జగన్ నివాసాన్ని ముట్టడించిన ఎబివిపి కార్యకర్తలు 

రాష్ట్రంలో మెగా డీఎస్సీ ప్రకటించాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు నేడు తాడేపల్లిలో సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించారు. మినీ డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ కావాలి అనే నినాదంతో వారు 'ఛలో తాడేపల్లి' పేరిట ఆందోళనకు దిగారు. నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని వారు మండిపడ్డారు. సీఎం నివాసం ముట్టడి సందర్భంగా విద్యార్థి నేతలు ఒక్కసారిగా దూసుకువచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారిని అక్కడ్నించి మంగళగిరి పీఎస్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పలువురు విద్యార్థి నేతలు పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నారు. దొరికిన వాళ్లను ఓ వాహనంలోకి ఎక్కించి అక్కడ్నించి తరలించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ ముట్టడిలో దాదాపు 100 మందికి పైగా విద్యార్థి నేతలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు విద్యార్థి నేతలకు గాయాలైనట్టు సమాచారం.ఉపాధ్యాయుల పోస్టుల గురించి మాట్లాడని సీఎం ఎవరైనా ఉన్నారంటే ఆ ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని డీఎస్సీ విద్యార్థులు మండిపడ్డారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో వందల మంది డీఎస్సీ అభ్యర్థులు ఈరోజు రోడ్డెక్కారు. 23వేల పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేయాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రిగా ప్రజలను పాలించడానికి వచ్చారా లేకపోతే ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటానికి వచ్చారా అని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  డీఎస్సీ అభ్యర్థులకు ఇచ్చిన మాట నెరవేర్చుకుని 23వేల పోస్టులతో మెగా డీఎస్సీని తక్షణమే విడుదల చేయాలని విద్యార్థులు ఈ ఆందోళన చేపట్టారు. నాలుగేళ్లలో డీఎస్సీ విడుదల చేయకపోవటం సిగ్గుచేటు, ఆవిరైపోతున్న ఉపాధ్యాయ నిరుద్యోగ ఆశలు, సున్నాలలో నోటిఫికేషన్ వద్దు మెగా డీఎస్సీ ముద్దు అంటూ విద్యార్థులు ఫ్లకార్డులతో నిరసనలు తెలిపారు. చంద్రబాబు నాయుడు హయాంలో రెండుసార్లు నోటిఫికేషన్ ఇస్తే జగన్ ఒక్కసారి కూడా విడుదల చేయకపోవటం సిగ్గు చేటు అని విద్యార్థులు ఎద్దేవా చేశారు. "నాలుగున్నర సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం మెుండి వైఖరి ప్రదర్శిస్తున్నారు. హక్కుల కోసం పోరాడుతుంటే అరెస్టులకు పాల్పడుతుంది. తక్షణమే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయాలి లేకపోతే నిరుద్యోగుల సత్తా ఎమిటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తాం" అని విద్యార్థులు హెచ్చరించారు. గత నాలుగు సంవత్సరాలుగా మెగా, జంబో, మినీ డీఎస్సీ అంటూన్నారు కాని ఇప్పటివరకూ ఒక్క పోస్టు కూడా విడుదల చేయకుండా జాప్యం చేశారని విద్యార్థులు విరుచుకుపడ్డారు. ప్రభుత్వం వారం రోజులు లోపు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని లేకపోతే పక్క రాష్ట్రంలో కేసీఆర్​కు పట్టిన పరిస్థితే జగన్​కు పడుతుందని ఉద్యోగులు హెచ్చరించారు. ఏపీని నిరుద్యోగి రాష్ట్రంగా మారుస్తామన్న మీ హామీ ఏమైందని, నాలుగున్నర సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం మెుండి వైఖరి ప్రదర్శిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు హక్కుల కోసం పోరాడుతుంటే ప్రభుత్వం అరెస్టులకు పాల్పడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మెగా డీఎస్సీ ప్రకటించకుంటే వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం: నిరుద్యోగులు వైసీపీ ప్రభుత్వం వారం రోజుల్లో మెగా డీఎస్సీ ప్రకటించకపోతే తాడేపల్లి ప్యాలెస్ ముట్టడిస్తామని విద్యార్థులు రోడ్డుపై బైటాయింపు ఆందోళన చేశారు.వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగుల సత్తా ఏంటో జగన్మోహనరెడ్డికి చూపిస్తామని హెచ్చరించారు. వీరిని అరెిస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించటంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఎస్సీ అభ్యర్థుల నిరసన కార్యక్రమానికి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్ మద్దతు తెలిపారు. విద్యార్ధులు చదువుకోవడం వలన నిరుద్యోగ శాతం పెరుగుతుందని విద్యాశాఖ మంత్రి అనడం దారుణం విద్యార్థులు మండిపడ్డారు.

జయప్రదకు అరెస్ట్ వారెంట్ 

చట్టానికి కళ్లు లేవు . న్యాయదేవత పట్టుకున్న త్రాసు ఎటువైపు తూగుతుందో అక్కడే న్యాయం ఉంటుంది. అంటే బరువు వైపు తూగడం వల్లే న్యాయం జరుగుతుంది. సాక్ష్యం బలంగా ఉండటం వల్లే ఇవ్వాళ అలనాటి జయప్రద న్యాయస్థానం ముందు దోషిగా నిలబెట్టింది. ఆమెకు ఉన్న స్టార్ డమ్ , పొలిటికల్ ఇన్ ఫ్లూయెన్స్ అక్కరకు రాకుంబా పోయింది. చట్టం తన పని తాను చేసుకుపోయింది.   సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదను సమస్యలు చుట్టుముట్టాయి. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా యూపీలోని రాంపూర్ నుంచి జయప్రద పోటీ చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆ సమయంలో ఆమెపై అక్కడ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరిగింది. అయితే కోర్టుకు హాజరు కావాలంటూ ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో, గతంలో ఒకసారి ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా.. పోలీసులు ఆమెను అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఈ క్రమంలోనే ఆమెను వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని రాంపూర్ ఎస్పీని కోర్టు ఆదేశించింది. తదిపరి విచారణను ఫిబ్రవరి 27కి వాయిదా వేసింది. సినీ నటి.. మాజీ హీరోయిన్ జయప్రద చిక్కుల్లో పడ్డారు. పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉన్నటైమ్ లో ఆమెపై పెట్టిన కేసుకు సబంధించి ప్రస్తుతం జయప్రదకు చిక్కులు తప్పేట్లు లేవు. జయప్రదకు ఎన్ని సార్లు నోటీస్లు ఇచ్చినా.. స్పందించకపోవడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తోంది.  ప్రముఖ నటి జయప్రదకు ఈఎస్‌ఐకి సంబంధించిన కేసులో జైలు శిక్ష పడిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా జయప్రదకు మరోసారి షాక్‌ తగిలిందనే చెప్పాలి. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో నిబంధనలను ఉల్లంఘించారని జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమెకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్ జారీ అయింది. జయప్రదను వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చాలంటూ రాంపుర్‌ ఎస్పీకి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రాంపుర్ నుంచి జయప్రద   పోటీ చేశారు. ఈ సమయంలోనే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి.. వీటికి సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో కొనసాగుతోంది. ఈ క్రమంలో జయప్రదకు ఎన్ని సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు.  దీంతో ఆమెకు నాన్​ బెయిలబుల్​ వారెంట్​ జారీ చేసింది కోర్టు. గతంలో కూడా ఒకసారి నాన్​ బెయిలబుల్​ వారెంట్ జారీ చేసి జయప్రదను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా, పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో వెంటనే అరెస్ట్‌ చేయాలని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణ ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.  

జగన్ పై బ్రదర్ అనీల్ పాశుపతాస్త్రం!

