ఖమ్మం బరిలో మండవ.. నామాకు ఇబ్బందులు దండిగా?
posted on Apr 12, 2024 @ 12:51PM
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చేందుకు బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీల నేతలు వ్యూహాలకు పదును పెట్టారు. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనను పూర్తిచేసి ప్రచారపర్వంలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు గాలివాటం కాదని.. ప్రజాబలంతో అధికారంలోకి వచ్చామని నిరూపించుకునేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. మరోవైపు.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నది. ఈ నాలుగు నెలల్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో అధిక శాతం పూర్తిచేశామని, ఎన్నికల కోడ్ పూర్తవ్వగానే మిగిలిన హామీలను పూర్తి చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు మాత్రం.. హామీల అమల్లో కాంగ్రెస్ విఫలమైందని విమర్శలు గుప్పిస్తున్నాయి. విద్యుత్ కోతలతో పాటు, తాగు, సాగు నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెబితేనే సమస్యల పరిష్కారం అవుతాయని బీజేపీ, బీఆర్ ఎస్ నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. దీంతో అభ్యర్థుల ఎంపికపై పార్టీ కేంద్ర, రాష్ట్ర పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. 13 నుంచి 15 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ నేతలు పట్టుదలతో ఉన్నారు. దీంతో అభ్యర్థుల ఎంపికలో ఆ పార్టీ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇంకా మూడు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా చెప్పుకొనే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఉంది. ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు ఆశావాహుల సంఖ్యా ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇప్పించుకునేందుకు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. భట్టి విక్రమార్క సతీమణి నందిని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ లు ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. వీరికి తోడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జట్టి కుసుమ కుమార్, వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌లు ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో అధిష్టానం వీరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంపై ఆచితూచి అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం పలుసార్లు నియోజకవర్గంలో పలు పేర్లతో సర్వేలు కూడా నిర్వహించింది. సర్వేకు సంబంధించిన ఫలితాలు కేంద్ర పార్టీ పెద్దల చేతికి చేరాయి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో నేడో రేపో ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎవరనే విషయంపై క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఎవరూ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం హయాంలో మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం హయాంలో మండవ వెంకటేశ్వరరావు మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనూ తెలుగుదేశంలో కీలక భూమిక పోషించారు. కేసీఆర్ స్వయంగా ఇంటికి వచ్చి ఆహ్వానించడంతో 2018 ఎన్నికల సమయంలో బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. కాగా.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి సమక్షంలో మండవ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డికి మండవ వెంకటేశ్వరరావు అత్యంత సన్నిహితులు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. దీంతో ఆయనను ఖమ్మం పార్లమెంట్ నుంచి బరిలోకి దింపాలని తుమ్మల సూచించగా.. సీఎం రేవంత్ రెడ్డిసైతం ఆమోదం తెలిపారని, దీంతో మండవ పేరు కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలనలో ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో బలమైన కమ్మ సామాజిక వర్గానికి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా అవకాశం కల్పించలేదు. ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గం నేతకు టికెట్ ఇస్తే ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యతను ఇచ్చినట్లవుతుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఈక్రమంలో మండవ వెంకటేశ్వరరావుతో పాటు పలువురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతల పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మండవ వెంకటేశ్వరరావు ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగితే.. బీఆర్ ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు ఇబ్బందికర పరిస్థితి ఎదురవ్వడం ఖాయమన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీతోపాటు, టీడీపీకి గట్టి బలం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం క్యాడర్ మద్దతు ఇవ్వడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలకు గాను తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ముఖ్యంగా ఆంధ్రాకు దగ్గరగా ఉన్న ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ఓటుబ్యాంకు ఎరికి వైపు మళ్లితే వారిదే విజయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరిలో తెలుగుదేశం లేదు. ఈ పరిస్థితుల్లో నామా నాగేశ్వరరావుకూడా గతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో గతంలోలా తెలుగుదేశం ఓటు బ్యాంకు నామాకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అసలు ఆ ఉద్దేశంతోనే బీఆర్ ఎస్ నామాకు టికెట్ ఇచ్చిందన్న అభిప్రాయం కూడా పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో గతంలో చురుకుగా పని చేసిన మండవను బరిలోకి దింపితే నామాను సునాయాసంగా ఓడించవచ్చన్నది కాంగ్రెస్ అభిప్రాయంగా కనిపిస్తోంది. దీనికి తోడు కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించిన సర్వేల్లోనూ ఇదే విషయం స్పష్టమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా మండవ వెంకటేశ్వరరావును తెలుగుదేశం సానుభూతిపరులు అభిమానిస్తారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మండవకు మంచి ఆదరణ ఉంది. నిజాయతీపరుడిగా మండవకు గుర్తింపు ఉంది. ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడించే మండవ.. తెలుగుదేశం పార్టీని వీడినా ఇప్పటి వరకూ పార్టీపై కానీ, పార్టీ అధినేతపై కానీ ఒక్క విమర్శ కూడా చేయలేదు. అటువంటి మండవను ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపితే.. తెలుగుదేశం ఓటు బ్యాంకు పూర్తిగా మండవ వైపు వస్తుందని, దీంతో గెలుపు సునాయాసం అవుతుందని రేవంత్ రెడ్డి భావి స్తున్నారు. పార్టీ అధిష్ఠానం కూడా మండవ వెంకటేశ్వరరావుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే నామా నాగేశ్వరరావుకు ఇబ్బందికర పరిస్థితి ఎదురవడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.