ముస్లిమ్స్ చేతిలో వైసీపీ మటాష్!

ఒక్కసారి గూగుల్ తల్లి దగ్గరకి వెళ్ళి మోస్ట్ కరప్ట్ చీఫ్ మినిస్టర్ (most corrupt chief minister) అని టైప్ చేసి చూడండి.. ఆ తల్లి అందరికంటే ఫస్ట్ ప్లస్‌లో ఏ తండ్రిని చూపిస్తుందో చూడండి.  అదలా వుంచితే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముస్లింలను దారుణంగా మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవరు అని రాష్ట్రంలో ఏ ముస్లింని అడిగినా వినిపించే ఒకే ఒక పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత ఎన్నికల ప్రచార సందర్భంగా, అలాగే ఈ ఐదేళ్ళ పదవీ కాలంలో ముస్లింల విషయంలో ముఖ్యమంత్రి జగన్ మాటలు కోటలు దాటిపోయాయి. ఆచరణలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.  జగన్ ప్రతిపక్షంలో వుండగా ముస్లింలకు తమ ఉత్తుత్తి హామీలతో 70 ఎం.ఎం. సినిమా చూపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ముస్లిం యువతుల వివాహానికి ‘షాదీ తోఫా’ పథకం కింద లక్ష రూపాయలు ఇస్తానని చెప్పారు. అయితే, అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరం తర్వాత ముఖ్యమంత్రికి ఆ పథకం గుర్తొచ్చింది. ఇంకా ఈ పథకం అమలు విషయంలో కూడా అంతా అయోమయమే. మనవాళ్ళు.. పరాయివాళ్ళు అనే భేదం షరా మామూలే. ప్రతిపక్ష నాయకుడిగా వున్నప్పుడు చెప్పిన మాటలు,  మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్నీ గాల్లో కలిసిపోయాయి. పాత హామీలు నెరవేర్చలేదు... కొత్తగా ఏ పథకమూ ప్రవేశపెట్టలేదు.ముస్లింల విషయంలో జగన్ చెప్పిన ఒక పెద్ద అబద్ధం ‘రంజాన్ తోఫా’. తెలుగుదేశం ప్రభుత్వం ఏటా నాలుగు లక్షల మంది పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించేది. జగన్ వచ్చాక తోఫా ఇవ్వకుండా ధోకా ఇచ్చారు. తెలుగుదేశం హయాంలో ముస్లిం, మైనారిటీ విద్యార్థులకు ఏటా ఐదు వేల వరకు స్కాలర్‌షిప్ అందేది. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆ షిప్పు మునిగిపోయింది. ఉర్దూకు ద్వితీయ భాష హోదా ఇస్తానని జగన్ చేసిన బాస నీటిమీద రాత అయిపోయింది. ఇచ్చిన మాట ప్రకారం ఉర్దూ పాఠశాలలను అభివృద్ధి చేసింది లేదు. ఉర్దూ టీచర్ల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేసిందీ లేదు. టీడీపీ ప్రభుత్వం ఉర్దూ అకాడమీ ద్వారా ప్రతి ఏడాది ఉత్తమ ఉపాధ్యాయులకు 5 వేల నుంచి 10 వేల వరకు ప్రోత్సాహక నగదు ఇచ్చేది. మన జగనన్న వచ్చాక ఆ ప్రోత్సాహక పథకం నిరుత్సాహంలో పడిపోయింది. ఇక వక్ఫ్ భూములను వైసీపీ  నాయకులు గుటకాయస్వాహా చేయడం అనే సంగతి సరేసరి. ఇలా ఏరకంగా చూసి  జగన్ ప్రభుత్వ హయాంలో ముస్లింలకు తీరని అన్యాయమే జరిగింది. అందుకే ఈసారి వైసీపీని మటాష్ చేయడానికి, జగన్ అండ్ కంపెనీకి కర్రు కాల్చి వాత పెట్టడానికి ముస్లింలు రెడీగా వున్నారు.

క్రోధులకు బుద్ధి చెప్పే శ్రీ క్రోధి

ఇది శ్రీ కోధి నామ సంవత్సరం. క్రోధి అని పేరు వుండేసరికి జనానికి క్రోధం గుర్తొస్తుంది. ఈ సంవత్సరం జనం మీద క్రోధంగా వ్యవహరిస్తుందా అనే సందేహాలు చాలామందికి కలగడం సహజం. అయితే పండితులు చెప్పేది ఏమిటంటే, శ్రీ క్రోధి నామ సంవత్సరం అందరి మీదా క్రోధాన్ని ప్రదర్శించదు.. క్రోధంతో వ్యవహరించేవారి మీద మాత్రం క్రోధంగా వ్యవహరిస్తుంది.. అంటే, కోపాన్ని ప్రదర్శిస్తుంది. ఈ వివరణ ఏపీ ప్రజలకు  ఆనందం కలిగించే విషయం. ఐదేళ్ళ నుంచి ప్రజలు వైసీపీ క్రోధుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూనే వున్నారు. గత ఎన్నికల సందర్భంగా పెచ్చుమీరిపోయిన వైసీపీ వర్గాల క్రోధపు పనులు అధికారంలోకి వచ్చాక మరింత పెరిగిపోయాయి. ప్రతిపక్షాలకు చెందిన వారి విషయంలో క్రోధంగా వ్యవహరించడం, ఇంతవరకు రాజకీయ రంగంలో ఎప్పుడూ లేని విధంగా అకారణ కోపాన్ని ప్రదర్శించడం చూశాం. వీరి క్రోధం రాజకీయాల వరకు ఆగిపోకుండా ఇళ్ళలో వుండే మహిళల వరకూ వెళ్ళడం గమనించాం. శ్రీ క్రోధి నామ  సంవత్సరం పుణ్యమా అని ఈ క్రోధపు బ్యాచ్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి విముక్తి కలిగితే అంతకంటే కావల్సింది ఏముంటుంది?

25న పులివెందులలో జగన్ నామినేషన్ 

21 రోజుల పాటు బస్సు యాత్రను నిర్వహించాలని వైఎస్ జగన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇంకో వారం రోజుల్లో బస్సు యాత్ర ముగిసే అవకాశం ఉంది. ఈ నెల 18వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురానికి చేరుకుని అక్కడ బస్సు యాత్ర ముగింపు సభలో ప్రసంగించేలా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసింది వైఎస్ఆర్సీపీ. అనంతరం వైఎస్ జగన్ కడప జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21, 22 తేదీల్లో తన సొంత నియోజకవర్గం పులివెందులలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. 25వ తేదీన పులివెందులలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారని చెబుతున్నారు. ఈ మేరకు కడప జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అనంతరం వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా మరోసారి పర్యటనలను నిర్వహిస్తారు. మే 11వ తేదీన ఎన్నికల ప్రచారానికి తెర పడేంత వరకూ కూడా 175 నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ ప్రణాళికను జగన్ రూపొందించుకున్నారు. పులివెందుల నియోజకవర్గం ప్రచార బాధ్యతలను ఆయన భార్య వైఎస్ భారతి తీసుకుంటారు. కడప లోక్‌సభ పరిధిలోని పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు, ప్రొద్దుటూరు, కడప అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతి విస్తృతంగా పర్యటిస్తారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆమె ప్రచారాన్ని నిర్వహిస్తారు.  

గెలుపు ఆశలు ఆవిరి.. అభ్యర్థుల మార్పుపై వైసీపీ మళ్లీ మల్లగుల్లాలు!

ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలో ఓటమి భయం పెరిగిపోతున్నది. విజయావకాశాలపై నమ్మకం కోల్పోవడంతో దింపుడు కళ్లెం ఆశగా ఆ పార్టీ మరోసారి అభ్యర్థుల మార్పుపై దృష్టి సారించింది. వైసీపీ గెలుపు అవకాశాలు రోజురోజుకూ దిగజారిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వరుసగా వెలువడుతున్న సర్వేలలో కూడా ఆ పరిస్థితి కనిపిస్తున్నది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేదని తాజాగా జన్మత్ సర్వే పేర్కొంది. దీంతో విజయంపై ఇంత కాలం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వస్తున్న వైసీపీ   ఇప్పుడు పలు నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్చి అయినా సరే వ్యతిరేకతను తగ్గించుకోవాలన్న భావనకు వచ్చినట్లు కనిపిస్తోంది.   ప్రధానంగా కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిని మార్చాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీలో ఉండటంతో వైసీపీకి భారీ నష్టం తప్పదన్న అంచనాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో అవినాష్ పోటీలో ఉంటే వైసీపీ మూడో స్థానానికి పడిపోవడం ఖాయమన్న విశ్లేషణల నేపథ్యంలో  ఆయనను మార్చేసే విషయాన్ని జగన్ సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ముఖ్యంగా  జగన్  పోటీ చేసే పులివెందుల నియోజకవర్గం కడప లోక్ సభ పరిధిలో ఉండటంతో అవినాష్ కడప నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం పులివెందులపై కూడా పడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ఆందోళనతో జగన్ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టి  ఆయన స్థానంలో అభిషేక్ రెడ్డిని నిలిపే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఈ మేరకు నేడో రేపో అధికారికంగా ప్రకటించే  ఛాన్సస్ ఉన్నాయని చెబుతున్నారు.   అదే విధంగా  ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో అభ్యర్థుల మార్పుపై కూడా వైసీపీ హైకమాండ్ అంటే జగన్ ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు.  మైలవరంలో సర్నాల తిరుపతిరావు స్థానంలో ప్రస్తుతం పెనమలూరు అభ్యర్థి జోగి రమేష్‌ను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని  పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.  మైలవరం తెలుగుదేశం అభ్యర్థి  వసంతకృష్ణ ప్రసాద్‌కు గట్టి పోటీ అయినా ఇవ్వాలంటే ఈ మార్పు తప్పదని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే  విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి షేక్ ఆసిఫ్ స్థానంలో ఇటీవలే జనసేన నుండి వైఎస్‌ఆర్‌సిపిలో చేరిన పోతిన మహేష్‌ను భర్తీ చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఇక గుంటూరు పశ్చిమ  అభ్యర్థి కిలారి రోశయ్యను గుంటూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపి, ఆ స్థానానికి మరో అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు.  మొత్తం మీద పలు నియోజకవర్గాలలో అభ్యర్థుల మార్పుపై వైసీపీ హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. మరో వైపు తెలుగుదేశం కూటమిలో సీట్ల సర్దుబాటు సజావుగా పూర్తి అయ్యి, ఆయా నియోజకవర్గాలలో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుంటే.. అధికార వైసీపీలో కీలక నియోజకవర్గాలలో ఇంకా అభ్యర్థుల విషయంలో ఒక నిర్ణయానికి రాలేక మల్లగుల్లాలు పడుతుండటం, ప్రకటించిన అభ్యర్థుల స్థానంలో మరొకరిని పోటీకి దించే అవకాశాలపై పార్టీలోనే చర్చ జరుగుతుండటంతో  పార్టీ క్యాడర్ లో అయోమయం నెలకొంది. దీంతో ఆ పార్టీ ప్రచారం నత్తనడకన సాగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

వేదాలు వల్లిస్తున్న బీఆర్ఎస్ దెయ్యాలు!

‘దెయ్యాలు వేదాలు వల్లించినట్టు’ అనే సామెత అందరికీ  తెలిసిందే. ఇప్పుడు ఆ సామెత బీఆర్ఎస్ దెయ్యాలకు... సారీ  బిఆర్ఎస్ నేతలకు సరిగ్గా సరిపోతుంది. ఈమధ్యకాలంలో చాలామంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల కారాలూ మిరియాలు నూరుతున్నారు. ఇలా ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్ళడం నీతి బాహ్యమైన చర్య అని ఆక్రోశిస్తున్నారు. ఇలా పార్టీలు మారడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం అని, ప్రజాస్వామ్యానికే గొడ్డలివేటు అని పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళ ప్రెస్ మీట్లు ఎవరైనా అమాయకులు చూశారంటే అయ్యోపాపం అని జాలిపడతారు. కాంగ్రెస్ పార్టీ దారుణం చేస్తోందని కోపగిస్తారు. అయితే ఇక్కడ వెరైటీ ఏమిటంటే, పార్టీ ఫిరాయింపుల విషయంలో నీతులు వల్లిస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరెవరో కాదు.. గతంలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీదో, టీడీపీ టిక్కెట్ మీదో గెలిచి ఎమ్మెల్యేలు అయి, ఆ తర్వాత అప్పటి టిఆర్‌ఎస్‌లో  చేరిపోయిన ప్రబుద్ధులే. అప్పట్లో నిర్దాక్షిణ్యంగా పార్టీ మారిపోయిన ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇలా సంప్రదాయినీ, సుప్పినీ, సుద్దపూసనీ అన్నట్టుగా నీతులు చెబుతూ వుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు. ఎర్రబెల్లి దయాకర్, కె.పి.వివేకానంద... ఇలా గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు నీతి సూత్రాలు వల్లిస్తున్నారు. రాజకీయాల్లో ఇంకా వెరైటీ ఏమిటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడుతున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేపో ఎల్లుండో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినా చేరిపోతారు. ఇలాంటి కప్పల తక్కెడ రాజకీయాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోవడం మానేసి చాలాకాలం అయింది.

19న బాలకృష్ణ నామినేషన్ 

ఎపీలో సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 19న ఆయన హిందూపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపటి నుంచి బాలకృష్ణ ఎన్నికల ప్రచార బరిలో దిగనున్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం సాగించనున్నారు. బాలయ్య కదిరి నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. అనంతరం, ఈ నెల 25 నుంచి ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటారు.  కాగా, ఏపీలో ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్  29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. రాష్ట్రంలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్న సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధమైంది. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో ఆయన రాయలసీమ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి కాగా కదిరి నుంచి యాత్ర ప్రారంభం కానుంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్నారు. రాయలసీమలో రేపటి నుంచి విస్తృతంగా పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో కదిరి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న బాలకృష్ణ ఈ నెల 19న హిందూపురంలో నామినేషన్‌ వేయనున్నారు. ఈ నెల 25 నుంచి ఉత్తరాంధ్రలో ప్రచారం చేయనున్నారు. హ్యాట్రిక్ విజయాల దిశగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పార్టీల కతీతంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన బాలకృష్ణ ప్రజలకు అందుబాటులో ఉంటూ పలు సేవా కార్యక్రమాలను సైతం కొనసాగిస్తున్నారు. తాజా ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభల్లో బిజీగా ఉన్నారు. రాయలసీమ పర్యటన అనంతరం ఉత్తరాంధ్రలో బాలకృష్ణ ప్రచారం ఉంటుంది.

మీనా గారూ.. ఏపీ గురించీ ప్రార్థించండి!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల వర్క్.లో బిజీగా వున్నారు. మధ్యమధ్యలో కాస్త వెసులుబాటు కల్పించుకుని రాష్ట్రంలో వున్న పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. లేటెస్ట్ గా ఆయన సతీమేతంగా తిరుమల శ్రీవారిని సందర్శించారు. దేవాలయం నుంచి ప్రశాంత వదనాలతో బయటకి వచ్చిన ముఖేష్ కుమార్ మీనా కుటుంబాన్ని చూస్తుంటే, ఏపీ ఎన్నికలు కూడా ఇంతే ప్రశాంతంగా జరిగితే బాగుండు కదా.. ఎన్నికల సందర్భంగా ఓటర్లు కూడా ఇంత ప్రశాంతంగా ఉండగలిగితే బాగుంటుంది కదా అనిపించింది.  గత ఎన్నికల సందర్భంగా అధికారంలో లేకపోయినప్పటికీ వైసీపీ గూండాలు చేసిన అరాచకాలు, ప్రజాస్వామ్యంతో ఆడిన పరాచికలు చూశాం. రాజకీయాలు ఇలా కూడా వుంటాయా అనుకుని ఆశ్చర్యపోయాం. ఈసారి కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే భయంలో ఏపీ ప్రజలు వున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ముఖేష్ కుమార్  మీనా పనితీరును చూస్తుంటే ఈసారి వైసీపీ తప్పులు ఉడకవన్న నమ్మకం కలుగుతోంది. ఎందుకంటే, లేట స్ట్.గా ఆయన, ప్రభుత్వ సలహాదారు హోదాలో వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న సజ్జలకి వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ముఖేష్ కుమార్ మీనాకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఒక విన్నపం. అదేంటంటే, ముఖేష్ గారూ, మీరు ఏపీలో మీకు వీలైనన్ని పుణ్య క్షేత్రాలను సందర్శించండి. మీ కుటుంబం మేలు కోసం ప్రార్థించండి. పనిలోపనిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి కూడా ప్రార్థించండి. ఎన్నికలు సక్రమంగా జరగాలని, దొంగ ఓట్లు పడకూడదని, దౌర్జన్యాలు జరక్కూడదని, రిగ్గింగుల్లాంటివి జరక్కూడదని, ఓటింగ్ ప్రక్రియలోకి వైసీపీ కార్యకర్తల్లాంటి వాలంటీర్లు ఎంటరవ్వకూడదని, పోలింగ్‌కి - కౌంటింగ్‌కి మధ్య ఏ గూడుపుఠానీలు జరక్కూడదని, కౌంటింగ్ న్యాయంగా జరగాలని ప్రార్థించండి సార్... పోనీ, అలా ప్రార్థించినా, ప్రార్థించకపోయినా, పైన పేర్కొన్న న్యాయమైన విషయాలు అమ లయ్యేలా ఒక నిస్పాక్షిమైక ఎన్నికల అధికారిగా పనిచేయండి.

