శభాష్ చంద్రబాబు! నాగం జనార్ధన్ రెడ్డి

  ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన నాగం జనార్ధన్ రెడ్డి, తెలంగాణా ఉద్యమాలు జోరుగా సాగుతున్న సమయంలో తెరాసలో చేరుదామని కలలు కంటూ పార్టీని వీడారు. కేసీఆర్ మెప్పు పొందేందుకు చంద్రబాబుపై నిత్యం చాలా ఘాటు విమర్శలు కూడా చేసేవారు. కానీ కేసీఆర్ ఆయనను తెరాసలో చేర్చుకోలేదు సరికదా తెలంగాణా జేఏసీలో కూడా చేరనీయకుండా అడ్డుపడ్డారు. అప్పటి నుండి ఆయన కేసీఆర్ పై కూడా విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన కేసీఆర్ ని విమర్శించేందుకు చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను మెచ్చుకోవడం విశేషం.   చంద్రబాబు పక్క రాష్ట్రాల నుండి అదనపు విద్యుత్ కొనుగోలు చేసి, రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చేస్తే, కేసీఆర్ మాత్రం మరో మూడేళ్ళ వరకు తెలంగాణా కు విద్యుత్ కష్టాలు తప్పవని గొప్పగా చెప్పుకొంటున్నారని నాగం జనార్ధన్ రెడ్డి ఎద్దేవా చేసారు. నాగం మాటలలో నిజం ఉన్నప్పటికీ ఆయన కేవలం కేసీఆర్ ను విమర్శించేందుకే తను ఇంతకాలంగా ద్వేషిస్తున్న చంద్రబాబును మెచ్చుకొంటున్నట్లుంది తప్ప నిజంగా చంద్రబాబును మెచ్చుకోవడం ఆయన ఉద్దేశ్యం కాదనిపిస్తోంది. చంద్రబాబు లాగే కేసీఆర్ కూడా ఇదివరకు పొరుగునున్న కర్నాటక రాష్ట్రం నుండి విద్యుత్ కొనుగోలు చేసారు. నాగం జనార్ధన్ రెడ్డి ఆ ఆవిషయం ప్రస్తావించకపోవడం గమనిస్తే, ఆయన పొగడ్తల వెనుక అసలు ఉద్దేశ్యం అర్ధమవుతుంది.

ఫీజు రీయింబర్స్ మెంట్ పై చంద్రబాబు కొత్త ప్రతిపాదన

  హైదరాబాదు మరియు పరిసర జిల్లాలలో పుట్టి పెరిగి అక్కడే ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న ఆంద్ర విద్యార్ధులకు 52:48 నిష్పత్తిలో ఫీజు రీయింబర్స్ మెంట్ చేసేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిపాదనను, తెలంగాణా ప్రభుత్వం నిర్ద్వందంగా తిరస్కరించింది. మా పిల్లలకు 100 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ చేసుకొంటున్నప్పుడు, మీరెందుకు మీ పిల్లలకు కేవలం 52 శాతమే చెల్లించాలనుకొంటున్నారు? అని ఎదురు ప్రశ్న వేసారు. విద్యార్ధుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని తాను మరోకమేట్టు దిగివచ్చెందుకు కూడా సిద్దమని చంద్రబాబు నాయుడు చెప్పినప్పటికీ, తెలంగాణా ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై కనీసం చర్చకు కూడా ఆసక్తి చూపలేదు. కానీ, ఫీజు రీయింబర్స్ మెంట్ సాకు చూపి ఇంజనీరింగ్ అడ్మిషన్లు చెప్పట్టకుండా కాలక్షేపం చేస్తే ఊరుకోనని సుప్రీం కోర్టు తీవ్రంగా హెచ్చరించిన తరువాతనే తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణా ప్రభుత్వం ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఉమ్మడిగా ప్రవేశాల ప్రక్రియ చెప్పట్టేందుకు అంగీకరించింది. చంద్రబాబు నాయుడు ఇదివరకు చెప్పినట్లే, మరో మెట్టు దిగి విద్యార్ధుల ఫీజు రీయింబర్స్ మెంట్ పై మరొక కొత్త ప్రతిపాదన చేసారు. తెలంగాణాలో ఉన్న ఆంధ్రా విద్యార్ధులు ఎందరో తెలంగాణా ప్రభుత్వమే తేల్చి చెపితే వారందరికీ తమ ప్రభుత్వం 100 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ చేసేందుకు సిద్దంగా ఉందని, ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన ప్రకటించారు. 1956కు ముందు నుండి ఉన్నవారి పిల్లలే స్థానికులుగా గుర్తిస్తామని తెలంగాణా ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది గనుక, తెలంగాణాలో పుట్టిపెరిగిన ఆంద్ర పిల్లలు అందరికీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వమే భరించవలసి ఉంటుంది. ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వానికి ఇది అదనపు భారమే అయినప్పటికీ, చంద్రబాబు నిర్ణయం వేలాది విద్యార్ధులకు వారి తల్లి తండ్రులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. విద్యార్ధులను స్థానికత ఆధారంగా, ప్రాంతాలవారిగా వేరు చేసి చూడటం తగదని సుప్రీం కోర్టు తెలంగాణా ప్రభుత్వానికి మెత్తగా చివాట్లు పెట్టినప్పటికీ, తన వైఖరిలో ఎటువంటి మార్పు రా(లే)దని నిన్న కేసీఆర్ స్వయంగా స్పష్టం చేసారు. బహుశః అందుకే విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బాధ్యతగల ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు ఆంధ్ర విద్యార్ధులందరికి ఫీజు రీయింబర్స్ మెంట్ చేసేందుకు సిద్దపడి ఉండవచ్చును. అందుకు ఆయనను అభినందించవలసిందే.

