కారు..కమలం కలిసికట్టుగా.. కాంగ్రెస్ పై పోరుకు రెడీ!?
posted on Feb 17, 2024 9:27AM
తెలంగాణలో రెండు పార్టీలో లోక్ సభ ఎన్నికలలో విజయం కోసం తెగ కష్టపడిపోతున్నాయి. ఎలాగైనా రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలలో అత్యధిక స్థానాలలో విజయం సాధించి, రాష్ట్రంలో ఉనికి చాటుకోవాలని తెగ తాపత్రేయపడిపోతున్నాయి. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి, ఆ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నిండా మూడు నెలల కూడా కాలేదు. అసెంబ్లీ ఎన్నికల విజయంతో కాంగ్రెస్ జోష్ మీద ఉంది. అదే సమయంలో ఆ ఎన్నికలలో ఎదురైన ఫలితంతో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ మాత్రమే కాదు, గత అసెంబ్లీ ఎన్నికలలో విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఇక అధికారమే తరువాయి అన్నంతగా బిల్డప్ ఇచ్చిన బీజేపీలో కూడా నిరాశా, నిస్ఫృహలే కనిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికలలో కూడా నామమాత్రపు స్థానాలలో విజయం సాధిస్తే.. ఆ రెండు పార్టీలకూ కూడా తెలంగాణలో సమీప భవిష్యత్ లో తేరుకునే అవకాశాలు ఉండవు. అందుకే ఎలాగైనా సరే సర్వశక్తులూ కూడగట్టుకుని గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నాయి.
అదే సమయంలో కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రం నుంచి అత్యధిక లోక్ సభ స్థానాలలో గెలిచే అవకాశం లేకుండా చేయడానికి లోపాయికారీ ఒప్పందాలకే కాదు, అవసరమైతే పోత్తు పెట్టుకుని రంగంలోకి దిగడానికి కూడా వెనుకాడటం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్, బీజేపీ పొత్తుపై రాజకీయ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ దానిని ఖండించడానికి కూడా ప్రయత్నించకపోవడమే ఇందుకు తార్కాణంగా చెబుతున్నారు.
అయితే బీజీపీ జాతీయ ప్రధాన కార్దర్శి, ఆ పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడూ మాత్రం స్పందించారు. ఆయన స్పందన కూడా బీఆర్ఎస్ తో పొత్త ఉంటుందన్న సంకేతాలు ఇచ్చే విధంగానే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయన స్పందనను బట్టి చూస్తే బీజేపీలో ఇంకా నాయకత్వ సమస్య పరిష్కారం కాలేదని అవగతమౌతోందనీ అంటున్నారు. కేసీఆర్ కేటీఆర్ లను వదిలి వచ్చే వారికి బీజేపీ తలుపులు బార్లా తీస్తుందంటూ ఆయన చేసిన ప్రకటక బీఆర్ఎస్ తో పొత్తుకు అనుకూలమే కానీ, ఆ పార్టీ నాయకత్వాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకించి బయటకు రావాలని చెబుతున్నట్లుగా ఉంది. ఇక మాజీ మంత్రి హరీష్ రావుకు బీజేపీ తలుపులు బార్లా తెరిచే ఉంటాయని బండి సంజయ్ చెప్పడం అంటే బీఆర్ఎస్ లో చీలకను ప్రోత్సహించేందుకు బీజేపీ వెనుకాడదని అవగతమౌతోంది. ఏదో మాట వరసకు అన్నట్లుగా బీఆర్ఎస్ ను ఎన్డీయేలో చేర్చుకునే ప్రశక్తే లేదనీ, ఆ విషయాన్ి స్వయంగా ప్రధాని మోడీ చెప్పారనీ బండి సంజయ్ అన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు మోడీ ఎన్డీయేలో బీఆర్ఎస్ ను చేర్చుకునే ప్రశక్తే లేదని చెప్పారు. ఆ సందర్భానికి ఆయన ఆ మాట చెప్పి ఉండొచ్చు. కానీ సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ టార్గెట్ వేరు. ఆ పార్టీ లక్ష్యం కాంగ్రెస్. అందుకు తెలంగాణలో అధకారంలో ఉన్న కాంగ్రెస్ కు రాష్ట్రంలో లోక్ సభ స్థానాలలో విజయాన్ని అత్యల్ప స్థాయికి పరిమితం చేయడానికే తొలి ప్రాధాన్యత. ఇక కేసీఆర్ కు కూడా తన పార్టీ ఉనికికి థ్రెట్ బీజేపీ నుంచీ కాదనీ, కాంగ్రెస్ నుంచే అనీ స్పష్టంగా తెలుసు.
అందుకే ఆయన కూడా తెలంగాణలో కాంగ్రెస్ సాధించే లోక్ సభ స్థానాల సంఖ్యను కనీస స్థాయికి పరిమితం చేయాలన్న లక్ష్యంతోనే అడుగులు వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనుభవంతో ఇరు పార్టీలూ కూడా రాష్ట్రంలో త్రిముఖ పోరుకు పెద్దగా సుముఖంగా లేరు. ఉమ్మడిగా ముందుకు వెడితే కాంగ్రెస్ ను దెబ్బతీయవచ్చన్న ఉద్దేశంతోనే ఇరు పార్టీలు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కలిసి పోటీ చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి, వ్యూహాలు రచిస్తున్నాయి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నేరుగా పొత్త మాట ఎత్తక పోయినా.. ఫ్రెండ్లీ పోటీ అన్న వ్యూహంతో ముందుకు సాగే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని చెబుతున్నారు.