కడపలో ఫ్యామిలీ ఫైట్.. రంగంలోకి వైఎస్ భారతి?!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం అడ్డా కడప గడ్డ. కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి 1984 నుంచి వరుసగా వైఎస్ కుటుంబ సభ్యులే విజయం సాధిస్తూ వస్తున్నారు. అటువంటి కడప గడ్డపై ఇప్పుడు ఎన్నికల పోరు వైఎస్ కుటుంబ సభ్యుల మధ్యే జరుగుతుండటం విశేషం. 2019 ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఇప్పుడు కడప బరిలో ప్రధాన ఎన్నికల అజెండాగా మారిపోయింది. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల స్వయంగా కడప లోక్ సభ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి.. వైసీపీ తరఫున ఇక్కడ రెండో సారి పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డితో ఢీ అంటే ఢీ అంటున్నారు. అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైఎస్ వివేకా హత్యకు కుట్రదారుడు అవినాష్ రెడ్డి అనీ, ఆయనను తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాపాడుతున్నాడనీ ఆరోపిస్తూ షర్మిల నియోజకవర్గాన్ని చుట్టేస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.  అవినాష్ రెడ్డిని, ఆయనను కాపాడుతున్న తన అన్న జగన్ మోహన్ రెడ్డిని ఓడించడమే ఏకైక ఎజెండాతో షర్మిల కడప బరిలో పోటీకి దిగారు.  ఇక షర్మిలకు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత మద్దతుగా నిలుస్తూ ఆమె కూడా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తుండటం అవినాష్ కే కాకుండా ముఖ్యమంత్రి జగన్ కు కూడా ఇబ్బందికరంగా పరిణమించింది. కడప బరిలో షర్మిల పది శాతం ఓట్లు సాధిస్తే అవినాష్ ఓటమి ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసలే షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత ఇంత వరకూ వైఎస్ కు దన్నుగా ఉన్న కాంగ్రెస్ సంప్రదాయ ఓటు దాదాపుగా కాంగ్రెస్ వైపు మళ్లిపోవడం ఖాయమన్న అంచనాల మధ్య కడప బరిలో షర్మిల పోటీ   ఆ నియోజకవర్గంలో అవినాష్ గెలుపు అవకాశాలను సంక్షిష్టం చేసింది.  షర్మిలకు ఎంత  మేరకు ఓటింగ్ శాతం పెరిగితే అంత మేరకు కడపలో తెలుగుదేశం విజయం, మెజారిటీ పెరుగుతుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.  ఎలా చూసినా కడప లోక్ సభ నియోజకవర్గంలో అవినాష్ కు గడ్డు పరిస్థితులే ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.   1984 తర్వాత జరిగిన కడప నియోజకవర్గానికి జరిగిన పది ఎన్నికల్లోనూ ఇక్కడ నుంచి వైఎస్ కుటుంబ సభ్యులే గెలుపొందారు. ఇప్పుడు ఆ ఒరవడికి గండి పడే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.  కడపలో షర్మిల పోటీ ప్రభావం పులివెందుల నియోజకవర్గంపై కూడా పడే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పులివెందుల నుంచి వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో  షర్మిల ప్రభావం జగన్ విజయంపై ఏ మేరకు పడుతుందన్న ఆందోళన వైసీపీలో వ్యక్తం అవుతున్నది. కపడలో వైఎస్ కుటుంబ సభ్యుల రాజకీయ రణం.. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నది.  పులివెందులలో జగన్ ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేయనున్నారు. సరిగ్గా ఆరోజు నుంచే జగన్ సతీమణి వైఎస్ భారతి భర్త తరఫున పులివెందులలో విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. పులివెందులలోనే క్యాంప్ చేసి ఆమె జగన్ ఎన్నికల ప్రచార భారాన్ని తన భుజస్కంధాలపై మేయడానికి రెడీ అయిపోయారు. పులివెందులలో జగన్ విజయం కాదు మెజారిటీ కూడా పెంచుకోవడమే లక్ష్యంగా భారతి వ్యూహరచన చేస్తున్నరని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. పులివెందులలో మెజారిటీని గణనీయంగా పెంచుకోవడం ద్వారా కడప లోక్ సభ స్థానం నుంచి అవినాష్ రెడ్డి రెండో సారి ఎంపీగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమం చేయాలని భావిస్తున్నారు.  మరి కడప జనం ఈ ఫ్యామిలీ ఫైట్ లో ఎటువైపు అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే. 

మద్యం కుంభకోణం కీలక సూత్రధారి కవిత.. కోర్టుకు తెలిపిన సీబీఐ

ఢిల్లీ మద్యం కుంభకోణంలో  తెలంగాణ  మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిండా మునిగినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో ఈడీ, సీబీఐలు కవితను ఇప్పటికే అరెస్టు చేశాయి. మద్యం కుంభకోణంలో కవితే కీలక సూత్రధారి అని ఆ రెండు దర్యాప్తు సంస్థలూ కూడా చెబుతున్నాయి. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు, పత్రాలు, వాట్సాప్ చాట్‌లు, ఈ మెయిల్స్ పత్రాలను కూడా ఆ సంస్థలు కోర్టుకు సమర్పించాయి. తాజాగా  లిక్కర్ స్కామ్ కేసులో కవితను సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో  శుక్రవారం (ఏప్రిల్ 12) హాజరు పరిచి  ఐదు రోజుల కస్టడీకి  కోరింది. ఈ సందర్భంగా కోర్టులో కవితపై సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది.  విజయ్ నాయర్ తో పాటు పలువురితో  కలిసి కవిత లిక్కర్ స్కామ్ స్కెచ్ వేశారని ఆరోపించింది. ఢిల్లీ, హైదరాబాద్‌లో సమావేశాలు జరిపారని పేర్కొంది. కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం.. ఎమ్మెల్సీ కవిత పాత్ర స్పష్టమమవుతోందని సీబీఐ కోర్టుకు తెలిపింది.   సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్ల రూపాయలు సమీకరించి ఆ సొమ్మును కవితే ఆప్ నేతలకు కవిత అందించారని సీబీఐ కోర్టుకు తెలిపింది. కవిత సూచన మేరకే మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాతిక కోట్ల రూపాయలు ఇచ్చారని  పేర్కొంది. ఇందుకు సంబంధించి వాట్సాప్ చాట్‌లను ధృవీకరణగా చూపింది.  మరో వైపు ఈడీ కూడా దాదాపు ఇవే అంశాలను సాక్ష్యాలతో సహా కోర్టుకు తెలియజేసిన సంగతి విదితమే. ఈడీ అందించిన వివరాలు, ఆధారాల మేరకు కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మధ్యంతర బెయిలును తిరస్కరించిన సంగతి తెలిసిందే. మధ్యంతర బెయిలు తిరస్కరించిన సందర్భంగా న్యాయమూర్తి   ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత ప్రమేయంపై ఈడీ ఆధారాలు చూపిందని పేర్కొన్నారు. అంతే కాకుండా దేశ విదేశాలలో ఉన్నత  చదువులు చదువుకుని,  భారత్‌ జాగృతి సంస్థకి అధ్యక్షురాలుగా మహిళలను చైతన్యపరిచిన కవిత, ఒక ఎంపీగా పార్లమెంటులో పలు స్టాండింగ్ కమిటీలలో పని చేశారనీ, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారనీ అటువంటి ఆమె అమాయకంగా మద్యం కేసులో తనను ఎవరో ఇరికించారంటే విశ్వసించజాలమని స్పష్టం చేసింది.   ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత ప్రమేయం ఉన్నట్లు  ఈడీ బలమైన సాక్ష్యాధారాలు సమర్పించిందనీ, విచారణకు ఆమె సహకరించలేదనడానికీ ఈడీ ఆధారాలు సమర్పించిందనీ, ఆమె ఈడీకి స్వాధీనం చేసిన మెబైల్ ఫోన్లలో డేటాను తొలగించారని ఫోరెన్సిక్ నివేదిక పేర్కొందని చెప్పారు.  వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని చూస్తే కవితకు ఇప్పట్లో బెయిలు వచ్చే అవకాశాలు మృగ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం .. అభ్యర్థుల మార్పుపై చర్చ

ఎపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. కూటమిలోని అన్ని పార్టీలు కలిసికట్టుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. తాజాగా అమరావతిలోని చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ కూడా భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహరచన, ఉమ్మడి మేనిఫెస్టో, రాష్ట్ర ప్రచారానికి జాతీయ నేతలను ఆహ్వానించడం తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై వీరు చర్చించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బీజేపీకి బదులుగా టీడీపీ పోటీ చేయడం, దీనికి బదులుగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి బీజేపీకి అవకాశం ఇవ్వడం వంటి అంశాలపై నేతలు చర్చించారు.  ఉండి నియోజకవర్గం అభ్యర్థి రఘురామ రాజు గెలుపుకోసం త్రి కూటమి చేయాల్సిన విధుల మీద చర్చ జరిగింది. ఉండి దేశం నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. నేతల మధ్య అభిప్రాయ బేధాలను నిర్మూలించడానికి చంద్రబాబు చర్చలు జరిపారు. ఉండి ఎమ్మెల్యే శివరామరాజు ను ఒప్పించడానికి చంద్రబాబు జరిపిన చర్చలు ఫలించాయి.అనపర్తి నియోజకవర్గ అభ్యర్థి మీద చర్చ జరిగింది. మార్పు కోరుకుంటున్న స్థానాల మీద త్రి కూటమి నేతలు చర్చించారు. ఈ సమావేశం తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కల్సి ఉమ్మడి సభల్లో పాల్గొన్నారు. 

ఇది ఎవరూ ఊహించని దారుణం!

సరిగ్గా నెల రోజుల క్రితం.. మహబూబ్‌నగర్ జిల్లా గార్ల మండలం  అంకన్నగూడెం గ్రామం.. ముద్దులొలికే చిన్నారులు మూడేళ్ళ లోహిత, ఏడాది వయసున్న జశ్విత తమ కోసం పాలు సిద్ధం చేస్తున్న తల్లి వైపు ప్రేమగా చూస్తున్నారు. ఆ తల్లి లోహితకు గ్లాసులో, జశ్వితకి బాటిల్లో పాలు పోసి ఇచ్చింది. ఆకలి మీద వున్న ఇద్దరు పిల్లలూ పాలు తాగారు. అంతే, విషం కలిపిన ఆ పాలు తాగిన ఇద్దరు చిన్నారులు క్షణాల్లో నురగలు కక్కుకుంటూ, కిందపడి గిలగిలా కొ్ట్టుకుంటూ చనిపోయారు. ఇదంతా అక్కడే వుండి చూస్తున్న ఆ చిన్నారుల తల్లిదండ్రులు అనిల్, దేవి ముఖాల్లో ఎంతమాత్రం బాధ కనిపించడం లేదు. తన పేగు తెంచుకుని పుట్టిన ఇద్దరు పిల్లలు బాధతో విలవిలలాడుతూ కన్ను మూసినా ఆ తల్లిలో ఎంతమాత్రం జాలి కనిపించడం లేదు. ఇద్దరు పిల్లలూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఆ కిరాతక తల్లిదండ్రులు ఇద్దరూ ఇంట్లోంచి బయటకి వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి అనిల్ తండ్రి వెంకన్న ఇంటికి వచ్చి ఈ దారుణం చూశాడు. ఈ వార్త కాసేపట్లో ఊరంతా పాకిపోయింది.  బయ్యారం మండలంలోని రాయికుంట గ్రామంలో అనిల్ ఇటుకల బట్టీలో పనిచేసేవాడు. అనిల్‌కి అదే గ్రామానికి చెందిన దేవితో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమకు పెద్దలు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఐదేళ్ళక్రితం ఇద్దరికీ పెళ్ళి చేశారు. పెళ్ళయ్యాక కొంతకాలం సజావుగా వీరి కాపురం సాగింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఆ తర్వాతే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అడపాదడపా గొడవపడుతూనే వుండేవారు. వీరిమధ్య సయోధ్య కుదర్చడానికి పెద్దలు ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. మరి ఏమైందో ఏమో.. తమ కుటుంబ సమస్యను పరిష్కరించుకోవాలంటే పిల్లల్ని చంపడమే కరెక్టని అనుకున్నారేమోగానీ, ఈ ఇద్దరూ కలసి తమ పిల్లలకు పాలతోపాటు విషం ఇచ్చి చంపేశారు.  ఆ తర్వాత ఇద్దరూ ఇంట్లోంచి వెళ్ళిపోయారు. పసికందులను చంపి పరారైన తల్లిదండ్రులు అనిల్, దేవి కోసం గత నెల రోజులుగా పోలీసులు గాలిస్తూనే వున్నారు. ఇప్పుడు అందరికీ షాకింగ్ న్యూస్ తెలిసింది. అనిల్, దేవి మృతదేహాలు అడవిలో చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. పిల్లలను చంపిన తర్వాత అడవికి వెళ్ళిన ఈ ఇద్దరూ అప్పుడే ఉరి వేసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. చనిపోయి నెలరోజులు కావడంతో వీరి మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాయి. అనురాగం, ఆప్యాయతలతో అన్యోన్యంగా ఉండాల్సిన కుటుంబం వివాదాల కారణంగా ఇలా అంతమైపోవడం దారుణమని స్థానికులు బాధపడుతున్నారు.

విజయసాయి రెడ్డి గవర్నరా? బుర్రుందా?

