా పోటీ నుంచి తప్పుకుంటే బెటరన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. తాజాగా గుంటూరు వైసీపీ లోక్ సభ అభ్యర్థి ఉమ్మారెడ్డి వెంకటరమణ తాను లోక్ సభ బరిలో దిగేది లేదని భీష్మించారు. తాను లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా లేనని కుండబద్దలు కొట్టేయడంతో ఇప్పుడు కీలకమైన గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి లేక జగన్ తల పట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎంత వెతికినా గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయడానికి అభ్యర్థి దొరకని దయనీయ స్థితిలో అధికార పార్టీ ఉంది. సాధారణంగా ఎన్నికల ముందు అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు నేతలు పోటీలు పడతారు. అందుకు భిన్నంగా వైసీపీలో పోటీ నుంచి నేతలు పారిపోతున్న పరిస్థితి ఉండటమే.. వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ ఎటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కోనుందో తేటతెల్లం చేస్తున్నది.   ఎన్నో కసరత్తుల చేసి, కుల సమీకరణాలు, ఆర్థిక బలం .. ఇలా అన్ని పరిగణనలోనికి తీసుకుని గుంటూరు లోక్ సభ స్థానానికి ఉమ్మారెడ్డి వెంకటరమణను జగన్ ఎంపిక చేశారు. ఉమ్మారెడ్డి వెంకటరమణ  మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు. ఉమ్మారెడ్డి వెంకటరమణను గుంటూరు లోక్ సభ వైసీపీ అభ్యర్థిగా ప్రకటించినా, ఆయన మాత్రం తాను ఎట్టిపరిస్థితుల్లోనూ లోక్ సభకు పోటీ చేసేది లేదని భీష్మించి, తాను అసెంబ్లీ బరిలోనే దిగుతానని కుండబద్దలు కొట్టేశారు.  ఇది జగన్ ను ఇప్పుడు దిక్కు తోచని పరిస్థితిలో పడేసిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. అయినా అత్యంత కీలకమైన గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీలోకి దింపడానికి వైసీపీకి అభ్యర్థే దొరకని పరిస్థితి ఆ పార్టీ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. ఉమ్మారెడ్డి వెంకటరమణ తాను గుంటూరు 2 నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆయనకు ఆ స్థానం ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే చిలకలూరి  పేట సిట్టింగ్ ఎమ్మెల్యే విడదల రజనీని అక్కడ నుంచి మార్చి గుంటూరు 2కు అభ్యర్థిగా జగన్ ఇప్పటికే ప్రకటించేశారు.  అసలు వైసీపీ నుంచి పోటీ చేయడానికి ఇష్టం లేకనే ఉమ్మారెడ్డి వెంకటరమణ గుంటూరు 2 అసెంబ్లీ స్థానం కోరుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇందుకు కూడా కారణం లేకపోలేదని చెబుతున్నారు. పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు స్వయాన అల్లుడు అయిన కిలారి రోశయ్యకు జగన్ మొండి చేయి చూపించేందుకు రెడీ అయిపోయారనీ, ఆయనకు పొన్నూరు నుంచి పోటీకి నో చెప్పారనీ, అందుకే ఉమ్మారెడ్డి కుటుంబం కినుక వహించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసలు సిట్టింగుల మార్పు అంటూ జగన్ జాబితాలు విడుదల చేయడం మొదలు పెట్టిన నాటి నుంచే పార్టీలో అసమ్మతి భగ్గు మంది. జగన్ తన క్యాబినెట్ ను రీషఫుల్ చేసిన సందర్భంగానే పెద్ద ఎత్తున అసమ్మతి చెలరేగినప్పటికీ, అప్పటికి ఇంకా రెండేళ్లు అధికారంలో జగన్ కొనసాగుతారు కనుక భగ్గుమని చెలరేగిన అసమ్మతి చప్పగా చల్లారిపోయింది. అయితే ఇక ఇప్పుడు మాత్రం పార్టీలో అసమ్మతి చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. నెలల వ్యవధిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు కూడా మౌనంగా ఉంటే పొలిటికల్ ప్యూచరే ప్రమాదంలో పడుతుందని వైసీపీ అసమ్మతి నేతలు తగ్గేదే లేదంటున్నారు.

దగా డీఎస్సీ వద్దు  మెగా డీఎస్సీ కావాలంటూ  మంత్రి బుగ్గన ఇల్లు ముట్టడి

దగా డీఎస్సీ వద్దు - మెగా డీఎస్సీ కావాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు నిరసన బాట పట్టారు. నాడు మెగా డీఎస్సీ  అంటూ హామీ ఇచ్చిన జగన్‌ ఎన్నికల ముందు దగా డిఎస్సి ఇచ్చారని మండిపట్టారు. నిరుద్యోగులను నిలువునా ముంచిన వైసీపీ సర్కార్‌కు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. 'మాకూ ఉంది ఓటు' - 'మీకూ ఉంది వేటు' అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెగా డీఎస్సీ వేయాలంటూ ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా నేడు నంద్యాల జిల్లా డోన్‌లో ఇదే డిమాండ్‌తో ఎన్ఎస్‌యూఐ నాయకులు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు. 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రికి వినతిపత్రం అందించేందుకు ఎన్ఎస్‌యూఐ నేతలు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను పట్టుకునే ప్రయత్నంలో పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ కిందపడ్డారు. అనంతరం నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిన్న కూడా ఇదే డిమాండ్‌తో యూత్ కాంగ్రెస్ నేతలు మంత్రి అంబటి రాంబాబు ఇంటి ముట్టడికి యత్నించారు. సత్తెనపల్లిలోని ఆయన ఇంటికి చేరుకున్న నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. వీరిని అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఐదేళ్లుగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను ఊరిస్తున్న ప్రభుత్వం చివరకు ఆరు వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. దీనికి నిరసనగా 'దగా డీఎస్సీ వద్దు - మెగా డీఎస్సీ' కావాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. నెల రోజుల్లో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. 

జగన్ పార్టీకి ఎండ్ కార్డ్ ?.. ఏడో జాబితాతో విజయంపై వైసీపీ శ్రేణుల్లోనూ సడలిన విశ్వాసం!

