జనసేనానికి నేచురల్ స్టార్ నాని మద్దతు

నేచురల్ స్టార్ నాని జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికలలో ఇప్పటి వరకూ సినీ పరిశ్రమ నుంచి ఎవరూ తమ మద్దతు ఫలానా పార్టీకి, ఫలానా అభ్యర్థికి అంటూ బాహాటంగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరి ఆ పార్టీకి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే నటుడు, రచయత అయిన పోసాని కృష్ణ మురళి వైసీపీ తరఫున మీడియా సమావేశాలలో మాట్లాడుతున్నారు. వైసీపీలోనే ఉన్న కమేడియన్ అలీ మాత్రం అసలు ప్రచారం వైపు చూసిన దాఖలాలు లేవు. ఇక పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగా హీరోలతో పాటు బుల్లి తెర నటులు ఆది, సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ వంటి వారు ప్రచారం చేస్తున్నారు. అంతకు మించి సినీ పరిశ్రమ  నుంచి పెద్దగా ఎవరూ బయటకు వచ్చినట్లు కనిపించదు. అయితే ఎన్నికలు రోజుల వ్యవధిలోకి వచ్చిన తరుణంలో ఒక్కరొక్కరుగా సినీ ప్రముఖులు బయటకు వచ్చి తమ మొగ్గు ఎవరివైపో చెబుతున్నారు. ఇప్పటికే చిరంజీవి తన సోదరుడికి ఓటేయాలంటూ పిఠాపురం ప్రజలకు వీడియో ద్వారా పిలుపునిచ్చారు. అలాగే అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ కు ఓటేయాలంటూ కోరారు. తాజాగా  పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దతుగా నేజురల్ స్టార్  నాని  రంగంలోకి దిగాడు. సోషల్ మీడియా వేదికగా జనసేనానికి మద్దతు ప్రకటించారు. పవన్ కల్యాణ్ ఎదుర్కోబోయే పెద్ద రాజకీయ యుద్ధంలో విజయం సాధించాలని కోరుతూ ట్వీట్ చేశారు. మీరు కోరుకున్నది సాధించి, మీ వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాలని కోరుతున్నానని పేర్కొన్నారు. సినిమా కుటుంబ  సభ్యుడిగా పవన్ కల్యాణ్ కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆ ట్వీట్ లో నాని పేర్కొన్నారు.   గతంలో ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలను బాగా తగ్గించిన జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా నాని  తన స్వరం వినిపించాడు. రాజకీయాల్లో లేనప్పటికీ ధైర్యంగా టికెట్ ధరల అంశంపై స్పందించిన నానికి.. అప్పట్లో పవన్ అండగా నిలిచాడు. ఇప్పుడు ఎన్నికల వేళ జనసేనాని కి నాని మద్దతు పలకడం పట్ల  పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఖర్మకాలి జగనొస్తే... సాంగ్ వైరల్...

మళ్ళీ జగన్ అధికారంలోకి రావడం అనేది అసంభవం. అయినప్పటికీ ఇంకా చాలా కొద్దిమంది జగన్ మాయలో వుండే అవకాశం వుంది. వాళ్ళు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడేమో అనే ఆలోచనలో వుండే ప్రమాదం వుంది. అలాంటి వారిలో చైతన్యం కలిగించే ఉద్దేశంతో తెలుగువన్ రూపొందించిన ‘ఖర్మకాలి జగనొస్తే’ సాంగ్ వైరల్ అవుతోంది. అంధుడైనప్పటికీ మాధవ్ ఈ పాటను అద్భుతంగా పాడారు.. ఆంధ్రప్రదేశ్‌లో వున్న వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా లిరిక్స్ వున్నాయి. ఆ లిరిక్స్.లో వున్న అర్థాన్ని ట్యూన్ బాగా ఎలివేట్ చేస్తే, మాధవ్ గొంతులో వున్న మాధుర్యం పాటను శిఖరాగ్రాలకు తీసుకెళ్ళింది. రాజకీయ విశ్లేషకుడు సువేరా కాన్సెప్ట్, లిరిక్, ట్యూన్ అందించిన ఈ పాటను తెలుగువన్ అధినేత రవిశంకర్ కంటంనేని తెలుగు ప్రజలకు అందించారు. ఖర్మకాలి జగనొస్తే ఏటైతది... ఏటైతది... అనేది మీరూ చూసి తెలుసుకోండి.  

డాన్స్ మోడీ డాన్స్!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ప్రముఖులను ఇమిటేట్  చేస్తూ వీడియోలు చేయడం సాధారణమైపోయింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డాన్స్ చేస్తున్నట్టుగా చాలా వీడియోలు తయారయ్యాయి. ఎన్నికల సందర్భంగా వాటి సంఖ్య మరింత పెరిగింది. వీటిలో కొన్ని వీడియోలు మోడీని కించపరుస్తున్నట్టు వుంటాయిగానీ, చాలావరకు సరదాగా తీసుకునే విధంగానే వుంటాయి. ఈమధ్యకాలంలో మోడీ డాన్స్ ఏఐ వీడియో ఒకటి వైరల్ అయింది. తెలుపు, కాషాయ కాంబినేషన్‌లో డ్రస్ చేసుకుని వున్న మోడీ లక్షలాది మంది జనం ముందు డాన్స్ చేస్తున్నట్టు వుంటుంది. ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన మోడీ తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు. ఈ వీడియో తాను కూడా చూశానని,  ఎంజాయ్ చేశానని రిప్లయ్ ఇచ్చారు.

జగన్ నోట ఓటమి మాట.. భవిష్యత్ దర్శనమేనా?