వైసీపీ ఏ2 విజయసాయిరెడ్డి మెరుపు కలలు మామూలుగా  లేవుగా. అయ్యగారి దృష్టి ఇప్పుడు గవర్నర్ పదవి మీద  పడింది. ఈ ఆర్థిక నేరగాడు రెండుసార్లు రాజ్యసభకు వెళ్ళడమే ప్రజాస్వామ్యంలో జరిగిన పెద్ద పొరపాటు అని ప్రజాస్వామ్యవాదులు అనుకుంటుంటే, ఏకంగా గవర్నర్  పదవిని ఆశిస్తున్నట్టు చెప్పి విజయసాయిరెడ్డి తన దురాశని సిగ్గూ ఎగ్గూ లేకుండా బయటపెట్టుకున్నారు. విజయసాయిరెడ్డి రెండుసార్లు చొక్కా నలగకుండా, చెమట చుక్క చిందించకుండా ఎంచక్కా రాజ్యసభ సభ్యత్వాన్ని పొందారు. ఏ1 జగన్ పుణ్యమా అని ఏ2 విజయసాయిరెడ్డి ఉన్నత పదవిలో ఊరేగారు. పదవి పెంచిన అహంకారం ప్రకోపించి తన వాచాలత్వాన్ని అనేక సందర్భాల్లో  ప్రదర్శించారు. తన ట్విట్టర్ అకౌంట్లో బూతుపురాణాలు రాశారు.  ప్రపంచ వ్యాప్తంగా ట్విటర్ని అత్యంత నీచాతి నికృష్టంగా వాడిన వాళ్ళ లిస్టు తయారు చేస్తే అందులో విజయసాయి  పేరు టాప్ ఫైవ్‌లో వుండే అవకాశం వుంది. కుసంస్కారంలో పరిధులు దాటిపోయిన ఈయన ఇప్పుడు గవర్నర్ లాంటి పెద్దమనిషి పదవిని ఆశించడమే వింతల్లోకెల్లా వింత. పరువు పాతాళానికి పోతుంటే, మాటలు ఆకాశంలో  విహరించడం అంటే ఏమిటో విజయసాయి రెడ్డిని చూస్తే అర్థమవుతుంది. ఏపీలో ఈసారి వైసీపి తుడిచిపెట్టుకుని పోవడం ఖాయమనే విషయం అందరికీ అర్థమైపోయింది. వైసీపీ నాయకులకు కూడా ఈ విషయం అర్థమైపోయినా అర్థం  కానట్టు భ్రమల్లో బతుకుతున్నారు. 2024 ఎన్నికల తర్వాత తనని గవర్నర్ చేయాలని, ఒకవేళ 2024లో కుదరకపోతే  2029 ఎన్నికల తర్వాత అయినా తనను గవర్నర్‌గా  రికమండ్ చేయాల్సిందిగా జగన్‌ని విజయసాయిరెడ్డి రిక్వెస్ట్  చేశారట, తన రిక్వెస్ట్.ని జగన్ ఓకే చేస్తారని ఆశిస్తున్నారట.   సర్పంచ్‌గా పోటీ చేసినా గెలవలేని స్థాయి వున్న విజయసాయిరెడ్డిని ఈసారి ఏకంగా నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా జగన్ ఆదేశించారు. ఈ ఆదేశం శరాఘాతంలా తగిలినప్పటికీ చేసేదేం లేక నెల్లూరు నియోజవర్గంలో విజయసాయిరెడ్డి ఫ్యామిలీ మెంబర్లతో కలసి ప్రచార తంటాలు పడుతున్నారు. వేడివేడి బిర్యానీ పెడతామని పిలుస్తున్నా జనం పట్టించుకోకుండా విజయసాయి ప్రచార సభల నుంచి పారిపోతున్నారు. నెల్లూరు ఎంపీ స్థానంలో విజయసాయిరెడ్డి గెలిచే అవకాశం లేదని ఏమాత్రం రాజకీయ అవగాహన వున్నవారికైనా అర్థమయ్యే విషయమే. మరి విజయసాయిరెడ్డికి అర్థం కాకుండా వుంటుందా? అందుకేనేమో 2024 ఎన్నికల తర్వాత గవర్నర్ గిరీ దక్కించుకుంటే ఏ కేసులూ గట్రా లేకుండా హ్యాపీగా విశ్రాంతి తీసుకోవచ్చని అయ్యగారు భావిస్తున్నట్టున్నారు. కలలు కనొచ్చుగానీ, కాస్త సాధ్యాసాధ్యాలు కూడా చూసుకోవాలి కదా విజయసాయిరెడ్డి సార్!

కవితమ్మ ఇప్పట్లో బయటకి రానట్టేనా?

కల్వకుంట్ల కవితమ్మ తీహార్ జైల్లోనే బతుకమ్మ ఆడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వందకోట్లు పెట్టుబడి పెట్టి వెయ్యి కోట్లు సంపాదించాలని ‘ఢిల్లీ మద్యం కలలు’ కన్న కవితమ్మ పరిస్థితి ఇప్పుడు ఎలా మారిపోయిందో అందరూ చూస్తూనే వున్నారు. అధికారంలో వున్నతవరకు తెలంగాణ  మహిళలకు రోల్ మోడల్‌గా తనను తాను ప్రొజెక్టు చేసుకుని, చివరికి తెలంగాణ తల్లి విగ్రహాల్లో కూడా తన పోలికలు వుండేలా తనను తాను ప్రమోట్ చేసుకున్న కవితమ్మ ఇప్పుడు తెలంగాణ ప్రజలు... ముఖ్యంగా మహిళలు ఏవగించుకునే పరిస్థితికి వచ్చారు. ‘మీరు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు?’ అని టీవీ ఇంటర్వ్యూలో అనే ప్రశ్నకు ‘మద్యాన్ని నిర్మూలిస్తాను’ అని ఎంతో హుందాగా సమాధానం ఇచ్చిన కవితమ్మ ఎంచక్కా వేల కోట్ల మద్యం వ్యాపారంలోకి ఎంటరైపోవడాన్ని తెలంగాణ మహిళలు చాలా తీవ్రంగా భావిస్తున్నారు. సర్లే, జనం ఎంత వ్యతిరేకించినా అధికారం ఇవ్వకపోవడం మినహా మరేమీ చేయలేరు. కానీ, కవితమ్మ చుట్టూ చుట్టుకుంటున్న కేసులు ఆమెను ఇప్పట్లో తీహార్ జైల్లోంచి బయటకి రానిచ్చేట్టు లేవు. గురువారం నాడు తీహార్ జైల్లో కాసేపు భగవద్గీత చదువుకుని, ఆ తర్వాత కాసేపు జపమాలతో జపం చేసుకుని, ఇంకాసేపు తన కొడుకు పదో తరగతి పరీక్షలు బాగా రాయాలని, తల్లి జైల్లో వున్న బాధ ఆ పసి మనసులో వుండకూడదని ప్రార్థన చేసుకున్న తర్వాత కళ్ళు తెరిచి చూస్తే, ఎదురుగా సీబీఐ అధికారులు. కవితమ్మను ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగిన సీబీఐ అధికారులు వెళ్తూవెళ్తూ కవితమ్మ మీద మరో కేసు బుక్ చేసి మరీ వెళ్ళారు. ఈడీ కేసులోంచి బయటపడేది ఎలారా భగవంతుడా అని తంటాలు పడుతున్న కవితమ్మకు మూలిగే నక్క మీద తాటికాయలా సీబీఐ కేసు పడినట్లైంది. వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ లాంటి కేసుల విషయంలో తప్ప సీబీఐ ఒక్కోసారి చాలా వేగంగా పనిచేస్తుంది. గురువారం నాడు ఇలా జైలుకు వచ్చి కవితమ్మ మీద కేసు బుక్ చేసిన సీబీఐ శుక్రవారం నాడు ఆమెని ఢిల్లీలో కోర్టు ముందు హాజరుపరిచారు. ఐదు రోజులపాటు కవితమ్మను తమ కస్టడీకి అనుమతించాలని కోరారు. అందుకు కోర్టు అనుమతించింది. ఈ నెల 14 వరకూ కవితను సీబీఐ కస్టడీకి ఇచ్చింది. మద్యం స్కామ్‌లో కవితమ్మ భారీగానే ఇన్వాల్వ్ అయ్యారంటూ, దానికి సంబంధించిన అనేక ఆధారాలను కోర్టుకు సీబీఐ సమర్పించింది. రాబోయే రోజుల్లో సీబీఐ కస్టడీలో కవితమ్మ ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఆ ‘విచారణ’ ఏ రేంజ్‌లో వుంటుందో ఏమో... నిన్నటి వరకు కవితమ్మ మీద ఈడీ కేసు ఒక్కటే వుంది. ఇప్పుడు అగ్నికి ఆజ్యంలా సీబీఐ కేసు కూడా వచ్చి పడింది. ఈ రెండు వ్యవస్థలూ కవితమ్మకు బెయిల్  రాకుండా తమ శాయశక్తులా కృషి చేస్తాయి. ఒక కేసులో బెయిల్ వచ్చినా బయటకి వచ్చే ఛాన్స్ లేదు. మొత్తమ్మీద కవితమ్మ పీకల్లోతు  కష్టాల్లో కూరుకుపోయిందని, వచ్చే బతుకమ్మ పండుగ కూడా జైల్లోనే చేసుకోవాల్సి వస్తుందేమోనని రాజకీయ పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వరంగల్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్య?

