తృణమూల్ ఎంపీల తుంటరితనం.. గది కోసం రగడ..

  పార్లమెంట్ ఆవరణలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు తమ తుంటరితనం ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ కోసం పార్లమెంట్‌లో కేటాయించిన కార్యాలయాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి స్పీకర్ కేటాయించిన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు కార్యాలయం బయట వున్న తెలుగుదేశం పార్టీకి చెందిన బోర్డులను కూడా పీకేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలకు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలకు మధ్య వాగ్వాదం జరిగింది. తమకు కార్యాలయం కావాలంటే స్పీకర్ని సంప్రదించాలిగానీ, ఇలా ఇతర పార్టీలకు చెందిన కార్యాలయాల మీద దాడి చేసి బలవంతంగా స్వాధీనం చేసుకోవడం ఎంతవరకు న్యాయమని తెలుగుదేశం ఎంపీలు ప్రశ్నిస్తున్నారు.

లేడీస్ ట్రైల్ రూమ్‌లో కెమెరాలు.. గుట్టు రట్టు...

  బట్టల షోరూంలోని ట్రయల్ రూంలో రహస్య కెమెరాలు అమర్చి మహిళలు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు రికార్డ్ చేసిన ముగ్గురు వ్యక్తులను కర్నాటకలోని బసవనగుడి పోలీసులు అరెస్టు చేశారు. బసవగుడిలో బట్టల షోరూమ్ నిర్వహిస్తున్న సందీప్, సురేష్, సునీల్‌ అనే సోదరుు సోదరులు తమ షోరూమ్‌లోని లేడీస్ ట్రైల్ రూమ్‌లో సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. చాలాకాలంగా ఈ ట్రైల్ రూమ్‌లోని దృశ్యాలను రికార్డు చేస్తున్నారు. ట్రైల్ రూమ్‌లో సీసీ కెమెరాని గమనించిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి గుట్టు రట్టయింది. పోలీసులు సందీప్, సురేష్‌లను అరెస్టు చేశారు. బట్టల షో రూమ్‌లో పని చేస్తున్న భాషాను కూడా అరెస్టు చేశారు. సునీల్ పరారీలో ఉన్నాడు.

‘భారతరత్న’కు హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌ పేరు సిఫారసు...

  భారత అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న అవార్డుకు హాకీ దిగ్గజం ధ్యాన్చంద్ పేరును కేంద్ర హోం శాఖ సిఫారసు చేసింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కీరెన్ రిజ్జు ఈ విషయాన్ని లోక్సభలో తెలిపారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులనుపరిశీలించిన అనంతరం భారతరత్న అవార్డుకు ధ్యాన్చంద్ పేరును సిఫారసు చేస్తూ ప్రధాని కార్యాలయానికి ప్రతిపాదన పంపినట్టు చెప్పారు. అయితే ఈ విషయంపై చర్చకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు, ప్రధాని కార్యాలయం సహాయం మంత్రి జితేందర్ సింగ్ తిరస్కరిచారు. ధ్యాన్చంద్ 1905లో జన్మించారు. ధ్యాన్చంద్ ప్రాతినిధ్యం వహించిన కాలంలో 1928-1936 మధ్య భారత హాకీ జట్టు ఒలింపిక్స్లో స్వర్ణ పతకాలు సాధించింది. 1948లో రిటైరయిన ధ్యాన్చంద్ పద్మభూషణ్ సహా పలు అవార్డులు స్వీకరించారు. ధ్యాన్చంద్ 1979లో కన్నుమూశారు. గతంలో ధ్యాన్‌చంద్‌కి దక్కాల్సిన భారతరత్న అవార్డును సచిన్ టెండూల్కర్‌కి మళ్ళించారన్న విమర్శలు వినిపించాయి.

కాబోయే భర్తని చంపేసిన కేసు... బెయిల్ దొరికింది...