జగన్ నోట ఓటమి  మాట వచ్చేసింది. ఔను ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతోంది. తనను అడ్డుకోవడానికి వాళ్లు సొమ్ములు నిలిపివేస్తున్నారు. అధికారులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు అంటూ జగన్ మాట్లాడారు. మచిలీపట్నంలో ఎన్నికల ర్యాలీలో జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన ఓటమి భయానికి నిదర్శనంగా రాజకీయ పండితులు చెబుతున్నారు. సాధారణంగా అన్ని విధాలుగా ఓటమి తథ్యం అన్న నిర్ధారణకు వచ్చిన తరువాతే రాజకీయ నాయకుల నుంచి ఇటువంటి బలహీనమైన వ్యాఖ్యలు చేస్తారని వివరిస్తున్నారు. జగన్ కూడా ఓటమి భయంతో, బెంగతో, బాధతోనే ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషిస్తున్నారు. ఈ సందర్భంగా 2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటనలను వారు గుర్తు చేస్తున్నారు. అప్పటి ఎన్నికలలో చంద్రబాబు అప్పటి ఎన్నికల సంఘం అధికారి గోపాలకృష్ణ ద్వివేది కార్యాలయానికి వెళ్లి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.  ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది.  ఇప్పుడు ఐదేళ్ల తరువాత జగన్ వ్యాఖ్యలు, ప్రకటనలూ చూస్తుంటే జగన్ తన ఓటమిని పోలింగ్ కు ముందే అంగీకరించేసినట్లు కనిపిస్తోందని అంటున్నారు.  2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తరువాత జగన్ ఇంత బేలగా మాట్లాడటం ఇదే మొదటి సారి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ పరాజయం పాలైన తరువాత కూడా ఆ పరాజయంపై జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జలే మాట్లాడారు. తమ ఓటర్లు వేరు ఉన్నారని చెప్పారు.   అయితే ఇప్పుడు మాత్రం ఓ ఎన్నికల ర్యాలీలో ఓటమి భయంతో జగన్ మాట్లాడటం చూస్తుంటే ప్రజా వ్యతిరేకతతో జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని స్పష్టంగా అర్ధమైతోందని పరిశీలకులు అంటున్నారు.  విపక్ష తెలుగుదేశం మేనిఫెస్టోకు ప్రజల నుంచి అద్భుత స్పందన రావడం, అదే సమయంలో తాను విడుదల చేసిన మేనిఫెస్టోను జనం అసలు పట్టించుకోకపోవడం, అదే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో విపక్షాలు సహేతుకంగా చేస్తున్న విమర్శలు జగన్ లో ఓటమి భయాన్ని కలిగించాయని విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి కేంద్ర ఎన్నికల సంఘం విపక్షాల విమర్శలపై నిర్హేతుకంగా స్పందించి చర్యలు తీసుకోవడం లేదు. పించన్ల పంపిణీ విషయంలో  ఘోరంగా విఫలమైనా సీఎస్ జవహర్ రెడ్డిని ఇప్పటికీ మార్చలేదు. ఆయన జగన్ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి విపక్ష కూటమి నేతలు ఫిర్యాదులు చేసినా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించలేదు. నాడు అంటే 2019 ఎన్నికల సమయంలో విపక్షంలో ఉన్న వైసీపీ ఇలా ఫిర్యాదు చేయగానే అలా అప్పటి సీఎస్ పునేఠాను తప్పించేసింది. అదే ఎన్నికల సంఘం ఇప్పుడు  ప్రధాని చిలకలూరి పేట సభలో భద్రతా లోపాలు తలెత్తినా డీజపీని వెంటనే మార్చేయలేదు.  ఎన్నికలు వారం రోజులలోకి వచ్చిన తరువాత మాత్రమే తాపీగా డీజీని మార్చి కొత్త డీజీపీని నియమించింది.  అంతే కాదు జగన్ అప్పాయింట్ చేసిన ఇంటెలిజెన్స్ చీఫ్, సీఐడీ చీఫ్ లను ఇప్పటికీ మార్చ లేదు. అయితే 2019 ఎన్నికలకు ముందు మాత్రం అప్పటి విపక్ష నేత జగన్ ఇలా కోరడం తరువాయి అలా అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో కీలక అధికారులందరినీ మార్చేసిన ఎన్నికల సంఘం అన్ని విధాలుగా చంద్రబాబును ఇబ్బందులకు గురి చేసింది.  నాటి పరిస్థితితో పోల్చుకుంటే జగన్ కు ఎన్నికల సంఘం ఇప్పటికీ సానుకూలంగా వ్యవహరిస్తోందనే చెప్పాలి. కానీ ఎన్నికల వేళ సంక్షేమ పథకాలకు నిధుల విడుదలను నిలిపివేయడం, కొందరు అధికారులను మార్చడంతోనే జగన్ వణికిపోతున్నారు. ఓటమి భయంతో ఫ్రస్ట్రేషన్ కు గురౌతున్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా సాగే అవకాశం లేదని భయమేస్తోందంటున్నారు. పోలింగ్ కు ముందే ఓటమి ఖరారైపోయిందన్నట్లగా మాట్లాడుతున్నారు. ఇదంతా చూస్తుంటే జగన్ కు భవిష్యత్ దర్శనం అయిపోయిందా? అన్న అనుమానం కలుగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఏది ఏమైనా పార్టీ అధినేతే ఎన్నికల విజయం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో వైసీపీ శ్రేణులు మరింత డీలా పడటం ఖాయమని అంటున్నారు. 

జగన్ మానసిక వ్యాధి ‘నార్సీ’ - పార్ట్ 5

వైసీపీ నాయకుడు జగన్‌ని ఆవహించిన ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అలియాస్ ‘నార్సీ’కి సంబంధించిన మరికొన్ని లక్షణాల విశ్లేషణ.... ‘యానిమల్’ సినిమాలో చూశాం.. హీరోయిన్ వెళ్ళిపోతూ వుంటే, హీరో వెంటపడి కాళ్ళు పట్టుకుంటూ వుంటాడు. వీళ్ళకి అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వున్నప్పుడు బెయిల్ కోసం జగన్ ఎవరి కాళ్ళ బేరానికి వెళ్ళాడో, గత పదేళ్ళుగా ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నాడో అందరికీ తెలిసిందే. కనీసం కోర్టు హియరింగ్‌కి కూడా హాజరు కాకుండా హాయిగా తిరుగుతున్నాడు. జగన్ ఎంత నీచానికి దిగజారాడంటే, తనను వ్యతిరేకించిందనే కారణంతో తన సొంత చెల్లిని అందరిచేతా తిట్టిస్తున్నాడు. కేరెక్టర్ లేని మనుషులు కూడా షర్మిలని తిడుతూ వుంటే విని ఆనందిస్తున్నాడు. సమాజంలో ఎంతమాత్రం విలువలేని వాళ్ళని సాక్షి టీవీలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు తీసుకుంటూ వుంటారు. వాళ్ళు జగన్‌ని వ్యతిరేకించే వాళ్ళని అసహ్యంగా తిడుతూ వుంటారు. సొంత చెల్లి కట్టుకున్న చీర మీద కూడా మాట్లాడే పరిస్థితికి ‘నార్సీ’ జగన్ దిగజారిపోయాడు.  వివేకానందరెడ్డి హత్య కేసులో ముందు గుండెపోటు అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు చేశాడంటూ నారాసుర రక్తచరిత్ర పేరుతో కథనాలు వండి వార్చారు. ఇప్పుడు ఆయనకి మరో పెళ్ళి జరిగిందని, ఆమె తరఫు వాళ్ళు చంపి వుంటారని,  ఇంకోసారి ఆయన కూతురు, అల్లుడే చంపించారని.. ఇలా రకరకాలుగా ఆ కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు.  జగన్ ఇన్ని దారుణాలు చేస్తూ వున్నా కూడా ప్రజలు జగన్ విషయంలో పూర్తిగా అర్థం కానట్టు ఎందుకు వున్నారంటే, అదే ఈ ‘నార్సీ’ విధానంలో వున్న మాయ. ఈ మాయ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బయటపడాలి. ఈ నార్సీల పోకడ గురించి మనకి పూర్తిగా తెలియపో్తే ఆ ఉచ్చులో మనం చిక్కుకుపోతాం. లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కష్టం. (సమాప్తం).

వైఎస్ షర్మిలపై కేసు నమోదు 

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్, కడప పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలపై కేసు నమోదు చేశారు . మే 2వ తేదీన బద్వేల్‌ బహిరంగ సభలో వైఎస్ వివేకా హత్య కేసు గురించి ప్రసంగించారని.. షర్మిలపై బద్వేల్ నోడల్ అధికారి, మున్సిపల్ కమిషనర్‌లు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఎఫ్ ఐఆర్ 168 , ఐపిసి సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు .కాగా, ఎన్నికల నేపథ్యంలో వైఎస్ వివేకా హత్య కేసు గురించి ప్రస్తావించకూడదని కడప కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ వైఎస్ షర్మిల.. వివేకా హత్య కేసును ప్రస్తావించారని అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బద్వేల్ పీఎస్‌లో ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా, షర్మిలపై కేసు నమోదు చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు సహా విపక్ష పార్టీల నేతలు ఫైర్ అవుతున్నారు. ఇదంతా వైసీపీ నేతల ప్లాన్ అని మండిపడుతున్నారు.