గత ఎన్నికలలో అంటే 2019 ఎన్నికలలో జగన్ విజయానికి దోహదపడిన అంశాలన్నీ ఇప్పుడు రివర్స్ గేర్ లో ఆయన ఓటమికి కారణమౌతున్న అస్త్రాలుగా మారుతున్నాయి. గత ఎన్నికలలో జగన్ విజయానికి దోహదపడిన వాటిలో ప్రధానంగా ఆయన సోదరి, వైఎస్ షర్మిల పాదయాత్ర, ప్రచారం అలాగే విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి దాడి, ఆ తరువాత సరిగ్గా ఎన్నికల ముందు జరిగిన సొంత బాబాయ్ వివేకా హత్య వంటి అంశాలు ఇప్పుడు జమరోసారి విజయం సాధించి అధికారం చేపట్టాలన్న గన్ కు  ఆశకు ప్రధాన ప్రతిబంధకాలుగా మారాయని చెప్పవచ్చు.  ఔను నాడు తన అన్న అధికారం చేపట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం కోసం కాళ్లరిగేలా తిరిగి, గొంతు చినిగేలా ప్రచారం చేసిన వైఎస్ షర్మిల ఇప్పుడు అదే అన్న ఓటమి కోసం కంకణం కట్టుకుని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టి రాష్ట్రం చుట్టేస్తున్నారు. నాడు విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి దాడి జగన్ పై జనం సానుభూతి పెరిగేలా చేయడానికి ఎంతగానో దోహదపడింది. ఇప్పుడు అదే కోడికత్తి కేసు జగన్ నాడు సానుభూతి కోసం ఆడిన డ్రామాగా ప్రజల ముందు ఆవిష్కృతమై, ఆ కేసులో నిందితుడు కోడికత్తి శ్రీను (జనుపల్లి శ్రీను) బలిపశువుగా మారారన్న భావన జనబాహుల్యంలో వ్యక్తం అవుతోంది. అలాగే వైఎస్ వివేకా హత్య ఘటన కూడా జగన్ కు సానుభూతి వెల్లువెత్తి నాటి ఎన్నికలలో విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే ఇప్పడు ఆ కేసులో జగన్ నిందితుల పక్షాన నిలవడం, స్వయంగా సోదరి షర్మిల, వివేకా కుమార్తె డాక్టర్ సునీత కూడా వివేకా హత్యకు రాజకీయ కారణాలున్నాయనీ, కడప ఎంపీ సీటు విషయంలో వివేకా ప్రదర్శించిన పట్టుదల కారణంగానే హత్య జరిగిందని చెప్పడంతో ఇప్పుడు వివేకా హత్య కేసు జగన్ కు యాంటీ సెంటిమెంట్ గా మారింది. నిందితుల పక్షాన నిలబడిన జగన్ పై ప్రజలలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా నాడు జగన్ విజయానికి దోహదపడిన అంశాలన్నీ నేడు రివర్స్ అయ్యాయి. ఆ ఆంశాలే జగన్ ను ఆయన పార్టీని గద్దె దించేందుకు వస్తున్న ఆస్త్రాలుగా మారాయి. ఇవే కాకుండా నాడు అంటే 2019 ఎన్నికలలో జగన్ పార్టీ విజయానికి మరో అంశం కూడా ఎంతగానో దోహదపడింది. అదే షర్మిల భర్త బ్రదర్ అనీల్ కుమార్ క్రైస్తవ సంఘాలతో వరుస భేటీలు జరిపి వారిని జగన్ కు అనుకూలంగా మార్చడం. ఇప్పుడు 2024 ఎన్నికల సమయం వచ్చే సరికి అదే బ్రదర్ అనీల్ కుమార్ జగన్ కు వ్యతిరేకంగా క్రస్తవ సంఘాలతో భేటీలు నిర్వహిస్తూ వాటిని జగన్ కు వ్యతిరేకంగా ఏకం చేస్తున్నారు.  మామూలుగానే రాజకీయాలలో కులం కార్డు విజయానికి దోహదపడే అంశంగా అంతా పరిగణిస్తారు. ఇక మతం కార్డైతే తిరుగేలేని అస్త్రంగా భావిస్తారు. గత ఎన్నికలలో మతం అస్త్రాన్ని అప్పటి విపక్ష నేతకు అండగా, అప్పటి అధికార పార్టీ తెలుగుదేశంకు వ్యతిరేకంగా సంధించిన బ్రదర్ అనిల్ కుమార్ ఇప్పుడు అదే అస్త్రాన్ని జగన్ కు వ్యతిరేకంగా సంధిస్తున్నారు.  ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన తన సతీమణి వైస్ షర్మిలకు మద్దతుగా బ్రదర్ అనీల్ కుమార్ రంగంలోకి దిగారు.  నాడు జగన్ విజయం కోసం ఆయన ఏ విధంగా పని చేశారో, అదే విధంగా ఇప్పుడు జగన్ ఓటమి కోసం పని చేస్తున్నారు.   బ్రదర్ అనీల్ కుమార్ కు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవసమాజంలో ఒక ఇమేజ్ ఉంది.  ఆ ఇమేజ్ ను గత ఎన్నికలలో  బావమరిది జగన్ ని సీఎం చేయాలన్న లక్ష్య సాధన కోసం ఉపయోగించిన బ్రదర్ అనీల్ కుమారు ఇప్పుడు జగన్ ఓటమి కోసం ఉపయోగిస్తున్నారు.  నాడు అనిల్ ప్రభావంతో రాష్ట్రంలోని క్రేస్తవ సమాజం మొత్తం జగన్ కు మద్దతుగా నిలిచింది. రానున్న ఎన్నికల్లో అదే అనీల్ ప్రమాభంతో రాష్ట్రంలోని క్రైస్తవ సమాజం జగన్ వ్యతిరేకంగా ఏకతాటిపైకి వస్తోంది. జగన్ పైకి మతం అనే పాశుపతాస్త్రాన్ని బ్రదర్ అనీల్ కుమార్ విశాఖ నుంచి సంధించారని చెప్పవచ్చు. ఆయన మంగళవారం విశాఖలో మత పెద్దలతో భేటీతో రాష్ట్రంలోని క్రైస్తవ మతస్థులను జగన్ కు వ్యతిరేకంగా ఏకతాటికి తీసుకు వచ్చే ప్రయత్నానికి ప్రారంభంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మాగుంట శ్రీనివాసులురెడ్డి అడుగులు టిడిపి వైపు ..

ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ పార్లమెంటు సభ్యుులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పక్క చూపులు చూస్తున్నారా? అంటే ఔననే వినిపిస్తుంది. వైసీసీలో టికెట్‌ లేదన్న సంకేతాలు వస్తుండటంతో తెలుగుదేశం పార్టీతో మాగుంట టచ్‌లో ఉన్నారట. అసలు సిట్టింగ్ ఎంపీ మాగుంటకు వైసీపీ టికెట్ ఎందుకు నిరాకరించినట్టు.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీ వైపు చూస్తున్నారా.. అంటే. వైసీపీలో టికెట్‌ రాకుంటే ఏం చేస్తాం.. మాదారి మేం చూసుకుంటాం.. అంటున్నారట మాగుంట అభిమానులు. దీంతో ఒంగోలులో వైసీపీ నుంచి పార్లమెంట్‌కు, అసెంబ్లీకి కలిసి పోటీ చేయాలని భావిస్తున్న మాగుంట – బాలినేని కాంబినేషన్‌కు ఈ ఎన్నికలు మరోసారి బ్రేక్‌ పడనున్నట్టు కనిపిస్తోంది. వైసీపీ టికెట్‌ కోసం ఆఖ రివరకు ఎదురు చూడాలని మాగుంటకు బాలినేని సూచించడంతో అందుకు అనుగుణంగానే హైదరాబాద్‌లో ఉన్న బాలినేనితో రెండు రోజుల పాటు మంతనాలు చేసిన మాగుంట చివరకు వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి సూచనలు రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ టచ్‌లోకి వెళ్ళిపోయారని భావిస్తున్నారు. టీడీపీ నుంచి సానుకూల సంకేతాలు ఉన్నాయని, ఒంగోలు లేదా నెల్లూరు నుంచి పోటీ చేసేందుకు సిద్దంగా ఉండాలని టీడీపీ అధిష్టానం నుంచి ఇప్పటికే మాగుంట శిబిరానికి సూచనలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల బరిలో మాగుంట కుటుంబం నుంచి ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీ చేయించాలని భావిస్తున్నారట. టీడీపీ అధిష్టానం కూడా మాగుంట కుటుంబానికి సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది అందుకు ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన రా కదలిరా.. ఎన్నికల శంఖారావ సభలో పరోక్షంగా మాగుంటను అభినందిస్తూ చంద్రబాబు చేసిన ప్రసంగమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు తెలుగు తమ్ముళ్ళు.