కామన్వెల్త్ విజేతలకు టీ సర్కార్ నజరానాలు....

  కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్ ఆధ్వర్యంలో కశ్యప్, గుత్తా జ్వాలతోపాటు పలువురు క్రీడాకారులు బుధవారం సచివాలయంలో కేసీఆర్‌ను కలిసారు. ఈ సందర్భంగా విజేతలను కేసీఆర్ అభినందించారు. క్రీడాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సహకారం ఉంటుందని ఆయన అన్నారు. అలాగే కామన్వెల్త్ గేమ్స్ విజేతలకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరాన ప్రకటించింది. స్వర్ణం సాధించిన వారికి రూ. 50 లక్షలు అందజేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. వెండిపతకం గెలుపొందిన వారికి రూ. 25 లక్షలు, కాంస్యం సాధించిన విజేతలకు రూ. 20 లక్షలు ఇస్తామని ఆయన ప్రకటించారు. విజేతల కోచ్‌లకు కూడా రూ. 50 లక్షలు, కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న క్రీడాకారులు అందరికీ రూ. 3 లక్షలు నజరాన ప్రకటించారు. ఈ ప్రోత్సాహక బహుమతులను గోల్కొండ వేదికగా జరిగే పంద్రాగస్టు వేడుకల్లో ఇవ్వనున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.

ఆత్మహత్యాయత్నం నేరం కానేకాదు....

  ఐపీసీ సెక్షన్ 309 ప్రకారం భారతదేశంలో ఆత్మహత్యాయత్నం నేరం. అత్మహత్యాయత్నం చేసిన వారికి ఒ సంవత్సరం జైలు శిక్షతో పాటు జరిమానాను కూడా విధించవచ్చని చట్టాలు చెపుతున్నాయి. ఇలాంటి ఆత్మహత్యాయత్నాన్ని నేరపరిధి నుంచి తప్పించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఐపీసీ సెక్షన్ 309ను రద్దు చేసి... ఆత్మహత్యను నేరపరిధి నుంచి తప్పించాలని లా కమిషన్ ఇప్పటికే కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ విషయంపై ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించామని కేంద్రమంత్రి హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు నిన్న లోక్‌సభలో వెల్లడించారు. ఇదే అమలుకు వస్తే ఐపీసీ సెక్షన్ 309ను రద్దు చేస్తే గనుక ఆత్మహత్య చేసుకున్నవారిపై ఇకపై ఎలాంటి కేసు నమోదవదు.

‘గాలి’కి బెయిలు... అయినా జైల్లోనే....

    ఏఎంసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లోఉన్న కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్థన్‌రెడ్డికి ఎట్టకేలకు బెంగుళూరు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ (ఏఎంసీ) కేసు విషయంలో బెంగుళూరు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ ఫర్ స్కామ్‌లో మాత్రం ప్రస్తుతం జనార్థన్‌రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. ఓఎంసీ కేసులో ఇంకా బెయిల్ మంజూరు కాలేదు. ఏఎంసీ కేసులో బెయిల్ వచ్చినంత మాత్రన ఇప్పటికిప్పుడు జైల్ నుంచి విడుదల అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఓఎంసీ కేసుకు సంబంధించి గాలికి బెయిల్ రావాలసి ఉంది. దీనిపై సుప్రీం కోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ప్రస్తుతం గాలి జనార్థన్‌రెడ్డి బెంగుళూరు జైల్లో ఉన్నారు.