ఇప్పటి వరకూ ప్రతిపక్షం తెలుగుదేశం వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి వైసీపీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉందంటూ వస్తున్నారు. అయితే తెలుగుదేశం చేస్తున్న వ్యాఖ్యలను, వేస్తున్న సెటైర్లను  పెద్దగా ఎవరూ నమ్మలేదు. అధికారపార్టీపై ప్రజా వ్యతిరేకత ఉందనడంలో ఎలాంటి అనుమానం లేదు.. కానీ ఆ పార్టీకి అభ్యర్థులే దొరకనంతగా బలహీనపడిందంటే నమ్మకం కలగడం లేదనే అంటున్నారు. అయితే ఆ పార్టీ తాజాగా విడుదల చేసిన ఏడో జాబితా చూసిన తరువాత ఇక వైసీపీ అభ్యర్థుల కోసం వెతుకులాటలో పడిందన్నది దాదాపుగా అందరికీ నిర్ధారణ అయిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అవును జగన్ రెడ్డి సిట్టింగుల మార్పుల ఏడో జాబితాను విడుదల చేశారు. ఆ జాబితాలో రెండంటే రెండు పేర్లే ఉన్నాయి. ఆ రెండు నియోజకవర్గాలకూ కొత్త సమన్వయకర్తలను నియమించారు. ఆ రెండు పేర్లలో ఒకటి ఎడం బాలాజీ. ఆయనను పర్చూరుకు సమన్వయకర్తగా నియమించారు. యడం బాలాజీ  ఇప్పటికీ తెలుగుదేశంలోనే ఉన్నారు. పార్టీకి రాజీనామా ఇంకా చేయలేదు. అయితే చాలా కాలంగా ఆయన పార్టీకే కాదు, రాజకీయాలకూ దూరంగా ఉంటున్నారు. పైగా ఇక్కడ కాదు అమెరికాలో ఉంటున్నారు.  మరి అలాంటి ఎడం బాలాజీని పర్చూరు సమన్వయ కర్తగా నియమించిందంటే.. పర్చూరులో ఆమంచి పోటీకి ససేమిరా అనడం,   ఇండిపెండెంట్ అయినా సరే  చీరాల నుంచి రంగంలోకి  దిగుతారన్న భావనలో ఉన్న జగన్ ఆయనను తప్పించాలని నిర్ణయించేసుకున్నారు. అయితే ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలన్న విషయంలో మాత్రం పార్టీకి సంబంధించి ఎవరూ దొరకకపోవడంతో  ఎడం బాలాజీని  పిలిపించుకున్నారు. ఆయన తనను కలిసినట్లుగా ఓ ఫొటో విడుదల చేసి పర్చూరు సమన్వయ కర్తగా ప్రకటించేశారు. ఆయన అమెరికా వదిలి ఇక్కడకు వస్తారా? వచ్చి పోటీ చేస్తారా? అన్న విషయాలపై ఇప్పుడు క్లారిటీ రావాల్సి ఉంది. పర్యూరు విషయం ఇలా ఉంటే.. కందుకూరుది మరో కథ. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీందర్ రెడ్డికి  టికెట్ ఇవ్వొద్దని డిసైడైపోకయిన జగన్ ఇక్కడ కూడా సొంత పార్టీ వారెవరూ దొరకక, వేరే నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం నేత పెంచలయ్య కుమార్తెను ఇన్ చార్జిగా నియమించేశారు. ఈ ఏడో జాబితా పరిశీలకులనే కాదు, వైసీపీ నేతలను, శ్రేణులనూ కూడా విస్మయపరిచిందనడంలో సందేహం లేదు.  పెంచలయ్య తెలుగుదేశం నుంచి వైసీపీ గూటికి చేరి నిండా నెలరోజులు కూడా కాలేదు.  ఇంతకీ సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిపై జగన్ ఆగ్రహానికీ, ఆయన ను తప్పించడానికీ కారణాల కోసం పెద్దగా  ఆరా తీయాల్సిన అవసరం లేదు. ఆయన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను బూతులు తిట్టడానికి సుముఖంగా లేకపోవడమే జగన్ కోపానికి కారణం.    ప్రతిపక్ష నేతలను తిట్టడమే టికెట్ లభించడానికి ట్రేడ్ మార్క్ అని భావిస్తున్న జగన్   అలా తిట్టడానికి ఇష్టపడని వారందరినీ పక్కన పెట్టేయడమే   విధానంగా మార్చుకున్నారు.. దీంతో వైసీపీలో ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులే కరవైన పరిస్థితి తలెత్తిందని, పార్టీలో ఎవరూ జగన్ ను నమ్మి పోటీ చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఎదురౌతుండటంతో తెలుగుదేశంలో  చెల్లని కాసులైనా సరే అన్నట్లుగా ఎవరినో ఒకరిని తీసుకు వచ్చి అభ్యర్థులుగా నిలబెట్టే దుస్థితికి జగన్ వచ్చేశాడని, ఇదే వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీకి ఎండ్ కార్డ్ పడటం ఖాయమని అందరూ భావించడానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా జగన్ తీరుతో పార్టీ శ్రేణుల్లోనే విజయంపై విశ్వాసం సన్నగిల్లిందంటున్నారు.

ఇలా చేరిక .. అలా పదవి

నిత్య జీవితంలో ఎంతోమంది తారసపడుతుంటారు. వారిలో కొద్దిమంది మాత్రమే జీవితాంతం గుర్తుండిపోతారు. అందులోనూ మతిమరుపు మనుషులను ఓ పట్టాన మరిచిపోలేం. అలాంటివారిని ఉద్దేశించిన సామెతే.. ‘ఉషికెల ఉంగురం పెట్టి పప్పుల దేవులాడినట్టు’. వాళ్ల స్వభావమే అంత. మాజీ ఉపముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నేత రాజయ్య  విషయంలో అదే జరిగింది.  మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ వీర విధేయుడైన రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన గంటల్లోనే కార్పోరేషన్ చైర్మన్ పదవి దక్కింది.  రాజయ్య కూడా ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన రాజయ్య పదేళ్ల తర్వాత అదే పార్టీలో చేరారు. శుక్రవారం  ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తుండడం తెలిసిందే. ఇలాంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డితో రాజయ్య భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ రోజు పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.  వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్‌తో పాటు సభ్యులుగా ఎం రమేశ్, సంకేపల్లి సుధీర్ రెడ్డి, నెహ్రూ నాయక్ మాలోత్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరి పదవీ కాలం రెండేళ్ల పాటు ఉంటుంది. రాజయ్య 15వ లోక్ సభకు వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఇప్పటికే రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా సీఎంవో మాజీ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌ను ప్రభుత్వం నియమించింది.

గృహజ్యోతి లబ్దిదారులకు ఆధార్ కంపల్సరీ 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఒక్కో గ్యారంటీ పథకం అమలు చేస్తుంది. ఇప్పటికే  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసింది. లోకసభ ఎన్నికల నేపథ్యంలో మరిన్ని గ్యారెంటీలను అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు యోచిస్తోంది. ఇందులో భాగంగా గృహజ్యోతి పథకం అమలు చేసే దిశగా అడుగులు వేసింది. ఈ మేరకు సాధ్యా అసాధ్యలను బేరీజు వేసుకుంటుంది. ఉచిత విద్యుత్ పథకం ‘గృహజ్యోతి’ లబ్ధిదారులకు తప్పనిసరిగా ఆధార్ ధ్రువీకరణ చేయించుకోవాలని తెలంగాణ ఇంధన శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బయోమెట్రిక్ విధానంలో ఈ ధ్రువీకరణ పూర్తి చేస్తేనే గృహజ్యోతి పథకంలో పేర్లు నమోదవుతాయని పేర్కొంది.  ఆధార్ ధ్రువీకరణ ప్రక్రియను డిస్కంలు చేపట్టాలని ఇంధన శాఖ తన ప్రకటనలో ఆదేశించింది. లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు ఇంటి కరెంట్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వారి ఆధార్‌ను సిబ్బందికి అందజేయాలి. ఎవరికైనా ఆధార్ లేకపోతే తక్షణం దరఖాస్తు చేసుకుని, ఆ రుజువు చూపాలి. ఆధార్ జారీ అయ్యేవరకూ ఇతర గుర్తింపు కార్డులు వినియోగించవచ్చు. బ్యాంకు లేదా పోస్టాఫీసు పాస్‌బుక్‌లో ఖాతాదారుడి ఫొటోతో ఉన్న జిరాక్స్, పాన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఉపాధి హామీ పథకం గుర్తింపు కార్డు, కిసాన్ పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఎవరైనా గెజిటెడ్ అధికారి లేదా తహసీల్దార్ ఇచ్చిన ధ్రువీకరణ పత్రం వంటి వాటిల్లో ఏదో ఒకటి విద్యుత్ సిబ్బందికి చూపించి పేర్లు నమోదు చేసుకోవాలి.  బయోమెట్రిక్ ధ్రువీకరణలో భాగంగా వేలిముద్ర లేదా కనురెప్పలను స్కాన్ చేయాలని ఇంధనశాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. డిస్కంలే ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించింది. పరికరాలు పనిచేయకపోతే ఆధార్ నంబర్‌ను నమోదు చేయగానే దాని యజమాని సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలి. ఇది కూడా సాధ్యం కాకపోతే, ఆధార్ కార్డుపై ఉండే క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేసి వివరాలు తెలుసుకోవాలని ఇంధన శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.  ఈ పథకం అమలు కోసం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వుల్లోని నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిస్కంలను ఇంధన శాఖ ఆదేశించింది. దీంతో, లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి పూర్తి స్థాయి మార్గదర్శకాలు తరువాత వెలువడతాయని భావిస్తున్నారు.