ఉత్తరాంధ్రలో వైసీపీకి ఘోర పరాభవం తప్పదా?

ఉత్తరాంధ్రలో అధికార వైసీపీకి ఎదురుగాలి వీస్తున్నది. ఈ ప్రాంతంలోని మూడు జిల్లాలలోనూ వైసీపీ అభ్యర్థులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విశాఖలో అయితే ఆ పార్టీకి  ఘోర పరాభవం తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ రాజధాని అంటూ ఆర్భాటం చేసిన వైసీపీ ఆ దిశగా ఒక్క అడుగూ వేయలేకపోవడం, పర్యావరణ ముప్పును కూడా లేక్క చేయకుండా రుషికొండకు బోడిగుండు కొట్టి మరీ భవన నిర్మాణాలు చేపట్టడం ప్రజలలో అధికార పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకోవడానికి కారణమయ్యాయని అంటున్నారు. జిల్లాకు సంబంధించిన కీలక సమస్యల పరిష్కారం గురించి పట్టించుకోకపోవడం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడితేవడంలో విఫలం కావడం ఇవన్నీ వెరసి వైసీపీకి జిల్లాలో గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతున్నారు. విజయనగరం జిల్లా నుంచి  మంత్రి బొత్సా సతీమణి బొత్స ఝాన్సీరాణిని విశాఖ ఎంపీగా పోటీలో దింపడమే.. విశాఖలో ఆ పార్టీ పరిస్థితికి అద్దంపడుతోందని చెబుతున్నారు.  గత ఎన్నికలలో అంటే 2019లో విశాఖ లో  నాలుగు అసెంబ్లీ స్థానాలలోనూ తెలుగుదేశం విజయం సాధించింది. అయితే విశాఖ లోక్ సభ స్థానంలో పరాజయం పాలైంది. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అన్ని అసెంబ్లీ స్థానాలనూ గెలుచుకోవడమే కాకుండా విశాఖ లోక్ సభ స్థానంలో కూడా తెలుగుదేశం జయకేతనం ఎగురవేసే పరిస్థితులున్నాయని స్థానిక ప్రజల మూడ్ ను బట్టి అవగతమౌతోంది. విశాఖ జిల్లాలో ప్రచారం తీరు చూస్తుంటే అసలు వైసీపీ పోటీలో ఉందా అన్న అనుమానం కలుగుతోందని స్థానికులు అంటున్నారు. ఇదే పరిస్థితి ఉత్తరాంధ్రమూడు జిల్లాల్లోనూ కనిపిస్తోందంటున్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖ పట్నం వరకూ ప్రతి నియోజజకర్గంలోనూ కూడా వైసీపీ అభ్యర్థులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రజల మద్దతు కూడగట్టుకోవడంలో పూర్తిగా విఫలమౌతున్నారు. స్థానిక సమస్యలపై జనం వైసీపీ అభ్యర్థులను ఎక్కడికక్కడ నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక సమస్యలపై ప్రజల ప్రశ్నాస్త్రాలకు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్న పరిస్థితి గోచరిస్తోంది. సమస్యల పరిష్కారంపై జవాబు చెప్పలేని వైసీపీ అభ్యర్థులు చేసే కొత్త వాగ్దానాలను జనం నమ్మడం లేదు. దీంతో ఉత్తరాంధ్రలో వైసీపీ ప్రచారంలో వెనుకబడింది. మూడు జిల్లాల్లోనూ కూడా వైసీపీ అభ్యర్థులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న వాతావరణం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది.  

జగన్ మానసిక వ్యాధి ‘నార్సీ’ - పార్ట్ 4

‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’... సంక్షిప్త రూపం ‘నార్సీ’ వైసీపీ అధినేత జగన్‌లో తారస్థాయికి చేరుకుందన్న విషయంలో పాఠకులకు స్పష్టత వచ్చిందని భావిస్తున్నాము. ఈ ‘నార్సీ’ వ్యాధిగ్రస్తులకు లక్షణాలు మరికొన్ని.... ‘నార్సీ’ వ్యక్తులకు తమకంటే వేరే ఎవరూ గొప్పగా, ఛరిష్మా కలిగిన వ్యక్తుల్లా వుండటం ఇష్టం వుండదు. అలా ఎవరికైనా తనకంటే ఎక్కువ ఛరిష్మా వుంటే, అలాంటి వాళ్ళని తన కాళ్ళ దగ్గరకి రప్పించుకుంటాడు. ఆమధ్య సినిమావాళ్ళని తన దగ్గరకి పిలిపించుకుని జగన్ ఎంత అవమానించాడో చూశాం. సినిమావాళ్ళ కార్లన్నీ ఎక్కడో దూరంగా ఆపించేసి, వాళ్ళని చాలాదూరం నడిపించడం, వాళ్ళు చేతులు జోడించి నమస్కరిస్తుంటే, బిల్డప్పుగా కూర్చోవడం ఇవన్నీ ‘నార్సీ’ లక్షణాల కిందకే వస్తాయి.  ‘నార్సీ’ ధోరణిలో ఆంధ్రప్రదేశ్‌లో  మనం గమనిస్తున్న మరీ భయంకరమైన విషయాలు ఏమిటంటే, జగన్ ప్రభుత్వానికి కేవలం ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ మాత్రమే కాకుండా సైకోటిక్ బిహేవియర్ కూడా వున్నట్టు అనిపిస్తోంది. మేం చెప్పింది ఎవరైనా చేసి తీరాలి.. మేం చెప్పింది జరిగి తీరాలి. మేం అనుకుంటూ మూడు రాజధానులు ఏర్పడాలి. అమరావతి నాశనం అయిపోవాలనుకుంటే నాశనం అయిపోవాలి.. మాకు నచ్చిందే చట్టం అవ్వాలి.. మాకు నచ్చనివాళ్ళు అరెస్ట్ అయిపోవాలి. దానిని ఎవరూ ప్రశ్నించకూడదు. ఈ కోర్టులేంటి.. మమ్మల్ని కంట్రోల్ చేయడమేంటి అన్నట్టుగా ఈ సైకోటిక్ బిహేవియర్ తయారైంది. వీళ్ళని వ్యతిరేకించిన వాళ్ళని అరెస్టు చేయడం, వాళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, మహిళలైతే వారి కేరెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా కామెంట్లు చేయడం, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం, ఎంతకైనా దిగజారిపోవడం, ఎలాంటి తప్పుడు వార్తలైనా ప్రచురించడం, తాము అరెస్టు చేయించనవాళ్ళని పోలీసులు కొడుతుంటే చూసి సంతోషపడటం... ఇవన్నీ శాడిస్ట్ బిహేవియర్ కిందకు వస్తాయి. ఇక యాంటీ సోషల్ బిహేవియర్... అంటే, చట్టాలకు, కోర్టులకు మర్యాద ఇవ్వకపోవడం, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన జడ్జిలను తిట్టించడం, కో్ర్టులు అమ్ముడుపోయాయని ఆరోపించడం..  ఇలాంటి లక్షణాలు కలగలసిన వ్యక్తికి ఉదాహరణగా ‘హిట్లర్’ అని చెప్పవచ్చు. కానీ, హిట్లర్‌ ఎంత ‘నార్సీ’ అయినా, జర్మనీని ప్రపంచంలో టాప్‌లో నిలబెట్టాలన్న ఉద్దేశం వుంది. జగన్ దగ్గర అది కూడా లేదు. దేశంమీదగానీ, రాష్ట్రం మీదగానీ ఎలాంటి ప్రేమ లేదు. ఇలాంటి వాడు ఒక రాష్ట్రానికి గానీ, ఒక దేశానికి గానీ, ఒక జాతికి గానీ నాయకుడైతే నాశనం తప్ప ఇంకేమీ మిగలదు (ఇంకావుంది)

నారాయణ గెలుపు నల్లేరు మీద బండి నడకే!