బీఆర్ఎస్ లో వచ్చే లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థుల కరవు తీవ్రంగా కనిపిస్తోంది. ఎంతగా డిమాండ్ వస్తున్నా కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి ఎవరూ కూడా లోక్ సభ ఎన్నికల బరిలో దిగేందుకు సుముఖంగా లేరని తేలిపోయింది. ఆ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన వారు కూడా పోటీకి నిరాకరించి పక్క పార్టీల్లోకి జంప్ కొట్టేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కేసీఆర్ అభ్యర్థుల కోసం వేట మొదలెట్టారు. అందులో భాగంగానే మాజీ మంత్రి, అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది ముందుగా పార్టీతో విభేదించి, అభ్యర్థుల ఎంపికలో పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకించి బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన రాజయ్యను కేసీఆర్ మళ్లీ పార్టీలోకి ఆహ్వానించి వరంగల్ లోక్ సభ స్థానం ఆఫర్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. శుక్రవారం (ఏప్రిల్ 12) కేసీఆర్ పిలుపు మేరకు తాటికొండ రాజయ్య హుటాహుటిన కేసీఆర్ ఫామ్ హౌస్ కు బయలుదేరి వెళ్లారు.  మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తెకు కేసీఆర్ వరంగల్ బీఆర్ఎస్ సీటు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమె పోటీకి నిరాకరించి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. దీంతో కంగుతిన్న కేసీఆర్ చూపు రాజయ్యపై పడింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కడియం శ్రీహరితో విభేధించి, ఆయనకు కేసీఆర్ స్టేషన్ ఘనపూర్ టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు కడియం శ్రీహరి కుమార్తె హాండివ్వడంతో కేసీఆర్ రాజయ్యను ఆ స్థానంలో పార్టీ అభ్యర్థిగా నిలిపేందుకు నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. రాజయ్య కూడా అందుకు సుముఖంగా ఉన్నట్లు సంకేతాలివ్వడంతో కేసీఆర్ ఆయనను ఫామ్ హౌస్ కు ఆహ్వానించారు. ఇప్పుడో ఇహనో కేసీఆర్ వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా రాజయ్య పేరును ప్రకటించే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 

ఈ పీకుడు గోలేంటి కేటీఆర్?

అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో నోటికొచ్చినట్టు మాట్లాడారు... చివరికి ఏమైంది? అహంకారాన్ని అస్సలు క్షమించని తెలంగాణా ప్రజలు కుర్చీలోంచి కిందకి లాగేసి పాతాళంలో పడేశారు. మన వాగుడు వల్లే అధికారం పోయిందనే విషయాన్ని అర్థం చేసుకుని ఇప్పుడైనా పద్ధతిగా  మాట్లాడ్డం ప్రాక్టీసు చేయాలి కదా? బీఆర్ఎస్ నాయకులకు ఇంకా ఈ సోయి కలగలేదు. మరీ ముఖ్యంగా చిన్నదొర కేటీఆర్‌కి అయితే ఇప్పటికీ నోటి మీద కంట్రోల్ రాలేదు. అధికారంలో ఉన్నప్పటికంటే డబుల్ అహంకారంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అప్పుడు అధికారంలో వున్న అహంకారం ఆయన మాటల్లో వినిపించేది. ఇప్పుడు అధికారం పోయిన ఆక్రోశంతో కూడిన అహంకారం వినిపిస్తోంది... అప్పుడైనా ఇప్పుడైనా కేటీఆర్ నోట కామన్‌గా, కామన్‌సెన్స్ లేకుండా వినిపిస్తున్న రెండు పీకుడు పదాలేంటంటే, ‘మా వెంట్రుక కూడా పీకలేరు’, ‘ఏం పీక్కుంటారో పీక్కోండి’.తెలంగాణ ప్రజలు ఎంతో పద్ధతిగా, సంస్కారంతో మాట్లాడతారు. పండితుడైనా, పామరుడైనా మాటలో మర్యాద వుంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ అండ్ కో తమకు ఇష్టమొచ్చినట్టుగా, నోటికొచ్చినట్టుగా మాట్లాడేసి ‘మా తెలంగాణలో ఇంతే’ అని తమ నోటి దురుసుతనాన్ని మొత్తం తెలంగాణకు ఆపాదించారు. బయటి రాష్ట్రాల వాళ్ళు పొరపాటుగా వీళ్ళ మాటలు వింటే, తెలంగాణ ప్రజలంతా ఇలాగే మాట్లాడతారేమో అనుకునే పరిస్థితి సృష్టించారు. సరే, ఉద్యమ సమయంలో అలా మాట్లాడారులే అనుకుని సరిపెట్టుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అధికారంలో వున్న పదేళ్ళూ తమ నోరు మంచిది కాదనే విషయాన్ని నిరూపించుకుంటూనే వున్నారు. ముఖ్యంగా కేటీఆర్ గారి ‘పీకుడు’ భాష విషయానికి వస్తే, అధికారంలో వున్నా, అధికారం ఊడిపోయినా ఆయన నోటి వెంట మాత్రం ‘పీకుడు భాష’ వస్తూనే వుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం విషయంలోగానీ, ఈడీ విషయంలో గానీ ‘ఏం పీక్కుంటారో పీక్కోండి’, ‘ఏమీ పీకలేరు’, ‘వెంట్రుక కూడా పీకలేరు’ లాంటి అనేక అద్భుతమైన పదాలు కేటీఆర్  నోటి నుంచి జాలువారాయి. పీకలేరు.. పీకలేరు.. అని పదేపదే అంటే, ఈడీ పీకిమరీ చూపించింది. భవిష్యత్తులో ఇంకా ఏ స్థాయిలో పీకుతారో అర్థంకాకుండా వుంది. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా కేటీఆర్ నోటివెంట సేమ్ అదే పీకుడు భాష. ‘రేవంత్ రెడ్డి ఏమీ పీకలేడు’ ఇది ఇప్పుడు ఆయన పీకలోంచి వస్తున్న మాటతీరు. నిన్నగాక మొన్న తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు జరిగాయి. పంతులుగారు వచ్చి, పూజలు చేసి కొన్ని మంచి మాటలు చెప్పారు. పంతులు గారికి కొంచెం పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నట్టుంది అందుకే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడారు. సదరు పంతులు గారు కేటీఆర్ పక్కనే కూర్చుని, ‘నోరు అదుపులో పెట్టుకోవడం వల్ల మేలు జరుగుతుంది’ అన్నారు. అది విన్న కేటీఆర్, పంతులుగారు తనను ఉద్దేశించే ఆ మాట అన్నారని అర్థం చేసుకుని, చిరునవ్వులు చిందించారు. సిగ్గుపడాల్సిన చోట చిరునవ్వులు చిందించడం ఏంటో మరి.కేటీఆర్ కావచ్చు.. కేసీఆర్ కావచ్చు.. ఇతర బీఆర్ఎస్ బాబులు కావచ్చు.. ఎంత గొంతు చించుకున్నా, ఎంత అసహ్యంగా మాట్లాడినా మరో ఐదేళ్ళ వరకు అధికారం గురించి ఆలోచించే  అవకాశం లేకపోగా, జనం దృష్టిలో మరింత చులకన అయిపోయే ప్రమాదం వుంది. కేసీఆర్ కుటుంబంతోపాటు బీఆర్ఎస్ నేతలు చేసిన అంతులేని అవినీతి కథలు రోజుకొకటి  బయటపడుతూ తెలంగాణ జనం నివ్వెరపోయేలా  చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ అధికారంలో  వున్నవారిని మరింత రెచ్చెగొట్టేలా తమ ‘పీకుడు’ భాషని మాట్లాడకుండా వుంటే మంచిది. లేదు నేను ఇలాగే మాట్లాడతాను అంటే, మీ ఇష్టం.

ఎపి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల 

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు ప్రకటించారు. మే 24 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన అనంతరం ఈ వివరాలను కూడా వెల్లడించారు. అయితే, పరీక్ష ఫీజులు, గడువు తేదీ వంటి వివరాలను తెలపాల్సి ఉంది. కాగా ఏపీ ఇంటర్మీడియెట్ ఫలితాలను బోర్డు అధికారులు శుక్రవారం 11 గంటలకు విడుదల చేశారు. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు ఆఫీసులో బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఫలితాలను రిలీజ్ చేశారు.  ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేయగా కృష్ణా ప్రథమ, గుంటూరు ద్వితీయ, ఎన్టీఆర్ జిల్లా తృతీయ స్థానాల్లో నిలిచాయి. http://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌లో విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు కాసేపటి క్రితం వెల్లడయ్యాయి. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు.  ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్‌ పరీక్షలను 4,99,756 మంది విద్యార్థులు రాయగా 67 శాతం, సెకండియర్‌ పరీక్షలకు 5,02,394 మంది హాజరుకాగా 78 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ పరీక్ష రాసిన 38 వేల మందిలో 71 శాతం మంది పాసయ్యారు.