బంగ్లాదేశ్‌లో నౌక ప్రమాదం... 200 మంది మ‌ృతి?

  బంగ్లాదేశ్‌లోని పద్మా నదిలో 250 మంది ప్రయాణికులతో వెళ్తున్న పినాక్-6 పేరుగల నౌక మునిగిపోవడంతో 200 మరణించారని తెలుస్తోంది. ఇప్పటి వరకు 115 మృతదేహాలు లభ్యమయ్యాయి. 40 మంది మినహా మిగతా అందరూ గల్లంతయ్యారు. చాలామంది ప్రయాణికుల జాడ ఇప్పటికీ తెలియక పోవడం, నదిలో మునిగిపోయిన పినాక్-6 పడవలోనే వారంతా చిక్కుపడి ఉండడమో, లేదా భారీ వర్షాల కారణంగా ఉగ్రరూపంలో ప్రవహిస్తున్న పద్మా నది ప్రవాహంలో కొట్టుకుపోయి ఉండడమో జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కెపాసిటీకి రెట్టింపు సంఖ్యలో సుమారు 250 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ పడవ సోమవారం అలల తాకిడికి తలకిందులై మునిగిపోయింది. అయితే ప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోపలే వందమందికి పైగా ప్రయాణికులను నౌకలు, స్పీడ్‌బోట్ల సాయంతో కాపాడారు.

ఉరిశిక్ష రద్దు చేసే ఆలోచనే లేదు...

  దేశంలో ఉరిశిక్షను రద్దుచేసే ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వానికి లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టంగా చెప్పారు. భారతీయ శిక్షాస్మృతి 1860 చట్టం ద్వారా కోర్టులు నేరస్థులకు ఉరిశిక్ష విధించే హక్కును కలిగి ఉన్నాయి. భారతీయ శిక్షాస్మృతి 1860 చట్టాన్ని సవరించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలే లా కమిషన్ ఇటీవల తన వెబ్‌సైట్‌లో ఉరిశిక్షకు సంబంధించి సూచనలు, సలహాలను, అభిప్రాయాలను అందించవలసిందిగా దేశపౌరులను కోరింది. ఈ నేపథ్యంలో, కేంద్రప్రభుత్వానికి ఉరిశిక్షను రద్దు చేసే ఆలోచన ఉందా అని పార్లమెంట్‌లో మంగళవారం సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. అయితే, ఆత్మహత్యను నేరపరిధి నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐపీసీ సెక్షన్ 309 ను రద్దు చేసి... ఆత్మహత్యను నేరపరిధి నుంచి తప్పించాలని లా కమిషన్ ఇప్పటికే కేంద్రానికి సిఫార్సు చేసింది.

జడ్పీ ఛైర్‌పర్సన్ ఎన్నికల హడావిడి....

  జిల్లాలోని 39 ఎంపీపీ స్థానాలకు ఒక జడ్పీ చైర్ పర్సన్ స్థానానికి నిర్వహిస్తున్న ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాంతో జిల్లాల్లో రాజకీయాలు వేడెక్కాయి. 6వ తేదీన ఎంపీపీ, ఏడో తేదీన జడ్పీ ఎన్నిక జరుగుతుంది. దీనికోసం అన్నిరకాల చర్యలు తీసుకోవాలని జడ్పీ సీఈఓ జయప్రకాశ్ నారాయణ ఆదేశాలు జారీ చేశారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఉంటుంది. అలాగే ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పలువురు నాయకులు శిబిరాలకు తెర తీశారు. ఎంపీపీ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఆయా పార్టీల నాయకులు వ్యూహ, ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. జిల్లా నుండి హైదరాబాద్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏర్పాటు చేసిన క్యాంపుల్లో ఉన్న ఎంపీటీసీ సభ్యులను మంగళవారం సాయంత్రమే ఆయా మండలాల్లోని రహస్య శిబిరాలకు తరలించినట్టు సమాచారం అందుతోంది. క్షేత్రస్థాయిలో కీలకమైన ఎంపీపీ ఎన్నికకు సంబంధించి అన్ని పార్టీలు విప్ జారీ చేశాయి.

