ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్?!
posted on Mar 13, 2024 @ 3:22PM
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణంలోనైనా వెలువడే అవకాశం ఉంది. దానితో పాటే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా నగారా మోగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం(మార్చి 12) నాడు త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది, ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉండాలంటూ తెలంగాణ గడ్డపై నుంచి బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చిన 24 గంటలలోగానే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు రెడీ అయిపోయిందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు దేశవ్యాప్త సుడిగాలి పర్యటనలు ఇంకా కొనసాగుతుండగానే.. ఉరుములేని పిడుగులా కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం (మార్చి 13)సాయంత్రం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
దీంతో దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలూ అలర్ట్ అయ్యాయి. ఎన్నికల తేదీలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలుగు రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమిషన్ మీడియా సమావేశం వార్త పెను తుపానునే సృష్టించింది. ఏపీలో ఎన్నికలు తొలి విడతలోనే జరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో పార్టీలు ఎన్నికల తేదీలపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టో రూపకల్పనపై ఇంకా కసరత్తులలోనే ఉన్న పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ప్రకటనతో ఒక్కసారి కంగుతిన్నాయి. ఇప్పటికే రోహిణీకార్తె ఎండలను తలపిస్తున్న ఎన్నికల హీట్.. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటన చేస్తే మరింత పెరగడం ఖాయం.
మొత్తం మీద గత ఎన్నికలలో అంటే 2019లో మార్చి 10వ తేదీన షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ సారి మూడు రోజులు ఆలస్యంగా షెడ్యూల్ ప్రకటిస్తున్నదని భావించాల్సి ఉంటుంది. మొత్తం మీద కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకా? లేక జమ్మూకాశ్మీర్ ఎన్నికలపై నిర్ణయాన్ని ప్రకటించడానికా అన్నది మరి కొద్ది సేపటిలో తేలిపోనున్నది.