రేవంత్ రెడ్డితో భేటీ అయిన  డిప్యూటి మేయర్ శ్రీలత 

ఆరునెలల్లో మళ్లీ కెసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పిన నేతలే ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. బిఆర్ఎస్ హాయంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కెటిఆర్ కు నమ్మినబంటు. అతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కల్సిన మరుసటి రోజే డిప్యూటి మేయర్ శ్రీలత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కల్సుకున్నారు. మరో రెండు రోజుల్లో ఆమె తన భర్త శోభన్ రెడ్డితో కల్సి  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.  తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కాంగ్రెస్ సొంతమయ్యాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా విజయాలు దక్కాయి. అయితే హైదరాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ పూర్తి ఆధిక్యతను కనపరిచింది. దీంతో, కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు పూర్తి స్థాయిలో హైదరాబాద్ పై ఫోకస్ చేసింది.  జీహెచ్ఎంసీ కార్పొరేటర్లను కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఇప్పటికే హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి, కాంగ్రెస్ లో చేరారు. తాజాగా ప్రస్తుత డిప్యూటీ మేయర్ శ్రీలత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తన భర్త శోభన్ రెడ్డితో కలిసి ఆమె సీఎంతో భేటీ అయ్యారు. రెండు రోజుల్లో శ్రీలత దంపతులు కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఈ సందర్భంగా వీరితో పాటు ఫసీయుద్దీన్ కూడా ఉన్నారు. కొంత కాలంగా బీఆర్ఎస్ హైకమాండ్ పై శ్రీలత దంపతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శోభన్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ దంపతులు మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్, కేటీఆర్ తమను అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నుమాయిష్ గడువు పొడగింపు

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న నుమాయిష్ ప్రదర్శనను మరో మూడు రోజులు కొనసాగించనున్నారు. సందర్శకుల డిమాండ్, ట్రేడర్ల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ (ఏఐఐఈఎస్) ప్రకటించింది. దీంతో ఈ నెల 15తో ముగియనున్న నుమాయిష్ మరో మూడు రోజులు.. అంటే ఈ 18 వరకు కొనసాగనుంది. ఏఐఐఈఎస్ నిర్ణయంపై నుమాయిష్ సందర్శకులు, ట్రేడర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.షెడ్యూల్ ప్రకారం ఏటా జనవరి 1న నుమాయిష్ మొదలై ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. గడువు దగ్గర పడుతుండడంతో సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సోమవారం సందర్శకుల రద్దీ చాలా ఎక్కువగా ఉందని ఎగ్జిబిషన్ సొసైటీ తెలిపింది. రద్దీ నేపథ్యంలో ప్రదర్శనను పొడిగించాలని ట్రేడర్లు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆదివారం వరకు నుమాయిష్ ను కొనసాగించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ తెలిపింది.ఈ సంవత్సరం, నాంపల్లిలోని నుమాయిష్ మైదాన్‌లో 45 రోజుల పాటు జరిగే వార్షిక ప్రదర్శన కోసం 2,400 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి రోజు సాయంత్రం 4:00 గంటల నుండి ఎగ్జిబిషన్ సందర్శకుల కోసం తెరిచి ఉంటుంది. వరకు అయితే, వారాంతాల్లో మరియు సెలవు దినాల్లో, నుమాయిష్ సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఎగ్జిబిషన్ సొసైటీ టిక్కెట్ ధరలను, సందర్శన వేళలను మార్చలేదు. ఫిబ్రవరి 15 న హైదరాబాద్‌లో నుమాయిష్‌ను ముగించాలని ప్లాన్ చేసినప్పటికీ, వ్యవధిని పొడిగించే హక్కు మేనేజింగ్ కమిటీకి ఉంది.

కెసిఆర్ కు ప్రత్యేక హెలికాప్టర్

కాళేశ్వరంప్రాజెక్టు కొరకు లక్షా ముప్పయివేల కోట్ల రూపాయలను వెచ్చించింది గత బిఆర్ఎస్ ప్రభుత్వం. గత ఎన్నికల ప్రచారంలోనే కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజిలు కుంగడం ప్రారంభించడంతో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణమ ఏర్పడింది. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చకచకా పావులు కదుపుతోంది. లోకసభ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ హాయంలో జరిగిన అవినీతి మీద కాంగ్రెస్ శంఖారావం పూరించింది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బాటు గత ముఖ్యమంత్రి కెసీఆర్ ను బాధ్యులుగా చేస్తూ పావులు కదుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తన ఖర్చుతో మేడిగడ్డ పర్యటనకు పిలుపునివ్వడమే కాదు ముఖ్యమంత్రి కెసిఆర్ కోసం ప్రత్యేక హెలికాప్టర్ ను సిద్దం చేసింది. ప్రపంచంలోనే అద్భుతమంటూ బీఆర్ఎస్ నేతలు పొగుడుతున్న కాళేశ్వరం గొప్పతనాన్ని కేసీఆర్ స్వయంగా వివరిస్తే బాగుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం తలపెట్టిన మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు మాజీ సీఎం కేసీఆర్, కాళేశ్వర రావు (హరీశ్ రావును ఉద్దేశించి) లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ రావాలని కోరారు. కేసీఆర్ కోసం ప్రత్యేకంగా బేగంపేట ఎయిర్ పోర్టులో ఓ హెలికాఫ్టర్ ను ప్రభుత్వం సిద్ధంగా ఉంచిందని చెప్పారు.ఈమేరకు మంగళవారం ఉదయం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రాజెక్టు రీడిజైన్ అనే బ్రహ్మ పదార్థాన్ని కనుగొన్నారని, దాంతో ప్రాజెక్టు అంచనాలను ఇబ్బడిముబ్బడిగా పెంచారని రేవంత్ రెడ్డి విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ కి పగుళ్లు ఏర్పడిందని ఆందోళన చేసిన ప్రతిపక్షాలను అప్పట్లో అడ్డుకున్నారని గుర్తుచేశారు. భారీగా పోలీసులను మోహరించి బ్యారేజ్ పైకి ఎవరూ పోకుండా అడ్డుకున్నారని, మేడిగడ్డ బ్యారేజ్ ఫెయిల్యూర్ ను గత ప్రభుత్వం దాచిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మరో అడుగు ముందుకేసి బ్యారేజీని బాంబులు పెట్టి పేల్చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. బాంబులు పెట్టి పేలిస్తే శకలాలు గాల్లోకి లేస్తాయని, భూమిలోకి కుంగదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ విషయం ‘అ ఆ’ లు చదివే పిల్లవాడికీ తెలుసని అన్నారు.  మేడిగడ్డ బ్యారేజీని బాంబులతో పేల్చేశారా..? లేక బ్యారేజీనే ఇసుకలో పేకమేడలా కట్టారా? అనేది అక్కడికి వెళ్లి చూసి తేల్చదానికే ప్రభుత్వం ఈ టూర్ ఏర్పాటు చేసిందని రేవంత్ రెడ్డి చెప్పారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ సందర్శనకు రావాలని సీఎం ఆహ్వానించారు. అక్కడికి వెళ్లి చూసి వచ్చాక ఒకటి రెండు రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై సభలో అందరమూ చర్చిద్దామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరికి ఏటీఎంగా మారింది.. దాని కథ, కమామీషు అంతా తేల్చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

వైపీపీ దాష్టికాలపై చర్యలకు నో పొలీస్!