నిజాం సుగర్స్ ఫైనాన్స్ జీఎం... పుట్టినరోజు నాడే...

  నిజాం షుగర్స్ లిమిటెడ్ కంపెనీ ఫైనాన్స్ జనరల్ మేనేజర్ ముప్పల జానకిరాం శర్మ (59) సోమవారం తన కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. పుట్టినరోజు నాడే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈమధ్యే స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన కాంట్రాక్ట్ పద్ధతిలో ఆ పదవిలో కొనసాగుతున్నారు. సోమవారం ఆఫీసుకు వచ్చిన ఆయన అటెండర్‌కి డబ్బు ఇచ్చి ఒక తాడు తెప్పించుకున్నారు. సాయంత్రం 5.30 గంటలకు శర్మ సిబ్బందిని ఇంటికి పంపేశారు. తండ్రి రాక కోసం, ఆయన పుట్టినరోజు వేడుకలు జరపాలని రాత్రి 11 గంటల వరకు ఎదురుచూసిన కొడుకు శ్రీనివాస్ తండ్రికి ఫోన్ చేయగా అది కలవలేదు. దాంతో శ్రీనివాస్ కార్యాలయానికి వెళ్లగా శర్మ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించారు. కార్యాలయంలో పనిభారం ఎక్కువగా వున్నందువల్ల ఆయన ఆత్మహత్యకు పాల్పడి వుండొచ్చన్న అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

‘కోటీశ్వరుడు’ హాట్ సీట్‌లో చిరంజీవి

  నాగార్జున యాంకరింగ్ చేస్తూ వుండగా మా టీవీలో ప్రసారమవుతున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఈ సీజన్‌లో చివరి ఎపిసోడ్ ఈ గురువారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌లో నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ హాట్ సీట్లో కూర్చుని నాగార్జున అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన చిరంజీవికి మాటీవీ ఛైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ స్వాగతం పలికారు. బిగ్ సినర్జీ సంస్థ ఇప్పటి వరకు ఈ షో 40 భాగాలను నిర్మించింది. ఈ తొలి సీజన్‌తో షో ముగిసిపోలేదనీ, కొద్ది నెలల విరామంతో రెండో సీజన్ వచ్చే ఏడాదిలో మొదలవుతుందనీ ‘మా’ టీవీ వర్గాలు చెబుతున్నాయి.

మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చట్టంలో ఎక్కడుంది?

  ఒకసారి రిజిస్టర్‌ చేయించుకున్న వాహనాలను తిరిగి రిజిస్టర్‌ చేసుకోవాలని చట్టంలో ఎక్కడ ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్రంలోని వాహనాలను మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నిలిపివేతకు మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కల్యాణ్‌ జ్యోతిసేన్‌ గుప్తా, జస్టిస్‌ పీవీ సంజయ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. నెంబర్‌ ప్లేట్ల మార్పు చట్టంలో ఎక్కడ ఉందని ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున వాదిస్తున్న స్పెషల్‌ జీపీ బి. మహేందర్‌రెడ్డి మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 65, 212(1) ప్రకారం వాహనాల నెంబరు ప్లేట్ల మార్పు చేసుకోవాలని ప్రభుత్వం జీవో నంబర్ 3 జారీ చేసిందని, అయితే ఆ జీవోను ఇంత వరకు అమలు చేయలేదని ఆయన కోర్టుకు తెలిపారు. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. అయితే దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని గడువు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కేసులో కౌంటర్‌ దాఖలు చేయడానికి కోర్టు ప్రభుత్వానికి వారం రోజులు గడువిచ్చింది.

‘గీతాంజలి’ దర్శకుడు సేఫ్!!

  అంజలి హీరోయిన్‌గా నటించిన ‘గీతాంజలి’ సినిమా ఈ నెల 8వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా డైరెక్టర్‌ రాజ్‌ కిరణ్‌ ఛాతీనొప్పికి గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్ మెహిదీపట్నంలోని జయభూషన్‌ ఆస్పత్రిలో ఉదయం చేర్చారు. కిరణ్‌కు ఛాతినొప్పి ఉన్నట్లు వైద్యులు గుర్తించారని, ఇప్పుడు ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారని నిర్మాత కోన వెంకట్ తెలిపారు. గీతాంజలి సినిమా విడుదల సన్నాహాలు చేస్తూ రాజ్ కిరణ్ ప్రసాద్‌ ల్యాబ్‌లో సోమవారం అర్థరాత్రి 1 గంట వరకు ఉన్నట్లు ఆయన తెలిపారు. అనంతరం తన ఇంటికి వెళ్లారని, మంగళవారం ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు గుండెపోటు అనుకుని హుటాహుటిన మెహిదీపట్నంలోని జయభూషన్‌ ఆస్పత్రిలో చేర్చారు.