  తల్లిదండ్రులు తనకు తనను ప్రేమించినవాడితో కాకుండా మరో వ్యక్తితో పెళ్ళి చేయాలని సంకల్పించడంతో కర్నాటకకు చెందిన శుభ అనే యువతి భరించలేకపోయింది. అయితే తనకు ఆ పెళ్ళి ఇష్టం లేదని తల్లిదండ్రులతో పోరాడి గెలిస్తే బాగుండేది. కానీ తన పెళ్ళిని ఆపడానికి మరో మార్గాన్ని అనుసరించింది. అది... తన కాబోయే భర్తని హత్య చేయించడం. వివరాల్లోకి వెళ్తే... కర్నాటకలోని బసవశంకరికి చెందిన శుభకు ఆమె తల్లిదండ్రులు తమ ఇంటి సమీపంలోనే నివసించే గిరీష్ అనే యువకుడితో పెళ్ళి ఖాయం చేశారు. అయితే శుభకు ఆ పెళ్ళి ఇష్టం లేదు. ఆమె అరుణ్ అనే వ్యక్తిని ప్రేమించింది. దాంతో తమ ప్రేమకు అడ్డుపడుతోన్న గిరీష్‌ని శుభ అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. దాంతో విందుకు వెళ్దామంటూ గిరీష్‌ని ఓ హోటల్‌కి తీసుకెళ్ళింది. తిరిగొచ్చే దారిలో నిర్మానుష్య ప్రదేశంలో కారు ఆపింది. అప్పటికే అక్కడే వున్న శుభ ప్రియుడు అరుణ్, అతని స్నేహితులు గిరీష్‌ని చంపేశారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హత్య చేసి వెళ్ళారని శుభ కట్టుకథలు చెప్పినా పోలీసులు నమ్మలేదు. పోలీసులు జరిపిన విచారణలో శుభ నేరస్థురాలని తేలింది. కేసు విచారణ చేసిన ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానం నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ సంఘటన పదేళ్ళ క్రితం జరిగింది. ఈ కేసు విషయంలో శుభ తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీం కోర్టు శుభ తదితరులకు తాజాగా బెయిల్ మంజూరు చేసింది.

యాక్సిడెంట్: గవాస్కర్‌కి తప్పిన ప్రాణాపాయం

  భారత క్రికెట్ వీరుడు సునీల్ గవాస్కర్ ప్రయాణిస్తున్న కారుకు లండన్‌ నగరంలో భారీ యాక్సిడెంట్ జరిగింది. అదృష్టవశాత్తూ గవాస్కర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ అనంతరం ఆ మ్యాచ్‌కి కామెంటేటర్‌గా వ్యవహరించిన సునీల్ గవాస్కర్ మరో కామెంటేటర్ మార్క్ నికోలస్‌తో కలసి మాంచెస్టర్ నుంచి లండన్‌కి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరి కారుకు ఎదురుగా ఓ కారు దూసుకొచ్చి ఢీకొంది. ప్రమాద సమయంలో భారీగా వర్షం కురుస్తోంది. ఈ ప్రమాదంలో గవాస్కర్ ప్రయాణిస్తున్న కారు తీవ్రంగా ధ్వంసమైంది. గవాస్కర్‌కి, మార్క్ నికోలస్‌కి ఒక్క గాయం కూడా కాకపోవడం విశేషం. ఈ సందర్భంగా ‘దేవుడే మమ్మల్ని రక్షించాడు' అని గవాస్కర్ వ్యాఖ్యానించారు.