కారు..కమలం కలిసికట్టుగా.. కాంగ్రెస్ పై పోరుకు రెడీ!?

తెలంగాణలో రెండు పార్టీలో లోక్ సభ ఎన్నికలలో విజయం కోసం తెగ కష్టపడిపోతున్నాయి. ఎలాగైనా రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలలో అత్యధిక స్థానాలలో విజయం సాధించి, రాష్ట్రంలో ఉనికి చాటుకోవాలని తెగ తాపత్రేయపడిపోతున్నాయి. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి, ఆ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నిండా మూడు నెలల కూడా కాలేదు. అసెంబ్లీ ఎన్నికల విజయంతో కాంగ్రెస్ జోష్ మీద ఉంది. అదే సమయంలో ఆ ఎన్నికలలో ఎదురైన ఫలితంతో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ మాత్రమే కాదు, గత అసెంబ్లీ ఎన్నికలలో విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఇక అధికారమే తరువాయి అన్నంతగా బిల్డప్ ఇచ్చిన బీజేపీలో కూడా నిరాశా, నిస్ఫృహలే కనిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికలలో కూడా నామమాత్రపు స్థానాలలో విజయం సాధిస్తే.. ఆ రెండు పార్టీలకూ కూడా తెలంగాణలో సమీప భవిష్యత్ లో తేరుకునే అవకాశాలు ఉండవు. అందుకే ఎలాగైనా సరే సర్వశక్తులూ కూడగట్టుకుని గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నాయి.  అదే సమయంలో కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రం నుంచి అత్యధిక లోక్ సభ స్థానాలలో గెలిచే అవకాశం లేకుండా చేయడానికి లోపాయికారీ ఒప్పందాలకే కాదు, అవసరమైతే పోత్తు పెట్టుకుని రంగంలోకి దిగడానికి కూడా వెనుకాడటం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్, బీజేపీ పొత్తుపై రాజకీయ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ దానిని ఖండించడానికి కూడా ప్రయత్నించకపోవడమే ఇందుకు తార్కాణంగా చెబుతున్నారు.   అయితే బీజీపీ జాతీయ ప్రధాన కార్దర్శి, ఆ పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడూ మాత్రం స్పందించారు. ఆయన స్పందన కూడా బీఆర్ఎస్ తో పొత్త ఉంటుందన్న సంకేతాలు ఇచ్చే విధంగానే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయన స్పందనను బట్టి చూస్తే బీజేపీలో ఇంకా నాయకత్వ సమస్య పరిష్కారం కాలేదని అవగతమౌతోందనీ అంటున్నారు. కేసీఆర్ కేటీఆర్ లను వదిలి వచ్చే వారికి బీజేపీ తలుపులు బార్లా తీస్తుందంటూ ఆయన చేసిన ప్రకటక బీఆర్ఎస్ తో పొత్తుకు అనుకూలమే కానీ, ఆ పార్టీ నాయకత్వాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకించి బయటకు రావాలని చెబుతున్నట్లుగా ఉంది. ఇక మాజీ మంత్రి హరీష్ రావుకు బీజేపీ తలుపులు బార్లా తెరిచే ఉంటాయని బండి సంజయ్ చెప్పడం అంటే బీఆర్ఎస్ లో చీలకను ప్రోత్సహించేందుకు బీజేపీ వెనుకాడదని అవగతమౌతోంది. ఏదో మాట వరసకు అన్నట్లుగా బీఆర్ఎస్ ను ఎన్డీయేలో చేర్చుకునే ప్రశక్తే లేదనీ, ఆ విషయాన్ి స్వయంగా ప్రధాని మోడీ చెప్పారనీ బండి సంజయ్ అన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు మోడీ ఎన్డీయేలో బీఆర్ఎస్ ను చేర్చుకునే ప్రశక్తే లేదని చెప్పారు. ఆ సందర్భానికి ఆయన ఆ మాట చెప్పి ఉండొచ్చు. కానీ సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ టార్గెట్ వేరు. ఆ పార్టీ లక్ష్యం కాంగ్రెస్. అందుకు తెలంగాణలో అధకారంలో ఉన్న కాంగ్రెస్ కు రాష్ట్రంలో లోక్ సభ స్థానాలలో విజయాన్ని అత్యల్ప స్థాయికి పరిమితం చేయడానికే తొలి ప్రాధాన్యత. ఇక కేసీఆర్ కు కూడా తన పార్టీ ఉనికికి థ్రెట్ బీజేపీ నుంచీ కాదనీ, కాంగ్రెస్ నుంచే అనీ స్పష్టంగా తెలుసు.    అందుకే  ఆయన కూడా తెలంగాణలో కాంగ్రెస్ సాధించే లోక్ సభ స్థానాల సంఖ్యను కనీస స్థాయికి పరిమితం చేయాలన్న లక్ష్యంతోనే అడుగులు వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనుభవంతో ఇరు పార్టీలూ కూడా రాష్ట్రంలో త్రిముఖ పోరుకు పెద్దగా సుముఖంగా లేరు. ఉమ్మడిగా ముందుకు వెడితే కాంగ్రెస్ ను దెబ్బతీయవచ్చన్న ఉద్దేశంతోనే ఇరు పార్టీలు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కలిసి పోటీ చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి, వ్యూహాలు రచిస్తున్నాయి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నేరుగా పొత్త మాట ఎత్తక పోయినా.. ఫ్రెండ్లీ పోటీ అన్న వ్యూహంతో ముందుకు సాగే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని చెబుతున్నారు. 