గత ఎన్నికలలో వైసీపీ నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. ఆ జిల్లాలోని మొత్తం పదికి పది అసెంబ్లీ స్థానాలలోనూ విజయకేతనం ఎగుర వేసింది. అయితే ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి వైసీపీ పరిస్థితి జిల్లాలో పూర్తిగా దిగజారింది. పరిశీలకుల విశ్లేషణలైతే జిల్లాలో గత ఎన్నికలలో వచ్చిన ఫలితం ఈ సారి రివర్స్ అయినా ఆశ్చర్యం లేదన్నట్లుగా సాగుతున్నాయి. ఐదేళ్ల కిందటి పరిస్థితికీ, ఇప్పటికీ జిల్లా రాజకీయాలలో గణనీయమైన మార్పు వచ్చిందనడంలో సందేహం లేదు.  ముఖ్యంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంో తెలుగుదేశం అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పొన్నూరు నారాయణకు పరిస్థితులు పూర్తి అనుకూలంగా మారాయని వైసీపీ శ్రేణులే అంగీకరించేస్తున్నాయి. ఆయన విజయం సాధించడమే కాదు, భారీ మెజారిటీ కూడా సాధిస్తారని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ పోటీలో ఉన్నారు. గత ఎన్నికలలో నారాయణకు ప్రత్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే అనీత్ కుమార్ యాదవ్ తీవ్ర ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్నారు. దీంతో వైసీపీ ఆయనను అక్కడ నుంచి తప్పించి ఖలీల్ అహ్మద్ ను రంగంలోకి దింపింది. ఈ నిర్ణయం ఖలీల్ ఆహ్మద్ కు ప్రతికూలంగా మారిందని చెబుతున్నారు. వైసీపీలో అంతర్గత విభేదాలు, నియోజకవర్గంలో కనిపించని అభివృద్ధి, అలాగే మొత్తంగా  అధికార వైసీపీపై ప్రజా వ్యతిరేకత అన్నీ కలిసి నారాయణకు నియోజకవర్గంలో విజయాన్ని సునాయాసం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి.  వీటికి తోడు తాను మంత్రిగా, నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉండగా నియోజకవర్గ అభివృద్ధికి నారాయణ చేసిన కృషి ఆయనకు పెద్ద ప్లస్ అయ్యింది. అలాగే ఈ ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం నారాయణపై కేసుల పేరిటి వేధింపులకు పాల్పడటం కూడా ఆయన పట్ల ప్రజలలో సానుభూతి వెల్లువెత్తడానికి దోహదపడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏ విధంగా చూసినా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నారాయణ విజయం నల్లేరు మీద బండినడకేనని చెబుతున్నారు. 

ప్రశాతంగా సాగుతున్న మూడో విడత పోలింగ్

సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 93 నియోజకవర్గాలలో ఈ  విడతలో పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాటు చేసింది. కాగా తొలి రెండు విడతలలో జరిగిన పోలింగ్ లో బీజేపీ ఒకింత వెనుకబడిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. చివరకు బీజేపీ కూడా అలాగే భావిస్తోంది. ఈ నేపథ్యంలో  మూడో విడతలో ఆధిక్యత కోసం బీజేపీ ప్రచారంలో స్పీడ్ పెంచింది. విపక్షాలపై విమర్శల డోస్ పెంచింది. పలు చోట్ల విద్వేష ప్రసంగాలకూ వెనుకాడలేదు. దీంతో మూడో విడత పోలింగ్ సరళి ఎలా ఉంటుందన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది   లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా నేడు (మంగళవారం) మూడో దశ పోలింగ్ మొదలైంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 93 లోక్‌సభ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలైంది.  వేసవితాపం నేపథ్యంలో ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద భారీ క్యూలలో నిలబడి ఉండటం కనిపించింది. ఈ దశలో అసోం- 4  , బీహార్-5, ఛత్తీస్‌గఢ్ -7, గోవా-2, గుజరాత్-26, కర్ణాటక-14, మధ్యప్రదేశ్-8, మహారాష్ట్ర-11, ఉత్తరప్రదేశ్ -10, పశ్చిమ బెంగాల్-4, కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ-2 లోక్ సభ నియోజకవర్గాలకు  పోలింగ్ జరుగుతోంది. మరోవైపు మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ లోక్‌సభ స్థానానికి కూడా పోలింగ్ మొదలైంది. రెండో దశలోనే ఇక్కడ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి మరణించడంతో మూడో దశకు వాయిదా పడింది. ఈ దశలో మొత్తం 1,300 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్‌లో  తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

