లగడపాటిని అడ్డుకున్నారు
posted on Aug 28, 2013 @ 4:29PM
విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ ను కూడా కొందరు సమైక్య ఉద్యమకారులు అడ్డుకోవడం విశేషం.పంచాయితీరాజ్ గెస్ట్ హౌస్ దగ్గర ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన దీక్షలు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన లగడపాటికి చేదు అనుభవం ఎదురైంది. లగడపాటి రాజీనామా చేయాలని, గో బ్యాక్ అంటూ ఆర్టీసీ ఉద్యోగులు నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ ప్రజల డిమాండ్‌ను అవమానంగా భావించడం లేదని అన్నారు.
లగడపాటిని శిబిరంలోకి రానివ్వమని చెబుతూ ఆర్టీసీ ఉద్యోగుల నిరసన తెలపడంతో లగడపాటి వెనుదిరగకుండా బందరురోడ్డులోనే ఓ డివైడర్‌పై కూర్చున్నారు. ఉద్యోగులకు సంఘీభావం తెలిపి, వారితో మాట్లాడిన తర్వాతే వెళతామని ఆయన పట్టుపట్టారు. ఆ తరువాత లగడపాటి పోలీసుల సహాయంతో శిబిరంలోకి వచ్చి, ఉద్యోగులతో మాట్లాడి, జై సమైక్యాంధ్రా అంటూ నినాదాలు చేశారు. ఇప్పటికైనా సీమాంధ్ర ఉద్యమాన్ని కేంద్రం గుర్తించాలని, విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లగడపాటి పేర్కొన్నారు.