బొత్స‌కు బిగ్‌షాక్‌.. వైసీపీని వీడుతున్న అనుచ‌రులు

ఏపీ రాజ‌కీయాల్లో సుదీర్ఘ‌కాలం అనుభ‌వం క‌లిగిన నేత‌ల్లో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఒక‌రు. ప్ర‌స్తుతం ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంలో కీల‌క మంత్రిగా కొన‌సాగుతున్నారు. జ‌గ‌న్ కు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చే స్థాయి క‌లిగిన నేత‌ల్లో మంత్రి బొత్స కూడా ఒక‌రు.  మంత్రి బొత్స కుటుంబానికి  విజ‌య‌న‌గ‌రం జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా అభిమాన గ‌ణం ఉంది. అయితే తాజా రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో జిల్లాలో బొత్స హ‌వాకు బ్రేకులు ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. వైసీపీ ప్ర‌భుత్వంలో బొత్స కీల‌కంగా  వ్య‌వ‌హ‌రిస్తున్న‌ప్ప‌టికీ ఆయ‌న అనుచ‌రుల‌ను కాపాడుకోవ‌టంలో విఫ‌ల‌మ‌వుతున్నారు. గ‌త ప‌దేళ్ల‌కుపైగా బొత్స‌కు వీర‌విధేయులుగా కొన‌సాగిన వారు సైతం మ‌రికొద్ది నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో వైసీపీకి గుడ్ బై చెబుతుండ‌టం వైసీపీ శ్రేణుల్లో ఆందోళ‌నకు కారణమౌతుంటే..  బొత్స షాక్ కు గురౌతున్నారు. విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి  జిల్లాలో  చ‌క్రం తిప్పుతుండ‌టంతో బొత్స అనుచ‌రులుగా వారు పార్టీలో ఇమ‌డ‌లేక పోతున్నారని పరిశీలకులు అంటున్నారు.   సార్వ‌త్రిక ఎన్నిక‌లకు సమయం ముంచుకువస్తున్న తరుణంలో  అనుచరులు  దూరం అవుతుండటం బొత్సకు మింగుడు పడటం లేదు.  మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే జ‌గ‌న్  పాల‌న‌పై ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప‌లుసార్లు స‌ర్వేలు నిర్వ‌హించినా వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌నే  ఫ‌లితాలే వ‌స్తుండ‌టంతో జ‌గ‌న్‌, వైసీపీ ముఖ్య‌నేత‌లు ఓట‌మి నుంచి త‌ప్పించుకొనేందుకు ప‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ‌ర్గాలూ గట్టిగా భావిస్తున్న  నేప‌థ్యంలో వైసీపీలోని ప‌లువురు నేత‌లు తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల్లో చేరుతున్నారు. దీనికి తోడు నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను మార్చుతుండ‌టంతో వైసీపీలో వ‌ర్గ‌విబేధాలు తార స్థాయికి చేరుతున్నాయి. వ‌ర్గ విబేధాల‌కు పుల్ స్టాప్ పెట్టేందుకు వైసీపీ అగ్ర‌నాయ‌క‌త్వం రంగంలోకి దిగినా ఫ‌లితం క‌నిపించ‌డం లేదు. ఒక‌వైపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప‌రిస్థితి ఇలాఉంటే.. విజ‌య‌న‌గ‌రం నియోజ‌క వ‌ర్గంలో నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు మరో లెవెల్ కు   చేరింది.  విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వైసీపీని వీడుతున్న‌వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వీరిలో బొత్స అనుచ‌రులు కూడా ఉండ‌టం ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజ‌య‌న‌గ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి బొత్స వ‌ర్గంగా చెప్పుకునే పిళ్లా విజ‌య్ కుమార్‌, అవ‌నాపు విజ‌య్ తో పాటు ఇత‌ర ద్వితీయ శ్రేణి నాయ‌కులు సుమారు 10వేల మంది కార్య‌క‌ర్త‌ల‌తో స‌హా  తెలుగుదేశం గూటికి వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యారు. విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలో పిళ్లా, అవ‌నాపు కుటుంబాల‌కు భారీ అనుచ‌ర గ‌ణం ఉంది. వీరంతా వైసీపీని వీడితే   ఆ పార్టీకి  జిల్లాలో పెద్ద ఎదురుదెబ్బ ఖాయ‌మ‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీర‌భ‌ద్ర స్వామి ఒంటెద్దు పోక‌డ‌ల‌తో పార్టీలో ఇమ‌డ‌లేక వారు పార్టీని వీడుతున్నారని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. బొత్స అనుచ‌రులే పార్టీలో ఇమ‌డ‌లేని ప‌రిస్థితులు ఉంటే.. ఎలా అన్న చర్చ  జ‌రుగుతోంది. ఓ విధంగా పిళ్లా విజయ్‌కుమార్‌, అవనాపు విజయ్‌ పార్టీని వీడితే సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోలగట్ల కన్నా..  మంత్రి బొత్సకే పెద్ద మైనస్‌ అంటున్నారు పరిశీలకులు. అనుచరులను కాపాడుకోలేకపోయారనే అపప్రదను మంత్రి మూటగట్టుకోవాల్సి వస్తుందని అంటున్నారు. పిళ్లా విజ‌య్ కుమార్‌, అవ‌నాపు విజ‌య్, వారి అనుచ‌రులు తెలుగుదేశంలో చేరితే  పార్టీ మ‌రింత జిల్లాలో మరింత బ‌లోపేతం అవ‌డం ఖాయం. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో తెలుగుదేశం సీనియ‌ర్ నేత అశోక్ గ‌జ‌ప‌తి వ‌ర్గీయులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నార‌ు. గ‌త ఎన్నిక‌ల్లో అశోక్ గ‌జ‌ప‌తి కుమార్తె అదితి గ‌జ‌ప‌తిరాజు విజ‌య‌న‌గ‌రం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఈసారి మ‌ళ్లీ ఆమే బ‌రిలోకి దిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. అదే జ‌రిగితే.. ఇద్ద‌రు బ‌ల‌మైన బీసీ నేత‌లు ఆమెకు అండ‌గా నిల‌వ‌నుండ‌టంతో  తెలుగుదేశం విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుందని అంటున్నారు.

ఏపీలో రేవంత్ ప్రచారం.. జగన్ కు ఇక చుక్కలే!

రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో సైతం సత్తా చాటేందుకు కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.   ఏపీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని.. అది కూడా రాయలసీమలో.. అందునా శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో నిర్వహించాలని నిర్ణయించింది.  ఈ సభ వేదికగా పార్టీ మేనిఫెస్టో విడుదల చేయాలని భావిస్తోంది. అలాగే ఈ సభకు కర్ణాటక సీఎం సిద్దరామయ్యతోపాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా హాజరు కానున్నారు. ఇక తెలంగాణ కేబినెట్‌లోని కీలక మంత్రులు మరీ ముఖ్యంగా ఆంధ్రా సరిహద్దు జిల్లాలకు చెందిన పార్టీలోని కీలక నేతలు సైతం ఈ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు  చేస్తున్నట్లు తెలుస్తోంది.   మరోవైపు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కుమారుడి వివాహ వేడుకల్లో బిజీ బిజీగా ఉన్నారు.. ఆ తర్వాత అంటే పిబ్రవరి చివరి వారంలో.. అంటే ఫిబ్రవరి 25వ తేదీ అదివారం ఈ సభ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు  సమాచారం. ఈ సభకు జన సమీకరణ కోసం హైదరాబాద్‌ మహానగరంతోపాటు ఆంధ్రాలోని విశాఖ, విజయవాడ తదితర నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.  అదీకాక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌లో   మంచి క్రేజ్ ఉందని.. అలాగే ఆయనకు భారీగా ఫాలోవర్స్ కూడా ఉన్నారని... అలాంటి వేళ.. ఆయన హాజరయ్యేలా ఏపీలో ఓ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే.. పార్టీకి ప్లస్ అవుతుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఇక వైయస్ షర్మిల  పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత.. రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయిందని.. అమె ప్రజల మధ్యకు బాణంలా దూసుకు పోతుండడమే కాకుండా.. సొంత సోదరుడు వైయస్ జగన్ పాలనపై విమర్శనాస్త్రాలను సంధిస్తుందని.. దాంతో ప్రజల్లో వైయస్ షర్మిలకు మంచి క్రేజీ ఏర్పడిందని, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కేసీఆర్ పాలనపై ఆయన ఏ విధంగా విమర్శలు సంధించారో.. అదే విధంగా వైయస్ జగన్ పాలనపై వైయస్ షర్మిల వ్యవహార శైలి ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ మద్య వార్ తారస్థాయికి చేరింది. అయితే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. పార్టీని ఆంధ్రాలో విస్తరించి..  గుంటూరులో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి.. ఓ అధ్యక్షుడిని కూడా నియమించారు.  కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీని తెలంగాణ ఓటర్లు ప్రతిపక్షానికి పరిమితం చేయడంతో.. గుంటూరులోని కారు పార్టీ కార్యాలయాన్ని మూసేశారని..  అయితే ఇదే కేసీఆర్ అధికారంలో ఉండగా.. విశాఖ లేదా విజయవాడ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినా,  కార్యరూపం మాత్రం దాల్చ లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పుడు, ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి... అక్కడ పార్టీ ప్రచారానికి వెళ్లి రమ్మని ఇలా ఆదేశిస్తే.. అలా రేవంత్ రెడ్డి శిరసావహిస్తారంటున్నారు.   అదీకాక ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. తనతో పాటు తన పార్టీ ఓటమి కోసం.. ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైయస్ జగన్.. తెర చాటు మంత్రాంగం నెరపారని.. దానికి అంతకు అంత రుణం తీర్చుకునేందుకు.. సీఎం రేవంత్ రెడ్డికి ఇదే తగిన సమయమని పోలిటికల్ సర్కిల్‌లో   ఓ చర్చ అయితే వాడి వేడిగా నడుస్తోంది. ఏదీ ఏమైనా.. ఏపీలో రేవంత్ రెడ్డి అడుగు పెడితే.. మాత్రం అక్కడ రాజకీయ రసవత్తరంగా మారుతోందనే అభిప్రాయం  సర్వత్రా వ్యక్తమవుతోంది.

