విజయవాడ సింహగర్జన
posted on Aug 28, 2013 @ 3:01PM
సమైక్యాంధ్ర కోరుతూ విజయవాడ విద్యార్థులు సింహాల్లా గర్జించారు. వారు వేలాదిగా తరలివచ్చి బందరు రోడ్డులో శాంతియుత నిరసన తెలిపారు. వారు జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తుంటే… విజయవాడ దద్దరిల్లుతోంది. దేవినేని అవినాష్ నాయకత్వంలో సమైక్యాంధ్ర విద్యార్థి గర్జన పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో విజయవాడలోని అన్ని విద్యాసంస్థలు విద్యార్థులు పాల్గొన్నారు. ఆ జనాన్ని చూస్తుంటే… సముద్రాన్ని చూస్తున్నట్టే అనిపించింది. ఇసుకేస్తే రాలని జనం… జై సమైక్యాంధ్ర అని నినాదం చేస్తుంటే… నాయకుల గుండెలు దద్దరిల్లాయి.
అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు కూడా వచ్చారు. హైదరాబాదు ఏ ఒక్కరి సొత్తూ కాదని… అది అందరి సొత్తని విద్యార్థులు నినదించారు. లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ ఇది డబ్బు సంచుల్లోంచి వచ్చిన ఉద్యమం కాదని… తెలుగు తల్లి గర్భం నుంచి వచ్చిన ఉద్యమం అన్నారు. శాంతియుతంగా తరలివచ్చిన ఈ అఖండ విద్యార్థి సమూహాన్ని డబ్బుతో కొనడం సాధ్యం కాదని… తెలుసుకునే విజ్ఞానం తెలంగాణ నేతలకు లేదన్నారు.
మరోవైపు కర్నూలు జిల్లా నందికొట్కూరు విద్యార్థులు కూడా గర్జించారు. ఈ విద్యార్థి గర్జన సభకు దీక్ష చేస్తున్న కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంఘీభావం ప్రకటించారు. సమైక్యాంధ్రను సోనియా ఇవ్వక్కర్లేదని.. ప్రజలే సాధించుకుంటారని అన్నారు.