Read more!

వృద్ధుల ఉసురు తగిలి తీరుతుంది

ఎవరు ఎంత అధికారంలో అయినా వుండవచ్చు... మా మాటకు ఎదురు లేదు.. మేం చేసిన దానికి తిరుగులేదు అనే ధీమాలో వుంటే వుండొచ్చు.. కానీ ‘కర్మఫలం’ అనేది ఒకటి వుంటుంది. అది ఎంతటి వారైనా అనుభవించి తీరాల్సిందే. చేసిన కర్మనిబట్టి కర్మఫలం కూడా అంతే స్థాయిలో వుంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి రెడీ అవుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి. ఆ కర్మఫలంలో తన వాటా తాను తీసుకోవడానికి రెడీ కావల్సిన వ్యక్తి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి.

వృద్ధులకు పెన్షన్ ఇవ్వడంలో ఉదారంగా వ్యవహరించాలని, వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పడం కాకుండా వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, జగన్మోహన్ రెడ్డి ఆలోచన వేరు. చంద్రబాబు పెన్షన్ ఆపే ప్రయత్నం చేశారని ప్రచారం చేయడం ప్లాన్ నంబర్ వన్. పెన్షన్ వృద్ధులకు వాళ్ళ ఇళ్ళ దగ్గర కాకుండా బ్యాంకులకు వెళ్ళి తీసుకునే పరిస్థితి రావడానికి చంద్రబాబే కారణమని ప్రచారం చేయడం నంబర్ టు. ఈ రెండు ప్లాన్స్ విజయవంతంగా అమలు చేయడానికి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తనవంతు సహకారం అందించారు. వృద్ధులకు ఇళ్ళకు వెళ్ళి పెన్షన్ ఇచ్చే అవకాశం వున్నప్పటికీ అలా చేయలేదు. ఆ నిర్ణయం వల్ల, భయంకరమైన ఎండల కారణంగా ఇప్పటి వరకు 33 మంది వృద్ధులు మరణించారు. 

తమ రాజకీయ ప్రయోజనాల కోసం పండుటాకుల్లాంటి వృద్ధుల జీవితాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం. అవకాశం వున్నప్పటికీ, జగన్  అడుగులకు మడుగులు ఒత్తుతూ సీఎస్ జవహర్ రెడ్డి వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పడం దారుణం. వృద్ధుల విషయంలో వీరిద్దరూ చేసిన దానికి ‘కర్మఫలం’ అతి త్వరలో లభిస్తుంది. వీరిద్దరికీ వృద్ధుల ఉసురు తగిలి తీరుతుంది.