ఉన్నత విద్యామండలి ఛైర్మన్.. పాపిరెడ్డి....

  తెలంగాణ రాష్ర్ట ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి నియమితులయ్యారు. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు. కాకతీయ యూనివర్సిటీలో ఎకనామిక్స్ అధ్యాపకుడిగా పనిచేసిన తమ్మల పాపిరెడ్డి ప్రొఫెసర్‌గా ఎదిగి వివిధ పదవులు నిర్వర్తించి ఈ ఏడాది జూన్ 30న ఉద్యోగ విరమణ పొందారు. ప్రొఫెసర్‌గా ఉంటూనే 2009 సంవత్సరం నుంచి జిల్లా పొలిటికల్ జేఏసీ చైర్మన్‌గా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోశించారు. ఆదిలాబాద్ జిల్లా జయపూర్ మండలం పవనూర్ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన పాపిరెడ్డి చదువు నిమిత్తం హన్మకొండకు వచ్చి స్థిపరడ్డారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా నియమితులైన పాపిరెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

కవిత మీద కేసు పెట్టండి... నాంపల్లి కోర్టు...

  జమ్ము - కాశ్మీర్, తెలంగాణ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ కవితపై కేసు నమోదు చేయాలని నాంపల్లి క్రిమినల్ కోర్టు పోలీసులను ఆదేశించింది. కవిత దేశ సమగ్రతకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకుడు కరుణాసాగర్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. కవిత చేసిన వ్యాఖ్యలు అత్యంత విద్వేషపూరితంగా ఉన్నాయని, దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కరుణాసాగర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం కవితపై కేసు నమోదు చేయాలని మాదన్నపేట పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 124 ఏ, 153 బి, 505 సెక్షన్లకింద కేసు నమోదు చేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ 11వ తేదీ లోపల దీనిపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

పశుపతినాథ్ ఆలయంలో మోడీ పూజలు

  భారత ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్‌లోని సుప్రసిద్ధ పశుపతినాథ్‌ ఆలయంలో కాషాయ దుస్తులు ధరించి సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం.. శ్రావణ అష్టమి కలిసి రావడంతో నేపాల్‌లో పవిత్రమైన రోజుగా భావిస్తారు. 108 మంది వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య ఆయనకు స్వాగతం పలికారు. రుద్రాభిషేకం చేసిన అనంతరం మోడీ.. పంచామృత స్నానం సహా సుమారు 45 నిమిషాలు ప్రత్యేక పూజలు చేశారు. ఆపై మెడలో రుద్రాక్ష మాలలు ధరించి బయటికొచ్చారు. దక్షిణ భారతదేశానికి చెందిన ప్రధాన పూజారి గణేశ్‌ భట్టా మోడీకి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయానికి 2500 కేజీల గంధపు చెక్కలను విరాళంగా ఇచ్చారు.

విశాఖ పోర్టులో ఘోర ప్రమాదం.. జస్ట్ మిస్...

  విశాఖ పోర్టులో ఒక ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. ఒక ప్రైవేట్ షిప్ విశాఖ పోర్టులో ప్రైవేటు పడవలు రాకూడని ప్రదేశానికి దూసుకుని వచ్చేసింది. ఆ ప్రదేశంలో వున్న భారీ గ్యాస్ నిల్వల బెర్త్‌ని ఢీకొనబోయి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఆ ప్రైవేట్ షిప్ గ్యాస్ నిల్వల బెర్త్‌ని ఢీకొని వుంటే ఘోర ప్రమాదం సంభవించి వుండేదని పోర్టు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదమే జరిగి వున్నట్టయితే మూడు నాలుగు నెలలపాటు పోర్టు కార్యకలాపాల మీద ఆ ప్రమాద ప్రభావం వుండేదని చెబుతున్నారు. సీవే షిప్పింగ్ సంస్థకి చెందిన ‘జలవాహిని’ అనే ఆ షిప్ కెప్టెన్‌ గత కొన్ని రోజులుగా తమ సంస్థ యాజమాన్యంతో వచ్చిన విభేదాల కారణంగా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నట్టు తెలుస్తోంది. ఆ మానసిక ఒత్తిడిలో షిప్పును ఎలా పడితే అలా నడపడం వల్ల ఈ సంఘటన చోటు చేసుకుంది. అనుమతి లేని ప్రదేశంలోకి వేగంగా వస్తున్న షిప్పును చూసి సెక్యూరిటీ సిబ్బంది హెచ్చరికలు చేసినా షిప్ కెప్టెన్ ఎంతమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తూ చివరి నిమిషంలో షిప్‌ను ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ షిప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక మాజీ కేంద్ర మంత్రి వారసులకు చెందినదిగా తెలుస్తోంది.