రాజధాని ఫైల్స్ తప్పక చూడండి.. చంద్రబాబు పిలుపు!

రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతుల ఆవేదనను కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రం రాజధాని ఫైల్స్. ఈ చిత్రం తప్పకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ట్విట్టర్ వేదికగా పిలుపు నిచ్చారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి  ఒక ప్రాంతంపై కక్షగట్టి... అది కూడా రాష్ట్ర రాజధానిపై పగబట్టి సర్వనాశనం చేసిన ప్రాంతం అమరావతి. ఇది ఒక చారిత్రక విషాదం. దీని కోసం కులాల కుంపట్లు రాజేసాడు. విష ప్రచారాలు చేయించాడు.  అధికార బలం మొత్తాన్ని ఉపయోగించి ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేశాడు.  ఈ కుట్రలకు, దారుణాలకు అద్దం పట్టిన చిత్రం 'రాజధాని ఫైల్స్'. జగన్ క్రూరత్వానికి, వైసీపీ విధ్వంసానికి నాశనమైన ఒక రాజధాని...  దాని కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను కళ్ళకు కట్టింది ఈ చిత్రం. అందుకే చిత్రం విడుదలను ఆపడానికి జగన్ శతవిధాలా ప్రయత్నించాడు. కానీ కోర్టు ఆ ఆటలను సాగనివ్వలేదు. సినిమా ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. తెలుగు ప్రజలందరూ థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను చూడండి. వాస్తవాలను తెలుసుకోండి. జగన్ రెడ్డీ!  నీ సినిమా అయిపోయింది.... అసలు సినిమా ఇప్పుడు మొదలవుతుంది  కాస్కో! అంటూ సవాల్ చేశారు.  బాను దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కంఠంనేని రవిశంకర్ నిర్మించిన చిత్రం రాజధాని ఫైల్స్. ఫిబ్రవరి 15వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఈ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లలకు అధికారులు చేరుకొని.. ఈ సినిమాను అర్ధంతరంగా నిలిపివేశారు. ఈ చిత్రం నిలిపివేయడంపై అధికారులను ప్రేక్షకులకు ప్రశ్నించగా.. ఈ చిత్రాన్ని తాత్కాలికంగా ఆపమని న్యాయస్థానం స్టే ఆర్డర్ ఇచ్చిందంటూ.. సమాధానం ఇచ్చారు. అయితే ఫిబ్రవరి 16వ తేదీన ఈ చిత్రం ప్రదర్శించ వచ్చంటూ న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో.. ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఈ చిత్రం ప్రదర్శితమవుతోంది. న్యాయస్థానం తీర్పుపై ప్రజాస్వామిక వాదులు హర్షం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పై విధంగా స్పందించారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ చిత్రం ప్రదర్శితమవుతోన్న థియేటర్లకు అన్ని వర్గాల ప్రజలు పోటెత్తుతున్నారు.

తెలుగుదేశం నేత‌ల‌కు చంద్ర‌బాబు భ‌రోసా.. బెడిసికొట్టిన‌ జ‌గ‌న్ వ్యూహం!

