జగన్ దీక్ష భగ్నం

  సమైఖ్యాంద్ర కోసం గత ఐదురోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నిరాహార దీక్ష వల్ల బీపీ, షుగర్ లెవల్స్ స్థాయి పడిపోవడం, కీటోన్స్ కూడా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం అర్ధరాత్రి, కట్టుదిట్టమైన భద్రత మధ్య చంచల్‌గూడ జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జగన్ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా లేనప్పటికీ... దీక్షను కొనసాగిస్తే మాత్రం కష్టమని ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు పోలీసులకు వివరించారు. దీక్ష విరమించాలని అధికారులు కోరినప్పటికీ జగన్ తిరస్కరించడంతో...ఉన్నతాధికారుల సూచన మేరకు జగన్‌ను అర్ధరాత్రి 11 గంటల తర్వాత ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జగన్ తల్లి విజయలక్ష్మి, భార్య భారతి కూడా ఉస్మానియా ఆస్పత్రికి వచ్చారు.

రాజీనామాలు చేసి జనంలోకి రండి

  విభజన ప్రకటనతో సీమాంద్రలో భారీ ఎత్తున నిరసనలు వెళ్లువెత్తుతున్న నేపధ్యంలో కేంద్రమంత్రులు, ఎంపీలతో ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశం అయ్యారు. వాడివేడిగా జరిగిన చర్యల్లో నేతలను ఇంకా ఎందుకు రాజీనామ చేయలేదని జేఎసి నాయకులు నిలదీశారు. విభజన ప్రకటన వెనక్కి తీసుకునేలా రాజకీయా నాయకులు కూడా కార్యచరణ చేపట్టాలని నాయకులు పై ఒత్తిడి తెచ్చారు. ఇంకా ఏం సాదించటానికి మీరు పదవులలో కొనసాగుతున్నారు. సీమాంద్రలో జరుగుతున్న ఉద్యమ తీవ్రతను కేంద్రానికి తెలియజేయటంలో మీరు పూర్తిగా విఫలమయ్యారంటూ నాయకుల పై మండిపడ్డారు. రాజీనామాలు చేయకుండా జనంలో ఎలా తిరగాలనుకుంటున్నారు, మీరు రాజీనామ చేస్తే తిరిగి మిమ్మలన్ని గెలిపించుకునే పూచీ మాది అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో  ఎంపీలు కేవీపీ రామచంద్రారావు, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకటరామిరెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్ మంత్రులు చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పనబాక లక్ష్మి, కావూరు సాంబశివరావు, పళ్లంరాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జెడీ శీలం, కిల్లి కృపారాణి ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబుతో పాటు 30 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