కార్గిల్ దేశానికి గర్వకారణం: ప్రధాని నరేంద్రమోడీ

  భారత ప్రధాని నరేంద్రమోడీ కార్గి‌ల్‌ని మంగళవారం నాడు సందర్శించారు. పాకిస్థాన్ దురాక్రమణకు ప్రయత్నించినప్పుడు కార్గిల్ ప్రజలు ఎంతో దేశభక్తిని ప్రదర్శించి పాకిస్థాన్ సైనికులు, తీవ్రవాదులను తిప్పికొట్టారని మోడీ అన్నారు. కార్గిల్ ప్రజల దేశభక్తిని చూసి దేశం గర్విస్తోందని మోడీ చెప్పారు. జమ్ము కాశ్మీర్ పర్యటనలో భాగంగా ఆయన కార్గిల్‌లో ఏర్పాటు చేసిన 44 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేశారు. లెహ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, భారత్‌ని ముఖాముఖి ఎదుర్కొనే శక్తి లేకనే సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. కార్గిల్‌తో ఇతర ప్రాంతాల సంబంధాలు మెరుగుపరుస్తామని, కార్గిల్‌లో పారిశ్రామిక ప్రగతి సాధిస్తామని, రక్షణ బలగాలను సాంకేతికంగా బలోపేతం చేస్తామని మోడీ హామీ ఇచ్చారు. తాను బీజేపీ కార్యకర్తగా వున్న సమయంలో కూడా తాను కార్గిల్‌ని సందర్శించానని మోడీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

కేసీఆర్ సంస్కార హీనుడు: కిషన్‌రెడ్డి

  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి టీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీద విరుచుకుపడ్డారు. కేసీఆర్ కేసీఆర్ సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే కేంద్రంతో కయ్యానికి కాలుదువ్వుతున్నారని మండిపడ్డారు. బీజేపీ, మోడీని కేసీఆర్ టార్గెట్ చేయడం మంచిదికాదని హితవు పలికారు. భారత ప్రధాని నరేంద్ర మోడీని కేసీఆర్ ఫాసిస్టు అనడాన్ని ఆయన ఖండించారు. బీజేపీ వల్లే తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందిందని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి కేంద్రాన్ని పిలవకపోవడం సరికాదని అన్నారు. కేసీఆర్ వ్యవహారాన్ని ప్రతిఘటించేందుకు తాము సమాయత్తమవుతున్నామని కిషన్‌రెడ్డి చెప్పారు.

లెహ్ - లడఖ్ అభివృద్ధికి మోడీ ‘3-పి’ ఫార్ములా

  ప్రస్తుతం జమ్ము కాశ్మీర్ రాష్ట్ర పర్యటనలో ఉన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ లడఖ్ ప్రాంత అభివృద్ధికి 3-పి ఫార్ములాను ప్రకటించారు. ప్రకాశ్, పర్యావరణ్, పర్యటన్ పేరుతో 3 పీ ఫార్ములాను ప్రకటించి, కాశ్మీర్ అభివృద్ధికి బాటలు వేస్తామని మోడీ ప్రకటించారు. ఈ మూడు రంగాల్లో కాశ్మీర్‌ను అభివృద్ధి చేయడం ద్వారా దేశానికి గర్వంగా నిలిచేలా తయారుచేస్తామని మోడీ కాశ్మీర్ ప్రజలకు హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ లేహ్‌లో ఆర్మీ అధికారులు, జవాన్ల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ఆయన జవాన్లను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల ప్రేమే తనను ఇక్కడదాకా రప్పించిందన్నారు. ప్రజల అభిమానాన్ని వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పారు. ఈ ప్రాంత బలమేంటో తనకు తెలుసని... అదేసమయంలో ఇక్కడున్న సమస్యలు కూడా తనకు తెలుసని వెల్లడించారు. కాశ్మీర్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నిమో బాగ్జో హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేసి, లెహ్ - కార్గిల్ - శ్రీనగర్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.

ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య

  ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత రాబిన్ విలియమ్స్ (63) ఆత్మహత్య చేసుకున్నారు. కాలిఫోర్నియాలోని టిబ్రోన్ ప్రాంతంలో వున్న తన నివాసంలో ఆయన ముఖానికి ప్లాస్లిక్ కవర్ చుట్టుకోని ఊపిరి ఆడకుండా చేసుకోవడం ద్వారా ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. మంచి హాస్య నటుడిగా పేరు ప్రఖ్యాతులు, అవార్డులు, డబ్బు సంపాదించిన రాబిన్ విలియమ్స్ ఇంత అర్ధంతరంగా ఆత్మహత్యకు పాల్పడటం వెనుక కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ఆయన నటించిన ‘మిసెస్ డౌట్‌ఫైర్’ చిత్రం ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాని కమల్‌హాసన్ ‘అవ్వై షణ్ముగై’, ‘చాచీ 420’ పేర్లతో తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేశారు. అలాగే రాబిన్ విలియమ్స్ నటించిన ‘జుమాన్జీ’ సినిమా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. 1978లో హాలీవుడ్ నటుడిగా ప్రయాణం ప్రారంభించిన ఆయన ‘మార్క్ అండ్ మిండీ’, ‘మిసెస్ డౌట్ ఫైర్’, ‘ది బర్డ్ కేజ్’, ‘అవేకెనింగ్’, ‘ఇన్‌స్నోమ్నియా’, ‘జుమాన్జీ’ లాంటి అనేక హిట్ సినిమాలలో నటించారు.

కాశ్మీర్ కామెంట్లపై సారీ చెప్పిన కవిత

  జమ్ము - కాశ్మీర్, హైదరాబాద్‌ల మీద భారతదేశం దురాక్రమణ చేసిందని టీఆర్ఎస్ ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ అంశం మీద కవితపై కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో కవిత తన వ్యాఖ్యలను పాక్షికంగా సవరించారు. జమ్మూకాశ్మీర్ భారత దేశంలో అంతర్గత భాగమని లోక్‌సభలో ప్రకటించారు. సోమవారం లోక్‌‌‌సభలో కాశ్మీర్ పండితుల పునరావాసంపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై కవిత మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. దీంతో బీజేపీ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. లోక్‌సభలో కాశ్మీర్ పండితుల పునరావాసంపై కవిత వ్యక్తం చేసిన అభిప్రాయాలను అధికారపక్షం సభ్యులతో పాటు ప్రతిపక్ష సభ్యుల సైతం ప్రశంసించారు. సొంత దేశంలో కాందిశీకులుగా బతుకు వెళ్లదీస్తున్న కాశ్మీర్ పండితుల గురించి ఎవ్వరూ పట్టించుకోవటం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బిజెపి సభ్యులతోపాటు పలువురు ప్రతిపక్ష సభ్యులూ బల్లలు చరుస్తూ కవితకు మద్దతు ప్రకటించారు.

ఎర్రబెల్లి, ధర్మానలకు సెక్యూరిటీ తగ్గింపు

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనను తుగ్లక్, బఫూన్ ల పరిపాలనళా ఉందని తెదేపా నేత ఎర్రబెల్లి దయాకరరావు చేసిన తీవ్ర విమర్శలకు సహజంగానే తెరాస మండిపడుతోంది. బహుశః ఆ కారణంగానేమో ఎర్రబెల్లికి కల్పిస్తున్న సెక్యురిటీని ప్రభుత్వం తగ్గించింది. దానితో తీవ్ర ఆగ్రహం చెందిన ఎర్రబెల్లి తన మిగిలిన సెక్యూరిటీ సిబ్బందిని కూడా ప్రభుత్వానికి నిన్న అప్పజెప్పేసారు. ప్రభుత్వాన్ని విమర్శించినందుకు తనపై కక్షసాధింపుగానే తనకు సెక్యూరిటీ తగ్గించిందని ఆయన ఆరోపించారు. ఇకపై తనకు ఏమయినా జరిగితే అందుకు తెలంగాణా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.   ఇక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకి సెక్యూరిటీ సిబ్బందిని తగ్గించడంతో ఆయన కూడా ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తన ఇంటి వద్ద రెండు రోజుల క్రితం రాత్రివేళ గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారని ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆయన తన భద్రతను పునరుద్దరించుకోవడానికే ఆవిధంగా చెపుతున్నారా లేక నిజంగా ఎవరయినా రెక్కీ నిర్వహించారా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.   సామాన్య ప్రజలు, స్కూళ్ళకు వెళ్ళే చిన్నారులకు సరయిన రక్షణ లేక (గెయిల్) గ్యాస్ లీక్ అగ్ని ప్రమాదాలలో, ఉగ్రవాదుల దాడులలో, రైళ్ళ క్రింద నలిగి చనిపోతుంటే, ఆ సామాన్య ప్రజలు చెమటోడ్చి సంపాదించికడుతున్న పన్నులతో అధికారంలో ఉన్న, లేని కోటీశ్వరులైన రాజకీయ నాయకులందరికీ ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉందా? అనే అంశంపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది.

