కాబోయే భర్తని చంపేసిన కేసు... బెయిల్ దొరికింది...
posted on Aug 12, 2014 @ 3:08PM
తల్లిదండ్రులు తనకు తనను ప్రేమించినవాడితో కాకుండా మరో వ్యక్తితో పెళ్ళి చేయాలని సంకల్పించడంతో కర్నాటకకు చెందిన శుభ అనే యువతి భరించలేకపోయింది. అయితే తనకు ఆ పెళ్ళి ఇష్టం లేదని తల్లిదండ్రులతో పోరాడి గెలిస్తే బాగుండేది. కానీ తన పెళ్ళిని ఆపడానికి మరో మార్గాన్ని అనుసరించింది. అది... తన కాబోయే భర్తని హత్య చేయించడం. వివరాల్లోకి వెళ్తే... కర్నాటకలోని బసవశంకరికి చెందిన శుభకు ఆమె తల్లిదండ్రులు తమ ఇంటి సమీపంలోనే నివసించే గిరీష్ అనే యువకుడితో పెళ్ళి ఖాయం చేశారు. అయితే శుభకు ఆ పెళ్ళి ఇష్టం లేదు. ఆమె అరుణ్ అనే వ్యక్తిని ప్రేమించింది. దాంతో తమ ప్రేమకు అడ్డుపడుతోన్న గిరీష్‌ని శుభ అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. దాంతో విందుకు వెళ్దామంటూ గిరీష్‌ని ఓ హోటల్‌కి తీసుకెళ్ళింది. తిరిగొచ్చే దారిలో నిర్మానుష్య ప్రదేశంలో కారు ఆపింది. అప్పటికే అక్కడే వున్న శుభ ప్రియుడు అరుణ్, అతని స్నేహితులు గిరీష్‌ని చంపేశారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హత్య చేసి వెళ్ళారని శుభ కట్టుకథలు చెప్పినా పోలీసులు నమ్మలేదు. పోలీసులు జరిపిన విచారణలో శుభ నేరస్థురాలని తేలింది. కేసు విచారణ చేసిన ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానం నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ సంఘటన పదేళ్ళ క్రితం జరిగింది. ఈ కేసు విషయంలో శుభ తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీం కోర్టు శుభ తదితరులకు తాజాగా బెయిల్ మంజూరు చేసింది.