ఎన్నిక‌ల స‌మ‌యంలో నేత‌లు పార్టీలు మార‌డం సాధారణ విషయమే. సుదీర్ఘ‌కాలంగా పార్టీలో కొన‌సాగుతూ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆశించిన స్థాయిలో అధిష్టానం నుంచి ప్రాధాన్య‌త దొక్క‌లేదని భావించే నేత‌లు రాత్రికి రాత్రే పార్టీలు మారుతుంటారు. అయితే, ఏపీలో వైసీపీ నేత‌ల ప‌రిస్థితి వేరు. గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల కాలంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నియంతృత్వ పాల‌న‌తో ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున బ‌రిలోనిలిస్తే ప్ర‌జ‌ల నుంచి ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని భావిస్తున్న కొంద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య‌నేత‌లు ఆపార్టీని వీడి  తెలుగుదేశం వైపు చూస్తున్నారు. ఇప్ప‌టికే అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికార పార్టీని వీడారు. వీరిలో కొంద‌రు టీడీపీలో చేర‌గా.. మ‌రికొంద‌రు సైకిలె్కేందుకు రెడీ అవుతున్నారు.  ఇలా వైసీపీని వీడి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండ‌టంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం మ‌ళ్లీ అధికారంలోకి మ‌న‌మే వ‌స్తామ‌ని పార్టీ నేత‌ల వ‌ద్ద మేక‌పోతు గాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇందుకు ఓ వ్యూహాన్ని కూడా సిద్ధం చేశాన‌ని జ‌గ‌న్ చెబుతున్నార‌ని వైసీపీ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. తాజాగా చంద్ర‌బాబు ఇచ్చిన షాక్ తో జ‌గ‌న్ వ్యూహం బెడిసికొట్టిన‌ట్లు వైసీపీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు.    రానున్న  ఎన్నిక‌ల్లో తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు క‌లిసి పోటీచేస్తున్నాయి. దీంతో  తెలుగుదేశం త‌ర‌పున ఎన్నిక‌ల్లో సీటు ఆశించిన ప‌లువురు నేత‌ల‌కు నిరాశే ఎదురు కానుంది. పొత్తులో భాగంగా జ‌న‌సేన పార్టీకి సీట్ల కేటాయింపు కారణంగా కొన్ని నియోజకవర్గాలలో  తెలుగుదేశం అభ్యర్థులు   ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే అవ‌కాశం లేకుండా పోతుంది. దీంతో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలుగుదేశం నేత‌లు త‌మ ఇబ్బందిని  చంద్ర‌బాబు, లోకేశ్ వ‌ద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు‌. ఇదే అదునుగా భావించిన వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో   అసంతృప్తుల‌ను వైసీపీ వైపుకు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుండ‌టంతో తెలుగుదేశం అసంతృప్త నేత‌లు జ‌గ‌న్ ఆహ్వానాన్ని తిర‌స్క‌రిస్తున్న‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. వైసీపీలోకి వెళ్లి ప్ర‌జ‌ల చేతిలో చావుదెబ్బ‌తినే బ‌దులు తెలుగుదేశంలోనే ఉంటూ పార్టీలో కీల‌క ప‌ద‌వుల‌ను ద‌క్కించుకోవ‌టం మేల‌ని అసంతృప్త నేత‌లు భావిస్తున్నట్లు చెబుతున్నారు‌. అయితే  ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో కొంద‌రు వైసీపీ వైపు వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో వారిని పార్టీ కండువా క‌ప్పి ఆహ్వానించేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మ‌వుతున్న క్ర‌మంలో.. చంద్ర‌బాబు ఇచ్చిన హామీతో తెలుగుదేశంలోని అసంతృప్త నేత‌లంతా ఖుషీ అయ్యారని సమాచారం. తెలుగుదేశం నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈసారి పొత్తులతో ఎన్నికలకు వెళ్తున్నందున టిక్కెట్ రాలేదని ఏ ఒక్కరూ నిరుత్సాహపడొద్దని, పార్టీని నమ్ముకుని ఉన్నవారికి ఖచ్చితంగా గుర్తింపు, ప్రాధాన్యం ఉంటాయ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. జగన్ తో విసిగిపోయిన చాలామంది వైసీపీ నేతలు రాష్ట్రాభివృద్ధి కోసం తెలుగుదేశం లో చేరుతాం అంటున్నారు. మంచి వారై ఉండి, పార్టీకి పనికొస్తారనుకునే వాళ్లని మాత్రమే తీసుకుంటున్నాం. అలాంటి వారి చేరికల్ని ప్రోత్సహించి కలిసి పనిచేయాలని పార్టీ నేత‌ల‌ను చంద్ర‌బాబు కోరారు. రా కదలిరా సభలు ముగియగానే మరో ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుడతాననీ,  మరో 50 రోజులే సమయం ఉన్నందున ప్రతీ ఒక్కరూ సీరియస్ గా పని చేయాల‌ని పార్టీ నేత‌ల‌కు చంద్ర‌బాబు సూచించారు.  ఎన్నిక‌ల్లో టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డ‌ నేత‌ల‌కు రాబోయే కాలంలో మంచి ప‌ద‌వులు ద‌క్కుతాయ‌ని చంద్ర‌బాబు క్లారిటీ ఇవ్వ‌డంతో.. కొద్దికాలంగా తెలుగుదేశంలో అసంతృప్తితో ఉన్న నేత‌లు త‌మ అసంతృప్తిని వీడి సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రిని బ‌రిలో నిలిపినా వారి తెలుగుదేశంలోని అసంతృప్త నేత‌ల‌ను ఎన్నిక‌ల స‌మ‌యం నాటికి ప‌లు ర‌కాలుగా ప్ర‌లోభ‌పెట్టి వైసీపీలోకి తీసుకొచ్చేందుకు జ‌గ‌న్   సిద్ధం చేసుకున్న వ్యూహం బెడిసికొట్టడంతో వైసీపీ శిబిరంలో ఆందోళన వ్యక్తమౌతోంది.  

కమలం గూటికి చేరిన పిఎల్ శ్రీనివాస్ 

లోక్ సభ ఎన్నికలకు ముందు పలువురు నాయకులు పార్టీలు మారుతున్నారు. ఇటీవల బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య పెరిగింది.  శుక్రవారం కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీకి చెందిన ఇతర నేతల సమక్షంలో... పీఎల్ శ్రీనివాస్, ఆయన కూతురు, ప్రముఖ విద్యావేత్త అలేఖ్య ఆ పార్టీ జెండాను కప్పుకున్నారు.  సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి బీజేపీ కండువాలను కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పీఎల్ శ్రీనివాస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలో రాష్ట్ర, జాతీయస్థాయుల్లో వివిధ హోదాల్లో పని చేశారు.   90వ దశకంలో కాన్షీరాం స్థాపించిన బిఎస్పి నుంచి ఆయన సనత్ నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజారిటీలో ఓడిపోయారు.   కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో వివిధ హోదాల్లో పనిచేసిన పీ.ఎల్‌.శ్రీనివాస్‌, ఆయన కుమార్తె, ప్రముఖ విద్యావేత్త పి.ఎల్‌.అలేఖ్య బీజేపీలో చేరారు. సికింద్రాబాద్‌ మహబూబ్‌ కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ కండువాలను కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ రాంచందర్‌రావు, కార్పొరేటర్లు రాకేష్‌ జైస్వాల్‌, కొంతం దీపిక, బీజేపీ మహంకాళి సికింద్రాబాద్‌ జిల్లా అధ్యక్షుడు బి.శ్యామ్‌ సుందర్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, పెద్ది రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబునివాసంలో రాజశ్యామల యాగం 

టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తమ నివాసంలో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. ఇవాళ తొలిరోజున చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజశ్యామల యాగం మూడ్రోజుల పాటు జరగనుంది. ఆదివారం నాడు పూర్ణాహుతితో ముగియనుంది. ఆ క్రతువుకు పలువురు టీడీపీ నేతలు కూడా హాజరైనట్టు తెలుస్తోంది. వేదమంత్రాలతో చంద్రబాబు నివాసంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పురాణాల్లో చేసిన రాజసూయ యాగం-రాజకీయ నాయకులు నిర్వహించే రాజ శ్యామల యాగం రెండూ ఒకటేనా... రెండిటికీ మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి..రాజ్యలక్ష్మి వరించాలని..విజేతగా నిలిచేలా చేయాలని చేసేదే రాజశ్యామలయాగం. ఈ యాగం చేస్తే శత్రువు బలం తగ్గుతుంది, రాజకీయాల్లో విజయ లక్ష్మి వరిస్తుందని విశ్వసిస్తారు.యజ్ఞయాగాదులు దేవుడికోసం అనుకుంటే మీరు పొరబడినట్టే...మహాభారతంలో ధర్మరాజు తో శ్రీ కృష్ణుడు చేయించిన రాజసూయ యాగం, మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు చేస్తున్న రాజ శ్యామల యాగం ఒకటేనా అంటే...ఈ రెండు యాగాలు ఒకటే కాకపోయినా వాటి వెనకున్న ఆంతర్యం, పరమార్థం మాత్రం ఒకటే. ప్రారంభించిన కార్యంలో విజయం అందుకోవాలి, శత్రువులు క్షీణించాలి,  సార్వ భౌమాధికారం సిద్ధించాలి, రాజ్యలక్ష్మి శాశ్వతంగా ఉండాలని చేస్తారు. రాజసూయ యాగం చేయడం చాలా పెద్ద క్రతువు అది నిర్వహించడం అంత సుసాధ్యం కాదు అందుకే అందుకు ప్రతిగా రాజశ్యామల యాగం నిర్వహిస్తారు.   ఇప్పటికే అనేక సార్లు యాగాలు చేసిన  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్..గత ఎన్నికలకు ముందు రాజ శ్యామల యాగం చేసి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజేతగా నిలిచారు. ఎన్నికల విజయం తరువాత సహస్ర చండీ యాగం చేశారు. 

