Read more!

తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదుః కేసీఆర్‌

గోదావరి న‌దీ జ‌లాల్ని తీసుకెళ్లి కర్నాటక, తమిళనాడుకు ఇస్తాన‌ని మోడీ చెబుతున్నా,   సి.ఎం. రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించ‌డం లేద‌ని మాజీ సి.ఎం. కేసీఆర్ ప్ర‌శ్నిస్తున్నారు. తాను సిఎంగా ఉన్నప్పుడే మోడీ గోదావరిపై ప్రతిపాదన పంపారట‌.  అయితే ముందు తెలంగాణ వాటా తేల్చండి. ఆ త‌రువాతే  మీటింగ్ కు వస్తానని మోడీకి తేల్చిచెప్పానని కేసీఆర్ చెబుతున్నారు. ఇంకా తెలంగాణ ఉద్యమం అయిపోలేదు.  తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందంటారు కేసీఆర్‌.  ఎన్నికల్లో ఓటమి అనేది టెంపరరీ సెట్‌ బ్యాక్‌ మాత్రమే. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు నిబ్బరం ఉండాలి.  గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని కేసీఆర్ త‌న క్యాడ‌ర్‌కు హిత‌బోధ చేస్తూ ఎన్నిక‌ల ప్ర‌చారం కొన‌సాగిస్తున్నారు. 

తెలంగాణ ఉద్యమ సందర్భంగా జరిగిన కొన్ని సంఘటల్ని కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో గుర్తు చేస్తున్నారు.  ఉద్యమ చివరి దశలో తాను ఢిల్లీ వెళ్తుండగా ఆంధ్రా పత్రికల వాళ్లు తనకు ఒక ప్రశ్న వేశారని, ఢిల్లీ వెళ్తున్న మీరు అక్కడ ఏం జరుగుతుందని... అడిగారని గుర్తు చేశారు. దానికి తాను ఒకటే మాట చెప్పానని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి నేను ఢిల్లీ వెళ్తున్నానని, తిరిగి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతానని చెప్పానని, ఈ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం, ఎంత నమ్మకం ఉండాలని అన్నారు. ఆ రోజు ప్రజల దీవెన, బలంతో అన్న ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెట్టినట్లు చెప్పారు. 

పదేళ్లలో తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం.  కానీ, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో అంతా గాడి తప్పింది. రాష్ట్రం ఇంత తొందరగా ట్రాక్‌ ఎలా తప్పిందని, ఇప్పుడున్న పాలకులకు ఒక పద్ధతీ పాడు లేదని కేసీఆర్ విమర్శించారు.  తెలంగాణాను తిరిగి బాగు చేయాల్సిన బాధ్యత మనదేనని, మళ్లీ మనం వచ్చేవరకు దీటుగా పనిచేసి రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం బీఆర్‌ఎస్‌ పార్టీని ముందుకు తీసుకొని పోవాలని, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలకు ప్రజలు మోసపోయారని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  రాష్ట్రంలో రూ. 1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ చెన్నైకి వెళ్లిపోయిందని స్పష్టం చేశారు. అనేక సంస్థలు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని యోచిస్తున్నాయన్నారు. అనేక సంస్థలు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని చూస్తున్నాయని కెసిఆర్ చెబుతున్నారు.   కాంగ్రెస్ పాలనలో ప్రతి రంగం  విఫలం కావడంతో ప్రజల్లో మార్పు మొదలైందని, తద్వారా రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని ఆయ‌న చెబుతున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంట్‌ ఎన్నిక‌లు కేసీఆర్‌కు  ఇజ్జ‌త్‌కే స‌వాల్‌గా మారాయా? 

తెలంగాణ సాధ‌న‌ను 2014లో ఆయుధంగా మార్చుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన కేసీఆర్‌, 2018లో “ఆంధ్రోళ్ల పాల‌న మ‌న‌కు అవ‌స‌ర‌మా?!”-అంటూ.. ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొన్నారు.  ఇప్పుడేమో తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదంటున్నారు. మ‌రి తెలంగాణా ప్ర‌జ‌లు లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనైనా కేసీఆర్‌ను ప‌ట్టించుకుంటారా అనేది ఉత్కంఠ‌గా మారింది. 

- ఎం.కె.ఫ‌జ‌ల్‌