ఖ‌మ్మం బ‌రిలో మండ‌వ.. నామాకు ఇబ్బందులు దండిగా?

తెలంగాణలో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చేందుకు బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీల నేత‌లు వ్యూహాల‌కు ప‌దును పెట్టారు. ఇప్ప‌టికే అభ్య‌ర్థుల ప్ర‌క‌టన‌ను పూర్తిచేసి ప్ర‌చార‌ప‌ర్వంలోకి దిగేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో  తెలంగాణలో స‌త్తా చాటాలన్న ప‌ట్టుద‌ల‌తో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సార‌థ్యంలో అత్య‌ధిక స్థానాల్లో కాంగ్రెస్ జెండాను ఎగుర‌వేయ‌డం ద్వారా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలుపు గాలివాటం కాద‌ని..  ప్ర‌జాబ‌లంతో అధికారంలోకి వ‌చ్చామ‌ని నిరూపించుకునేందుకు ఆ పార్టీ నేత‌లు సిద్ధ‌మ‌వుతున్నారు.  మ‌రోవైపు.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి నాలుగు నెల‌లు అవుతున్నది. ఈ నాలుగు నెల‌ల్లో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల్లో అధిక‌ శాతం పూర్తిచేశామ‌ని, ఎన్నిక‌ల కోడ్ పూర్త‌వ్వ‌గానే మిగిలిన హామీల‌ను పూర్తి చేస్తామ‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు మాత్రం.. హామీల అమ‌ల్లో కాంగ్రెస్ విఫ‌ల‌మైంద‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. విద్యుత్ కోత‌ల‌తో పాటు, తాగు, సాగు నీటి కొర‌త‌తో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు గుణ‌పాఠం చెబితేనే స‌మ‌స్య‌ల ప‌రిష్కారం అవుతాయ‌ని బీజేపీ, బీఆర్ ఎస్ నేత‌లు ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు. మొత్తానికి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో త‌మ ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించాల్సిన ప‌రిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్ప‌డింది. దీంతో అభ్య‌ర్థుల ఎంపిక‌పై పార్టీ కేంద్ర‌, రాష్ట్ర పెద్ద‌లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.  తెలంగాణ‌లో మొత్తం 17 పార్ల‌మెంట్  నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. 13 నుంచి 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగుర‌వేయాల‌ని కాంగ్రెస్ నేత‌లు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. దీంతో అభ్య‌ర్థుల ఎంపిక‌లో ఆ పార్టీ పెద్ద‌లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇంకా మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీ అధిష్టానం అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. ఇందులో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట‌గా చెప్పుకొనే ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం కూడా ఉంది. ఖ‌మ్మం నుంచి పోటీ చేసేందుకు ఆశావాహుల సంఖ్యా ఎక్కువ‌గానే ఉంది. ముఖ్యంగా త‌మ కుటుంబ స‌భ్యుల‌కు టికెట్ ఇప్పించుకునేందుకు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. భ‌ట్టి విక్ర‌మార్క స‌తీమ‌ణి నందిని, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి త‌మ్ముడు పొంగులేటి ప్ర‌సాద్ రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు యుగంధ‌ర్ లు ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసేందుకు త‌మ ప్ర‌య‌త్నాలను కొన‌సాగిస్తున్నారు. వీరికి తోడు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ వి. హ‌నుమంతరావు, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జ‌ట్టి కుసుమ కుమార్‌, వ్యాపార‌వేత్త వంకాయ‌ల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌లు ఖ‌మ్మం లోక్‌స‌భ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో అధిష్టానం  వీరిలో ఎవ‌రికి టికెట్ ఇవ్వాల‌నే విష‌యంపై ఆచితూచి అడుగులు వేస్తోంది. కాంగ్రెస్  అధిష్టానం ప‌లుసార్లు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు పేర్ల‌తో స‌ర్వేలు కూడా  నిర్వ‌హించింది. స‌ర్వేకు సంబంధించిన ఫ‌లితాలు కేంద్ర పార్టీ పెద్ద‌ల చేతికి చేరాయి. సీఎం రేవంత్ రెడ్డి  ఢిల్లీకి వెళ్ల‌డంతో నేడో రేపో ఖ‌మ్మం పార్ల‌మెంట్ అభ్య‌ర్థి  ఎవ‌ర‌నే విష‌యంపై క్లారిటీ వ‌స్తుంద‌ని కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు. ఈ క్ర‌మంలో ఎవ‌రూ ఊహించ‌ని పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో  తెలుగుదేశం హ‌యాంలో మంత్రిగా ప‌నిచేసిన సీనియ‌ర్ నేత మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు ఖ‌మ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం హ‌యాంలో మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు మంత్రిగా ప‌నిచేశారు. ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు హ‌యాంలోనూ తెలుగుదేశంలో కీల‌క భూమిక పోషించారు. కేసీఆర్‌ స్వయంగా ఇంటికి వచ్చి ఆహ్వానించడంతో   2018 ఎన్నిక‌ల స‌మ‌యంలో బీఆర్ ఎస్ పార్టీలో చేరారు.  కాగా.. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో  మండవ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, రేవంత్ రెడ్డికి మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు అత్యంత స‌న్నిహితులు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మండ‌వ.. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌. దీంతో  ఆయనను ఖ‌మ్మం పార్ల‌మెంట్ నుంచి బ‌రిలోకి దింపాల‌ని తుమ్మ‌ల సూచించ‌గా.. సీఎం రేవంత్ రెడ్డిసైతం ఆమోదం తెలిపార‌ని, దీంతో మండ‌వ పేరు కాంగ్రెస్ హైకమాండ్  ప‌రిశీల‌న‌లో ఉంద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు చెబుతున్నాయి.  రాష్ట్రంలో బ‌ల‌మైన క‌మ్మ సామాజిక వ‌ర్గానికి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్క‌డా అవ‌కాశం క‌ల్పించ‌లేదు. ఖ‌మ్మంలో క‌మ్మ సామాజిక వ‌ర్గం నేత‌కు టికెట్ ఇస్తే ఆ సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్య‌త‌ను ఇచ్చిన‌ట్ల‌వుతుంద‌ని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.  ఈక్ర‌మంలో మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావుతో పాటు ప‌లువురు క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల పేర్ల‌ు అధిష్టానం ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.   మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు ఖ‌మ్మం లోక్‌స‌భ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగితే.. బీఆర్ ఎస్ అభ్య‌ర్థి నామా నాగేశ్వ‌ర‌రావుకు ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర‌వ్వ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్నది. ఉమ్మ‌డి  ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీతోపాటు, టీడీపీకి గ‌ట్టి బ‌లం ఉంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం క్యాడ‌ర్‌ మద్దతు ఇవ్వడంతో   ఉమ్మ‌డి ఖమ్మం జిల్లాలోని 10 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను తొమ్మిది నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించింది. ముఖ్యంగా ఆంధ్రాకు ద‌గ్గ‌ర‌గా ఉన్న ఖ‌మ్మం పార్ల‌మెంట్  నియోజకవర్గ ప‌రిధిలో  తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం ఓటుబ్యాంకు ఎరికి  వైపు మ‌ళ్లితే వారిదే విజ‌య‌మ‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరిలో తెలుగుదేశం లేదు.  ఈ ప‌రిస్థితుల్లో నామా నాగేశ్వ‌ర‌రావుకూడా గ‌తంలో  తెలుగుదేశం పార్టీకి చెందిన వ్య‌క్తి కావ‌డంతో గ‌తంలోలా తెలుగుదేశం ఓటు బ్యాంకు నామాకు వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి. అసలు ఆ ఉద్దేశంతోనే  బీఆర్ ఎస్   నామాకు  టికెట్ ఇచ్చిందన్న అభిప్రాయం కూడా పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.  ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో గతంలో చురుకుగా పని చేసిన మండవను బరిలోకి   దింపితే నామాను సునాయాసంగా ఓడించవచ్చన్నది  కాంగ్రెస్ అభిప్రాయంగా కనిపిస్తోంది. దీనికి తోడు కాంగ్రెస్ అధిష్టానం నిర్వ‌హించిన‌ స‌ర్వేల్లోనూ ఇదే  విష‌యం స్ప‌ష్ట‌మైన‌ట్లు తెలుస్తోంది.  తెలంగాణ వ్యాప్తంగా మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావును తెలుగుదేశం సానుభూతిప‌రులు అభిమానిస్తారు.  ముఖ్యంగా ఖ‌మ్మం జిల్లాలో మండ‌వకు మంచి ఆద‌ర‌ణ ఉంది. నిజాయతీపరుడిగా మండవకు గుర్తింపు ఉంది. ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడించే మండవ.. తెలుగుదేశం పార్టీని వీడినా ఇప్పటి వరకూ పార్టీపై కానీ, పార్టీ అధినేతపై కానీ ఒక్క విమర్శ కూడా చేయలేదు.  అటువంటి మండవను   ఖ‌మ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి  బ‌రిలోకి దింపితే.. తెలుగుదేశం  ఓటు బ్యాంకు పూర్తిగా మండ‌వ వైపు వ‌స్తుంద‌ని, దీంతో గెలుపు సునాయాసం అవుతుంద‌ని రేవంత్ రెడ్డి భావి స్తున్నారు. పార్టీ అధిష్ఠానం కూడా  మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే నామా నాగేశ్వ‌ర‌రావుకు ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర‌వ‌డం ఖాయ‌మ‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కెసీఆర్ ఫామ్ హౌజ్ వద్ద ఉద్రిక్తత.. డబుల్ బెడ్ రూం లబ్దిదారుల ఆందోళన 