ఆంధ్రప్రదేశ్ లో అసలు పోలీసులు ఉన్నారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అధికార పార్టీపై విమర్శలు గుప్పించినా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినదిస్తూ ఆందోళనకు దిగినా పెద్ద సంఖ్యలో ఖాఖీ యూనిఫారాలు వేసుకున్న దండు వాలిపోతుంది. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తే చాలు కేసులు, అరెస్టులు, వేధింపులతో చెలరేగిపోతుంది. అదే అధికార పార్టీకి చెందిన వారు ఎంత అడ్డగోలుగా వ్యవహరించినా కిమ్మనదు. పైపెచ్చు అధికార పార్టీ నేతల దాష్టీకాలకు బలైన బాధితులపైనే కేసులు నమోదు చేస్తుంది. అరెస్టులు చేస్తుంది. ఇదంతా చూస్తుంటే.. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఖాఖీ యూనిఫారంలో వైసీపీ అనుబంధ సంస్థలా మారిపోయిందా అన్న అనుమానాలు కలుగక మానవు. ఒక ఎమ్మెల్సీ తన మాజీ డ్రైవర్ ను హత్య చేసి అతడి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేస్తే.. ఆ ఎమ్మెల్సీ తనంతట తాను వచ్చి లొంగిపోయే వరకూ..బహిరంగంగా తిరిగినా అరెస్టు చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉదాహరణలు. వైసీపీ మూకలు దాడులకు తెగబడిన సందర్భాలలో ఆ దాడులకు గురైన వారిపైనే కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం అన్నది ఏపీ పోలీసులకు సర్వసాధారణంగా మారిపోయింది.  ఇక వైసీపీ నేతలు ఎంత అడ్డగోలుగా మాట్లాడినా, ప్రతిపక్ష నేతలను దుర్భాషలాడినా, లేపేస్తాం అంటూ హెచ్చరికలు చేసినా పోలీసులకు వినపడదు. అదే ప్రతిపక్ష నాయకులు అధికారపక్షంపై కానీ, ఆ పార్టీ నాయకులపై కానీ చిన్న పాటి విమర్శ చేసినా కేసులు, జైళ్లు. ఇదీ ఏపీలో పోలీసు వ్యవస్థ పని తీరు.   సహజంగా ఎవరినైనా ఫోన్ చేసి బెదిరిస్తేనే కేసులు పెడతారు. కానీ.. ఒక బాధ్యతగల ఎమ్మెల్యే ఒక మహిళను ఉద్దేశించి ఆమె వైఎస్ బిడ్డ కాబట్టి బాపట్ల దాటనిచ్చాం. అదే వేరేవాళ్లయితేనా? అంటూ మీడియా సమావేశంలోనే బహిరంగంగా హెచ్చరిస్తే.. పోలీసులకు అందులో ఎలాంటి తప్పూ కనిపించలేదు. ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడానికి చేతులు, చేతలు రాలేదు.  అందుకు ఒకే ఒక్క కారణం ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. అదే స్థానంలో ఏ విపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినా అయి ఉంటే.. ఈ పాటికి  కేసులు నమోదు చేసి రాజును మించిన రాజభక్తి ప్రదర్శించేవారనడంలో సందేహం లేదు. విషయమేంటంటే.. ఇటీవల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బాపట్లలో పర్యటించారు. ఆ సందర్భంగా  బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి దందాలపై విమర్శలు గుప్పించారు.  దీనిపై స్పందించి  కోన మీడియా సమావేశం పెట్టి మరీ పెట్టి షర్మిలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.  ఆమె వైఎస్ బిడ్డ షర్మిల కాబట్టి బాపట్ల దాటగలిగింది. ఇంకొకరైతే వేరేలా ఉండేదంటూ  హెచ్చరించారు. షర్మిల కాకుండా మరొకరైతే    బాపట్లయితే దాటనిచ్చేవాడిని కాదని విస్పష్టంగానే చెప్పేశారు. దీనిపై స్పందించిన షర్మిల.. తనను హెచ్చరించిన కోనకు గట్టి రిటార్డే ఇచ్చారు. ఒ ఒక్క నిమిషానికి నేను వైఎస్ బిడ్డను కాదనుకుందాం. రండి ఎవరడొస్తారో చూద్దాం. ఎంతమంది వస్తారో చూద్దాం. మీ దమ్మేంటో చూపించండి. ఎవరేంటో చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు.  చెల్లి అనే ఇంగిత జ్ఞానం లేదంటూ జగన్ పైనా విరుచుకుపడ్డారు.  షర్మిల ప్రతి సవాల్ సంగతి పక్కన పెడితే.. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే..  ఎమ్మెల్యే కోనం వ్యాఖ్యలపై పోలీసుల మౌనం.   సాధారణంగా అయితే ఈ అంశానికి సంబంధించి ఎవరైనా కోనపై ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయాలి. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా  పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేయాలి. ఎందుకంటే ఎమ్మెల్యే హెచ్చరికలో  హింస ధ్వనిస్తోంది.  గత ఐదేళ్లలోతెలుగుదేశం నేతలు   ప్రెస్‌మీట్లలో చేసిన వ్యాఖ్యలు, సోషల్‌మీడియాలో పోస్టింగులు, లైకులు, ఫార్వార్డు మెసేజీలు పంపిస్తేనే పోలీసులు సుమోటోగా కేసులు  నమోదు చేశారు.   మరి షర్మిలను హెచ్చరించిన అధికార పార్టీ ఎమ్మెల్యే కోనపై కూడా అదే విధంగా  పోలీసులు సుమోటోగా ఎందుకు కేసు నమోదు చేయలేదు అని నెటిజన్లు నిలదీస్తున్నారు. కోనకు భయపడి  ఎవరూ ఫిర్యాదు చేయనంత మాత్రానా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైనదేనా అని ప్రశ్నిస్తున్నారు.   ఇలాంటి అంశాలపై గతంలో సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు, అధికార పార్టీ ఎమ్మెల్యే కనుకే కోనపై కేసు నమోదు చేయలేదు, చర్యలకు ఉపక్రమించలేదు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇక కాంగ్రెస్ పార్టీ అయితే వైసీపీ ఎమ్మెల్యే కోన హెచ్చరికలను బట్టి, వైఎస్ షర్మిలకు ప్రాణహాని  ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.   పోలీసు భద్రత పెంచాలని డిమాండ్ చేస్తోంది.   మొత్తం మీద ఏపీలో పోలీసులు    వైసీపీకి ఊడిగం చేయడమే తమ డ్యూటీ అని భావిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

రాజ్య‌స‌భ‌కు సోనియా?..ఖ‌మ్మం బ‌రిలో నిలిచేదెవ‌రో?