సమైక్యవాదమంటే ప్రేమోన్మాది చేసే యాసిడ్ దాడి వంటిదే

  టీ.జేయేసీ చైర్మన్ ప్రొఫెస్సర్ కోదండరామ్ తెలంగాణావాదులను ఉద్దేశించి మాట్లాడుతూ నేడు సీమంధ్రలో జరుగుతున్న సమైక్యఉద్యమం ప్రేమోన్మాది చేతిలో యాసిడ్ వంటిదని అన్నారు. సమైక్యవాదులు ఇతరుల హక్కులను, స్వేచ్చను గౌరవించడం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. తెలంగాణకు అడ్డుపడితే ఊరుకొబోమని, తెలంగాణా సత్తా ఏమిటో చాటి చెపుతామని ఆయన అన్నారు. సెప్టెంబర్ 7న సిటీ కాలేజ్ నుంచి ఇందిరాపార్కు వరకు జరిగే తెలంగాణ సాధన ర్యాలీలో తెలంగాణా ప్రజలందరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేసారు. తెలంగాణపై జరుగుతున్న కుట్రలను అడ్డుకొనేందుకు మళ్ళీ ప్రజలందరూ ఉద్యమ బాట పట్టవలసిన అవసరం ఉందని అన్నారు. అందుకే సెప్టెంబర్ 1నుండి 6వరకు వరుసగా గ్రేటర్ హైదరాబాద్, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్ లలో పెద్ద ఎత్తున శాంతి ర్యాలీలు నిర్విహించబోతున్నామని వాటిలో ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.   విద్యార్ధుల జీవితాలు తీర్చిదిద్దవలసిన ప్రొఫెసర్ కోదండరామ్ ఆపని చేయక చాల కాలమే అయ్యింది. మంచి వక్తగా పేరున్నఆయన ప్రతిభను కేసీఆర్ గుర్తించి తెలంగాణా ఉద్యమంలోకి ఆహ్వానించడంతో ఆయన దశ తిరిగింది. ఆయన తన జీవితమంతా ఆచార్యుడిగా పనిచేసినా రాని పేరు ప్రతిష్టలు, గుర్తింపు, రాజకీయంగా ఎదిగే అవకాశం అన్నీకూడా కేసీఆర్ మరియు తెలంగాణా ఉద్యమాల పుణ్యామని సంపాదించుకొన్నారు. టీ.జేయేసీ చైర్మన్ గా ఆయన కేసీఆర్ తో సమాన హోదా, పేరు ప్రతిష్టలు, సంపాదించుకొన్నతరువాత, ఆయన ఇప్పుడు కేసీఆర్ కే సవాలుగా మారారు. కేసీఆర్ చేపడుతున్న ఉద్యమాలకి సమాంతరంగా తాను ఉద్యమాలు నడుపుతూ ప్రజలలో గందరగోళం సృష్టిస్తున్నారు.   వచ్చేనెల 7వ తేదీన ఆంధ్ర యన్.జీ.ఓ.లు హైదరాబాదులో లక్షమంది ఉద్యోగులతో తలపెట్టిన బహిరంగసభను అడ్డుకొనేందుకు కేసీఆర్ 6వ తేదీన రెండు లక్షల మందితో హైదరాబాదులో శాంతి ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిస్తే, ప్రొఫెసర్ కోదండరామ్ సెప్టెంబర్ 7న శాంతి ర్యాలీ జరపాలని పిలుపునీయడం, కేవలం తన ఉనికిని చాటుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప మరొకటి కాదు.   తెలంగాణా కోసం పోరాడుతున్న కేసీఆర్ తో, తెరాసతో ఆయన కలిసి పనిచేయలేన్నపుడు, తెలంగాణావాదులందరూ కలిసి ఉద్యమించాలని పిలుపునీయడం హాస్యాస్పదం. లక్షలాది ప్రజలను రోడ్లపైకి రప్పించి సాటి తెలుగు ప్రజలతోనే యుద్దానికి పురిగొల్పడం వలన ఎటువంటి దారుణ పరిణామాలు ఎదురవుతాయో తెలిసి కూడా ఈవిధంగా రెచ్చగొట్టడం ఆయన వంటి ఉన్నత విద్యావంతుడు చేయవలసిన పని కాదు.   రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్న ఆంధ్ర యన్.జీ.ఓ.లు కూడా ఇటువంటి ప్రమాదకరమయిన ఆలోచనలు మానుకోవాలి. ఉన్నత విద్యావంతులయిన ఇరుపక్షాల నేతలు కూడా ఇప్పుడు తమ ఆశయసాధనకు విజ్ఞతకు బదులు మంద బలం ఉపయోగించాలనుకోవడం చాలా అవివేకం. తమ ఆశయ సాధన కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటం చాల హేయమయిన ఆలోచన. ఇటువంటి ఆలోచనలను ఎవరు చేసినా ఖండించాల్సిందే.

ఉస్మానియాకు వైయస్‌ జగన్‌

  సమన్యాయం చేయాలంటూ లేదంటే రాష్ట్రన్ని సమైక్యంగా ఉంచాలంటూ జైలులోనే దీక్ష చేపట్టిన వైయస్‌ జగన్‌ దీక్షను గురువారం అర్ధరాత్రి పోలీసులు భగ్రం చేశారు. ఆగస్టు 24 నుంచి దీక్షకు దిగిన జగన్‌ను గురువారం రాత్రి 11.58 గంటలకు బలవంతంగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే జగన్‌ తన దీక్షను ఆసుపత్రిలో కూడా కొనసాగిస్తున్నారు. జగన్‌ బిపితో పాటు షుగర్‌ లెవల్‌, పల్స్‌ రేట్‌ పడిపోయినట్టుగా డాక్టర్లు చెపుతున్నారు. ప్రస్థుతం జగన్‌ ను ఉస్మానియా ఓపి బిల్డింగ్‌లోని ఏఎంసీయూ 116 నెంబర్‌ గదిలో ఉంచారు. అయితే జగన్‌ ఎటువంటి వైద్యాని సహకరించటం లేదని, పోలీసులు డాక్టర్‌లు ఎంత చెప్పిన వినటం లేదని ఉస్మానియా హాస్పిటల్‌ ఆర్‌ఎంఒ చెప్పారు.