అధికారంలో ఉన్న రాజకీయపార్టీలు ఎన్నికల హామీలు, వాగ్దానాలను అమలుపరచకపోతే నిరసనలు, ధర్నాలు జరపడం సర్వ సాధారణం. కానీ తెలంగాణలో అధికారం కోల్పోయిన బిఆర్ఎస్ పార్టీ తమ ఎన్నికల వాగ్దానాలు, హామీల మీద ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు స్వంత నియోజకవర్గంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమమైన డబుల్ బెడ్ రూం  లబ్దిదారులు రోడ్డెక్కారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గజ్వేల్ కు చెందిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఫామ్ హౌస్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. లక్కీ డ్రాలో 1,100 మంది పేర్లను తీశారని...వీరిలో ఒక్కరికి కూడా ఇంత వరకు డబుల్ బెడ్రూమ్ ఇంటిని అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసీఆర్ వరుసగా మూడుసార్లు గజ్వేల్ నియోజక వర్గం నుంచి గెలుపొందారు. అయితే పదేళ్ల తర్వాత బిఆర్ ఎస్ ఓడిపోయినప్పటికీీ  లబ్దిదారులు బాధపడటం లేదు. కెసీఆర్ డ్రా తీసిన లబ్దిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వడం లేదని బాధపడుతున్నారు. డ్రాతీసిన వ్యక్తి ప్రస్తుతం గజ్వేల్ ఎమ్మెల్యేగా ఎంపికయ్యారని వారి వాదన.వీరిలో ఒక్కరికి కూడా ఇంత వరకు డబుల్ బెడ్రూమ్ ఇంటిని అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్ రావు, ఒంటేరులను కలిసినా ప్రయోజనం లేకపోయిందని చెప్పారు. అధికారుల చుట్టూ కాళ్లు అరిగిపోయేలా తిరిగామని... ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్ లో ఉన్న తాము ఏం పాపం చేసుకున్నామని ప్రశ్నించారు. తాము ఇక్కడకు వచ్చి ఎంతో సేపు అవుతున్నా కేసీఆర్ నుంచి కనీస స్పందన కూడా రాలేదని చెప్పారు. గేట్ వద్ద ఉన్న తమకు ఫామ్ హౌస్ లోపల నుంచి ఫోన్ కాల్ కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ ఎన్నికల అస్త్రంగా కచ్చాతీవు!?

మరో సారి ప్రాంతీయ మంటలను రేపి ఎన్నికల లబ్ధి పొందేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారా? వివాదాస్పద అంశాలను రాజకీయం చేసి తమిళనాట ఎన్నికలలో ప్రయోజనం చేకూర్చుకునేందుకు వ్యూహాత్మకంగా ప్రధాని మోడీ అడుగులు వేస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే సమాధానమే ఇస్తున్నారు.  కచ్చాతీవు ద్వీపాన్ని 1974లో కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంక దేశానికి అప్పగించిందని, ఆ ద్వీపాన్ని తిరిగి భారత్ లో కలిపేస్తామని ప్రధాని మోదీ చేసిన ప్రకటన ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది.  గత పదేళ్లుగా అధికారంలోనే ఉన్న ప్రధాని మోడీ ఎప్పుడూ కచ్చతీవు అంశంపై నోరెత్తింది లేదు. సరిగ్గా 2024 సార్వత్రిక ఎన్నికల ముంగిట, అది తమిళనాడులో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్న వేళ ఈ ప్రకటన చేయడం వెనుక ఉన్న ఎత్తుగడ ఎన్నికల లబ్ధి పొందేందుకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గతంలో కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేస్తామని  ఆయన ప్రకటించారు.  దీనికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మోడీ బంగ్లాదేశ్ కు 10వేల ఎకరాలు ధారాదత్తం చేసారని ప్రతి విమర్శ చేసారు. దేశ ప్రయోజనాల నిమిత్తం పొరుగు దేశాల తో జరిగిన ఒప్పందాలను బీజేపీ వివాదం చేస్తున్నదని కాంగ్రెస్ విమర్శిస్తున్నది. 1921 నుంచి కచ్చతీవు ద్వీపం శ్రీలంక (బ్రిటిష్ సిలోన్) ఆధీనంలో ఉంది. 1974వరకు భారత్ ప్రభుత్వం ఈ ద్వీపాన్ని గుర్తించే వరకు ఇరుదేశాల మధ్యా ఇది వివాదంగానే ఉంది.  ఈ ద్వీపం వైశాల్యం   285ఎకరాలు. జాఫ్నా ద్వీపకల్పంలో నెడుంతీవు, రామేశ్వరం మధ్య కచ్చాతీవు ఉంది. 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఇండో శ్రీలంక సముద్ర ఒప్పందంలో భాగంగా ఈ దీవిని  శ్రీలంకకు చెందినదిగా అంగీకరించారు. చరిత్ర తిరగేస్తే 1187-96మధ్య పాలించిన శ్రీలంక రాజు నిస్సంక మల్లా రామేశ్వరం శాసనంలో ఈ కచ్చి దీవు ప్రస్తావన ఉంది. ఈ ద్వీపం పోర్చుగీసు,డచ్, బ్రిటీష్ వారి హయాంలో శ్రీలంక పరిధిలోనే ఉంది. మధ్యయుగంలో జాఫ్నా రాజ్యంలో ఉంది. 17వ శతాబ్దం నుంచి రామ నాడ్ రాజ్యం లో (మధురై జిల్లా) ఉండేది. ఆ తర్వాత భారత ఉపఖండం తోపాటు బ్రిటీష్ వారి అధీనంలోకి వచ్చింది. మద్రాస్ ప్రెసిడెన్సీ లో భాగమైంది. ఈ ద్వీపంలో కాథలిక్ మందిరం ఉంది. ఇరు దేశాల భక్తులు ఈ మందిరాన్ని సందర్శిస్తారు. ఈ ద్వీపంపై భారత ప్రభుత్వం శ్రీలంక సార్వభౌమత్వం అంగీకారంపై  తమిళనాడు మత్స్యకారుల లో ఉన్న అసంతృప్తి ని దృష్టిలో ఉంచుకునే ప్రధాని నరేంద్రమోడీ  ఎన్నికల అస్త్రంగా కచ్చాదీవు వ్యవహారాన్ని కెలికి వివాదం చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  దీనిపై ఇరు దేశాలు మళ్లీ చర్చలు పునఃప్రారంభించాలన్న  భారత్ డిమాండ్ ను శ్రీలంక తోసిపుచ్చింది. ఇది ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందం కనుక  దీనిపై చర్చలు ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేసింది.   ఎన్నికల ప్రయోజనాల కోసం  ప్రభుత్వాలు దేశ ప్రయోజనాల దృష్ట్యా చేసుకున్న ఒప్పందాలను ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు గౌరవించకపోవడం సముచితం కాదని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడు తున్నారు.