లెహ్ - లడఖ్ అభివృద్ధికి మోడీ ‘3-పి’ ఫార్ములా
posted on Aug 12, 2014 @ 12:29PM
ప్రస్తుతం జమ్ము కాశ్మీర్ రాష్ట్ర పర్యటనలో ఉన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ లడఖ్ ప్రాంత అభివృద్ధికి 3-పి ఫార్ములాను ప్రకటించారు. ప్రకాశ్, పర్యావరణ్, పర్యటన్ పేరుతో 3 పీ ఫార్ములాను ప్రకటించి, కాశ్మీర్ అభివృద్ధికి బాటలు వేస్తామని మోడీ ప్రకటించారు. ఈ మూడు రంగాల్లో కాశ్మీర్‌ను అభివృద్ధి చేయడం ద్వారా దేశానికి గర్వంగా నిలిచేలా తయారుచేస్తామని మోడీ కాశ్మీర్ ప్రజలకు హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ లేహ్‌లో ఆర్మీ అధికారులు, జవాన్ల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ఆయన జవాన్లను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల ప్రేమే తనను ఇక్కడదాకా రప్పించిందన్నారు. ప్రజల అభిమానాన్ని వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పారు. ఈ ప్రాంత బలమేంటో తనకు తెలుసని... అదేసమయంలో ఇక్కడున్న సమస్యలు కూడా తనకు తెలుసని వెల్లడించారు. కాశ్మీర్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నిమో బాగ్జో హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేసి, లెహ్ - కార్గిల్ - శ్రీనగర్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.