కుటుంబాలను చీల్చే వ్యక్తిని కాను తల్లీ.. ముద్రగడ కుమార్తెతో పవన్ కల్యాణ్

జనసేనాని పవన్ కల్యాణ్ కు పిఠాపురంలో విజయం  నల్లేరు మీద బండి నడకే అని పరిశీలకులు నియోజకవర్గ పరిస్థితులను ఉటంకిస్తూ విశ్లేషణలు చేస్తున్నారు. మరో వైపు పవన్ కల్యాణ్ ను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ దాడులకు పాల్పడుతూ తన పరపతిని మరింత దిగజార్చుకుంటోంది. మెగా హీరో సాయి ధర్మ తేజపై పిఠాపురంలో జరిగిన దాడి పట్ల ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. సరే ఇక ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి తండ్రితో విభేదించి తన మద్దతు పవన్ కల్యాణ్ కే అని ప్రకటించడం, ముద్రగడ తన కుమార్తె తన ప్రాపర్టీ కాదు అంటూ వ్యాఖ్యనించడంతో ముద్రగడ తన పరువునే కాకుండా పార్టీ ప్రతిష్టను కూడా మంటగలిపేశారు. తాజాగా పవన్ పోలింగ్ పూర్తి కాకుండానే ప్రజల హృదయాలను గెలిచేసుకున్నారు. తన సంస్కారంతో, తన నైతిక విలువలతో నియోజకవర్గ ప్రజలను కదిలించారు.  ఇంతకీ ఏం జరిగిందంటే.. ముద్రగడ పద్మనాభం కుమార్తె.. తండ్రితో విభేదించి తన మద్దతు పవన్ కల్యాణ్ కే అని ప్రకటించి ఊరుకోకుండా, తన భర్తతో కలిసి పవన్ కల్యాణ్ విజయం కోసం కృషి చేస్తానంటూ పవన్ కల్యాణ్ ను కలిశారు. పవన్ కోసం ప్రచారం చేస్తానని ఆయనకు చెప్పారు.  అయితే  పవన్ కల్యాణ్ సున్నితంగా తిరస్కరించారు. తాను కుటుంబాలను కలిపే వ్యక్తినే కానీ, విడదీసే వాడిని కానని ముద్రగడ కుమార్తె క్రాంతికి విస్పష్టంగా కలిశారు. ఆమెను ఇప్పుడు జనసేనలోకి ఆహ్వానించలేనని సున్నితంగానైనా చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల తరువాత మీ ఇంటికి వచ్చి మీ తండ్రిగారి సమక్షం మిమ్మల్ని జనసేనలోకి ఆహ్వానిస్తానని పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు ఆయన పాటిస్తున్న నైతిక విలువలకు అద్దం పట్టాయి.  తన ఓటమే లక్ష్యం అంటూ రంగంలోకి దిగిన ముద్రగడ పద్మనాభం కు తేరుకోలేని దెబ్బ కొట్టే విధంగా ఆయన కుమార్తె క్రాంతికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి ఉండొచ్చు. అయితే జనసేనాని ఆ ఆప్షన్ ను ఎంచుకోలేదు. తాను కుటుంబాలను చీల్చే వ్యక్తిని కానంటూ సున్నితంగా క్రాంతి జనసేన ప్రవేశాన్నినిరాకరించారు. అంతే కాదు ముద్రగడ పద్మనాభం సమక్షంలోనే ఎన్నికల తరువాత మిమ్మల్ని పార్టీలోని ఆహ్వానిస్తానంటూ చెప్పి.. తనపై అడ్డగోలు విమర్శలు చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి కూడా గౌరవం ఇచ్చి ముద్రగడ స్థాయిని అందరికీ అర్ధమయ్యేలా ఎత్తి చూపారు. పవన్ కల్యాణ్ వ్యక్తిత్వంతో పోలిస్తే ముద్రగడ స్థాయి పిపీలకం కంటే తక్కువ అని జనం భావించేలా చేశారు.  

ఎవరీ హరీష్ కుమార్ గుప్తా.. ఈసీ ఆయన్నేఏపీ డీజీపీగా ఎందుకు నియ‌మించింది?

ఆంధ్రప్రదేశ్ నూత‌న‌ డీజీపీగా హ‌రీశ్ కుమార్ గ‌ప్తాను ఎన్నిక‌ల సంఘం నియ‌మించింది. ఆయన సోమవారం (మే6) బాధ్యతలు చేపట్టారు. ఏపీ డీజీపీగా కొన‌సాగుతున్న రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై ఎన్నిక‌ల సంఘం ఆదివారం బ‌దిలీ వేటు వేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న అధికార వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విప‌క్షాల నుంచి ఈసీకి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. ఫిర్యాదుల‌పై విచార‌ణ జ‌రిపిన ఈసీ.. రాజేంద్ర‌నాథ్ రెడ్డి డీజీపీగా కొన‌సాగితే ఏపీలో ఎన్నిక‌లు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జ‌ర‌గ‌వ‌ని భావించి ఆయ‌న‌పై బ‌దిలీ వేటు వేసింది. కొత్త డీజీపీగా హ‌రీశ్ కుమార్ గుప్తాను నియ‌మించింది. ఆయ‌న సోమ‌వారం (మే6)సాయంత్రం ఏపీ నూత‌న డీజీపీగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అయితే అసలు హ‌రీశ్ కుమార్ గుప్తా ఎవ‌రు? ఆయన ఏ రాష్ట్రానికి చెందిన వ్య‌క్తి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల్లో సీనియారిటీ లిస్ట్ లో హ‌రీశ్ ఆరో స్థానంలో ఉన్నారు. తొలి ఐదుగురిని కాద‌ని ఈసీ హ‌రీశ్ కుమార్ గుప్తానే ఎందుకు నూత‌న డీజీపీగా ఎంపిక చేసింది అనే చ‌ర్చ ఏపీ అధికార వ‌ర్గాల్లో జ‌రుగుతున్నది. ప్ర‌స్తుతం ఏపీలో ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో హ‌రీశ్ కుమార్ గుప్తా అయితేనే ఎన్నిక‌ల‌ను ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హించ‌గ‌ల‌ర‌ని ప‌లు అంశాల‌ను బేరీజు వేసుకొని ఈసీ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హ‌రీశ్ కు ఏపీ నూత‌న డీజీపీగా బాధ్య‌త‌లు అప్ప‌గించింది.  ఏపీ నూత‌న డీజీపీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన హ‌రీశ్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయ‌న జ‌మ్మూ అండ్ కాశ్మీర్ కు చెందిన వ్య‌క్తి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల లిస్టులో మొద‌టి స్థానంలో ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఉన్నారు. కానీ, ఆయ‌న స‌స్పెన్షన్ పై క్యాట్ విచార‌ణ‌ జరుగుతోంది. దీంతో ఆయ‌న పోస్టింగ్ కు అవ‌కాశం లేకుండా పోయింది. రెండో స్థానంలో ద్వార‌కా తిరుమ‌ల‌రావు ఉన్నారు. తొలుత ఆయ‌న్నే నూత‌న డీజీపీగా ఈసీ ఎంపిక చేస్తుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ హ‌రీశ్ కుమార్ గుప్తాను ఏపీ నూత‌న డీజీపీగా ఈసీ నియ‌మించింది. హ‌రీశ్ కుమార్ గుప్తా ఎవ‌రు? ఆయ‌న గ‌తంలో ఎక్క‌డెక్క‌డ ప‌నిచేశారు.. ? ఏపీలో ఏఏ విభాగాల్లో ఆయ‌న ప‌నిచేశార‌నే విష‌యాల‌ను చూస్తే..  1992లో ఐపీఎస్ అధికారిగా ఆయ‌న బాధ్య‌త‌లు స్వీక‌రించారు.  1994లో ఖ‌మ్మం జిల్లా అడిష‌న‌ల్ ఎస్పీగా ప‌నిచేశారు.  1995లో మెద‌క్ జిల్లా ఏఎస్పీగా ప‌నిచేశారు.  1996లో క‌రీంన‌గ‌ర్ జిల్లా ఏఎస్పీగా ప‌నిచేశారు. 1999లో   తొలిసారి ఆయ‌న‌కు ప‌దోన్న‌తి ల‌భించింది. కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆయ‌న 2002 సంవ‌త్స‌రం వ‌ర‌కు అక్క‌డే  ప‌నిచేశారు.  2002 సంవ‌త్స‌రంలో యూస‌ఫ్ గూడ‌లోని ఫ‌స్ట్ బెటాలియ‌న్ సూప‌ర్ క‌మాండెంట్ గా వెళ్లారు.  ఆరు నెల‌ల త‌రువాత 2002లోనే సీఐడీ ఎస్పీగా ప‌నిచేశారు.  2004లో హైద‌రాబాద్ సౌత్ జోన్ డీసీపీగా ప‌నిచేశారు.  2006 నుంచి 2011 సంవ‌త్స‌రం వ‌ర‌కు న‌ల్గొండ జిల్లా ఎస్పీగా ప‌నిచేశారు.  2011 నుంచి 2012 వ‌ర‌కు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీఐజీగా ప‌నిచేశారు.  2012 నుంచి 2016 వ‌ర‌కు గుంటూరు రేంజ్ ఐజీగా ప‌నిచేశారు.  2016లో టెక్నిక‌ల్ స‌ర్వీస్ ఐజీ కొన్నాళ్లు.. లా అండ్ ఆర్డ‌ర్ ఐజీగా కొన్నాళ్లు ప‌నిచేశారు.  2019లో  వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత లా అండ్ ఆర్డ‌ర్ అడిష‌న‌ల్ డీజీగా ప‌నిచేశారు.  2022లో ఎస్ఎల్‌పీఆర్‌బి  చైర్మ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆయ‌న కొద్ది నెల‌ల‌కే రైల్వేలో అడిష‌న‌ల్ డీజీపీగా ప‌నిచేశారు.  2023 మే నెల‌లో హోంశాఖ కార్యదర్శిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.  2024 మే 6న ఏపీ నూత‌న డీజీపీగా హ‌రీశ్ కుమార్ గుప్తాకు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ ఈసీ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆయ‌న వెంట‌నే డీజీపీగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

వాస్తుతో పాటు జగన్ ఈ పనులు కూడా చేయాలి...

