అభివృద్ధీ, సంక్షేమం రెండూ డొల్లే.. బాబు సవాల్ తో బయటపడ్డ జగన్ నిర్వాకం!
చంద్రబాబు సవాల్ తో వైసీపీ గొప్పల డొల్ల తనం బయటపడిపోయింది. ఏపీ సీఎం జగన్ పాలనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. జగన్ సర్కార్ కు కౌంట్‌డౌన్ ప్రారంభమైందనీ, రెక్కలు విరిగిన ఫ్యాన్ ను స్క్రాప్ లో పడేయడానికి జనం రెడీ అయిపోయారనీ పేర్కొన్నారు. జగన్‌ది విధ్వంసక పాలన అని ఫైర్ అయిన చంద్రబాబు రాష్ట్రంలో అభివృద్ధిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలన్నారు.
బాదుడే బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి, విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్‌ను కూల్చేసిన జగన్ ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం అంటూ అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మరన్న చంద్రబాబు.. బూటకపు ప్రసంగాలు కట్టిపెట్టి దమ్ముంటే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్లేస్, టైం జగన్ నే డిసైడ్ చేసుకోమన్నారు. ఎక్కడికి, ఎప్పుడు ర మ్మంటే అప్పుడు వస్తాననీ, దేనిమీదైనా చర్చకు రెడీ అని చాలెంజ్ చేశారు. ఈ చాలెంజ్ తో జగన్ శిబిరంలో వణుకు మొదలైంది. జరిగిన అభివృద్ధిని చూపలేక, చెప్పలేక, అరకొరగా అందించిన సంక్షేమాన్ని చూపించుకోలేక, మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా చెప్పుకుని ఇప్పుడు అమలు కాని హామీల చిట్టాపై ఏ ముఖం పెట్టుకు మాట్లాడాలో అర్ధం కాక వైసీపీ గంగవెర్రులెత్తిపోతున్నది.
దీంతో చంద్రబాబు సవాల్ ను తిరస్కరించేందుకు కారణాలను వెతుక్కుంటోంది. హామీలు ఎందుకు అమలు చేయలేదన్న విషయంపై లాజిక్ కూడా అందకుండా అడ్డదిడ్డమైన జవాబులు ఇచ్చేయడంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన సజ్జల జగన్ తరఫున రంగం మీదకు వచ్చేశారు. జగన్ వంటి గొప్పనాయకుడికి చంద్రబాబుతో బహిరంగ చర్చకు రావలసిన అవసరం లేదని వాక్రుచ్చారు. అంతేనా ఇచ్చిన హామీలలో 99శాతానికి పైగా అమలు చేశామని చెప్పుకున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అన్ని వాగ్దానాలనూ తుంగలోకి తొక్కారనీ, అయితే జగన్ మాత్రం అలా కాకుండా నెరవేర్చలేని వాగ్దానాలపై వివరణ ఇచ్చుకున్నారనీ భాష్యం చెప్పారు. అంటే ఆయన చెప్పిందెలా ఉందంటే.. వాగ్దానాల అమలు వైఫల్యాలను అంగీకరించడమే అమలు చేయడమన్నట్లుగా ఉంది. జగన్ గత ఎన్నికల సమయంలో సంపూర్ణ మద్య నిషేధం, అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు వంటి ఎన్నో ఎన్నెన్నో వాగ్దానాలు చేశారు. మరి ఇప్పుడు చెబుతున్నట్లు ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చారా అంటే లేదని చెప్పేశాంగా అంటే నెరవేర్చేసినట్లే అని సజ్జల అంటున్నారు. గత నాలుగున్నరేళ్లుగా జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు, ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యాన్నీ, అడ్డగోలు పాలనను ఇలాగే సమర్థించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల వేళ కూడా అదే పని చేస్తున్నారు. మద్య నిషేధం జగన్ కన్న కల అని అది సాకారం అయ్యే అవకాశం లేదనీ చెప్పకనే చెప్పిన సజ్జల ఇప్పుడు వచ్చే పాతికేళ్ల వరకూ మద్యం విక్రయాల ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ సంక్షేమం కోసం నిధులు సమకూర్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. అలాగే జగన్ కు అవగాహన లేకపోవడం వల్లే సీపీఎస్ రద్దు హామీ ఇచ్చారనీ, అవగాహన వచ్చిన తరువాత సిపీఎస్ రద్దు అసంబద్ధమని తేలడంతో రద్దు చేయడం లేదనీ చెబుతున్నారు.