కస్టడీకి సుబేదార్ పతన్ కుమార్

  భారత సైన్యం రహస్యాలను పాకిస్థాన్ లేడీ గూఢచారికి వెల్లడించిన మిలటరీ ఉద్యోగి సుబేదార్ పతన్‌కుమార్‌కు నాంపల్లి క్రిమినల్ కోర్టు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కస్టడీకి ఇచ్చింది. పతన్‌ను వారంపాటు సీసీఎస్ పోలీసుల కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. తిరిగి ఈనెల 19న వైద్య పరీక్షలు నిర్వహించి పతన్‌ను కోర్టుకు అప్పగించాలని పేర్కొంది. తన తరపు న్యాయవాది సమక్షంలోనే పోలీసులు పతన్‌ను విచారించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆర్మీ సుబేదార్ పతన్‌ను కస్టడీకి అప్పగించేందుకు ఆర్మీ అధికారుల అనుమతి తీసుకున్నారా? అని న్యాయమూర్తి సిసిఎస్ పోలీసుల తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. ఆర్మీ అనుమతితో రావాలని న్యాయమూర్తి చెప్పారు. దాంతో ఆ తర్వాత ఆర్మీ అధికారుల నుంచి అనుమతి తీసుకున్నట్టు సిసిఎస్ పోలీసులు మెమో దాఖలు చేయడంతో కోర్టు పతన్‌ను కస్టడీకి అనుమతి ఇచ్చింది. పతన్‌ను సిసిఎస్ కస్టడీకి ఇచ్చిన సందర్భంగా ఈ కేసుకు సంబంధించి మరింత కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

రాజధాని కోసం కర్నూలువాసుల పోరాటం

  కర్నూలులోనే రాష్ట్ర రాజధానిని నిర్మించాలని కోరుతూ నిన్న కర్నూలు పట్టణంలో ‘లక్ష గొంతుల పొలికేక’ పేరిట విద్యార్ధులు, మహిళలు, ఉద్యోగులతో కూడిన భారీ ర్యాలీ ఒకటి నిర్వహించబడింది. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కర్నూలులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని భావిస్తోంది. అయితే దానితో సరిపెట్టకుండా వెనుకబడిన తమ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు రాజధానిని కర్నూలులోనే నిర్మించాలని ర్యాలీలో పాల్గొన్న ప్రజలు గట్టిగా తమ డిమాండ్ వినిపించారు. ఒకవేళ కర్నూలులో కాక వేరేక్కదయినా రాజధానిని నిర్మించే ప్రయత్నం చేసినట్లయితే, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమాలు మొదలవుతాయని కర్నూల్ మాజీ మేయర్ యస్. రఘురామి రెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.   ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైకాపా యం.యల్యే. యస్వీ.మోహన్ రెడ్డి మాట్లాడుతూ, “వేలాది మహిళలు, విద్యార్ధులు, ఉద్యోగులు పాల్గొన్న ఈ కార్యక్రమం రాయలసీమ వాసుల ఆకాంక్షలకు అద్దం పడుతోంది. దానిని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేయడం వలన అక్కడ సారవంతమయిన వేలాది ఎకరాల వ్యవసాయ భూమి పోతుంది. దానివలన ఏడాదికి 60లక్షల క్వింటాళ్ళ ఆహార దాన్యాల ఉత్పత్తి కోల్పోవలసి వస్తుంది. పైగా ఆ ప్రాంతంలో రాష్ట్రంల్ మిగిలిన అన్ని ప్రాంతాలకంటే ఎక్కువగా భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరికలను ప్రభుత్వం ఖాతరు చేయకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది,” అని అన్నారు. కర్నూల్ రాజధాని సాధన సమితి తన ఉద్యమం మరింత తీవ్రతరం చేసేందుకు ఆగస్ట్ 13ణ కర్నూల్ జిల్లా బందుకు సిద్దమవుతోంది. ఒకవేళ పోలీసు అధికారులు తమ బంద్ కు అనుమతి ఈయనట్లయితే ఆగస్ట్ 15 వేడుకల తరువాత తప్పకుండా బంద్ నిర్వహించి తీరుతామని ఆ సమితి సభ్యుడు సోమశేఖర్ చెప్పారు.