బిఆర్ఎస్ కు పట్నం సునీతా మహేందర్ రెడ్డి రాజీనామా 

కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత బిఆర్ఎస్ నుంచి రాజీనామాలు చేసే వారి సంఖ్య ఎక్కువైంది మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతా మహేందర్ రెడ్డి బిఆర్ఎస్ కు రాజీనామా చేశారు.  వికారాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. . ఈ మేరకు ఆమె పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు లేఖ రాశారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు బీఆర్ఎస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు హృదయభారంతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నానని కేసీఆర్‌కు పంపించిన లేఖలో పేర్కొన్నారు. తన పదవీకాలంలో సహకరించిన పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. కాగా, తన భర్త, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.నిన్న  పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి దంపతులు కలిసి సీఎం రేవంత్ రెడ్డిని  ఇటీవల మర్యాదపూర్వకంగా కలిశారు.  2018 ఎన్నికల్లో మహేందర్ రెడ్డిపై తాండూర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన పైలట్ రోహిత్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. ఆ తర్వాత జిల్లాలో మహేందర్‌రెడ్డి గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వచ్చింది. ఈ క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీలో పట్నం దంపతులు చేరతారని కథనాలు వచ్చినా.. చివరి మూడు నెలల టైంలో మహేందర్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో ఆ నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా.. వికారాబాద్‌జిల్లాలోని 4 నియోజకవర్గాలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. దీంతో పట్నం దంపతులు పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ కు కేటీఆర్ బరువేనా?.. పార్టీ నేతల్లో అంతర్మథనం!

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో కనీసమైన ధిక్కారం కూడా వినిపించేది కాదు. అలా వినిపించడానికి ప్రయత్నించిన ఈటల వంటి వారిని ఏ రీతిలో బయటకు పంపించేశారో అందరికీ తెలిసిందే. ప్రజాబలం ఉన్న నాయకుడైనా సరే పార్టీ అధినేత మససెరిగి ప్రవర్తించాల్సిందే. అలా కాదని తన సొంత అభిప్రాయాన్ని వెలిబుచ్చడానికి ప్రయత్నం చేసినా, కాదు కాదు ప్రయత్నిస్తున్నట్లు కనిపించినా ఇక ఆ నేతకు బీఆర్ఎస్ తో సంబంధానికి నూకలు చెల్లినట్లే. తెలంగాణ ఆవిర్భావం నుంచీ ఏకధాటిగా తొమ్మిదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ లో అంతా ఏకస్వామ్యమే. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమన్నది నేతి బీరకాయలో నేతి చందమే. అయితే తొమ్మిదిన్నరేళ్ల అధికారానికి తెరపడి బీఆర్ఎస్ విపక్షంలోకి రాగానే పార్టీలో సొంత గొంతుకలు లేస్తున్నాయి. అధినేత మాటే వేదం అన్న పరిస్థితిని ఇంకానా ఇక సాగనీయం అని కొందరు నేతలు కుండబద్దలు కొట్టేస్తున్నారు.  బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం పార్టీలో మెజారిటీ ఏమనుకుంటున్నారు అన్న విషయంతో సంబంధం లేకుండా తన తరువాత తనంతటి వాడు కేటీఆర్ మాత్రమే అనే బిల్డప్ ఇచ్చేశారు కేసీఆర్. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ రెండో సారి విజయం సాధించిన వెంటనే పార్టీలో చర్చకు పెట్టడం వంటివి ఏవీ లేకుండానే కేటీఆర్ కు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కట్టబెట్టారు. తన తరువాత సీఎం కేటీఆర్ అంటూ స్పష్టంగా అందరికీ తెలిసేలా చేశారు. ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలు వ్యక్తం అవుతాయా అన్న శంకను కూడా దరి చేరనీయలేదు. కానీ స్వయంగా ఆయనకే హరీష్, ఈటల శక్తి సామర్థ్యాలు తెలుసుకనుక వారిద్దరికీ తన ఆశీస్సులు లేవని పార్టీ నేతలకు, క్యాడర్ కూ చెప్పకనే చెప్పే విధంగా రెండో సారి  గెలిచిన వెంటనే   ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో వారికి చోటు ఇవ్వలేదు. ఇలా వారిని దూరం పెట్టిన కేసీఆర్ ఆ తరువాత అనివార్యంగా కేబినెట్ విస్తరణలో వారికి స్థానం కల్పించారు. సరే హరీష్ కు ఆర్థిక శాఖ, ఈటలకు ఆరోగ్య శాఖ ఇచ్చారు. బంధుత్వం కారణంగానో, మరో కారణమో తెలియదు కానీ, హరీష్ పట్ల ఒకింత సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించిన కేసీఆర్ ఈటలను మాత్రం పొగపెట్టి పంపేశారు.   ఏ నాయకుడికైనా సరే ఆయన సమర్థత, సత్తా బయటపడేది పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే.. అయితే ఈ తొమ్మిదిన్నరేళ్ల కాలంలో కేటీఆర్ కు అటువంటి పరిస్థితి, అవసరం రాలేదు. ఎందుకంటే ఆయన గోల్డెన్ స్పూన్ తో అధికారంలోకి వచ్చారు. పార్టీ అధినేత బిడ్డగా.. సీనియర్ మంత్రులు నేతలు సైతం ఆయనను కాబోయే సీఎం అంటూ బహిరంగ సభలలోనే ఆకాశానికి ఎత్తేశారు.  తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న సమయంలో పార్టీని తన కనుసన్నల్లో నడిపిన కేసీఆర్.. తన కుమారుడు  కేటీఆర్ తనంతటి నేతగా పార్టీ నేతలకు, కేడర్ కు చూపించారు. చివరాఖరకు ఈటలకు జరిగిన మర్యాద చూసిన తరువాత హరీష్ కూడా కేసీఆర్ మనసెరిగి నడుచుకున్నారు. ఎలాంటి  అభ్యంతరాలూ లేకుండా  కేటీఆర్ ఆధిపత్యాన్ని అంగీకరించి ఆయన వెంట నడిచారు. అలా నడిస్తే తప్ప పార్టీలో మనుగడ కష్టమని తలచారు. అయితే ఒక్క ఓటమి పరిస్థితిని తల్లకిందులు చేసేసింది. విపక్షంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని దీటుగా స్పందించే విషయంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుకు కేటీఆర్ తేలిపోతున్నారు. పార్టీని ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయట పడేయడానికి హరీష్ తప్ప మరో దిక్కులేకుండా పోయిందని పార్టీ శ్రేణులు బాహాటంగానే చెబుతున్నాయి. ముఖ్యంగా ఇరిగేష్ వ్యవహారాలలో సభలో మాట్లాడేందుకు అవసరమై సబ్జెక్ కేటీఆర్ వద్ద లేదని పార్టీ శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి. తాజాగా సభలో కాళేశ్వరంపై జరిగిన చర్చలో కేటీఆర్  మౌనమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు.  అసలు పార్టీ ఓటమి తరువాత కేసీఆర్ సభకు వస్తారని ఎవరూ భావించలేదు. అటువంటిది ఆయన స్వయంగా ప్రతిపాదించినా కేటీఆర్ ను బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు నిరాకరించడంతో అనివార్య పరిస్థితుల్లో సభలో విపక్ష నేతగా ఆయనే ముందకు వచ్చారు. అయినా ఆయన విపక్ష నేతగా సభలో కూర్చోవడానికి ఇంకా సిద్ధం కాలేదు. తన కుమారుడు కేటీఆర్ ను ఇబ్బందికర పరిస్థితి నుంచి అంటే హరీష్ నేతృత్వంలో  పని చేసే పరిస్థితి నుంచి తప్పించడానికి ఆయనే బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఉండాల్సిన అనివార్య పరిస్థితి ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఆయన సభకు హాజరు కాలేదనుకోండి అది వేరే సంగతి. కీలకమైన బడ్జెట్ సమావేశాలు, ఇరిగేషన్ పై చర్చ వంటి వాటికి కూడా గైర్హాజరైన కేసీఆర్, తన ఆబ్సెన్స్ లో కేటీఆర్ నిష్క్రియాపరత్వం బాగా ఇబ్బంది పెట్టి ఉంటుందనడంలో సందేహం లేదు.  ఇరిగేషన్ పై చర్చలో హరీష్ క్రీయాశీలంగా వ్యవహరించారు. దీంతో కేటీఆర్ వల్ల పార్టీకి భారమే తప్ప మరో ప్రయోజనం లేదని పార్టీ  వర్గాలే అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నాయి.  కాశేశ్వరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా తన మౌనాన్ని ఎలా సమర్థించుకోవాలో కూడా తెలియని స్థితిలో ఉన్న కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ఆ చర్చలో హరీష్ ఒంటరి పోరు చేశారంటూ అభినందించడాన్ని నెటిజనులు ఓ రేంజ్ లో ఏకి పారేస్తున్నారు. పార్టీలో నంబర్ 2గా ఉండి మీరు చేసిందేమిటంటూ నిలదీస్తున్నారు. సభలో ఉండి మీరు చేసిందేమిటని ప్రశ్నిస్తున్నారు.  పార్టీ అధికారంలో ఉన్నప్పుడు  కేసీఆర్ తర్వాత అంతా తానే అన్నట్లు వ్యవహరించిన కేటీఆర్ విపక్షంలో మాత్రం బేక్ బెంచ్ కు పరిమితమవ్వడమేమిటని కడిగి పారేశారు.  ఈ పరిస్థితుల్లో పార్టీ మొత్తం కేటీఆర్ ను కాదని హరీష్ వెంట ర్యాలీ అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవంటున్నారు. ఈ పరిస్థితి కేటీఆర్ కు ఎలా ఉందన్నది పక్కన పెడితే కేసీఆర్ కు మాత్రం ఇబ్బందికరమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