గోడ మీద పిల్లిలా పార్టీలు

      తెలంగాణ ప్రజలు సీమాంధ్ర ఉద్యోగులకు గానీ, హైదరాబాద్ లో ఉంటున్న సీమాంధ్రులకు గానీ వ్యతిరేకం కాదు. ప్రపంచంలోనే అత్యంత శాంతియుతంగా ఒక్క రక్తం చుక్క చిందకుండా గత 13 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఏర్పాటుకు అన్ని పార్టీలు మద్దతు తెలిపిన తరవాత, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ప్రకటన వచ్చింది. ఇప్పుడు సీమాంధ్ర నేతలు, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ నేతలు తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని టీఆర్ఎస్ విమర్శించింది. సీమాంధ్రలో ఉద్యమం నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.   తెలంగాణ మీద నిర్ణయం వచ్చాక ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్యాయం అంటోంది. మరి ఇంతకుముందు తెలంగాణలో తిరిగినప్పుడు, దీక్షలు చేసినప్పుడు విజయమ్మ, జగన్, షర్మిలలు ఇలా ఎందుకు అనలేదు ? తెలంగాణ రాకముందు అనుకూలమని చెప్పి, ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు రెండుకళ్ల సిద్దాంతంతో మాట్లాడుతున్నారు. మీకు తెలంగాణ అంటే ఇష్టం లేకుంటే సమైక్యానికి అనుకూలం అని ధైర్యంగా చెప్పండి కానీ గోడ మీద పిల్లిలా వ్యవహరించడం మానుకోవాలని టీఆర్ఎస్ నేతలు మందా జగన్నాధం, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి తదితరులు అన్నారు.

షర్మిలా బస్సు యాత్ర

        ఒకవైపు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బస్ యాత్ర సెప్టెంబర్ ఒకటిన ఆరంభం కాబోతుండగా, మరోవైపు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పక్షాన షర్మిల కూడా బస్ యాత్ర సెప్టెంబరు రెండు నుంచి ఆరంభిస్తున్నారు. సెప్టెంబరు 2 వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నేపథ్యంలో ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి బస్సుయాత్ర మొదలు పెడతారు. రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయలేని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చేయకూడదని, ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంచాలని డిమాండ్ చేస్తూ బస్సుయాత్ర చేయనున్నారు. ఇటీవలనే పాదయాత్ర ముగించుకుని షర్మిల తిరిగి బస్సుయాత్ర చేపట్టనుండడం గమనార్హం. సెప్టెంబరు రెండునే హరికృష్ణ కూడా ఆయన తండ్రి స్వస్థలమైన నిమ్మకూరు నుంచి యాత్ర చేయవచ్చని అంటున్నారు. అది కూడా జరిగితే సీమాంద్రలో ముగ్గురు నేతలు యాత్రలు చేస్తున్నట్లవుతుంది.

జగన్ కేసులపై విభజన ప్రభావం

    రాష్ట్ర విభజన ప్రభావం కేవలం ప్రజల మీదనే కాక జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై కూడా పడవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులలో ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలకు చెందిన వ్యక్తులు, కార్యాలయాలు, ఆస్తులు, వ్యవహారాలు ఉన్నందున సీబీఐ పని మరింత కష్టమవుతుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుండి విషయ సేకరణ, అనుమతులు, చట్టపరమయిన నిబంధనలు వగైరా అన్నీ సీబీఐకి ప్రతిబంధకంగా మరే అవకాశం ఉంది.   అదేవిధంగా రెండు రాష్ట్రాలలో ఏర్పడే ప్రభుత్వాలను బట్టి కూడా కేసు తీరు తెన్నులు మరే అవకాశం ఉంది. ఒకవేళ సీమాంధ్ర, తెలంగాణా రెండు చోట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడినట్లయితే కేసు   యధావిధిగా సాగవచ్చును. ఒకవేళ తెలంగాణాలో తెరాస లేదా కాంగ్రెస్-తెరాస సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి, సీమంధ్రలో జగన్ పార్టీ ప్రభుత్వం ఏర్పరచగలిగితే కేసులు నత్తనడకన సాగవచ్చును. ఒకవేళ తెలంగాణాలో తెరాస, సీమంధ్రలో తెదేపా ప్రభుత్వాలు ఏర్పరచగలిగితే కేసులు రేసుగుర్రంలా పరుగులు తీయవచ్చును. ఎందుకంటే సీమాంధ్రకు చెందిన జగన్ మోహన్ రెడ్డి ఆఖరి నిమిషంలో తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడ్డాడడనే అక్కసుతో తెరాస ప్రభుత్వం సీబీఐకి పూర్తిగా సహకరిస్తే, వైకాపాను దాని అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని ప్రధమ విరోధిగా భావిస్తున్న తెదేపా కూడా సీబీఐకి పూర్తి సహకరించవచ్చును. ఇవిగాక అనేక ఇతర అంశాలు కూడా జగన్ కేసును తీవ్ర ప్రభావితం చేయవచ్చును.