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన ప‌దేళ్ల త‌రువాత తొలి సారిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది.  రేవంత్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. తొలి రోజు నుంచి ప్ర‌జాసం క్షేమ‌మే ధ్యేయంగా రేవంత్ పాల‌నపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమ‌లుకు రేవంత్ స‌ర్కార్ అత్యంత ప్రాధాన్య‌త‌నిస్తోంది.  బ‌డ్జెట్ లోనూ ఆరు గ్యారెంటీల అమ‌లుకు పెద్ద‌ పీట వేసింది. సముచిత కేటాయింపులు జరిపింది. గ‌త ప్ర‌భుత్వం త‌ర‌హాలో కాకుండా నిజ‌మైన అర్హుల‌కు ప్ర‌భుత్వ ఫ‌లాలు అందించడంపై రేవంత్ స‌ర్కార్ దృష్టిపెట్టింది.  ఫ‌లితంగా సీఎంగా రేవంత్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన రెండు నెల‌ల కాలంలోనే కాంగ్రెస్ పార్టీకి ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పెరిగింది. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో బీఆర్ ఎస్ విజయాన్ని కాంక్షించిన‌వారు సైతం ప్ర‌స్తుతం కాంగ్రెస్ వైపు మ‌ళ్లుతున్నారు. దీంతో మ‌రో రెండు నెల‌ల్లో జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అత్య‌ధిక స్థానాల్లో విజ‌యం సాధించ‌డం ఖాయంగా క‌నిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తెలంగాణ‌లో మొత్తం 17 పార్ల‌మెంట్ స్థానాలు ఉన్నాయి. మ‌రో రెండు నెల‌ల్లో జ‌ర‌గ‌నున్న ఈ ఎన్నిక‌ల్లో 12 నుంచి 15 స్థానాల్లో విజ‌యం సాధించడంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. దీనికి తోడు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే వారి సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ప్ర‌జాద‌ర‌ణ పెర‌గ‌డంతో గెలుపు తేలిక అవుతుంద‌ని బ‌రిలో నిలిచేందుకు పోటీ ప‌డుతున్న‌వారు భావిస్తున్నారు. ఇప్ప‌టికే, పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల వారిగా పోటీ చేసేందుకు ఆస‌క్తి ఉన్నవారు గాంధీ భ‌వ‌న్ లో ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి పోటీ అధికంగా ఉంది. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అత్య‌ధిక స్థానాల్లో విజ‌యం సాధించింది. మొత్తం 10 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కుగాను తొమ్మిది నియోజక‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థులు గెలిచారు. వీరిలో ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గం నుంచి తుమ్మ‌ల‌, పాలేరు నుంచి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, మ‌ధిర నుంచి భ‌ట్టి విక్ర‌మార్క ఉన్నారు. వీరు ముగ్గురు ప్ర‌స్తుతం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఉన్నారు. భ‌ట్టి డిప్యూటీ సీఎంగా ఉండ‌గా, తుమ్మ‌ల‌, పొంగులేటి మంత్రులుగా ఉన్నారు.  ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో నిలిచేందుకు భ‌ట్టి విక్ర‌మార్క‌ స‌తీమ‌ణి నందినితో పాటు పొంగులేటి శ్రీ‌నివాస్ సోద‌రుడు, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు, రేణుకా చౌద‌రి, వంకాయ‌ల‌పాటి  రాజేంద్ర‌ప్ర‌సాద్, వి. హ‌నుమంత‌రావులు ఉన్నారు. వీరంతా టికెట్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు తెలిసింది. అయితే, ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సోనియాగాంధీ ఈ ద‌ఫా బ‌రిలోకి దిగుతారని ప్ర‌చారం జ‌రిగింది. ఒక‌వేళ సోనియా కాకుంటే ప్రియాంక గాంధీ ఖ‌మ్మం నుంచి పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. దీనికితోడు సోనియా ఖ‌మ్మం పార్ల‌మెంట్ నుంచి పోటీచేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌  ఢిల్లీ వెళ్లి విజ్ఞ‌ప్తి చేశారు. ఆమె కూడా అందుకు అంగీక‌రించారనీ, ఖ‌మ్మం నుంచి సోనియానే పోటీ చేస్తార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు భావించాయి. అయితే ఇప్పుడు సోనియా ఖ‌మ్మం నుంచి పోటీ చేయ‌డం లేద‌ని తేలిపోయింది. వృద్దాప్యం, అనారోగ్య కార‌ణాల‌తో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని సోనియా నిర్ణ‌యించుకున్నారు. రాజ‌స్థాన్ నుంచి రాజ్య‌స‌భ‌కు వెళ్ల‌నున్నారు.  సోనియా గాంధీ రాజ్య‌స‌భకు వెళ్ల‌డం ఖ‌రారు కావ‌డంతో ప్రియాంక గాంధీ ఖ‌మ్మం నుంచి లోక్ స‌భ ఎన్నిక‌ల‌ బ‌రిలోకి దిగుతార‌ని భావించారు. కానీ, ప్రియాంక గాంధీ సోనియా నియోజ‌క‌వ‌ర్గం అయిన‌ రాయ్ బ‌రేలి నుంచి పోటీ చేయ‌నున్నారు. సోనియా, ప్రియాంక ఇద్ద‌రూ ఖ‌మ్మం నుంచి పోటీ చేయ‌డం లేద‌ని తేలిపోవ‌డంతో ఖ‌మ్మం నుంచి ఎవ‌రికి అవ‌కాశం ద‌క్కుతుందోన‌న్న అంశం ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌త పార్ల‌మెంట్‌ ఎన్నిక‌ల స‌మ‌యంలో రేణుకా చౌద‌రి పోటీ చేశారు.  బీఆర్ ఎస్ అభ్య‌ర్థి నామా నాగేశ్వ‌ర‌రావు చేతిలో ఓట‌మి పాల‌య్యారు. మ‌రోసారి రేణుకా చౌద‌రి పోటీ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. భ‌ట్టి స‌తీమ‌ణి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి సోద‌రుడు , వంకాయ‌ల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ పేర్లు కూడా ఖమ్మం రేసులో గట్టిగా వినిపిస్తున్నాయి. ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పొచ్చు. ఈద‌ఫా ఎన్నిక‌ల్లో ఎవ‌రు బ‌రిలో నిలిచినా కాంగ్రెస్ విజ‌యం ఖాయ‌మ‌న్నవాద‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉంది.

బీఆర్ఎస్ లో నంబర్ 2 హరీష్.. కేటీఆర్ బ్యాక్ బెంచ్ కే పరిమితం?

తెలంగాణ‌లో అధికార కాంగ్రెస్‌, ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ మ‌ధ్య వాట‌ర్ వార్ తారాస్థాయికి చేరింది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవకతవకలు, లొసుగులపై దృష్టిసారించారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జ‌రిగింద‌ని ఆరోపణలు, విమర్శలు చేసిన   రేవంత్‌..   అధికారంలోకి రాగానే ఆ అవినీతిని వెలికితీయడంపై దృష్టిపెట్టారు. ఈ క్ర‌మంలో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవినీతిని ప్ర‌జ‌ల ముందు పెట్ట‌డంలో రేవంత్ అండ్ కో స‌ఫ‌ల‌మ‌వుతోంది. గ‌త‌ ప్ర‌భుత్వ  హ‌యాంలో అవినీతిపై కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌శ్నిస్తుండ‌టంతో.. ప్ర‌తిప‌క్ష పార్టీ కొత్త వాద‌న తెర‌పైకి తెచ్చింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనెజ్ మెంట్ బోర్డుకు (కేఆర్ఎంబీ) అప్పగించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపట్టింది. కాంగ్రెస్ హ‌యాంలో తెలంగాణ‌కు నీటి పంప‌కాల విష‌యంలో తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌ని ఆ పార్టీ నేత‌లు వాదిస్తున్నారు. అయితే, ఆ పాపమంతా మాజీ సీఎం కేసీఆర్‌దేన‌ని కాంగ్రెస్ నేత‌లు కౌంట‌ర్ ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో అసెంబ్లీలో కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై చ‌ర్చ‌జ‌రిగింది.  అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్త‌మ్‌, కోమ‌టిరెడ్డిలు గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలోనే తెలంగాణ‌కు నీటివాటాను సాధించుకోవ‌టంలో అన్యాయం జ‌రిగింద‌ని తీవ్ర‌ స్థాయిలో మండిప‌డ్డారు. కేసీఆర్ తెలంగాణ‌కు ద‌క్కాల్సిన నీటిని ఆంధ్రాకు అప్ప‌గించారంటూ విమ‌ర్శించారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో ఆయ‌న ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన అవినీతి బ‌య‌ట‌ప‌డుతుంద‌నే కేసీఆర్ అసెంబ్లీకి రావ‌డం లేద‌ని కాంగ్రెస్ స‌భ్యులు అన్నారు. అయితే, అసెంబ్లీలో బీఆర్ ఎస్ త‌ర‌పున హ‌రీష్ రావు మాత్ర‌మే అధికార ప‌క్షానికి స‌మాధానం ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. నీటి వాటాపై చ‌ర్చ ప్రారంభ‌మైన స‌మ‌యం నుంచి హరీష్ రావు, ఇద్ద‌రు ముగ్గురు బీఆర్ ఎస్ స‌భ్యులు మాత్ర‌మే కాంగ్రెస్ స‌భ్యుల వాద‌న‌ల‌కు బ‌దులిచ్చే ప్ర‌య‌త్నం చేశారు. కేటీఆర్ స‌భ‌లో ఉన్న‌ప్ప‌టికీ కేవ‌లం బ్యాక్ బెంచ్ కే ప‌రిమితం అయ్యారు. కేసీఆర్ పై కాంగ్రెస్ స‌భ్యులు మాట్లాడుతున్నా.. కేటీఆర్ కౌంట‌ర్ ఇచ్చేందుకు ఏమాత్రం ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌టం బీఆర్ ఎస్ శ్రేణుల‌కు ఇబ్బందిక‌రంగా మారింది.  బీఆర్ ఎస్ లో కేసీఆర్ త‌రువాత ఆయ‌న త‌న‌యుడు కేటీఆరే అధ్య‌క్షుడిగా ఉంటాడ‌ని, మ‌ళ్లీ బీఆర్ ఎస్ అధికారంలోకి వ‌స్తే సీఎం కాబోయేది కేటీఆరేన‌ని బీఆర్ ఎస్ నేత‌లు చెబుతుంటాడు. కేటీఆర్ అభిమానులైతే అసెంబ్లీలో కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి స‌రియైన స‌మాధానం చెప్పేది ఒక్క కేటీఆరేన‌ని గొప్ప‌లు చెప్పుకోవ‌టం చూస్తూనే ఉంటాం. అంతే కాకుండా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ కేసీఆర్ ఆబ్సెన్స్ లో  గట్టిగా మాట్లాడాల్సి ఉంది. అయితే కేటీఆర్  రాష్ట్రంలో అతిముఖ్య‌మైన ప్రాజెక్టులు, కృష్ణా జ‌లాల నీటి పంపకం వంటి అంశాల‌పై అసెంబ్లీలో చ‌ర్చ‌జ‌రుగుతుంటే కేటీఆర్ మాత్రం అసెంబ్లీలో వెనుక సీట్ల‌లో కూర్చొని రిలాక్స్ అవ్వ‌డం బీఆర్ ఎస్ శ్రేణుల‌కు మింగుడు ప‌డ‌ని అంశంగా మారింది.  ప్రాజెక్టుల అంశంపై చ‌ర్చ‌ కాబ‌ట్టి.. గ‌త ప్ర‌భుత్వంలో ఆ శాఖ‌కు మంత్రిగా హ‌రీష్ రావు ఉండ‌టం వ‌ల్ల‌.. హ‌రీష్ రావే అధికార ప‌క్షం వాద‌న‌ల‌కు స‌మాధానం చెప్పార‌ని ప‌లువురు బీఆర్ ఎస్ నేత‌లు చెబుతున్న‌ప్ప‌టికీ.. కేసీఆర్ త‌రువాత నేనే   అని చెప్పుకునే కేటీఆర్ కు అన్ని అంశాల‌పై అవ‌గాహ‌న ఉండాల‌ని, అన్ని విష‌యాల్లో ముందుండి అధికార ప‌క్షం వాద‌న‌ల‌ను తిప్పికొట్టాల‌ని, కానీ, పార్టీ క‌ష్ట‌కాలంలో నాయ‌కుడిగా ముందుండి న‌డిపే ల‌క్ష‌ణాలు కేటీఆర్ లో లేవ‌ని ప‌లువురు బీఆర్ ఎస్ నేత‌లు పేర్కొంటుండ‌టం గ‌మ‌నార్హం.  మ‌రోవైపు.. అసెంబ్లీ స‌మావేశం ముగిసిన త‌రువాత కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు.. ఆ ట్వీట్‌లో.. శాసనసభలో ఇవ్వాళ‌ తమ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు ఒంటిచేత్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రులను ఎదుర్కొన్నారని ప్రశంసించారు. దీనికితోడు.. బీఆర్ ఎస్ లో కేసీఆర్ త‌రువాత కేటీఆరే నెంబ‌ర్-2 అనుకుంటున్న కొంద‌రు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, నేత‌లు.. అసెంబ్లీలో హ‌రీష్ రావు దూకుడు చూసిన త‌రువాత‌ కేసీఆర్ త‌రువాత హ‌రీశ్ రావే నెంబ‌ర్-2గా అర్హుడనే విష‌యాన్ని తెర‌పైకి తెస్తున్నారు. కేసీఆర్ త‌రువాత నెం.2 ఎవ‌రు అనే అంశంపై బీఆర్ ఎస్ లో కొన్నేళ్లుగా చ‌ర్చ జ‌రుగుతుంది. అధిక‌శాతం మంది బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, పార్టీ కార్య‌క‌ర్త‌లుసైతం కేటీఆరే నెం.2 అని పేర్కొంటూ వ‌చ్చారు. ప్ర‌స్తుతం, బీఆర్ ఎస్ అధికారం కోల్పోవ‌డంతో..  కేటీఆర్ అసెంబ్లీలోనూ, బ‌య‌ట అధికార ప‌క్షానికి గ‌ట్టి కౌంట‌ర్ ఇవ్వలేక పోతున్నారు. ఇదే స‌మ‌యంలో హ‌రీష్ రావు దూకుడు పెంచ‌డంతోపాటు, అన్ని అంశాల్లోనూ అసెంబ్లీలో అధికార ప‌క్షాన్ని ఇరుకున‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీంతో.. కేటీఆర్ వ‌ర్గీయులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధులుసైతం ఎప్ప‌టికైనా బీఆర్ ఎస్ కు నెం.2 హ‌రీష్ రావేన‌న్న అభిప్రాయానికి వ‌స్తున్నార‌ట‌. కేటీఆర్ రాబోయే రోజుల్లోనూ.. ఇది నా అంశం కాదులే.. గ‌తంలో ఇది నా శాఖ కాదులే.. నేను మాట్లాడ‌టం ఎందుక‌ని అసెంబ్లీలో బ్యాక్ బేంచీకి ప‌రిమితం అయితే.. పార్టీలోనూ బ్యాక్ బెంచ్ కు వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని కేటీఆర్ అభిమానులు ఆందోళ‌న చెందుతున్నార‌ట‌.