సుప్రీంకోర్టు కోలీజియం వ్యవస్థలో మార్పులకు మోడీ ప్రభుత్వం శ్రీకారం

  భారత న్యాయవ్యవస్థలో జడ్జీల నియామకాలను చేపట్టే ‘సుప్రీంకోర్టు కోలీజియం’ సభ్యులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అవినీతిపరులయిన న్యాయమూర్తులను పదవులలో నియమిస్తూ, కొనసాగిస్తున్నారని మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి మార్కండేయ కట్జూ చేసిన ఆరోపణలతో న్యాయ, రాజకీయ వ్యవస్థలలో పెద్ద దుమారమే రేగింది. అయితే న్యాయవ్యవస్థపై పడిన ఈ మచ్చను తొలగించుకొనేందుకు సుప్రీంకోర్టు ఎటువంటి చర్యలు చెప్పట్టకుండా, ఆరోపణలను ఖండించడంతో సరిపెట్టుకొంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను చాలా తీవ్రంగా భావించి, కోలీజియం వ్యవస్థలో సమూలమయిన మార్పులు చేసేందుకు లోక్ సభలో నిన్న రెండు బిల్లులు ప్రవేశపెట్టింది. వాటిలో ఒకటి కోలీజియం వ్యవస్థలో మార్పుల కోసం (జ్యూడిషియల్ నియామకాల కమీషన్ బిల్లు-2014) ఉద్దేశించింది కాగా రెండవది న్యాయమూర్తుల నియామకంలో కోలీజియం అనుసరించాల్సిన విధి విధానాలను (రాజ్యాంగ సవరణ బిల్లు-2014) రూపొందించే బిల్లు. కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు.

కార్గిల్, లెహ్ పర్యటించనున్న ప్రధాని మోడీ

  కార్గిల్, లెహ్ పర్యటించనున్న ప్రధాని మోడీ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్గిల్ మరియు లెహ్ ప్రాంతాలలో పర్యటించనున్నారు. ఆయన అధికారం చేప్పట్టిన తరువాత జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించడం అప్పుడే ఇది రెండవసారి. దానిని బట్టి ఆయన ఆ రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అర్ధమవుతోంది. ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన యుద్దభూమిగా పేరుగాంచిన సియాచిన్-గ్లేసియర్ లను ఆయన ఈరోజు పర్యటించి అక్కడ మైనస్ 30-40 డిగ్రీల వాతావరణంలో ప్రాణాలకు తెగించి కాపలా కాస్తున్న భారత సైనికులను కలిసి వారితో మాట్లాడుతారు. భారత వైమానిక, మిలటరీ ఉన్నతాధికారులతో కూడా ఆయన సమావేశమవుతారు.   ఆ తరువాత లెహ్ పట్టణంలో పోలో మైదానంలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. లెహ్ లో నిర్మించిన నిమూ బజ్గో (45 మెగావాట్స్ సామర్ధ్యం) హైడ్రో విద్యుత్ ప్లాంటును జాతికి అంకితం చేస్తారు. ఆ తరువాత లెహ్-శ్రీనగర్ ల మధ్య 349కి.మీ.ల పొడవైన విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణానికి ఆయన శంకు స్థాపన చేస్తారు. ఆ తరువాత కార్గిల్ ల్లో నిర్మించిన చౌతక్ విద్యుత్ ప్లాంటు (44 మెగావాట్స్ సామర్ధ్యం) లను ప్రారంభిస్తారు. అనంతరం కార్గిల్ పట్టణంలో ఒక బహిరంగ సభలో పాల్గొంటారు.   ఈ పర్యటనలో ఆయనతో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొంటారు. జమ్మూ మరియు కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, భారత ఆర్మీ చీఫ్ గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన దల్బీర్ సింగ్ సుహాగ్, బీజేపీ నేతలు ముక్తార్ అబ్బాస్ నక్వీ, అవినాష్ రాయ్ ఖన్నా తదితరులు ప్రధాని మోడీ పర్యటనకు అవసరమయిన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