ఐదేళ్ళపాటు చేయకూడని అరాచకాలు అన్నీ చేసిన జగన్, ఇప్పుడు అధికారం చేజారిపోతోందని అర్థం చేసుకుని ఆందోళన పడిపోతున్నారు. మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించిన ఆయనకు తన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కమ్ ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలను సెట్ చేసుకుంటే సరిపోతుందని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిన వెంటనే అమల్లో పెట్టేశారు. ఇనుప కాంపౌండ్ వాల్‌కి సంబంధించిన రిపేర్లు చేశారు. గోడ ఎత్తు తగ్గించడం యుద్ధ ప్రాతిపదిక మీద జరిగిపోయింది. వాస్తు దోషాలను సరిచేశారు సరే... మరి మిగతా దోషాల సంగతేంటి? -- అద్బుతమైన రాజధానిగా రూపొందే అమరావతిని పాడుబెట్టేసి ఘోస్ట్ సిటీగా మార్చేశారు. మరి ఈ దోషానికి పరిహారం ఏమిటి? -- ఈ ఐదేళ్ళలో జగన్ అండ్ కో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచేసి, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు. మరి ఆ తప్పుకు దండన ఏమిటి? -- కల్తీ మద్య ప్రవాహంతో వేలాది ప్రాణాలు గాల్లో కలసిపోయేలా చేశారు.. ఆ నేరానికి శిక్ష ఏమిటి? -- హత్యారాజకీయాలు చేసి ఎంతోమంది టీడీపీ కార్యకర్తల ప్రాణాలు తీశారు.. ఆ ఘోరాలకు శిక్ష ఏమిటి? -- రాష్ట్ర విభజన తర్వాత ముందడుగులో వున్న రాష్ట్రాన్ని పాతికేళ్ళు వెనక్కి తీసుకెళ్ళారు.. ఆ నేరానికి శిక్ష ఏమిటి? -- పరిశ్రమలను తరిమేసి, ఉపాధి అవకాశాలను పాతాళంలోకి పడేసి లక్షలాది మంది యువకుల జీవితంలో ఐదేళ్ళ కాలాన్ని వృధా చేశారు. ఏం చేస్తే ఈ పొరపాటు సరిదిద్దడానికి వీలవుతుంది? -- ఈ ఐదేళ్ళలో వైసీపీ ప్రభుత్వం ఆశీస్సులతో జరిగిన నేరాలు, ఘోరాలు, అన్యాయాలు, ఆర్థిక నేరాలు... వీటన్నిటి సంగతేమిటి? .... ఇవి జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన దారుణాల్లో కొన్ని... మరి ఇలాంటివన్నిటినీ మరచిపోయి, ఒక్క వాస్తు దోషం సరిచేస్తే అధికారం వచ్చేస్తుందని ఆశించడం అజ్ఞానం కాక మరేమవుతుంది?

తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదుః కేసీఆర్‌

గోదావరి న‌దీ జ‌లాల్ని తీసుకెళ్లి కర్నాటక, తమిళనాడుకు ఇస్తాన‌ని మోడీ చెబుతున్నా,   సి.ఎం. రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించ‌డం లేద‌ని మాజీ సి.ఎం. కేసీఆర్ ప్ర‌శ్నిస్తున్నారు. తాను సిఎంగా ఉన్నప్పుడే మోడీ గోదావరిపై ప్రతిపాదన పంపారట‌.  అయితే ముందు తెలంగాణ వాటా తేల్చండి. ఆ త‌రువాతే  మీటింగ్ కు వస్తానని మోడీకి తేల్చిచెప్పానని కేసీఆర్ చెబుతున్నారు. ఇంకా తెలంగాణ ఉద్యమం అయిపోలేదు.  తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందంటారు కేసీఆర్‌.  ఎన్నికల్లో ఓటమి అనేది టెంపరరీ సెట్‌ బ్యాక్‌ మాత్రమే. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు నిబ్బరం ఉండాలి.  గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని కేసీఆర్ త‌న క్యాడ‌ర్‌కు హిత‌బోధ చేస్తూ ఎన్నిక‌ల ప్ర‌చారం కొన‌సాగిస్తున్నారు.  తెలంగాణ ఉద్యమ సందర్భంగా జరిగిన కొన్ని సంఘటల్ని కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో గుర్తు చేస్తున్నారు.  ఉద్యమ చివరి దశలో తాను ఢిల్లీ వెళ్తుండగా ఆంధ్రా పత్రికల వాళ్లు తనకు ఒక ప్రశ్న వేశారని, ఢిల్లీ వెళ్తున్న మీరు అక్కడ ఏం జరుగుతుందని... అడిగారని గుర్తు చేశారు. దానికి తాను ఒకటే మాట చెప్పానని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి నేను ఢిల్లీ వెళ్తున్నానని, తిరిగి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతానని చెప్పానని, ఈ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం, ఎంత నమ్మకం ఉండాలని అన్నారు. ఆ రోజు ప్రజల దీవెన, బలంతో అన్న ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెట్టినట్లు చెప్పారు.  పదేళ్లలో తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం.  కానీ, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో అంతా గాడి తప్పింది. రాష్ట్రం ఇంత తొందరగా ట్రాక్‌ ఎలా తప్పిందని, ఇప్పుడున్న పాలకులకు ఒక పద్ధతీ పాడు లేదని కేసీఆర్ విమర్శించారు.  తెలంగాణాను తిరిగి బాగు చేయాల్సిన బాధ్యత మనదేనని, మళ్లీ మనం వచ్చేవరకు దీటుగా పనిచేసి రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం బీఆర్‌ఎస్‌ పార్టీని ముందుకు తీసుకొని పోవాలని, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలకు ప్రజలు మోసపోయారని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  రాష్ట్రంలో రూ. 1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ చెన్నైకి వెళ్లిపోయిందని స్పష్టం చేశారు. అనేక సంస్థలు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని యోచిస్తున్నాయన్నారు. అనేక సంస్థలు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని చూస్తున్నాయని కెసిఆర్ చెబుతున్నారు.   కాంగ్రెస్ పాలనలో ప్రతి రంగం  విఫలం కావడంతో ప్రజల్లో మార్పు మొదలైందని, తద్వారా రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని ఆయ‌న చెబుతున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంట్‌ ఎన్నిక‌లు కేసీఆర్‌కు  ఇజ్జ‌త్‌కే స‌వాల్‌గా మారాయా?  తెలంగాణ సాధ‌న‌ను 2014లో ఆయుధంగా మార్చుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన కేసీఆర్‌, 2018లో “ఆంధ్రోళ్ల పాల‌న మ‌న‌కు అవ‌స‌ర‌మా?!”-అంటూ.. ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొన్నారు.  ఇప్పుడేమో తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదంటున్నారు. మ‌రి తెలంగాణా ప్ర‌జ‌లు లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనైనా కేసీఆర్‌ను ప‌ట్టించుకుంటారా అనేది ఉత్కంఠ‌గా మారింది.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌

వృద్ధుల ఉసురు తగిలి తీరుతుంది

ఎవరు ఎంత అధికారంలో అయినా వుండవచ్చు... మా మాటకు ఎదురు లేదు.. మేం చేసిన దానికి తిరుగులేదు అనే ధీమాలో వుంటే వుండొచ్చు.. కానీ ‘కర్మఫలం’ అనేది ఒకటి వుంటుంది. అది ఎంతటి వారైనా అనుభవించి తీరాల్సిందే. చేసిన కర్మనిబట్టి కర్మఫలం కూడా అంతే స్థాయిలో వుంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి రెడీ అవుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి. ఆ కర్మఫలంలో తన వాటా తాను తీసుకోవడానికి రెడీ కావల్సిన వ్యక్తి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. వృద్ధులకు పెన్షన్ ఇవ్వడంలో ఉదారంగా వ్యవహరించాలని, వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పడం కాకుండా వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, జగన్మోహన్ రెడ్డి ఆలోచన వేరు. చంద్రబాబు పెన్షన్ ఆపే ప్రయత్నం చేశారని ప్రచారం చేయడం ప్లాన్ నంబర్ వన్. పెన్షన్ వృద్ధులకు వాళ్ళ ఇళ్ళ దగ్గర కాకుండా బ్యాంకులకు వెళ్ళి తీసుకునే పరిస్థితి రావడానికి చంద్రబాబే కారణమని ప్రచారం చేయడం నంబర్ టు. ఈ రెండు ప్లాన్స్ విజయవంతంగా అమలు చేయడానికి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తనవంతు సహకారం అందించారు. వృద్ధులకు ఇళ్ళకు వెళ్ళి పెన్షన్ ఇచ్చే అవకాశం వున్నప్పటికీ అలా చేయలేదు. ఆ నిర్ణయం వల్ల, భయంకరమైన ఎండల కారణంగా ఇప్పటి వరకు 33 మంది వృద్ధులు మరణించారు.  తమ రాజకీయ ప్రయోజనాల కోసం పండుటాకుల్లాంటి వృద్ధుల జీవితాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం. అవకాశం వున్నప్పటికీ, జగన్  అడుగులకు మడుగులు ఒత్తుతూ సీఎస్ జవహర్ రెడ్డి వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పడం దారుణం. వృద్ధుల విషయంలో వీరిద్దరూ చేసిన దానికి ‘కర్మఫలం’ అతి త్వరలో లభిస్తుంది. వీరిద్దరికీ వృద్ధుల ఉసురు తగిలి తీరుతుంది.

నెక్ట్స్ వికెట్ సీఎస్ జవహర్ రెడ్డేనా? ఈసీ వేటుకు వేళాయెనా?

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్  వారం రోజుల వ్యవధిలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీకి కొమ్ముకాస్తూ ఏక‌ప‌క్షంగా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని చూస్తున్న అధికారుల జాబితాను రెడీ చేసుకున్న ఈసీ ఆ జాబితాలో ఒక్కొక్క‌రి పై బదిలీ వేటు వేస్తూ వ‌స్తున్న. ఇప్ప‌టికే ప‌లువురు అధికారుల‌పై బ‌దిలీ వేటు వేసిన ఈసీ.. ఆదివారం (మే6)  రాష్ట్ర డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై బ‌దిలీ వేటు వేసింది. ఆయ‌న స్థానంలో ర‌వికుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా   నియ‌మించింది. రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై గ‌త కొంత‌కాలంగా ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల నుంచి ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రాజేంద్ర‌నాథ్ రెడ్డి అధికార పార్టీ వైసీపీకి కొమ్ముకాస్తూ ఎన్నిక‌ల్లో ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ నేత‌లు ఈసీకి ఫిర్యాదులు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాల‌ను సైతం  స‌మ‌ర్పించారు. దీంతో రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై బ‌దిలీ వేటు వేసిన ఈసీ.. ర‌వికుమార్ గుప్తాను కొత్త డీజీపీగా నియ‌మించింది. రాజేంద్ర‌నాథ్  రెడ్డిపై బ‌దిలీ వేటు తో నెక్ట్స్ వికెట్ ఎవ‌రిద‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయ‌, అధికార వ‌ర్గాల్లో జోరందుకుంది.  ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి పై ఈసీ బ‌దిలీ వేటు వేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.  ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి అధికార వైసీపీ కార్య‌క‌ర్త‌లా ప‌నిచేస్తున్నార‌ని, సీఎం జ‌గ‌న్ ఆదేశాల‌నే ఇప్ప‌టికీ ఆయ‌న పాటిస్తున్నార‌న్న విమర్శలు కూటమి నేతల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ఈసీకి కూడా పలుమార్లు ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా వాలంటీర్లు, పెన్ష‌న్ల పంపిణీ విష‌యంలో సీఎస్ వ్య‌వ‌హ‌రించిన తీరు సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. ప్ర‌తీనెలా ప్ర‌భుత్వం వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్ష‌న్లు పంపిణీ చేస్తున్నది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రావ‌డంతో వారు ఎలాంటి విధుల్లో పాల్గొన‌వ‌ద్ద‌ని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. పెన్ష‌న్ దారుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా పెన్ష‌న్లు అందించాల‌ని సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కానీ, జ‌వ‌హ‌ర్ రెడ్డి ఈసీ ఆదేశాల‌ను పెడ‌చెవిన పెట్ట‌డంతో ఏప్రిల్ నెల పెన్ష‌న్లు తీసుకొనే స‌మ‌యంలో పెన్ష‌న్ దారులు అనేక ఇబ్బందులు ప‌డ్డారు. ప‌లువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. దీంతో వైసీపీ నేత‌లు ఈ వ్య‌వ‌హారాన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందు ప్ర‌య‌త్నాలు చేశారు. మే నెల పెన్ష‌న్ల పంపిణీ విష‌యంలోనూ సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి  స‌మ‌ర్థ‌వంతంగా ఈసీ ఆదేశాల‌ను పాటించ‌క పోవ‌టంతో పెన్ష‌న్ దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.   సీఎస్ తీరుపై ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పెన్షనర్లు ఏమైపోయినా పరవాలేదు.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మేలు జ‌ర‌గాల‌ని సీఎస్ వ్య‌వ‌హ‌రించార‌ని టీడీపీ నేత‌లు ఆందోళ‌న‌ వ్య‌క్తం చేశారు. పెన్ష‌న్ పంపిణీ విష‌యంలోనూ, వాలంటీర్ల విష‌యంలోనూ, ఇత‌ర అంశాల్లోనూ సీఎస్ వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆధారాల‌తో స‌హా ఈసీకి విప‌క్ష నేత‌లు ఫిర్యాదు చేశారు. అయితే, విప‌క్షాల ఫిర్యాదుల‌పై ఈసీ విచార‌ణ చేయ‌గా సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని స్ప‌ష్ట‌మైన‌ట్లు తెలుస్తోంది. దీంతో నేడో, రేపో జ‌వ‌హ‌ర్ రెడ్డిపై ఈసీ బ‌దిలీ వేటు వేయ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ ఏపీ అధికార వ‌ర్గాల్లో జ‌రుగుతున్నది. ఒక‌వేళ ఈసీ జ‌వ‌హ‌ర్ రెడ్డిపై వేటు వేయ‌కుంటే ఎన్నిక‌లు స‌జావుగా జ‌రిగే ప‌రిస్థితి ఉండ‌ద‌ని విప‌క్ష నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇలా ఉండగా ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహణపై పట్టుదలగా ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనా పలు సందర్భాలలో  చెప్పారు. ఇప్పుడు ఎన్నికల సంఘం వరుసగా అధికారులపై బదిలీ వేటు వేయడాన్ని చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది. తాజాగా సోమవారం అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆయనను వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించింది. అలాగే ఆయనకు ఎటువంటి ఎన్నికల విధులూ అప్పగించవద్దని సీఎస్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  