బియాస్ తరహా దుర్ఘటన: రెండు కుటుంబాలు...

  హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో వరద నీటి ప్రవాహం పెరగడం వల్ల హైదరాబాద్‌కి చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయిన దుర్ఘటనను మరవకముందే సరిగ్గా అలాంటి దుర్ఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. మధ్యప్రదేశ్‌లోని హన్‌మాన్‌తల్ ప్రాంతానికి చెందిన రెండు కుటుంబాలకు చెందిన 12 మంది బాగ్దారి జలపాతానికి వెళ్లారు. కొండల మధ్య చిన్న నదీపాయను దాటి పిక్నిక్ స్పాట్‌కు చేరుకున్నారు. సరిగ్గా వాళ్లు తిరిగి ఇంటికి వెళ్దామనుకుంటున్న సమయంలో అనూహ్యంగా పెరిగిపోయిన వరద ఆ రెండు కుటుంబాలను కబళించేసింది. వరద ఉద్ధృతిలో మొదట ఓ యువకుడు పడిపోగా అతడిని రక్షించే ప్రయత్నంలో మిగతా వారంతా కొట్టుకుపోయారు. ఒక యువతి మాత్రం ప్రాణాలతో బయటపడగలిగింది. సహాయ బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టాయి. ఈ గాలింపులో ఇప్పటి వరకు 8 మృతదేహాలను వెలికి తీశారు. మరో ముగ్గురి కోసం గాలింపు జరుగుతోంది.

2009లో గెలవటమే మన్మోహన్‌కి ఆశ్చర్యం...

  2009 ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ గెలిచిందనే వార్త విని మా నాన్న, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆశ్చర్య పోయారని ఆయన కుమార్తె దమన్ సింగ్ పేర్కొన్నారు. ‘స్ట్రిక్ట్‌లీ పర్సనల్, మన్మోహన్ అండ్ గురుశరణ్’ పేరుతో ఆమె ఓ పుస్తకం రాశారు. ఇందులో ఆమె కొన్ని సంచలనాత్మక కామెంట్స్ చేశారు. దమన్ సింగ్ తన తండ్రిని పూర్తిగా సమర్థించారు. తన తండ్రి రాజకీయాలకు సరిపోరని తాను భావించడం లేదన్నారు. దేశంలో సంస్కరణలు తీసుకొచ్చే సమయంలో కాంగ్రెస్ పార్టీలోనే తన తండ్రి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారని దమన్ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్వూలో ఆమె తన తండ్రికి మద్దతుగా వాదన వినిపించారు. రాజకీయాలకు తన తండ్రి సరిపోరని తాననుకోవడం లేదన్నారు. అప్పటి ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు నాన్నను పిలిచి రాత్రికి రాత్రే ఆర్థికమంత్రిగా చేశారని, అప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు తన తండ్రి మన్మోహన్‌కు నెల గడువు మాత్రమే ఉందన్నారు. పీవీయే లేకుంటే 1991 బడ్జెట్ సమయంలో మన్మోహన్ ఏమి చేయలేకపోయేవారని, మన్మోహన్‌కు పూర్తి మద్దతుగా నిలిచారని దమన్ సింగ్ చెప్పారు.

కరెంటు అడిగితేనే లాఠీలతో కొడతారా? ఇదెక్కడి న్యాయం...

  తెలంగాణ రైతులు కరెంటు కావాలని అడిగినందుకే అన్యాయంగా వాళ్ళని లాఠీలతో గొడ్డును బాదినట్టు బాదిస్తారా అని సీపీఐ నాయకుడు నారాయణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమైన విషయమని, సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మతోన్మాదులకు భయపడుతున్నట్లు తెలుస్తోందని నారాయణ వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆయన కోరారు.