ఉగ్రవాది యాసిన్ భత్కల్ అరెస్ట్

      ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు,కరుడుగట్టిన ఉగ్రవాది యాసిన్ భత్కల్ నేపాల్ సరిహద్దులో అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్ దిల్‌సుఖనగర్‌లో జరిగిన రెండు జంట పేలుళ్ల కేసులో భత్కల్ సూత్రధారి. ఇటీవల అరెస్టైన అబ్దుల్ కరీం అలియాస్ తుండ ఇచ్చిన సమాచారంతో ఎన్ఐఏ అధికారులు భత్కల్‌ను అరెస్ట్ చేశారు. బెంగళూరు, పుణే, ఢిల్లీ, నాగపూర్ తదితర నగరాల్లో పేలుళ్లలో ఇతని పాత్ర ఉంది. ఇతని పైన రూ.20 లక్షల రివార్డ్ ఉంది. భత్కల్‌తో పాటు మరో ఉగ్రవాది అసదుల్లా అక్తర్‌ను కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. పాకిస్థాన్‌లోని లష్కరే తయ్యాబాతో భత్కల్‌కు సంబంధాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఉగ్రవాది యాసిన్ భత్కల్ అరెస్ట్‌ను కేంద్ర హోంశాఖ ధృవీకరించింది.

మెగాస్టార్ బాటలో కెసిఆర్..!!

      తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాత మొదటిసారిగా ఢిల్లీ వెళ్ళిన కె.చంద్రశేఖరరావు..కాంగ్రెస్ అదిష్టానంతో విలీన౦ పై చర్చలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. కెసిఆర్ సాధారణంగా ఢిల్లీ వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతుంటారు. కాని ఈ సారి ఆయన మీడియాతో మాట్లాడకుండానే విమానం ఎక్కేసారు. దీంతో టీఆర్ఎస్ విలీనానికి టైం దగ్గర పడిందని ఉహాగానాలు వినిపిస్తున్నాయి.   కెసిఆర్ ప్రస్తుతం ఢిల్లీలో విలీనం గురించి కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఫ్యామిలీ ప్యాకేజ్ డిమాండ్ ను ప్రస్తావించినట్లు ఢిల్లీ వర్గాల బోగట్టా. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే...తన కూతురు..కొడుక్కి పదవులను అడిగిన కెసిఆర్ హరీష్ రావు గురించి పట్టించుకోకపోవడం ఆశ్చర్యం. తనకు ఏఐసీసీ సెక్రటరీ జనరల్ పదవి, తన కొడుకు కేటీఆర్ కు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి, కూతురు కవితకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలనే డిమాండ్ ను కాంగ్రెస్ అధిష్టానం ముందు వుంచినట్లు తెలుస్తోంది.   తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక...కాంగ్రెస్ ఎదిరించి పార్టీని నడపడం కష్టమని అనుకున్న కెసిఆర్...ఈ విషయంలో జగన్ రూట్ కన్నా చిరంజీవిని రూటే బెటరని భావిస్తున్నాడు.

సభ పెట్టుకుంటే అభ్యంతరం లేదు : గీతారెడ్డి

  సెప్టెంబర్‌ 7న ఎపి ఎన్జీవోలు తలపెట్టిన సభ వివాదాస్పదమవుతుండటంతో ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఈ విషయం పై స్పందించిన రాష్ట్ర మంత్రి గీతారెడ్డి. ఎపి ఎన్జీవోలు సభ పెట్టుకోవచ్చన్నారు. పదేళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగానే అంగీకరించాం. సభ పెట్టుకోవడానికి అభ్యంతరాలు ఎందుకు చెపుతామన్నారు. శాంతియుతంగా ఎవరు ఎక్కడైనా కార్యక్రమాలు నిర్వహించుకొవచ్చని చెప్పారు. అయితే శాంతి భద్రతల పరిస్థితిని బట్టి సభకు లభించటం లభించకపోవటం ఉంటుందన్నారు. గీతారెడ్డి నివాసంలో బుధవారం జరిగిన ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులతో పాటు ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సంధర్బంగా రాష్ట్రంలో తాజా పరిణామాలమై చర్చించిన నేతలు తరువాత మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఎంతో సమ్యనం పాటిస్తున్నారన్న ఆమె సీమాంద్ర నాయకులు, ప్రజలు విభజనకు సహకరించాలని కోరారు. సీడబ్ల్యూసిలో తీసుకున్న హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తప్ప వేరే దేనికి అంగీకరించబోమని ప్రకటించారు.

