పరకామణి దొంగను వెనకేసుకొస్తున్న జగన్
posted on Dec 5, 2025 @ 10:30AM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరకామణి చోరీ కేసు నిందితుడిని వెనకేసుకు వస్తున్నారు. పరకామణిలో జరిగిన చోరీ చాలా చాలా చిన్నదని అంటూ.. ఆ విషయంలో ఇంత రాద్ధాంతం ఎందుకని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే నేరం, దొంగతనం చిన్నాదా పెద్దదా అన్నది పక్కన పెడితే.. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. మన చట్టం అదే చెబుతోంది. అందులోనూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం.
తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా. కానీ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం అదేమంత పెద్ద నేరం కాదని తీసి పడేస్తున్నారు. పరకామణి లో రవికుమార్ అనే వ్యక్తి ఏదో చిన్న దొంగతనం చేశాడు.. కానీ అందుకు ప్రాయశ్చితంగా టీటీడీకి 144 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడంటూ వెనకేసుకు వచ్చారు. అటు వంటి వ్యక్తి విషయంలో ఇంత యాగీ చేస్తారేంటంటూ ఆశ్చర్యపోయారు. పరకామణి చోరీ నిందితుడిని వెనకేసుకురావడమే కాదు.. అతడిని మహాదాతగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. నిజమే జగన్ హయాంలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయి. ఆయన స్వయంగా ఆక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. అటువంటి వ్యక్తికి పరకామణి చోరీ చిన్న విషయం కనిపించడంలో ఆశ్చర్యం లేదు.. కానీ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల శ్రీవారి విషయంలో జగన్ తీరును ఎవరూ సమర్ధించరు. సమర్ధించలేరు. ఎవరి తప్పులకు వారు శిక్ష అనుభవించి తీరాలి. అయినా జగన్ మోహన్ రెడ్డి పరకామణి చోరీ నిందితుడు రవికుమార్ ను వెనకేసుకురావడం చూస్తుంటే..ఈ చోరీ కేసులోనూ ఆయన ప్రమేయం ఉందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులోనూ తాను బుక్కయ్యే ప్రమాదం ఉందన్న భయం ఆయనలో ప్రస్ఫుటంగా కనిపిస్తోం దంటున్నారు.
అందుకే పరకామణి చోరీ కేసును ఇప్పుడు తిరగతోడి విచారించడం సరికాదన్నట్లుగా మాట్లాడు తున్నారంటున్నారు. ఇక్కడ జగన్ పరకామణిలో చోరీ జరగలేదని చెప్పడం లేదు.. కానీ చోరీ చేసిన సొత్తుకంటే ఎన్నో రెట్ల ఆస్తులను టీటీడీకి ఇచ్చి ప్రాయశ్చిత్తం చేసుకున్న వ్యక్తిని ఎందుకు విచారణ పేరుతో విధిస్తారని ఆశ్చర్యపోతున్నారు జగన్. రవికుమార్ చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా రూ.144 కోట్ల ఆస్తులను టీటీడీకి ఇవ్వడం వల్లనే తన హయాంలో ఆ కేసును రాజీ చేశారని చెబుతున్న జగన్ అసలు ఓ చిరుద్యోగికి అంత ఆస్తి ఎక్కడిదన్న విషయం మాత్రం చెప్పలేదు. వాస్తవానికి ప జగన్ హయాంలో తిరుమల పరకామణిలో అవకతవకలకు హద్దు లేకుండా పోయిందనీ, రవికుమార్ ఇటువంటి చోరీలతోనే కోట్ల రూపాయలు సంపాదించాడ, ఆ సంపాదన నుంచి వందల కోట్ల రూపాయలను వైసీపీ నేతలకు రాసిచ్చాడనీ పరిశీలకులు ఆరోపణలు చేస్తున్నారు. ఏది ఏమైనా చిన్న చోరీ చేసి ప్రాయశ్నితంగా 144 కోట్లు టీటీడీకి రాసిచ్చేశానని రవికుమార్ చెప్తున్న మాటలు, ఆయనను సమర్ధించుకు వస్తూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలూ ఇసుమంతైనా నమ్మశక్యంగా లేవు. అయినా నేరం జరిగిందని నిందితుడే అంగీకరించాడు.
ఇప్పుడు జగన్ కూడా ఔను రవికుమార్ చోరీ చేశాడని చెబుతున్నారు. అలాంటప్పుడు విచారణ జరపడంలో తప్పేముంది? అన్నిటికీ మించి పరకామణి చోరీపై ఫిర్యాదు చేసిన సతీష్ హత్యకు గురి కావడంతో పరకామణి చోరీ వ్యవహారంలో రవికుమార్ వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అవి నివృత్తి కావాలంటే ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందే. అయినా ఇప్పుడు పరకామణి చోరుడు రవికుమార్ ను వెనకేసుకు వస్తూ జగన్ మాట్లాడిన మాటలు వింటుంటే గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు అన్న సామెత గుర్తుకు వస్తోందంటున్నారు పరిశీలకులు.
అదలా ఉంటే కోర్టు కూడా పరకామణి చోరీ వ్యవహారాన్ని లోక్ అదాలత్ లో రాజీ కుదుర్చుకోవడాన్ని సీరియస్ గా తీసుకుంది. ఇదేమీ చిన్న విషయం కాదని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. ఈ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితుడు రవికుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను గురువారం (డిసెంబర్ 4) విచారించిన ధర్మాసనం సతీష్‌కు సంబంధించిన కేసు లోక్ అదాలత్‌లో రాజీకి అవకాశం లేదని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది.
ఆలయాల ప్రయోజనాల పరిరక్షణలో కోర్టులే మొదటి సంరక్షకులుగా వ్యవహరిస్తాయని స్పష్టం చేసింది. పరకామణి చోరీ వంటి తీవ్రమైన కేసులో రాజీ కుదుర్చుకోవడాన్ని తేలికగా తీసుకోలేమని స్పష్టం చేసింది. తరువాత రవికుమార్ దాఖలు చేసిన అప్పీల్‌పై తదుపరి విచారణను ఈనెల 11కి వాయిదా వేసింది.