విజయసాయి రెడ్డి గవర్నరా? బుర్రుందా?
posted on Apr 12, 2024 @ 2:27PM
వైసీపీ ఏ2 విజయసాయిరెడ్డి మెరుపు కలలు మామూలుగా లేవుగా. అయ్యగారి దృష్టి ఇప్పుడు గవర్నర్ పదవి మీద పడింది. ఈ ఆర్థిక నేరగాడు రెండుసార్లు రాజ్యసభకు వెళ్ళడమే ప్రజాస్వామ్యంలో జరిగిన పెద్ద పొరపాటు అని ప్రజాస్వామ్యవాదులు అనుకుంటుంటే, ఏకంగా గవర్నర్ పదవిని ఆశిస్తున్నట్టు చెప్పి విజయసాయిరెడ్డి తన దురాశని సిగ్గూ ఎగ్గూ లేకుండా బయటపెట్టుకున్నారు.
విజయసాయిరెడ్డి రెండుసార్లు చొక్కా నలగకుండా, చెమట చుక్క చిందించకుండా ఎంచక్కా రాజ్యసభ సభ్యత్వాన్ని పొందారు. ఏ1 జగన్ పుణ్యమా అని ఏ2 విజయసాయిరెడ్డి ఉన్నత పదవిలో ఊరేగారు. పదవి పెంచిన అహంకారం ప్రకోపించి తన వాచాలత్వాన్ని అనేక సందర్భాల్లో ప్రదర్శించారు. తన ట్విట్టర్ అకౌంట్లో బూతుపురాణాలు రాశారు. ప్రపంచ వ్యాప్తంగా ట్విటర్ని అత్యంత నీచాతి నికృష్టంగా వాడిన వాళ్ళ లిస్టు తయారు చేస్తే అందులో విజయసాయి పేరు టాప్ ఫైవ్‌లో వుండే అవకాశం వుంది. కుసంస్కారంలో పరిధులు దాటిపోయిన ఈయన ఇప్పుడు గవర్నర్ లాంటి పెద్దమనిషి పదవిని ఆశించడమే వింతల్లోకెల్లా వింత. పరువు పాతాళానికి పోతుంటే, మాటలు ఆకాశంలో విహరించడం అంటే ఏమిటో విజయసాయి రెడ్డిని చూస్తే అర్థమవుతుంది.
ఏపీలో ఈసారి వైసీపి తుడిచిపెట్టుకుని పోవడం ఖాయమనే విషయం అందరికీ అర్థమైపోయింది. వైసీపీ నాయకులకు కూడా ఈ విషయం అర్థమైపోయినా అర్థం కానట్టు భ్రమల్లో బతుకుతున్నారు. 2024 ఎన్నికల తర్వాత తనని గవర్నర్ చేయాలని, ఒకవేళ 2024లో కుదరకపోతే 2029 ఎన్నికల తర్వాత అయినా తనను గవర్నర్‌గా రికమండ్ చేయాల్సిందిగా జగన్‌ని విజయసాయిరెడ్డి రిక్వెస్ట్ చేశారట, తన రిక్వెస్ట్.ని జగన్ ఓకే చేస్తారని ఆశిస్తున్నారట.
సర్పంచ్‌గా పోటీ చేసినా గెలవలేని స్థాయి వున్న విజయసాయిరెడ్డిని ఈసారి ఏకంగా నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా జగన్ ఆదేశించారు. ఈ ఆదేశం శరాఘాతంలా తగిలినప్పటికీ చేసేదేం లేక నెల్లూరు నియోజవర్గంలో విజయసాయిరెడ్డి ఫ్యామిలీ మెంబర్లతో కలసి ప్రచార తంటాలు పడుతున్నారు. వేడివేడి బిర్యానీ పెడతామని పిలుస్తున్నా జనం పట్టించుకోకుండా విజయసాయి ప్రచార సభల నుంచి పారిపోతున్నారు. నెల్లూరు ఎంపీ స్థానంలో విజయసాయిరెడ్డి గెలిచే అవకాశం లేదని ఏమాత్రం రాజకీయ అవగాహన వున్నవారికైనా అర్థమయ్యే విషయమే. మరి విజయసాయిరెడ్డికి అర్థం కాకుండా వుంటుందా? అందుకేనేమో 2024 ఎన్నికల తర్వాత గవర్నర్ గిరీ దక్కించుకుంటే ఏ కేసులూ గట్రా లేకుండా హ్యాపీగా విశ్రాంతి తీసుకోవచ్చని అయ్యగారు భావిస్తున్నట్టున్నారు. కలలు కనొచ్చుగానీ, కాస్త సాధ్యాసాధ్యాలు కూడా చూసుకోవాలి కదా విజయసాయిరెడ్డి సార్!