రోగానికి పన్నేసిన రాష్ట్ర సర్కార్‌

  రాష్ట్ర పభుత్వం నిర్ణయాలు తుగ్లక్‌ పాలనను తలపిస్తున్నాయి. అప్పట్లో జుట్టుకు చదువుకు ఇలా రకరకాల పన్నులు ఉండేవట అని పుస్తకాల్లో మాత్రమే చదివాం. ఇప్పుడు అంతకన్నా విచిత్రమైన పన్నులను వేస్తుంది మన ప్రభుత్వం. కర్మ కాలి రోగం వచ్చినా దవాఖానాలో ఉన్నందుకు ప్రభుత్వానికి పన్ను కట్టాలంటూ కొత్త నిర్ణయం తీసుకుంది. ఆదాయం కోసం ఇప్పటికే బాండ్లను కూడా అమ్ముకుంటున్న మన రాష్ట్ర సర్కారు ఇప్పుడు సామాన్యుడి ఆరోగ్యానికి కూడా వెలకడుతుంది. ఇతర రాష్ట్రల్లో ఎక్కడా లేని విధంగా ఐసియూ ఉన్న హాస్పిటల్స్‌ లగ్జరీ ట్యాక్స్‌ కట్టాలంటూ ప్రైవేట్‌ ఆసుపత్రులకు నోటీసుల జారీ చేసింది. ఐసియూలో ఉన్న పడకల సంఖ్యను బట్టి ఈ పన్నును నిర్ణయించారు. దీంతో ఇక ఆ పన్నును రోగినుంచే వసూలు చేయడానికి సిద్దమవుతున్నాయి ఆసుపత్రి యాజమాన్యాలు. అసలై ప్రైవేట్‌ దవాఖానాల దోపిడితో విలవిలలాడుతున్న రోగులు ఇప్పుడు పన్ను పోటుతో మరింత కుదేలవుతున్నారు. తీవ్రమైన జబ్బులు, అరుదైన సమస్యలతో బాధపడే వారిని రోజుల తరబడి ఐసీయూలోనే ఉంచుతారు. ఇక అలాంటి వారికి వైధ్యం మరింత భారం కానుంది.  

31 నుంచి మొదలవనున్న గ్యాస్‌ కష్టాలు

  హైదరాబాద్‌లో గ్యాస్‌ కష్టాలు మొదలవనున్నాయి. ఈ నెల 31 నుంచి నగదు బదిలీ పథకం అమలవుతుండటంతో ఫస్ట్‌ నుంచి అందరూ సిలిండర్‌ 990 రూపాయలు పెట్టి తీసుకోవాల్సిందే. ఆదార్‌ నెంబర్‌ను గ్యాస్‌ ఏజెన్సీలతో పాటు, బ్యాంక్‌ ఎకౌంట్లకు కూడా లింక్‌ చేయించుకున్నవారికి మాత్రమే సబ్సిడి సొమ్ము అందలేదు. ఇప్పటి వరకు ఈ ప్రక్రియ కింద ఎల్పీజీ కనెక్షన్లు ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమైంది 34 శాతమే.. అయితే ఫస్ట్‌ లోపు ఆధార్ పొందని గ్యాస్ వినియోగదారులు.. గ్యాస్ సిలిండర్‌ను మార్కెట్ ధరకే కొనుక్కోవాల్సి ఉంటుంది.   గడువు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉండటంతో బ్యాంక్‌లు ఆదివారం కూడా నమోదు ప్రక్రియకు వీలు కల్సించనున్నాయి. దీనితో పాటు వినియోగదారులకు జిరో బ్యాలెన్స్‌ ఎకౌంట్లు తీసుకునే వీలును కూడా కల్పిస్తున్నాయి. అయితే ఎన్ని చర్యలు చేపట్టిన గడువులోగా అందరి ఆదార్‌ నెంబర్లు నమోదు చేయడం సాధ్యపడదంటున్నారు విశ్లేషకులు. అక్టోబర్‌ 1 నుంచి నెల్లూరు జిల్లాలో కూడా నగదు బదిలీ పథకం అమలు అవుతుండటంతో సామాన్యుడికి గ్యాస్‌ కష్టాలు తప్పేలాలేవు. ఇప్పటికే ఐదు జిల్లాల్లో నగదు బదిలీ పథకం అమలవుతున్నా సమస్యలు కూడా అదే స్ధాయిలో తలెత్తుతున్నాయి. అయితే ఆదార్‌ కార్డు ఉన్న వారికి నగదు బదిలీ అందుతుండటంతో చాలా మందికి సబ్సిడి సొమ్ము అందే అవకాశం లేదంటున్నాయి గణాంకాలు. జిల్లాలొ దాదాపు 30 లక్షల  జనాభా ఉండగా ఇంకా కేవలం 20 లక్షల మందికి మాత్రమే ఆదార్‌ కార్డులు అందాయి. జిల్లాలో ఐదెన్నర లోలక్షల గ్యాస్‌ కనెక్షన్‌లు ఉండగా వీరిలో కేవలం 2 లక్షల మంది మాత్రమే గ్యాస్‌ ఏజెన్సీలలో తన ఆదార్‌ నెంబర్‌ను లింక్‌ చేయించారు. దీంతో నగదు బదిలీ పథకం అమలయితే 50 శాతానికి పైగా ప్రజలు గ్యాస్‌ సిలిండర్‌కు 990 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