గిరిజనుల పునరావాసానికి ఐఏఎస్ అధికారి నియామకం

  ఈ రోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో రుణమాఫీ, రాష్ట్ర బడ్జెట్, తెలంగాణా ప్రభుత్వంతో తలెత్తుతున్న సమస్యల గురించి లోతుగా చర్చ జరిగింది. రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈనెల 18 నుండి ఆరంభించాలని, 20 రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. తెలంగాణా ప్రభుత్వంతో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించినప్పటికీ, తెలంగాణా ప్రభుత్వం సహకరించక పోయినట్లయితే రెండు రాష్ట్రాల మధ్య తలెత్తున్నసమస్యల పరిష్కారానికి న్యాయపోరాటం అనివార్యమవుతుందని మంత్రివర్గం భావించింది. ఇక పోలవరం ముంపు ప్రాంతాలు ఆంధ్రాలో కలిసినందున, స్థానిక గిరిజనుల పునరావాస చర్యలను సమర్ధంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలని మంత్రివర్గ నిర్ణయించింది.

ప్రకాశం జడ్పీ ఛైర్మన్‌పై అనర్హత వేటు!!

  తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి జంప్ చేసి ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఈదర హరిబాబు జడ్పీటీసీ సభ్యత్వాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ విజయకుమార్ రద్దు చేశారు. టీడీపీ విప్ ధిక్కరించిన కేసులో ఆయనపై అనర్హత వేటు వేశారు. దాంతో ఆయన జడ్పీటీసీ సభ్యత్వంతో పాటు.. ఛైర్మన్ పదవి కూడా పోయినట్లు అవుతుంది. గతనెల 13వ తేదీన జరిగిన జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి వైఎస్ఆర్ సీపీ వ్యూహాత్మకంగా ఇచ్చిన మద్దతుతో చైర్మన్‌గా ఈదర హరిబాబు గెలిచారు. గతంలో ప్రిసైడింగ్ అధికారి తనకు షోకాజ్ నోటీసు ఇవ్వగా దానికి ఆయన సమాధానం కూడా ఇచ్చారు. అయినా కూడా ఇప్పుడు ఆయన సభ్యత్వం రద్దు అయింది.

సచిన్‌కి సెలవిచ్చారు...

  క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండుల్కర్‌కు లీవ్ ఇచ్చారు. ఈ సెషన్ రాజ్యసభ సమావేశాలకు హాజరు కాకపోయినా పర్లేదంటూ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సచిన్ టెండూల్కర్‌కి సెలవు ఇచ్చారు. మొన్నామధ్య కొంతమంది ఎంపీలు సచిన్ ఎంపీగా ఎన్నికయినప్పటికీ సమావేశాలకు ఎక్కువగా డుమ్మాలు కొడుతున్నారని విమర్శించారు. దానికి సచిన్ స్పందించి, తన సోదరుడి ఆరోగ్యం బాగాలేనందుకే తాను సమావేశాలకు రావడం లేదని వివరణ ఇచ్చారు. అలాగే ఎందుకొచ్చిన గొడవ అని ఈసారి సమావేశాలకు హాజరు కాకుండా వుండటానికి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ని లీవ్ అడిగారు. సచిన్ సమస్యని అర్థం చేసుకున్న కురియన్ లీవు ఇచ్చారు.