అనంతపురం రేంజ్ డిఐజిపై వేటు 

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎపిలో నూతన డిజిపి నియామకమయ్యారు. అంతటితో ఆగకుండా ఎన్నికల కమిషన్ దూకుడు పెంచింది.  ఎన్నికల నేపథ్యంలో పలువురు పోలీసు అధికారులను ఈసీ బదిలీ చేస్తోంది. తాజాగా అనంతపురం జిల్లాలో పలువురు అధికారులపై బదిలీ వేటు వేసింది. అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్ఎస్ అమ్మిరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. కింది స్థాయి అధికారికి వెంటనే బాధ్యతలను అప్పగించి రిలీవ్ కావాలని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఆయనకు ఎన్నికలకు సంబంధించిన విధులను అప్పగించవద్దని ఆదేశించింది. ఈ రాత్రి 8 గంటల లోపు ముగ్గురు అధికారుల పేర్లతో ప్యానల్ పంపాలని ఆదేశాలు జారీ చేసింది.  డీఐజీ అమ్మిరెడ్డిపై పలు ఆరోపణలు ఉన్నాయి. అధికార వైసీపీకి ఆయన సహకరిస్తున్నారని విపక్ష కూటమి నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా చూపారు. ఈ నేపథ్యంలో ఈసీ చర్యలు తీసుకుంది. ఇప్పటికే అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ ను ఈసీ బదిలీ చేసింది. ఆయన స్థానంలో అమిత్ బర్దర్ ను నియమించింది. మరోవైపు, అనంతపురం అర్బన్ డీఎస్పీగా టీవీవీ ప్రతాప్ కుమార్ ను, రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును నియమిస్తూ ఈసీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.   

జగన్ ఆ ఇంటర్వ్యూ ఇవ్వకుండా వుండాల్సింది...

‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఒక కీలక సీన్ వుంటుంది. ముఖ్యమంత్రి పోస్టులో వున్న రఘువరన్‌ని జర్నలిస్టు పాత్రలో అర్జున్ ఇంటర్వ్యూ చేస్తాడు. ఆ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి అనవసరంగా నోరు జారి తన పదవిని, పరువుని పోగొట్టుకుంటాడు. క్లైమాక్స్.లో రఘువరన్ బాల్చీ తన్నేస్తూ హీరోతో ‘‘అది చాలా గొప్ప ఇంటర్వ్యూ’’ అంటాడు. అంటే, ఒక్క ఇంటర్వ్యూ ముఖ్యమంత్రి అంత స్థాయి వున్న వ్యక్తిని పూర్తిగా పతనం అయ్యేలా చేసింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మొన్నీమధ్య నేషనల్ మీడియాకి.. ముఖ్యంగా టైమ్స్ నౌ ఎడిటర్ నవికా కుమార్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా సేమ్ టు సేమ్ ‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఇంటర్వ్యూ  లాంటిదే. ఆ సినిమాలో ముఖ్యమంత్రి పదవి పోయింది.. ఈ రియాల్టీలో ముఖ్యమంత్రి పరువు పోయింది. జగన్ గెలవబోతున్నాడా.. ఓడుతున్నాడా అని అప్పటి వరకు జాతీయ స్థాయిలో గానీ, స్థానికంగా గానీ వున్న డోలాయమాన పరిస్థితికి ఆ ఇంటర్వ్యూ ఫుల్‌స్టాప్ పెట్టింది. నవికా కుమార్ అడిగిన ప్రశ్నలకు జగన్ ఇచ్చిన సమాధానాలు, హావభావాలు జగన్ ఓటమిని ఫిక్స్ చేశాయి. ఇక జగన్ తట్టాబుట్టా సర్దుకోవడం ఖాయమన్న క్లారిటీ జాతీయ స్థాయిలో కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో జగన్ ఆ ఇంటర్వ్యూ ఇవ్వకుండా వుండాల్సిందనే అభిప్రాయాలు వైసీపీలో వ్యక్తమవుతున్నాయి. గతజలసేతు బంధనం మాదిరిగా, జరిగిపోయిన నష్టం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు వైసీపీ వర్గాలు తీరిగ్గా బాధపడుతున్నాయి. ఇకమీదట జగన్ ఏ జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వకూడదని వైసీపీ వర్గాలు ఫిక్సయ్యాయి. అసలే ఓటమి భయం నిలువెల్లా ఆవరించి వున్న జగన్ ఢిల్లీ జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి తడబడిపోతున్న పరిస్థితి. జాతీయ రాజకీయాల మీద మీ వ్యూ ఏమిటని అడిగితే, నాకు జాతీయ రాజకీయాల గురించి అంతగా తెలియదు అని సమాధానం చెప్పడం... అది కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలా అనడం చాలా మైనస్ అయింది. అందుకే, ఎందుకొచ్చిన గొడవ.. నేషనల్ మీడియాకి దూరంగా వుంటే సరిపోతుంది కదా అని వైసీపీ వర్గాలు ఫిక్సయ్యాయి. ఏపీలో మీడియాకి జగన్ అంతట జగనే చెప్పడం తప్ప, జర్నలిస్టులు అడిగిన దానికి సమాధానం చెప్పే అలవాటు జగన్‌కి లేదు. గత ఐదు సంవత్సరాలుగా ఇదే వ్యవహారం. మరి నేషనల్ మీడియా జర్నలిస్టులు అలా కాదు.. కోడి ఈకలు పీకినట్టు ప్రశ్నలు సంధిస్తారు. ఆ పీకుడుని తట్టుకునే పరిస్థితిలో జగన్ లేరు. మరీ ముఖ్యంగా... బాబాయ్ హత్య గురించి, చెల్లెమ్మ షర్మిల తిరుగుబాటు గురించి ప్రశ్నలు అడిగితే మాత్రం జగన్ తడబడిపోతున్నారు. ఆయా ప్రశ్నలకు ఏ సమాధానం చెబుతున్నారో జగన్‌కే అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. అందువల్ల ప్రభుత్వం పోతే పోయింది.. ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చి జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకోవడం ఎందుకన్న అభిప్రాయంలో వైసీపీ వర్గాలు వున్నట్టు సమాచారం.