తెలుగు ప్రజలతో ఆడుకొంటున్న రాజకీయ పార్టీలు

  వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాష్ట్ర విభజనలో సమన్యాయం చేయాలంటూ తన పార్టీ నేతలతో కలిసి బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మూడు గంటలసేపు ధర్నానిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వపాలన పూర్తిగా గాడి తప్పిందని, ప్రజలెవరూ సంతోషంగా లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. తన భర్త స్వర్గీయ రాజశేఖరరెడ్డి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకొన్నారని, అయితే ప్రస్తుతం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నాయని, తత్ఫితంగా రాష్ట్రం అగ్నిగుండంగా మారిందని ఆమె అన్నారు.   తెలుగు ప్రజల సమైక్యకృషి కారణంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ ను ఇప్పుడు విభజన కారణంగా ఎందుకు వదులుకోవాలని ఆమె ప్రశ్నించారు. అందరి కృషి కారణంగా అభివృద్ధి అయిన నగరాన్ని ఇప్పుడు కేవలం తెలంగాణకు మాత్రమే ఎలా కేటాయిస్తారని ఆమె ప్రశ్నించారు.   విజయమ్మతో సహా నేడు కాంగ్రెస్, తెదేపా నేతలు సైతం అడుగుతున్నఈ ప్రశ్నలు గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించినప్పుడు అడిగి ఉంటే, ఆ పార్టీల నిబద్ధతపై రాష్ట్ర ప్రజలందరికీ నమ్మకం కలిగి ఉండేది. కానీ, ఆవిధంగా అడిగితే అది తెలంగాణా వ్యతిరేఖతగా ప్రచారమయితే అక్కడ తమ పార్టీలు ఎక్కడ నష్టపోతాయనో భయంతో నాడు అందరూ మౌనం వహించారు తప్ప ఈ సందేహాలన్నీనాడు వారికి లేవని కాదు. నేడు రాష్ట్రం యొక్క, ప్రజల యొక్క దైన్య స్థితి గురించి బాధపడుతూ మొసలి కన్నీరు కారుస్తున్న ఈ రాజకీయ నేతలకు, నిజంగా తమ పార్టీ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావించి ఉంటే ఆనాడే దైర్యంచేసి వివిధ అంశాలపై నేడు లేవనెత్తుతున్న ధర్మసందేహాలను అడిగి ఉంటే నిజంగానే నేడు రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిఉండేది కాదు. అంతే కాకుండా ఈ అంశాలపై ఈపాటికి ఒక స్పష్టత కూడా వచ్చి ఉండేది.   ఆనాడు తెలంగాణా ఉద్యమాల వల్ల తమ పార్టీలపై ఏర్పడిన తీవ్ర ఒత్తిళ్ళ నుండి తాత్కాలికంగా బయటపడే ఉద్దేశ్యంతో, తాము రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చినప్పటికీ కేంద్రం ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణా ఇవ్వలేదని వారు బలంగా నమ్మినందునే లేఖలు ఇచ్చారు. తెలంగాణాలో తమ పార్టీలు నష్టపోకూడదనే ఆలోచనతోనే నాడు అఖిలపక్షంలో నోరు మూసుకొని కూర్చొని వచ్చారు.   తమ ఈ నిర్వాకాన్నిఅంతా నేర్పుగా కప్పిపుచ్చుకొంటూ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, మిగిలిన పార్టీల వైపు వేలెత్తి చూపుతూ ఇంకా ప్రజలని మభ్యపెట్టాలని చూస్తున్నాయి. అందుకే నేడు సీమాంధ్రలో సమైక్య ఉద్యమం చేస్తున్న ప్రజల వద్దకు సదరు నేతలు దైర్యంగా వెళ్ళలేకపొతున్నారు. వెళ్ళిన ప్రతీ ఒక్కనేతకీ భంగ పాటు తప్పడం లేదు. ప్రజలు రాజకీయ నాయకుల మాటలను నమ్మడం లేదని ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది. అయినప్పటికీ నిరాహార దీక్షలు, ధర్నాలు, యాత్రలు చేయడం ద్వారా ప్రజలను సులువుగా మభ్యపెట్టవచ్చుననే భ్రమలో ఉండటం విశేషం.   ఇప్పటికయినా రాజకీయ నేతలు, పార్టీలు విజ్ఞత ప్రదర్శించి రాష్ట్రం మళ్ళీ గాడినపడేలా చేయగలిగితే ప్రజలే వారికి పట్టం కడతారు. లేకుంటే అందుకు వారు భారీ మూల్యం చెల్లించక తప్పదు.

