దటీజ్ రేవంత్..!
posted on Feb 17, 2024 @ 1:13PM
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి స్వపక్షం, విపక్షం అన్న తేడా లేకుండా అందరినీ మెస్మరైజ్ చేస్తున్నారని చెప్పడానికి ఎటువంటి సందేహం అవసరం లేదనిపించేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా అసెంబ్లీ వేదికగా ఆయన మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అలా ఇలా కాకుండా కేసీఆర్ రాజకీయ అనుభవం, మంత్రిగా, కేంద్ర మంత్రిగా, పార్లమెంటేరియన్ గా, తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు సీఎంగా ఆయన చేసిన సేవలను ప్రస్తుతిస్తూ అత్యంత ఆత్మీయంగా సభ వేదిగా ఆయన కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తీరు విపక్ష బీఆర్ఎస్ నేతల నుంచి కూడా బల్లలు చరిచి హర్షద్వానాలు చేయించింది.
కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా తనదైన పాత్ర పోషించిన కేసీఆర్ 70వ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున జన్మదిన ముఖ్యమంత్రి బర్త్ డే విషెస్ తెలిపారు. భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని.. తెలంగాణ పున:నిర్మాణంలో వారిని భాగస్వామ్యం చేయాలని ఆకాంక్షించారు. ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభను సజావుగా నడిపేలా, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి నడిపించేలా ఆయనకు పూర్తి స్థాయిలో దేవుడు శక్తి, సామర్థ్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.