రాష్ట్రంలో రాక్షస పాలనను సాగనంపాలి.. కేశినేని చిన్ని

కంచికచర్ల మండలంలో పర్యటిస్తున్న తెలుగుదేశం నాయకుడు కేశినేని శివనాద్ (చిన్ని), మాజీ ఎమ్మెల్యే తంగిరాల స్వౌమ్యకి తెలుగుదేశం నాయకులు భారీ ర్యాలీ లతో ఘన స్వాగతం పలికారు.  కంచికచర్ల మండలం కీసర,పెండ్యాల,వేములపల్లి అమరవరం గ్రామాలలో కేశినేని చిన్ని పర్యటన సాగింది. ఆయా గ్రామాల్లో   టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేశినేని  శివనాథ్ (చిన్ని)  మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో జగన్ పార్టీకి ఒక చాన్స్ ఇచ్చి అందరం మోసపోయామన్నారు.  నందిగామలో ఇద్దరు సైకోలతో పాటు మూడో సైకో కూడా బయలుదేరాడని వ్యాఖ్యానించారు. నందిగామలో తంగిరాల సౌమ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.  వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం,జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందన్నారు.  175 స్థానాలకు గాను తెలుగుదేశం, జనసేన కూటమి 160 స్థానాల్లో గెలవబోతోందని చిన్ని చెప్పారు. అనూహ్యంగా పులివెందులలో కూడా తెలుగుదేశం విజయం సాధించబోతోందని చిన్ని అన్నారు. ఇంకా ఎన్నికలకు మనకు 65 రోజులు మాత్రమే సమయం ఉంది. రాష్ట్రంలో రాక్షస పాలన సాగనంపాలని పిలుపునిచ్చారు. 

జగన్ పై గళమెత్తిన వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి 

ఎన్నికలు సమీపిస్తుండడంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో నేతల మధ్య ఉన్న విభేదాలు బయటపడుతున్నాయి. పార్టీ అధికారంలో ఉండడం, వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తామనే భావనతో నేతలు ఇన్నాళ్లూ తమ అసంతృప్తిని బయటపడనివ్వకుండా జాగ్రత్తపడుతూ వచ్చారు.   అధికార పక్షం వైసీపీలో అసంతృప్తుల సంఖ్య అంతకంతకు అధికమవుతోంది. తాజాగా, వైసీపీ ఎమ్మెల్సీ, పార్టీ బీసీ సెల్ ప్రెసిడెంట్ జంగా కృష్ణమూర్తి వ్యతిరేక గళం వినిపించారు.  బీసీలకు పదవులు ఇచ్చారు కానీ, అధికారాలు ఏవి? అని ప్రశ్నించారు. కీలక పదవులన్నీ ఒక సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయని... బీసీలకు నామమాత్రం కూడా అధికారాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నేతిబీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో, వైసీపీలో సామాజిక న్యాయం కూడా అంతేనని జంగా కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు.  బీసీ నేతలకు ఎక్కడా న్యాయం జరగడంలేదని, గౌరవం ఇవ్వడంలేదని, ప్రోటోకాల్ పాటించడంలేదని ఆరోపించారు. బీసీలు ఇవాళ సంక్షేమం కోసం కాకుండా ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. బీసీలు ఇవాళ పార్టీకి దూరమవుతున్నారని, దీనిపై వైసీపీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు.

