కవితమ్మ ఇప్పట్లో బయటకి రానట్టేనా?
posted on Apr 12, 2024 @ 2:16PM
కల్వకుంట్ల కవితమ్మ తీహార్ జైల్లోనే బతుకమ్మ ఆడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వందకోట్లు పెట్టుబడి పెట్టి వెయ్యి కోట్లు సంపాదించాలని ‘ఢిల్లీ మద్యం కలలు’ కన్న కవితమ్మ పరిస్థితి ఇప్పుడు ఎలా మారిపోయిందో అందరూ చూస్తూనే వున్నారు. అధికారంలో వున్నతవరకు తెలంగాణ మహిళలకు రోల్ మోడల్‌గా తనను తాను ప్రొజెక్టు చేసుకుని, చివరికి తెలంగాణ తల్లి విగ్రహాల్లో కూడా తన పోలికలు వుండేలా తనను తాను ప్రమోట్ చేసుకున్న కవితమ్మ ఇప్పుడు తెలంగాణ ప్రజలు... ముఖ్యంగా మహిళలు ఏవగించుకునే పరిస్థితికి వచ్చారు.
‘మీరు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు?’ అని టీవీ ఇంటర్వ్యూలో అనే ప్రశ్నకు ‘మద్యాన్ని నిర్మూలిస్తాను’ అని ఎంతో హుందాగా సమాధానం ఇచ్చిన కవితమ్మ ఎంచక్కా వేల కోట్ల మద్యం వ్యాపారంలోకి ఎంటరైపోవడాన్ని తెలంగాణ మహిళలు చాలా తీవ్రంగా భావిస్తున్నారు. సర్లే, జనం ఎంత వ్యతిరేకించినా అధికారం ఇవ్వకపోవడం మినహా మరేమీ చేయలేరు. కానీ, కవితమ్మ చుట్టూ చుట్టుకుంటున్న కేసులు ఆమెను ఇప్పట్లో తీహార్ జైల్లోంచి బయటకి రానిచ్చేట్టు లేవు.
గురువారం నాడు తీహార్ జైల్లో కాసేపు భగవద్గీత చదువుకుని, ఆ తర్వాత కాసేపు జపమాలతో జపం చేసుకుని, ఇంకాసేపు తన కొడుకు పదో తరగతి పరీక్షలు బాగా రాయాలని, తల్లి జైల్లో వున్న బాధ ఆ పసి మనసులో వుండకూడదని ప్రార్థన చేసుకున్న తర్వాత కళ్ళు తెరిచి చూస్తే, ఎదురుగా సీబీఐ అధికారులు. కవితమ్మను ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగిన సీబీఐ అధికారులు వెళ్తూవెళ్తూ కవితమ్మ మీద మరో కేసు బుక్ చేసి మరీ వెళ్ళారు. ఈడీ కేసులోంచి బయటపడేది ఎలారా భగవంతుడా అని తంటాలు పడుతున్న కవితమ్మకు మూలిగే నక్క మీద తాటికాయలా సీబీఐ కేసు పడినట్లైంది.
వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ లాంటి కేసుల విషయంలో తప్ప సీబీఐ ఒక్కోసారి చాలా వేగంగా పనిచేస్తుంది. గురువారం నాడు ఇలా జైలుకు వచ్చి కవితమ్మ మీద కేసు బుక్ చేసిన సీబీఐ శుక్రవారం నాడు ఆమెని ఢిల్లీలో కోర్టు ముందు హాజరుపరిచారు. ఐదు రోజులపాటు కవితమ్మను తమ కస్టడీకి అనుమతించాలని కోరారు. అందుకు కోర్టు అనుమతించింది. ఈ నెల 14 వరకూ కవితను సీబీఐ కస్టడీకి ఇచ్చింది. మద్యం స్కామ్‌లో కవితమ్మ భారీగానే ఇన్వాల్వ్ అయ్యారంటూ, దానికి సంబంధించిన అనేక ఆధారాలను కోర్టుకు సీబీఐ సమర్పించింది. రాబోయే రోజుల్లో సీబీఐ కస్టడీలో కవితమ్మ ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఆ ‘విచారణ’ ఏ రేంజ్‌లో వుంటుందో ఏమో...
నిన్నటి వరకు కవితమ్మ మీద ఈడీ కేసు ఒక్కటే వుంది. ఇప్పుడు అగ్నికి ఆజ్యంలా సీబీఐ కేసు కూడా వచ్చి పడింది. ఈ రెండు వ్యవస్థలూ కవితమ్మకు బెయిల్ రాకుండా తమ శాయశక్తులా కృషి చేస్తాయి. ఒక కేసులో బెయిల్ వచ్చినా బయటకి వచ్చే ఛాన్స్ లేదు. మొత్తమ్మీద కవితమ్మ పీకల్లోతు
కష్టాల్లో కూరుకుపోయిందని, వచ్చే బతుకమ్మ పండుగ కూడా జైల్లోనే చేసుకోవాల్సి వస్తుందేమోనని రాజకీయ పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.