అధికారుల‌ను కిడ్నాప్ చేసిన కానిస్టేబుల్‌

  చిరంజీవి హీరోగా న‌టించిన ఠాగూర్ సినిమా అంద‌రికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి హైద‌ర‌బాద్‌లో చోటు చేసుకుంది పోలీస్ శాఖ ప్రక్షల‌న చేస్తానంటున్న ఓ వ్యక్తి ముగ్గుకు అధికారుల‌ను కిడ్నాప్ చేశాడు. దీంతో ఒక్కసారి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉలిక్కి ప‌డింది. గతంలో కూడా ఓ పిటివో అధికారిని కిడ్నాప్ చేసిన శ‌ర్మ అనే వ్యక్తి  ఈ సారి కూడా కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. ముగ్గురు అధికారుల‌ను తాను కిడ్నాప్ చేసిన‌ట్టుగా శ‌ర్మ ప్రక‌టించాడు. వారిలో ఇద్దరు పిటివో అధికారులు కాగా ఒక‌రు బిజెపి ప్రతినిథి. స‌ద‌రు పిటివో అధికారులు అవినీతికి పాల్పడుతున్నార‌ని అందుకే వారిని కిడ్నాప్ చేశాన‌ని శ‌ర్మ తెలిపాడు. ప్రత్యేక రాయ‌ల‌సీమ కోరుతున్నందుకు గాను బిజెపి ప్రతినిధిని కిడ్నాప్ చేశాన‌ని చెపుతున్నాడు. అయితే గ‌తంలో కూడా ఇలాంటి చ‌ర్యల‌తొ వివాదాస్పద‌మైన శ‌ర్మ కేవ‌లం ప‌బ్లిసిటి కోస‌మే ఇలాంటి చేస్తున్నార‌న్న వాద‌న కూడా ఉంది. ఇప్పటికే అప్రమ‌త్తమ‌యిన పోలీసులు కిడ్నాప్ అయిన అధికారుల‌ను విడిపించ‌డానికి ప్రయ‌త్నిస్తున్నారు.