వైవీకి జగన్ క్లాస్!

తిరుమల తిరుపతి మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చిందులు తొక్కారన్న ప్రచారం పోలిటికల్ సర్కిల్‌లో వాడి వేడిగా జరుగుతోంది. ఏపీకి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ అందుబాటులోకి వచ్చే వరకు హైదరాబాద్ రాజధానిగా కొనసాగించాలని.. ఈ అంశాన్ని త్వరలోనే పెద్దల సభలో ప్రశ్నిస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. జగన్ పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయనే ఓ చర్చ అయితే సదరు సర్కిల్‌లో నడుస్తోంది. అదీ కూడా ఎన్నికల వేళ.. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టినట్లు అయిందనే ఓ అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది.  ఎందుకంటే.. ప్రతిపక్షనేతగాజగన్ అసెంబ్లీలో రాజధాని అమరావతికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కానీ ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత.. అధికార వికేంద్రీకరణ అంటూ ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండాలని.. అందులో భాగంగా శాసన రాజధాని అమరావతి, కార్యనిర్వాహాక రాజధాని విశాఖపట్నం, న్యాయ రాజధాని కర్నూలు అని అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. దీంతో రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన బాట పట్టారు. నవ్యాంధ్రకి ఏకైక రాజధాని..  అమరావతే ఉంచాలంటూ రైతులు నిరసనలు, దీక్షలు చేపట్టారు. అందులోభాగంగా వారు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు, అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్రలు  చేశారు. కానీ ఈ ప్రభుత్వం మనస్సు మాత్రం ఏమాత్రం  కరగలేదు. మరోవైపు జగన్ ప్రభుత్వం గద్దెనెక్కి నేడో రేపో అయిదేళ్లు పూర్తి చేసుకొంటుంది. అయితే ఇప్పటి వరకు విశాఖలో కార్య నిర్వాహాక రాజధాని కానీ.. కర్నూలులో న్యాయ రాజధానికి సంబంధించి ఒక్క ప్రభుత్వ కార్యాలయం కానీ ఏర్పాటు కాలేదు. మరో వైపు అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేశారు.  దీంతో సీఎం జగన్ మాటల ప్రభుత్వమే కానీ... చేతల ప్రభుత్వం కాదనే విషయం అందరికీ అర్ధమైంది. ప్రజలలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇంకోవైపు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇలాంటి వేళ హైదరాబాద్ రాజధానిగా మరికొన్నాళ్లు కొనసాగించాలంటూ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై  తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తుగ్లక్ వ్యవహారానికి ఇంత కంటే నిదర్శనం ఏమి కావాలంటూ నవ్వుతున్నారు. ఎందుకంటే విభజన బిల్లులో పేర్కొన్నట్లు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కేవలం 10 ఏళ్లు మాత్రమే ఉంటుందని... ఆ గడువు మరికొద్ది రోజుల్లో ముగియనుందని... అలాంటి వేళ.. ఇలాంటి సున్నితమైన రాజధాని అంశంపై బాబాయి వైవీ సుబ్బారెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై సీఎం   జగన్ చాలా సీరియస్ అయినట్లు ఓ చర్చ   నడుస్తోంది.  అటు రాజధాని అమరావతి లేదు..  ఇటు మూడు రాజధానులు లేవు... ఇక హైదరాబాద్ రాజధాని అంటే.. మళ్లీ ఎన్నికల వేళ సెంటిమెంట్ అగ్గి రాజేయడమేననీ,  దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య, రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శనాస్త్రాలు మొదలవుతాయని.. ఇప్పటికే హైదరాబాద్ మహానగరం కారణంగానే రాష్ట్ర విభజన జరిగిందని.. అలాంటిది మళ్లీ ఈ అంశంపై మాట్లాడడమంటే.. అగ్గి రాజేయడమేనని.. ఇంకా చెప్పాలంటే  తేనెతుట్టె పై రాయి వేసినట్లేనన్న అభిప్రాయం పోలిటికల్ సర్కిల్‌లో  వ్యక్తమౌతోంది.  వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చేయడం.. ఆ తర్వాత  మంత్రి బోత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి.. వైవీ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చినా.. జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే చర్చ సైతం నడుస్తోంది.  ఇక వైవీ సుబ్బారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో   నెటిజన్లు ఓ రేంజ్ లో విమర్శలు, సెటైర్లు గుప్పిస్తున్నారు.  విభజన బిల్లులో ఉమ్మడి రాజధాని పదేళ్లు అని చెప్పినా.. ఐదేళ్లకే ఏపీకి వెళ్లిపోయి.. అక్కడి నుంచి పాలన సాగిస్తున్నది. అలాగే ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేప, బీజేపీలు వైవీ వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందిస్తున్నాయి.  ఏదీ ఏమైనా.. రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఆ సమయంలో కేంద్రం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ కూడా సరిగ్గా అమలు కాకపోవడంతో.. ఏపీ రాష్ట్రాభివృద్ధితోపాటు ఆర్థికాభివృద్ధి సైతం కుంటుపడింది. ఈ విషయాన్ని గమనించిన ప్రజలు సైతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని పోలిటిల్ సర్కిల్‌లో సైతం ఓ చర్చ అయితే హల్‌చల్ చేస్తోంది.