అసలు వాస్తవమేమిటంటే.. జగన్ తొలి కేబినెట్ సమావేశంలోనే మేనిఫెస్టోలో పొందు పరిచిన హామీలలో ఎనభై శాతానికి పైగా అమలు చేసేశామని ప్రకటించేసుకున్నారు. అంటే అప్పటి నుంచే హామీల అమలు కంటే అమలు చేసేశామన్న ప్రచారానికే పెద్ద పీట వేశారు. నిజానికి జగన్ ఇచ్చిన హామీలలో అమలు చేసినవి పది శాతం కూడా ఉండవు. కానీ గోబెల్స్ ప్రచారంతో జనాలను నమ్మించాలనీ, నమ్మించేయగలమన్న అతి విశ్వాసంతో తాము చెప్పిందే వేదమన్నట్లుగా ఇంత కాలం వ్యవహరిస్తూ వచ్చారు.
అయితే, ప్రతిపక్ష పార్టీలు, అసంతృప్త ప్రజలు జగన్ ప్రభుత్వం అమలు చేసింది కేవలం పది శాతం మాత్రమేనని గణాంకాలతో సహా చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడం ఒక్కటే లక్ష్యంగా పాదయాత్రలో ఆగిన ప్రతిచోటా ఒక హామీ అన్నట్లుగా జగన్ ఎడా పెడా హామీలిచ్చేశారు. అలా తన పాదయాత్ర నుండి ఎన్నికల సమయంలో సభల వరకూ మొత్తం జగన్ 650కి పైగా హామీలు ఇచ్చారని ప్రతిపక్షాలు లెక్క తేల్చారు. అయితే వాటిలో కేవలం పది శాతం మాత్రమే అమలయ్యాయని ఆధారాలతో సహా చెబుతున్నారు. అక్కడితో ఆగకుండా జగన్ తన నోటి నుండి చెప్పి మరచిన వాటిని ఆధారాలతో సహా బయట పెడుతూ ఇది హామీ కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే వైసీపీ చెప్పుకుంటున్న అమలు చేసిన 99 శాతం హామీలు ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేస్తున్నారు.
జగన్ గత ఎన్నికల సమయంలో చెప్పిన వాటిలో ప్రధానమైనవి సీపీఎస్ రద్దు, మద్యనిషేధం, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, 45 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ వంటివి అమలయ్యాయా అని నిలదీస్తున్నారు. అలా జగన్ అమలు చేయని హామీల జాబితా కొండవీటి చాంతాడంత ఉందని సోదాహరణంగా వివరిస్తున్నారు. రాష్ట్రంలో మద్యం అంటే స్టార్ హోటళ్లలో దొరికే వస్తువుగా పరిమితం చేస్తానని, ఆ తర్వాతనే ఓట్లు అడుగుతామని ఘనంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ ఊసే లేకపోగా మద్యం ఆదాయాన్ని కూడా వచ్చే పాతికేళ్ల పాటు తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు. ఇక మెగా డీఎస్సీ, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ సంగతి ప్రస్తావించడమే దండుగ. రాష్ట్రంలో ఉద్యోగమంటే వాలంటీర్, సచివాలయాలనే చూపిస్తున్నారు.
మరో కీలకమైన హామీ సీపీఎస్ రద్దు. దీని గురించి వెళ్లిన ప్రతి చోటా చెప్పిన జగన్.. ఇప్పుడు డొంక తిరుగుడు సమాధానాలు చెపున్నారు. సీపీఎస్ రద్దు చేస్తే అప్పులు దొరకవని ఈ హామీని అటకెక్కించారు. 45 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి రూ.3 వేలు పెన్షన్ అన్నారు. కానీ, రియాలిటీలో 63 దాటిన వాళ్ళకే సవాలక్ష కొర్రీలు పెట్టి అదీ ఇంట్లో ఒకరికే ఇస్తున్నారు. అదీ ఇప్పటికీ చెప్పిన రూ.3 వేలు కాలేదు. ఇలా, జగన్ మ్యానిఫెస్టోలో పెట్టి, బహిరంగ సభలలో ఇచ్చిన హామీలే వందలలో ఉండగా.. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి, ఏ జిల్లాకి ఆ జిల్లాలో జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఇంకా వేలల్లో , లక్షల్లో ఉన్నాయి. వీటితో పాటు గత ప్రభుత్వాలు తెచ్చిన ఫీజ్ రీఎంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, పావలా వడ్డీ రుణాలు, వ్యవసాయ ప్రోత్సాహకాలు లాంటి ఉపయోగకరమైన పథకాలకు నిధులు లేకుండా చేసి వాటిని నీరుగార్చేశారు. మరి ఇవన్నీ ప్రజలు మర్చిపోయి వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారులే అనుకున్నారో ఏమో కానీ వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా అబద్దాల ప్రచారాన్ని చేసేసుకున్నారు. చేసుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు సవాల్ చేసే సరికి బిక్కచచ్చిపోయి లాజిక్ కు అందని వాదనతో బహిరంగ చర్చకు నిరాకరిస్తూ ముఖం చాటేస్తున్నారు.