సోనియాగాంధీ మాటిస్తే అంతే

      ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడ్డారని మంత్రి గీతారెడ్డి పేర్కొన్నారు. ఆమె మాటకు తిరుగులేదని అన్నారు. దేశ ప్రజల కోసం పట్టుపట్టి ఆహార భద్రత బిల్లుకు తీసుకువచ్చి, దానికి చట్టరూపం కల్పించిన సోనియాకు కృతజ్ఞతలు తెలియజేశారు.   రాష్ట్ర విభజన జరిగిపోయిదని, కాబట్టి సీమాంధ్రుల్ర సహకరించాలని గీతారెడ్డి కోరారు. అలాగే సీడబ్ల్యూసీలో తెలంగాణపై తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంటులో బిల్లుపెట్టి త్వరగా లమలు చేయాలని ఆమె కోరారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజలతో సయంమనంతో, స్నేహపూర్వకంగానే వ్యవహరిస్తున్నామని గీతారెడ్డి తెలిపారు. పదేళ్ళ ఉమ్మడి రాజధానికి సహృదయంతోనే ఒప్పుకున్నామని అన్నారు. అవసరమైతే మళ్ళీ అంటోనీ కమిటీని కలుస్తామని చెప్పారు. పరస్పర దాడులుసరికాదని ఆమె అన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఒప్పుకున్నప్పుడు సీమాంద్రులు నగరంలో సభలు, సమావేశాలు పెట్టకూడదని ఎందుకు చెబుతామని గీతారెడ్డి అన్నారు. సభల వ్యవహారం, శాంతభద్రతల వ్యవహారాన్ని పోలీసులు చూసుకుంటారని ఆమె అన్నారు.

లగడపాటిని అడ్డుకున్నారు

      విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ ను కూడా కొందరు సమైక్య ఉద్యమకారులు అడ్డుకోవడం విశేషం.పంచాయితీరాజ్ గెస్ట్ హౌస్ దగ్గర ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన దీక్షలు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన లగడపాటికి చేదు అనుభవం ఎదురైంది. లగడపాటి రాజీనామా చేయాలని, గో బ్యాక్ అంటూ ఆర్టీసీ ఉద్యోగులు నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ ప్రజల డిమాండ్‌ను అవమానంగా భావించడం లేదని అన్నారు. లగడపాటిని శిబిరంలోకి రానివ్వమని చెబుతూ ఆర్టీసీ ఉద్యోగుల నిరసన తెలపడంతో లగడపాటి వెనుదిరగకుండా బందరురోడ్డులోనే ఓ డివైడర్‌పై కూర్చున్నారు. ఉద్యోగులకు సంఘీభావం తెలిపి, వారితో మాట్లాడిన తర్వాతే వెళతామని ఆయన పట్టుపట్టారు. ఆ తరువాత   లగడపాటి పోలీసుల సహాయంతో శిబిరంలోకి వచ్చి, ఉద్యోగులతో మాట్లాడి, జై సమైక్యాంధ్రా అంటూ నినాదాలు చేశారు. ఇప్పటికైనా సీమాంధ్ర ఉద్యమాన్ని కేంద్రం గుర్తించాలని, విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లగడపాటి పేర్కొన్నారు.

విజయవాడ సింహగర్జన

  సమైక్యాంధ్ర కోరుతూ విజయవాడ విద్యార్థులు సింహాల్లా గర్జించారు. వారు వేలాదిగా తరలివచ్చి బందరు రోడ్డులో శాంతియుత నిరసన తెలిపారు. వారు జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తుంటే… విజయవాడ దద్దరిల్లుతోంది. దేవినేని అవినాష్ నాయకత్వంలో సమైక్యాంధ్ర విద్యార్థి గర్జన పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో విజయవాడలోని అన్ని విద్యాసంస్థలు విద్యార్థులు పాల్గొన్నారు. ఆ జనాన్ని చూస్తుంటే… సముద్రాన్ని చూస్తున్నట్టే అనిపించింది. ఇసుకేస్తే రాలని జనం… జై సమైక్యాంధ్ర అని నినాదం చేస్తుంటే… నాయకుల గుండెలు దద్దరిల్లాయి. అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు కూడా వచ్చారు. హైదరాబాదు ఏ ఒక్కరి సొత్తూ కాదని… అది అందరి సొత్తని విద్యార్థులు నినదించారు. లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ ఇది డబ్బు సంచుల్లోంచి వచ్చిన ఉద్యమం కాదని… తెలుగు తల్లి గర్భం నుంచి వచ్చిన ఉద్యమం అన్నారు. శాంతియుతంగా తరలివచ్చిన ఈ అఖండ విద్యార్థి సమూహాన్ని డబ్బుతో కొనడం సాధ్యం కాదని… తెలుసుకునే విజ్ఞానం తెలంగాణ నేతలకు లేదన్నారు. మరోవైపు కర్నూలు జిల్లా నందికొట్కూరు విద్యార్థులు కూడా గర్జించారు. ఈ విద్యార్థి గర్జన సభకు దీక్ష చేస్తున్న కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంఘీభావం ప్రకటించారు. సమైక్యాంధ్రను సోనియా ఇవ్వక్కర్లేదని.. ప్రజలే సాధించుకుంటారని అన్నారు.