గృహజ్యోతి లబ్దిదారులకు ఆధార్ కంపల్సరీ
posted on Feb 17, 2024 @ 9:32AM
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఒక్కో గ్యారంటీ పథకం అమలు చేస్తుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసింది. లోకసభ ఎన్నికల నేపథ్యంలో మరిన్ని గ్యారెంటీలను అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు యోచిస్తోంది. ఇందులో భాగంగా గృహజ్యోతి పథకం అమలు చేసే దిశగా అడుగులు వేసింది. ఈ మేరకు సాధ్యా అసాధ్యలను బేరీజు వేసుకుంటుంది. ఉచిత విద్యుత్ పథకం ‘గృహజ్యోతి’ లబ్ధిదారులకు తప్పనిసరిగా ఆధార్ ధ్రువీకరణ చేయించుకోవాలని తెలంగాణ ఇంధన శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బయోమెట్రిక్ విధానంలో ఈ ధ్రువీకరణ పూర్తి చేస్తేనే గృహజ్యోతి పథకంలో పేర్లు నమోదవుతాయని పేర్కొంది.
ఆధార్ ధ్రువీకరణ ప్రక్రియను డిస్కంలు చేపట్టాలని ఇంధన శాఖ తన ప్రకటనలో ఆదేశించింది. లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు ఇంటి కరెంట్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వారి ఆధార్‌ను సిబ్బందికి అందజేయాలి. ఎవరికైనా ఆధార్ లేకపోతే తక్షణం దరఖాస్తు చేసుకుని, ఆ రుజువు చూపాలి. ఆధార్ జారీ అయ్యేవరకూ ఇతర గుర్తింపు కార్డులు వినియోగించవచ్చు. బ్యాంకు లేదా పోస్టాఫీసు పాస్‌బుక్‌లో ఖాతాదారుడి ఫొటోతో ఉన్న జిరాక్స్, పాన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఉపాధి హామీ పథకం గుర్తింపు కార్డు, కిసాన్ పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఎవరైనా గెజిటెడ్ అధికారి లేదా తహసీల్దార్ ఇచ్చిన ధ్రువీకరణ పత్రం వంటి వాటిల్లో ఏదో ఒకటి విద్యుత్ సిబ్బందికి చూపించి పేర్లు నమోదు చేసుకోవాలి.
బయోమెట్రిక్ ధ్రువీకరణలో భాగంగా వేలిముద్ర లేదా కనురెప్పలను స్కాన్ చేయాలని ఇంధనశాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. డిస్కంలే ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించింది. పరికరాలు పనిచేయకపోతే ఆధార్ నంబర్‌ను నమోదు చేయగానే దాని యజమాని సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలి. ఇది కూడా సాధ్యం కాకపోతే, ఆధార్ కార్డుపై ఉండే క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేసి వివరాలు తెలుసుకోవాలని ఇంధన శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
ఈ పథకం అమలు కోసం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వుల్లోని నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిస్కంలను ఇంధన శాఖ ఆదేశించింది. దీంతో, లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి పూర్తి స్థాయి మార్గదర్శకాలు తరువాత వెలువడతాయని భావిస్తున్నారు.