విడదల రజనీ కాదు.. వసూళ్ల రాణి!
posted on Mar 13, 2024 @ 11:44AM
తమ పార్టీ నేతల అక్రమాలు, అవినీతి బాగోతాలపై విమర్శలు, ఆరోపణలు చేసే అవకాశం ప్రత్యర్థి పార్టీలకు ఇచ్చే ప్రశక్తే లేదంటున్నారు వైసీపీ నాయకులు. మా పార్టీ నేతల అవినీతి బాగోతం గురించి తామే చెబుతాముంటూ ముందుకు వస్తున్నారు. వైసీపీలో విభేదాలు వేరే లెవల్ కు చేరుతున్నాయి. సరిగ్గా ఎన్నికల ముంగిట ఆ పార్టీలోని వర్గవిభేదాలు రచ్చకెక్కడం వెనుక పార్టీ అధినేత వైఎస్ జగన్ తీరే కారణమని పార్టీ వర్గాల్లోనే విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఎవరినీ నమ్మలేకపోవడం, తనపై తప్ప మరెవరిపై విశ్వాసం లేకపోవడం, అన్నిటికీ మించి వైసీపీ అభ్యర్థిగా ఏ నియోజకవర్గంలో ఎవరిని నిలబెడితే విజయం సాధించగలరు అన్న అంచనాలలో జగన్ వైఫల్యం ఈ పరిస్థితికి కారణమని పార్టీ వర్గాలే విశ్లేషిస్తున్నాయి. అడ్డగోలుగా, హేతు రహితంగా సిట్టింగుల మార్పు అంటూ జగన్ మొదలు పెట్టిన ప్రయోగం మొదటికే మోసం తీసుకు వచ్చేలా ఉందని అంటున్నారు.
సిట్టింగుల మార్పు విషయంలో కూడా ఒక విధానం, రీతి, తీరు లేకుండా ఆయన చేస్తున్న విన్యాసాలు అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ విజయావకాశాలను మరింత దిగజార్చేస్తున్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. తాజాగా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ వైసీపీ సమన్వ యకర్తే పార్టీ కార్యకర్తలు, అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పరువును నిండా గంగలో ముంచేశారు. పార్టీ హైకమాండ్ కే అల్టిమేటమ్ జారీ చేశారు. పనిలో పనిగా మంత్రి విడదల రజనీపై ఆరోపణలు విమర్శలూ గుప్పించేస్తూ ప్రభుత్వ సలహాదారు సజ్జలనూ ముగ్గులోకి దించారు. మంత్రి రజనీ వసూళ్ల బాగోతం సజ్జలకు తెలుసునని బాంబు పేల్చారు.
విషయానికి వస్తే చిలకలూరిపేట సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి విడదల రజనీని చిలకలూరి పేట నుంచి మార్చి ఆమను గుంటూరు వెస్ట్ నుంచి రంగంలోకి దింపాలని జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. చిలకలూరి పేట నుంచి మల్లెల రాజేష్ నాయుడిని పార్టీ అభ్యర్థిగా నిలబెట్టే ఉద్దేశంతో ఆయనకు నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను అప్పగించారు. తాజా సమాచారం ప్రకారం మల్లెల రాజేష్ నాయుడిని కూడా మార్చి మరో వ్యక్తిని అక్కడ నుంచి అభ్యర్థిగా నిలబెట్టాలని జగన్ భావిస్తున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మల్లేల రాజేష్ నాయుడు తన నాయకత్వ మార్పు పై వచ్చే వార్తల పై పార్టీ కార్యకర్తలతో, తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి మంత్రి విడుదల రజని వసూళ్ల రాణి అంటూ విమర్శలు గుప్పించారు. తన వద్ద నుండి ఆరున్నర కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల దగ్గర పంచాయితీ కూడా జరిగిందనీ, ఆ తరువాత ఆమె 3 కోట్లు వెనక్కి ఇచ్చారనీ, మిగిలిన మొత్తం కూడా ఇచ్చే తీరాలని డిమాండ్ చేశారు. అక్కడితో ఆగకుండా చిలకలూరి పేట నుంచి పోటీ చేస్తే విడదల రజనీ గెలిచే అవకాశాలు ఇసుమంతైనా లేవు కనుకనే జగన్ ఆమెను గుంటూరుకు పంపేశారన్నారు.
దమ్ముంటే ఆమె చిలకలూరి పేటలో పోటీకి దిగాలని సవాల్ విసిరారు. ఇక పార్టీ హైకమాండ్ తనకు కాకుండా మరొకరికి పార్టీ టికెట్ ఇవ్వాలని నిర్ణయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక కూడా జారీ చేశారు. తనను కాదని మర్రి రాజశేఖర్ ను చిలకలూరిపేట అభ్యర్థిగా నిలబెడితే సహకరిస్తాననీ, అయితే తమ ఇద్దరినీ కాకుండా మరో వ్యక్తిని తీసుకువస్తామంటే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. పార్టీ అధినేత సిద్ధం అంటూ విపక్షాలపై విమర్శల వర్షం కురిపిస్తుంటే.. సొంత పార్టీ నేతలు మాత్రం అంతర్గత పోరాటానికే తాము సిద్ధంగా ఉన్నామనీ, అది తేలిన తరువాతే ఎన్నికల యుద్ధానికి రెడీ అవుతామని విస్ఫష్టంగా తేల్చేస్తున్నారు. ఈ పరిస్థితి ఒక్క చిలకలూరి పేటకు మాత్రమే పరిమితమై లేదనీ, జగన్ సిట్టింగుల మార్పు తంత్రంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ ఇదే పరిస్థితి ఉందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి రోజాపై సొంత పార్టీ నాయకులే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. మాప్రభుత్వంలో అవినీతి లేదంటూ ముఖ్యమంత్రి చెబుతుంటే.. సొంత పార్టీ నేతలే వైసీపీ మంత్రుల అవినీతి బండారాన్ని బయటపెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో సొంత పార్టీలోని సమస్యలను పరిష్కరించకుండా సిద్ధం అంటూ చొక్కా చేతులు మడతపెట్టినంత మాత్రాని ఎన్నికల రణరంగానికి రెడీ అయిపోయినట్లు కాదని వైసీపీ శ్రేణులే అంటున్నారు.