జగన్ మెంటలెక్కిపోతుందా..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రస్తుత పరిస్థితి తలుపు సందులో పడి నలిగిపోయిన చందంగా ఉందనే ఓ చర్చ  అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. వైయస్ జగన్ పాలనపై ఓ వైపు సొంత సోదరి, పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే.. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. రెడ్ బుక్ పేరు ప్రస్తావిస్తూ వస్తున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారనే ఓ చర్చ అయితే సదరు సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది.  అయితే నారా లోకేశ్.. సీఎం వైయస్ జగన్‌పై ఆరోపణలు గుప్పిస్తూనే.. జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారుల పేర్లు.. రెడ్ బుక్‌లో నమోదు చేస్తున్నామని..  తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పని పడతామంటూ... వివిధ సభల్లో ప్రకటిస్తు వస్తున్నారని.. కానీ వైయస్ షర్మిల అలా కాదని.. ఎప్పుడు, ఎక్కడ, ఏ సభ జరిగినా..  అందులో ముఖ్యమంత్రి వైయస్ జగన్ వ్యవహరశైలిపైనే కాకుండా అతడి పాలనా వైఖరిపై నిప్పులు చెరుగుతోందని... ఇంకా క్లారిటీగా చెప్పాలంటే బాపట్లలో జరిగిన సభలో ఆమె చేసిన విమర్శలపై స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రెస్ మీట్ పెట్టి స్పందించడం... అందుకు ప్రతీగా వైయస్ షర్మిల.. అతడికి సైతం తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం..  అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరిలో ఏర్పాటు చేసిన సభలో సైతం స్థానిక ఎమ్మెల్యే ఆర్కే రోజాపై మండిపడడం.. ఇలా వైయస్ షర్మిల.. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే.. అక్కడి స్థానిక ఎమ్మెల్యేతోపాటు.. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై మండిపడడం.. అలాగే రాష్ట్రంలో నాయకులంతా.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి గులాంగిరి చేస్తున్నారంటూ విమర్శించడం.. అదే విధంగా ఈ నాలుగేళ్లలో వైయస్ జగన్ ప్రభుత్వం పట్టించుకోని పలు కీలక అంశాలు వైయస్ షర్మిల తెరపైకి తీసుకు రావడం..  అందులో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపడం తదితర అంశాలను మళ్లీ ప్రజల ముందుకు తీసుకు రావడం.. రాష్ట్రానికి సంబంధించిన ఈ అంశాలను జగన్ ప్రభుత్వం అటకెక్కించిందని.. అలాంటి వేళ.... రాష్ట్రానికి  మేలు జరగాలంటే.. జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటూ ప్రజలకు విజ్జప్తి చేయడం.. ఇక పచ్చిగా చెప్పాలంటే.. ఏం పీక్కుంటారో.. పీక్కోండంటూ జగన్ అండ్ కోకి సవాల్ విసురడం... ఆ క్రమంలో వైయస్ షర్మిలకు కౌంటర్ ఇచ్చేందుకు.. జగన్ ప్రభుత్వంలోని పెద్దలు సైతం వెనకాడుతోందనే ఓ ప్రచారం అయితే సదరు సర్కిల్‌లో కొన... సాగుతోంది.    అదీకాక... వైయస్ షర్మిల చేసిన ఇవే ఆరోపణలు ఇప్పటికే మరోకరు కానీ చేసి ఉంటే.. ఈపాటికే వారిపై నాని బ్రదర్స్, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, జోగి రమేష్, ఎక్సెట్రా ఎక్సెట్రాలు.. మీడియా ముందుకు వచ్చి విరుచుకు పడిపోయేవారని.. కానీ వైయస్ జగన్‌కి వైయస్ షర్మిల సోదరి కావడంతో.. వారంతా మిన్నకుండి పోయారని.. అయితే.. తొలుత జగన్ పార్టీ నాయకులు వైయస్ షర్మిలను లక్ష్యంగా చేసుకొని.. విమర్శలు గుప్పిస్తుంటే.. వైయస్ రాజశేఖరరెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్రరావు లాంటి వాళ్లు.. మీడియా ముందుకు వచ్చి.. వైయస్ జగన్ వైఖరిని ఇప్పికే తూర్పారపట్టారని.. అలాంటి వేళ వైయస్ షర్మిలపై వారంతా విమర్శల బాణాలు సంధించకుండా ఉండిపోయారని.. లేకుంటే వీరంతా ఎప్పుడో రంగంలోకి దిగి.. జగనన్న కళ్లలో ఆనందం కోనం... బూతులతో రెచ్చిపోయేవారని చర్చ సైతం సర్కిల్‌లో నడుస్తోంది.  వైయస్ షర్మిలపై విమర్శలు గుప్పిస్తుంటే.. తండ్రి వైయస్ఆర్ ఆత్మ కేవీపీ రామచంద్రరావే కాదు... పార్టీలకు అతీతంగానే అందరు స్పందిస్తున్నారని.. అలాగే ప్రజలు సైతం తీవ్రంగా పరిగణిస్తున్నారని..దీంతో వైయస్ జగన్ ఓ విధంగా పరిస్థితిని కక్కలేక మింగలేక అన్న చందంగా వ్యవహరిస్తూ.. తనలో తానే.. లోలోపల కుమిలి పోతున్నారని ఓ ప్రచారం అయితే పోలిటికల్ సర్కల్‌లో వైరల్ అవుతోంది.

కన్యాశుల్కం స్పూర్తితో కర్ణాటక సిఎం అడుగులు 

ఆధునిక సాహిత్యానికి వేగుచుక్క గురజాడ.కొత్తపాతల మేలుకలయికతో తెలుగువారి మత్తువదల గొట్టిన భావ విప్లవకారుడు గురజాడ.తనకి అవసరమైన సాహిత్యాన్ని ఆ తరమే సృష్టించుకొంటుందన్న సూక్తికి “కన్యాశుల్కం” ప్రత్యక్షనిదర్శనం. సాంఘిక నాటకాలు, స్వతంత్ర నాటకాలు, సామాజిక సమస్యగల నాటకాలు లేని లోటును “కన్యాశుల్కం” పూరించింది. కన్యాశుల్కం తెలుగుజీవనాన్నీ, వాతావరణాన్నీ,మనుషుల శ్వాసనిశ్వాసాల్నీ, ఆంతరిక వ్యధల్నీ, భ్రష్టు పట్టిన మానవస్వభావాల్నీ ఆవిష్కరించే మొదటి సాంఘిక నాటకం. కన్యాశుల్కం తెలుగు వారినే కాదు కన్నడిగులకు కూడా స్పూర్తినిచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య కన్యాశుల్కం స్పూర్తిగా ప్రకటన చేశారు.   కర్ణాటక అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు ముందు సీఎం సిద్ధరామయ్య రైతు సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. వ్యవసాయ రంగానికి కేటాయింపులపై సీఎం వారితో చర్చించారు. వివిధ పథకాల అమలు, ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. సేద్యాన్ని నమ్ముకున్న రైతులను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడడంలేదని కర్ణాటక రైతులు వాపోతున్నారు. దీంతో 45 ఏళ్లు వచ్చినా యువ రైతులు అవివాహితులుగానే మిగిలిపోతున్నారని చెప్పారు.ఈ పరిస్థితిని తప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, రైతును పెళ్లి చేసుకునే అమ్మాయికి ప్రభుత్వం తరఫున నగదు ప్రోత్సాహం ప్రకటించాలని కోరారు. సేద్యాన్ని నమ్ముకున్న రైతులను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడడంలేదని కర్ణాటక రైతులు వాపోతున్నారు. దీంతో 45 ఏళ్లు వచ్చినా యువ రైతులు అవివాహితులుగానే మిగిలిపోతున్నారని చెప్పారు. అన్నదాతలకు కుటుంబ జీవితం దక్కడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రైతు సంఘాల ప్రతినిధులు వినతిపత్రం అందిస్తూ.. యువ రైతును పెళ్లి చేసుకునే అమ్మాయికి రూ.5 లక్షల నగదు ప్రోత్సాహం ఇవ్వాలని అందులో డిమాండ్ చేశారు. సోమవారం రైతు సంఘాలతో జరిగిన భేటీలో సీఎం సిద్ధరామయ్యకు తమ డిమాండ్ వినిపించారు. కర్ణాటక అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు ముందు సీఎం సిద్ధరామయ్య రైతు సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. వ్యవసాయ రంగానికి కేటాయింపులపై సీఎం వారితో చర్చించారు. వివిధ పథకాల అమలు, ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలపై రైతు సంఘాల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు సంఘంలో పౌష్టికాహారం పెంపుదల, నీటి వనరుల అభివృద్ధి, వ్యవసాయ అధికారుల నైపుణ్యాల పెంపుదలకు అవసరమైన నిధులను బడ్జెట్ లో కేటాయించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సేద్యాన్ని నమ్ముకుని, ఏటా లక్షలు ఆర్జిస్తున్నా కూడా యువ రైతులకు పెళ్లి కావడంలేదని సీఎం సిద్ధరామయ్యకు తెలిపారు. ఈ పరిస్థితిని తప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, రైతును పెళ్లి చేసుకునే అమ్మాయికి ప్రభుత్వం తరఫున నగదు ప్రోత్సాహం ప్రకటించాలని కోరారు.

