వివేకా వర్ధంతి రోజున సునీత రాజకీయ ప్రకటన?
posted on Mar 13, 2024 @ 12:41PM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణంగా హత్యకు గురై ఎల్లుండికి ( మార్చి 15) ఐదేళ్లు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా వివేకా ఐదో వర్ధంతి కార్యక్రమాలు కడప కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్నాయి. వైఎస్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీటిలో పాల్గొంటున్న ఆయన కుమార్తె సునీతారెడ్డి కీలక వ్యాఖ్యలు చేయనున్నారు. తన రాజకీయ అరంగ్రేటం ప్రకటించనున్నారు.
ఏపీలో మాజీ మంత్రిగా, మాజీ ఎంపీగా పనిచేసిన వైఎస్ వివేకానందరెడ్డి ఐదేళ్ల క్రితం అంటే 2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు. ఆయన హత్య ఎవరు చేశారనే దానిపై సీబీఐ ఐదేళ్లుగా విచారణ జరుపుతున్నా ఇంకా అసలు హంతకులు తేలలేదు. మరోవైపు తన తండ్రి హంతకుల్ని తేల్చేందుకు ఆయన కుమార్తె సునీతారెడ్డి తీవ్ర స్ధాయిలో న్యాయపోరాటం చేస్తున్నారు. అటు విపక్షాలు కూడా వివేకా హత్య కేసును ఎన్నికలకు ముందు చేధించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఆయన ఐదో వర్ధంతి వచ్చింది.వివేకా వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె సునీతారెడ్డి మరోసారి స్పందించే అవకాశం ఉంది. నాన్నను ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని సునీత పదే పదే చెబుతున్నారు. . ఈ కేసులో నిజాలు ఖచ్చితంగా బయటికి రావాలని, కొందరు వ్యక్తులు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. వివేకానంద్ రెడ్డి సోదరుడైన వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఆమె పీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగడం తన సోదరి సునీతకు సపోర్ట్ చేయడంతో ఐదో వర్దంతి రోజు అంటే వైసీపీ శ్రేణుల్లో గుబులు మొదలైంది. ఆమె ఏం బాంబు పేల్చుతుందో అని జగన్ పార్టీ హైరానా పడుతుంది.