జగన్ తో భేటీ అయిన రాజ్యసభ ఎంపీ వైసీపీ అభ్యర్థులు 

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు వైసీపీ తరఫు అభ్యర్థులను సీఎం వైఎస్‌ జగన్‌ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.  ఎంపికైన ముగ్గురు అభ్యర్థుల్లో మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు ఉన్నారు. ఈ సందర్భంగా వారు అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో జగన్‌ను కలిసి తమకు రాజ్యసభ అభ్యర్థులుగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.  రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనుండగా, గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 15 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 16న నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు 20వ తేదీ వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా  గతంలో విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియ ఈ నెల 29లోగా పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో రాజ్యసభ బరిలో నిలిచిన వైసీపీ అభ్యర్థులు ముగ్గురూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు.  ఈ ముగ్గురు  సోమవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభలో ఖాళీ అయిన మూడు సీట్లకు టీడీపీ పోటీపడితే ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. టీడీపీ తన అభ్యర్థులను నిలబెట్టకుంటే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ విషయంపైనే ముఖ్యమంత్రి జగన్ తో వైవీ సుబ్బారెడ్డి, బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది.

ఎలక్ట్రిక్ కంచెతో గ్రేహౌండ్స్ కమెండో మృతి 

రైతుల అతి జాగ్రత్త ఓ నిండు ప్రాణం బలైంది. పంట చుట్టూ వేసిన కరెంట్ ఫెన్సింగ్ వల్ల ఈ ఘాతుకం జరిగింది. రక్షణ వలయం భక్షణ వలయంగగా మారి ఆ కుుంబానికి శోక సంద్రం మిగిల్చారు.  గ్రేహౌండ్స్ కమాండో ఒకరు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. నస్తూర్‌పల్లెలో కూంబింగ్ ఆపరేషన్‌లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఓ ఐరన్ ఫెన్సింగ్‌ను పట్టుకున్న కమాండో ఎ.ప్రవీణ్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.  అటవీ జంతువుల నుంచి తమ పంటలను కాపాడుకునేందుకు సమీప ప్రాంతాల రైతులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కరెంటు వైరుతో రక్షణ ఏర్పాటు చేయడం సర్వ సాధారణం. ఇప్పుడిదే కమాండో ప్రాణాలు బలిగొంది. అడవిలో కొందరు అనుమానితులు సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న గ్రౌహౌండ్స్ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ప్రవీణ్ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు.   ఎలక్ట్రిక్ కంచె ఏర్పాటు చేసిన గ్రామస్థులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రవీణ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. కాగా, ములుగు జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. గోవిందరావుపేటలో రమేశ్ (28) అనే వ్యక్తి ఎలక్ట్రిక్ ఫెన్సింగును ముట్టుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

తెలంగాణ నిరుద్యోగులకు శుభ వార్త 

మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ పాలనలో పోటీ పరీక్షలు నిర్వహించకపోవడంతో నిరుద్యోగ సమస్య అంతకంతకూ పెరిగింది. కాంగ్రెస్ మేనిఫెస్టో లో ప్రకటించిన విధంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. వయసు మీరిన నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి సర్కారు నడుం బిగించింది. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న 44 ఏళ్ల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. పోలీస్ ఉద్యోగ నియామకాల వంటి యూనిఫామ్ సర్వీసులు మినహా మిగతా ఉద్యోగాలకు 46 ఏళ్ల వయసున్న నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.  గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని, నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూనే నిరుద్యోగులు ఏజ్ బార్ అయిపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల పేర్కొన్నారు. వారికి న్యాయం చేసేందుకు వయోపరిమితిని పెంచుతామని ప్రకటించారు. ఈమేరకు సోమవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో విడుదల చేశారు. గ్రూప్ 1 సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచారు.

వెంటిలేటర్ పై మంత్రి రోజా పొలిటికల్ కెరీయర్!

మంత్రి రోజా.. వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. జగన్ పై ఈగ వాలనీయకుండా రోజా తన మాటల గారడీతో విపక్షాలపై ఇష్టారీతిగా రెచ్చి పోతుంటారు. అదే సమయంలో ఆమె తన నోటి దురుసును సొంత పార్టీ నేతలపైనా ప్రయోగిస్తుండటం కద్దు. అందుకే పార్టీ తరఫున ఎంత ధాటిగా మాట్లాడినా ఆమెకు పార్టీలో ఎటువంటి మైలేజీ రాని పరిస్థితి ఉంది. ఇక పార్టీలో తన పరిస్ధితి ఏమిటో తనకే తెలియని స్థితిలో ఉన్న రోజా ప్రతిపక్షంపై విమర్శల విషయంలో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. విపక్షాలపై తన తిట్ల దండకమైనా జగన్ తనకు నగరి టికెట్ కేటాయించేటట్లు చేస్తుందని ఆశపడుతున్నారు. అయితే జగన్ మాత్రం రోజాను ఇసుమంతైనా పట్టించుకోవడం లేదని వైసీపీ వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి. సిట్టింగుల మార్పు అంటూ జగన్ ఇప్పటి వరకూ ఏడు జాబితాలు ప్రకటించారు. అయితే రోజాకు మాత్రం నగరి గ్యారంటీ అన్న హామీ దక్కలేదు. ఇప్పటి వరకూ జగన్ రోజాకు నగరి అనే కాదు.. అసలు ఏ నియోజకవర్గం నుంచీ టికెట్ ఖరారు చేయలేదు. అంతే కాదు మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆమె పెర్ఫార్మెన్స్ ఏ మాత్రం బాగాలేదంటూ నివేదికలు అందాయన్న లీకులు ఇస్తున్నారు. నగరిలో ఆమెకు పోటీ చేసేందుకు చాన్స్ ఇస్తే ఓటమి ఖాయమని పార్టీ శ్రేణులే చెబుతున్నాయని అంటున్నారు. దీంతో రోజా పొలిటికల్ కెరీర్ ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉందని భావించాల్సి వస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇప్పటి వరకూ వైసీపీ అధినేత జగన్ స్వయంగా చేయించుకున్న  అన్ని సర్వేల్లో   సగరి ప్రజలు రోజాపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు తేలిందని అంటున్నారు. అవినీతిలో  రోజా క్వీన్ అన్నభావన అక్కడి ప్రజలలో ఉందంటున్నారు.   భూమలు , మట్టి  దోచుకున్నారని విమర్శిఃస్తున్నారనీ సర్వేల్లో తెలింది. గురువింద గింజ తన నలుపెరుగదన్నట్లు రోజా తనపై వచ్చిన, వస్తున్న అవినీతి ఆరోపణలకు ముందు సమాధానం చెప్పి, ఆ తరువాత చంద్రబాబుపైన విమర్శలు చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. రోజాపై ఆమె  పార్టీకి చెందిన కౌన్సిలరే   40 లక్షల లంచం ఇచ్చానని మీడియా సమావేశంలో చెప్పినా రోజా ఎందుకు స్పందించలేదని నిలదీస్తున్నారు. రోజాకు మద్దతుగా వైసీపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు వచ్చి మాట్లాడలేదంటే ఆమె అవినీతికి పాల్పడినట్లే కదా అని ప్రశ్నిస్తున్నారు.  ప్రతిపక్ష నేతలపై  నిత్యం నిరాధార ఆరోపణలతో విరుచుకుపడుతున్న రోజాపై సొంత పార్టీ నుండే అవినీతి ఆరోపణలు వచ్చాయనీ, పార్టీ కూడా ఆ ఆరోపణలపై మౌనం వహించడం ద్వారా రోజాపై వచ్చినవి ఉట్టి ఆరోపణలకు కాదని అంగీకరించేసినట్లైందని అంటున్నారు.   దీన్ని బట్టే పార్టీ ఆమెను పక్కన పెట్టేసిందని అర్ధమౌతోందనీ, అయినా  రోజా తెలుగుదేశం అధినేతపై ఆరోపణలు చేయడం అంటే ఆకాశం మీద ఉమ్ము వేయడంగానే భావించాలని తెలుగుదేశం నేతలు అంటున్నారు.తన రాజకీయ కెరియర్ కు ఎండ్ కార్డ్ పడిందని రోజా ఇప్పటికైనా గ్రహించి ప్రత్యర్థులపై విమర్శలకు పుల్ స్టాప్ పెట్టి తన సంగతి చూసుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు.